మాల్దీవులు-లక్షద్వీప్ వివాదం: సోషల్ మీడియా యూజర్లు విదేశాంగ విధానాన్ని కూడా నిర్దేశించేలా ప్రవర్తించవచ్చా?

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమ మంత్రులను మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ తర్వాత, ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్‌లోని మాల్దీవుల హైకమిషనర్‌ను షాహిబ్‌ను పిలిపించి, ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వాస్తవానికి, ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాతోనే మొదలైంది.
జనవరి 4న ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనంతరం, పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడంకన్నా లక్షద్వీప్‌కు వెళ్లడం బెటరంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
మాల్దీవులను లక్షద్వీప్‌తో పోల్చడంపై తీవ్రంగా స్పందించిన మాల్దీవులలోని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ప్రధాన మంత్రి మోదీ, భారత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
దీంతో భారత్‌కు చెందిన కొందరు నెటిజన్లు, సెలెబ్రిటీలు కూడా వివాదంపై స్పందించారు. మాల్దీవులను బహిష్కరించాలన్న నినాదాలు మొదలయ్యాయి.
ట్రావెల్ కంపెనీ 'ఈజ్ మై ట్రిప్' మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు కూడా చేసింది.
అదే సమయంలో మాల్దీవులకు చెందిన కొందరు అక్కడి బీచ్‌ల ఫోటోలను షేర్ చేస్తూ, బీచ్‌ల అందాల గురించి పోస్టులు చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయిజ్జు ఉన్నారు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మయిజ్జు, గత ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పార్టీతో కలిసి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA/AFP VIA GETTY IMAGES
భారత్ వ్యతిరేక వైఖరి ఎందుకు?
భారత్‌కు అనుకూల వైఖరి అవలంబిస్తారని పేరున్న మాల్దీవ్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ సొలిహ్‌పై మహమ్మద్ మయిజ్జు విజయం సాధించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మయిజ్జు పార్టీ 'ఇండియా ఔట్' అనే నినాదమిచ్చింది.
భారత సైనికులు మాల్దీవులను వదిలి వెళ్లిపోవాలని కోరినట్లు ఎన్నికల్లో విజయం అనంతరం మయిజ్జు తెలిపారు.
భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మాల్దీవుల్లో భారత సైన్యం ఉండడం తమ దేశాన్ని ముప్పులోకి నెట్టే ప్రమాదం ఉందని బీబీసీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ మయిజ్జు చెప్పారు.
''మాల్దీవులు చాలా చిన్న దేశం. రెండు పెద్దశక్తుల మధ్య బలపరీక్షలో చిక్కుకుపోలేం. అందుకు మాల్దీవులు సిద్ధంగా లేదు'' అని ఆయన అన్నారు.
అయితే, మాల్దీవుల్లో భారత సైన్యం ఉండడాన్ని అతిపెద్ద బూచిగా చూపించారని మాజీ అధ్యక్షులు మహమ్మద్ సొలిహ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
లక్షద్వీప్ వివాదం, జాతీయవాదం
మయిజ్జు, ఆయన పార్టీ మొదటి నుంచి చైనా వైపే మొగ్గు చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు తుర్కియే పర్యటనకు వెళ్లారు. అనంతరం చైనాలో పర్యటించడమే అందుకు నిదర్శనం. గతంలో మాల్దీవులకు కొత్త అధ్యక్షుడు వస్తే మొదట భారత్‌లో పర్యటించేవారు.
మయిజ్జు విజయం తర్వాత, మాల్దీవుల్లో భారత్ వ్యతిరేక, చైనా అనుకూలవాదుల బలం పెరిగింది. అది నాలుగైదు రోజులుగా జరుగుతున్న లక్షద్వీప్-మాల్దీవుల వివాదంలో కనిపించింది.
మాల్దీవులకు చెందిన కొందరు తమ దేశాన్ని ప్రశంసిస్తూ, భారత పౌరులపైనా, ప్రధాని మోదీపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులు కూడా అదే స్థాయిలో స్పందించారు.
భారత్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు మాల్దీవులను బాయ్‌కాట్ చేయాలని విజ్ఞప్తులు చేశారు. వారి వ్యాఖ్యల తీరు భారత విదేశాంగ విధానానికి అనధికారిక ప్రతినిధులుగా మారినట్లుగా కనిపించింది.
