విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఊడిన తలుపు, 171 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేసిన అమెరికా

వైరల్ మారిన బోయింగ్ విమానంలోని చిత్రం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం బయటి షెల్‌లోని పెద్ద భాగం నేలపై పడిపోయిందని అందులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

'బోయింగ్ 737 మ్యాక్స్ 9'కు చెందిన 171 విమానాలు ప్రయాణానికి సురక్షితమని తేలే వరకు వాటిని నేలకే పరిమితం చేస్తామని అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించింది.

ఈనెల 5న అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం గాల్లో ఎగరగానే తలుపు ఒకటి ఊడిపడిపోవడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఈ విమానాలలో భద్రతపై తనిఖీ చేపట్టింది.

విమానంలో ప్రయాణించే ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఎఫ్ఏఏ తెలిపింది. అమెరికా విమానయాన సంస్థలు డజన్ల కొద్దీ జెట్‌లను నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్‌లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

"మేం ఇలాంటి సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్న విమానాలన్నింటినీ నిలిపేశాం. అవి సురక్షితమని ఎఫ్ఏఏ సంతృప్తి చెందే వరకు అనుమతివ్వం." అని ఏజెన్సీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో ఈ చర్యతో అమెరికాలోని విమాన రవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది.

బోయింగ్

ఫొటో సోర్స్, Getty Images

పోర్ట్‌ల్యాండ్‌లో అధికారుల తనిఖీలు

అమెరికాలో ఉపయోగించే బోయింగ్ 737 మ్యాక్స్ 9లలో ఎక్కువ భాగం యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అలాస్కా ఎయిర్‌లైన్స్‌ నడుపుతున్నాయి.

ప్రమాదం అనంతరం తుర్కిష్ ఎయిర్‌లైన్స్, పనామా కోపా ఎయిర్‌లైన్స్, ఏరోమెక్సికో సంస్థలు కూడా తనిఖీల కోసం ఆ మోడల్ జెట్‌ల ప్రయాణాలను నిలిపేశాయి.

అలాస్కా ఎయిర్‌లైన్స్ సంస్థ 65 విమానాలను నిలిపివేసింది, ఆదివారం నాడు 163 ఫ్లైట్‌లను ( 21 శాతం) రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 25,000 మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ తనిఖీలు ఈ వారం మధ్య వరకు కొనసాగుతాయని, అప్పటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ కూడా 79 విమానాలను నిలిపివేసింది. ఆదివారం సుమారు 180 ఫ్లైట్‌లను రద్దు చేసినట్లు తెలిపింది.

మరోవైపు ఊడిపడిన ప్లగ్ డోర్ కోసం అధికారులు వెతుకుతూనే ఉన్నారు. ఇది పోర్ట్‌ల్యాండ్‌లోని పశ్చిమ శివారు ప్రాంతంలో పడిందని భావిస్తున్నారు.

ప్యానెల్‌ను కనుగొనడంలో సహాయం చేయాలంటూ అధికారులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు.

బోయింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోయింగ్‌లో కొన్ని మోడళ్ల ఎయిర్ క్రాఫ్ట్స్‌లో పదేపదే లోపాలు బయటపడుతున్నాయి.

అసలేం జరిగింది?

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకు వెళుతున్న 'అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-1282' శుక్రవారం 16,000 అడుగుల (4,876 మీ) ఎత్తులో ఉన్న సమయంలో ఘటన జరిగింది.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం బయటి షెల్‌లోని పెద్ద భాగం నేలపై పడిపోయిందని అందులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

వార్తా సంస్థలకు పంపిన చిత్రాలు పరిశీలిస్తే రాత్రిపూట ఆకాశం, పోర్ట్‌ల్యాండ్ లైట్లు ఫ్యూజ్‌లేజ్‌లోని గ్యాప్ (డోర్ విడిపోయిన ప్రాంతం) ద్వారా కనిపిస్తున్నాయి. ఇన్సులేషన్ పదార్థం, ఇతర శిథిలాలు కూడా కనిపిస్తాయి.

ఆ రంధ్రంలో రిఫ్రిజిరేటర్ పట్టేంత స్థలం ఉందని ఒక ప్రయాణికుడు చెప్పగా, విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ఆ గాలికి పిల్లల చొక్కాలూ చిరిగిపోయాయని మరొకరు చెప్పారు.

మొత్తం మీద 177 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న ఆ విమానం పోర్ట్‌ల్యాండ్‌కు సురక్షితంగా తిరిగి వచ్చింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారని, అయితే తీవ్రంగా గాయపడలేదని అలస్కా ఎయిర్‌లైన్స్ ‌ ప్రకటించింది.

బోయింగ్

ఫొటో సోర్స్, REUTERS

ముందే హెచ్చరించిన ఎఫ్ఏఏ

వరుస భద్రతా సమస్యలతో "చరిత్రలో ఎక్కువగా తనిఖీలకు గురైన రవాణా విమానం"గా బోయింగ్ 737 మ్యాక్స్ నిలిచింది.

ఏడాదిన్నర వ్యవధిలో రెండు మ్యాక్స్‌ విమానాలు ప్రమాదానికి గురి కావడంతో మార్చి 2019లో ఈ విమానాలను ఎగరనీయ లేదు.

కొత్త విమానాలు, ఇప్పటికే ఉన్న ఇతర పరికరాల సుదీర్ఘ తనిఖీలు, లోపాల పరిష్కారం కోసం చాలా సమయం పట్టిందని, ఇక 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు పెంచుతామని బోయింగ్ సంస్థ ఇటీవలే పేర్కొంది.

సుమారు పదమూడు వందల 737 మ్యాక్స్ విమానాలు కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బోయింగ్ డేటా ద్వారా తెలుస్తోంది.

కాగా, మ్యాక్స్ మోడల్స్‌లలో ఏవైనా బోల్ట్‌లు వదులుగా ఉన్నాయేమో చూసుకోవాలని ఎఫ్ఏఏ గత నెలలోనే విమానయాన సంస్థలను కోరింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)