బిల్కిస్ బానో: ‘దోషులకు బడా నేతలతో సంబంధాలున్నాయి, అందుకే మేం సంబరాలు చేసుకోవట్లేదు’- ఆమె గ్రామానికి చెందిన ముస్లింలు

ఫొటో సోర్స్, ROXY GADGEKAR CHHARA/BBC
- రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
2022 ఆగస్టు 15న ఈ కేసులోని దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
దోషుల శిక్షను మాఫీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాల్లోగా దోషులందరూ జైల్లో ఉండాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేవగఢ్ బైరియాకు చెందిన కపాడీ ప్రాంతంలోని 45, 46 అనే నెంబర్ గల రెండు ఇళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.
ఆ ఏరియాలోని చాలా ఇళ్లు 2002 గుజరాత్ అల్లర్ల తర్వాతే కట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ముస్లింలు అక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
ఈ ఏరియాలోని 74కు పైగా ఇళ్లు రంధీక్‌పుర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబాలవే. 2002కు ముందు బిల్కిస్ బానో తన కుటుంబంతో ఇక్కడే నివసించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు తీర్పుపై బిల్కిస్ బానో ఇరుగుపొరుగు హర్షం
మొదట చూడగానే బిల్కిస్ బానో ఇల్లు రోజుల తరబడి మూసేసి ఉన్నట్లుగా అనిపించింది.
రెండు వారాల క్రితం వరకు భర్త పిల్లలతో కలిసి బానో ఆ ఇంట్లోనే ఉన్నారని, మీడియాకు దూరంగా ఉండటానికి తెలియని ప్రదేశనికి వెళ్లిపోయారని పొరుగువారు చెప్పారు.
కపాడీ ఏరియాలోని బిల్కిస్ బానో ఇంటికి సమీపంలో సంతోషకర వాతావరణం నెలకొంది.
యువత టపాసులు కాల్చుతూ, గుంపులుగా కూడిన మహిళలు సుప్రీం కోర్టు తీర్పు గురించి మాట్లాడుతూ కనిపించారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడిన ఆనందం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.
న్యాయం కోసం బిల్కిస్ బానో చేసిన పోరాటం ఫలితాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని బీబీసీతో బిల్కిస్ బానో బంధువు, ఈ కేసులో కీలక సాక్షి రజాక్ మన్సూరీ చెప్పారు.
‘‘ఈ కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్ష మాఫీ చేయడంతో మా గుండె బద్దలైపోయింది. కానీ, ఈరోజు న్యాయవ్యవస్థపై మా నమ్మకం, విశ్వాసం మరింత బలపడింది’’ అని రజాక్ అన్నారు.

ఫొటో సోర్స్, ROXY GAGDEKAR CHHARA/BBC
గుజరాత్ ప్రభుత్వం న్యాయాన్ని చేతుల్లోకి తీసుకుందా?
న్యాయం పొందడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని బీబీసీతో రజాక్ చెప్పారు.
‘‘విచారణ కోసం మేం ముంబయికి వెళ్లాల్సి వచ్చింది. దీనంతటి కోసం పని మానేసి, జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ న్యాయాన్ని లాగేసుకుంది. ఆ తర్వాత మళ్లీ పోరాడాలని మేం నిర్ణయించుకున్నాం. పిటిషన్ దాఖలు చేశాం’’ అని రజాక్ వివరించారు.
రంధీక్‌పుర్ గ్రామంలో కూడా బీబీసీ పర్యటించింది. ఈ కేసులోని 11 మంది దోషులు ఈ గ్రామానికి చెందినవారే.
సోమవారం కోర్టు తీర్పు వెలువడటానికి ముందు సోమవారం రంధీక్‌పుర్‌లో అవాంఛనీయ ఘటనలను ఎదుర్కోవడానికి భద్రతా దళాలను మోహరించారు.
అంతకుముందు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కాషాయ జెండాలతో అలంకరించిన ఈ ప్రాంతం అంతా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత నిశ్శబ్ధంగా మారింది.
తాజా పరిణామాల గురించి ఈ కేసులోని దోషులు, వారి కుటుంబ సభ్యులెవరూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు.
అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పెట్రోలింగ్ పెంచామని, అదనపు భద్రతా దళాలను సిద్ధం చేశామని ఆ ఏరియాకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

ఫొటో సోర్స్, CHIRANTANA BHATT
ముస్లింలలో భయం
2002కు ముందు తన కుటుంబంతో కలిసి బిల్కిస్ బానో నివసించిన ప్రాంతం పోలీస్ స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది.
అయితే, ఇక్కడికి చెందిన చాలామంది తమ ఇళ్లను వదిలేసి దేవగఢ్ బైరిలో స్థిరపడ్డారు.
సుప్రీం కోర్టు సోమవారం నాటి తీర్పులో గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ, శిక్షను తగ్గించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఆ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని తెలిపింది.
కోర్టుకు తప్పుడు సమాచారం అందించినందున, 2022 మే నెలలో వెలువరించిన ఆదేశాలను రద్దు చేసినట్లు సుప్రీం కోర్టు చెప్పింది. శిక్షను తగ్గించడంపై గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నాటి ఆదేశాల్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ముస్లిం సముదాయానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, ‘‘దోషుల్లో చాలామంది రాజకీయంగా చాలా బలమైనవారు. పెద్ద నాయకులతో వారికి సంబంధాలు ఉన్నాయి. అందుకే సుప్రీం కోర్టు తీర్పుపై సంబరాలు చేసుకోవట్లేదు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