ఈ లక్షద్వీప్-మాల్దీవుల వివాదం అనంతరం, ఇండియాకి చెందిన ఓ పెద్ద ట్రావెల్ కంపెనీ అయిన 'ఈజ్ మై ట్రిప్' సీఈవో ప్రశాంత్ పిత్తి మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేసినట్లు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని పరోక్షంగా చూపించారు.
''మన పొరుగువారిపై సానుకూల వైఖరితోనే ఉన్నాం. కానీ, ఎలాంటి కారణం లేకుండా చిమ్ముతున్న ద్వేషాన్ని సహించకూడదు. నేను చాలాసార్లు మాల్దీవులకు వెళ్లా. ఎప్పుడూ ప్రశంసలే కురిపించాం. కానీ, మన గౌరవం కూడా చాలా ముఖ్యం'' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదిక ఎక్స్( ట్వీట్ )లో పోస్ట్ చేశారు. ''అదంతా ఇప్పుడు ముగిసిపోయింది. ఇప్పుడు మనం భారతీయ దీవులకు వెళ్లి మన దేశ పర్యాటకానికి సాయం చేద్దాం'' అని రాశారు.
ఇలాంటి వ్యాఖ్యల అనంతరం, పొరుగు దేశాలతో సంబంధాల వంటి ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వాల వైఖరిపై ప్రభావం చూపించేలా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొచ్చా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, సోషల్ మీడియాలో భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాల్దీవుల రాయబారిని పిలిపించి అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత, సోషల్ మీడియాలో చేసిన రెండు వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చలను నిర్ణయిస్తాయా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, X
సోషల్ మీడియాలో చర్చలు సముచితమా?
రెండు దేశాల మధ్య సంబంధాల గురించి సోషల్ మీడియాలో జాతీయవాదంతో కూడిన ప్రకటనల వల్ల కలిగే ప్రమాదాలేంటి?
''మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రుల పొరపాటు ఏంటంటే, వారి బలమైన రాజకీయ వైఖరిని మాల్దీవుల అధికారిక వైఖరిగా మార్చారు. అలాగే, మంత్రి కూడా కాని నుపూర్ శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి చేసిన ఒక ప్రకటన భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం మీకు గుర్తుండే ఉంటుంది'' అని జామియా మిలియా యూనివర్సిటీలో నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రేమానంద్ మిశ్రా అన్నారు.
ఐడీయాలజీ (భావజాలం) ఆధారంగా విదేశాంగ విధానాన్ని అనుసరించలేమని ప్రేమానంద్ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్ వంటి పెద్ద శక్తులు ఈ రకమైన విదేశాంగ విధానంతో పనిచేయలేవన్నారు.
''మాల్దీవులకు సంబంధించి పెరుగుతున్న సెంటిమెంట్లను వీలైనంత త్వరగా నియంత్రించాలి. తద్వారా మాల్దీవుల్లో భారత్‌కు ఉన్న అవకాశాలు పదిలంగా ఉంటాయి. భారత్‌కు అనుకూలమైన అక్కడి ప్రతిపక్షం కూడా దీనిని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే, అది అక్కడ ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అందువల్ల అలాంటి పరిస్థితి తలెత్తకూడదు'' అన్నారాయన.
''సోషల్ మీడియాలో కొన్నిసార్లు మంచి చర్చ జరుగుతుంది. మరికొన్నిసార్లు అనవసరమైన రాద్ధాంతాలు జరుగుతాయి. కాబట్టి అనవసర రాద్ధాంతాల కారణంగా పెల్లుబికిన జాతీయవాదం అవతలి దేశానికి చెడుగా చూపించే స్థాయికి వెళ్లకూడదు. భారత్ పరిణతి చెందిన దౌత్య విధానాలను అవలంబించాలి'' అన్నారు మిశ్రా.

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV
'సోషల్ మీడియాను పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు'
''ఈ వ్యవహారంలో మాల్దీవుల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మాల్దీవుల హైకమిషనర్‌ను పిలిచి భారత్ కూడా తన అభిప్రాయాలను తెలియజేసింది. ఇక, భారత్ ఈ విషయాన్ని ఇక్కడితే ఆపేయాలి'' అని ప్రేమానంద్ మిశ్రా అన్నారు.
అయితే, భారత విదేశాంగ విధానంపై సోషల్ మీడియాలో జరిగే చర్చను ఆపడం మాత్రం సాధ్యం కాదని విదేశాంగ విధానంపై అవగాహన కలిగిన కొందరు నిపుణులు అంటున్నారు.
''మాల్దీవులపై సోషల్ మీడియాలో బలమైన ప్రతిస్పందన వచ్చింది. భారత్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉండడమే అందుకు కారణం. చాలా మంది భారత పర్యాటకులు మాల్దీవులకు వెళ్తారు, అది మాల్దీవులకు ప్రాముఖ్యత తెచ్చిపెట్టాయి. పర్యాటకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తోంది. కానీ, సోషల్ మీడియాలో వినియోగదారులు, మాల్దీవుల మంత్రులు భారత్, ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.'' అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ ఎల్లెరి అన్నారు.
''సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు భారత విదేశాంగ విధానాన్ని బలహీనపరుస్తాయని చెప్పడం తప్పు. అలాంటి చర్చలు జరగాలని నేను అనుకుంటున్నా" అన్నారు.
''సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారు లేదా చర్చలు నిర్వహించేవారికి సాధారణంగా మంచి నేపథ్యం ఉంటుంది. అది లోతైన చర్చకు దారితీయొచ్చు. అయితే, ఒక దేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలో సోషల్ మీడియా నిర్ణయించలేదు. కానీ అదొక ప్రతిస్పందనగా చూడాలి. అది విదేశాంగ విధానాన్ని నిర్దేశించడదని గుర్తుంచుకోవాలి'' అన్నారు అరవింద్.

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV
మాల్దీవుల్లో భారత వ్యతిరేక వైఖరి పెరుగుతోందా?
అయితే, ''ఇలాంటి అతి జాతీయవాదం రాజకీయ సమస్యలను లేవనెత్తగలదు. ఇది దేశ అంతర్గత రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటుంది. అది రెండు దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది'' అని దిల్లీలోని షహీద్ భగత్ సింగ్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిత్యూషా తివారి అభిప్రాయపడ్డారు.
భారత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, ఇలాంటి ప్రతిచర్యలు రాజకీయ అంశాలుగా కూడా కనిపిస్తాయని, అలాగే వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు కూడా ఉండొచ్చని తివారి అన్నారు.
మాల్దీవుల్లో అత్యధిక జనాభా భారత్‌కు అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌కు, భారత్ అనుకూల వైఖరి ఉన్న అక్కడి ప్రతిపక్ష పార్టీకి అక్కడ మంచి అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANI
లక్షద్వీప్ - మాల్దీవుల వివాదంలో నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యల అనంతరం అక్కడి ప్రతిపక్ష నేతలు భారత్‌కు మద్దతుగా ముందుకు రావడమే అందుకు నిదర్శనం.
భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ స్వయంగా చెప్పారు. ఇది మాల్దీవుల ప్రభుత్వ అధికారిక వైఖరి కాదు.
ఇరుదేశాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న మైత్రీబంధంపై ప్రతికూల ప్రభావం చూపే ఇలాంటి అనుచిత ప్రకటనలను సహించేది లేదని మాజీ అధ్యక్షులు ఇబ్రహీం సొలిహ్ అన్నారు. సొలిహ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్, మాల్దీవుల మధ్య మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
మాల్దీవుల భద్రత, శ్రేయస్సులో కీలకమైన మిత్రదేశంపై భయంకరమైన భాష వాడుతున్నారని, ముయిజ్జు ప్రభుత్వం అలాంటి ప్రకటనలను మానుకోవాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి మహమ్మద్ నషీద్ స్పందించారు.
మాల్దీవులకు చెందిన మరికొందరు నేతలు కూడా భారత్‌పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు.
మాల్దీవుల నుంచి భారత్‌కు వస్తున్న మద్దతును కూడా నిపుణులు గుర్తుచేస్తున్నారు. పరిణితి ప్రదర్శిస్తూ సోషల్ మీడియా యూజర్లు ఈ విషయాన్ని ఇక్కడితో ఆపితే మంచిదని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బిల్కిస్ బానో కేసు: సుప్రీంకోర్టు తీర్పులోని తీవ్రమైన వ్యాఖ్యలేంటి?
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
- ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా?
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
- హిందూ టీమ్, ముస్లింల జట్టు.. ఇలా మతాల ఆధారంగా టీమ్‌లు ఏర్పడి క్రికెట్ ఆడిన రోజులున్నాయి.. చివరకు ఆ పోటీలు ఎలా ముగిశాయో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














