గోధ్రా: 'సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో దోషులు ముందస్తు విడుదలకు అర్హులు కారు'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుచిత్ర కె.మొహంతి
- హోదా, బీబీసీ కోసం
గోధ్రా: 'సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో దోషులు ముందస్తు విడుదలకు అర్హులు కారు'
గుజరాత్‌లోని గోధ్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు ఎస్-6 కోచ్‌ను తగలబెట్టిన కేసులోని నిందితులు, ముందస్తు విడుదలకు అర్హులు కారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
గోధ్రా రైలు దహనం కేసును 'అరుదైన వాటిలో అరుదైనది'గా చూడాలంటూ సుప్రీం కోర్టుకు గుజరాత్ తెలిపింది. అలాగే గుజరాత్ రాష్ట్ర విధానం ప్రకారం ఆ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు అర్హులు కారని ప్రభుత్వం తెలిపింది.
'నేరం తీవ్రత దృష్ట్యా ఆ కేసును అరుదైన వాటిలో అరుదైనదిగా చూడాలని రాష్ట్రం(గుజరాత్) కోరుతోంది. దోషులు టాడా కింద ఉన్నందున గుజరాత్ రాష్ట్ర విధానం ప్రకారం వారిని ముందస్తు విడుదలకు పరిగణనలోకి తీసుకోకూడదు.
ఈ కేసులో 59 మంది సజీవంగా కాలిపోయారు. ఆ బోగీ తలుపులను బయట నుంచి లాక్ చేశారు. చనిపోయిన 59 మందిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు' అని గుజరాత్ తరపున వాదనలు వినిపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
'శిక్షను కోర్టులో సవాలు చేసిన తొలి దోషి, ప్రయాణికులు బయటకు రానివ్వకుండా ఉండేలా రాళ్లు విసిరాడు. రెండో దోషి పాత్ర కూడా స్పష్టంగానే ఉంది. మూడో దోషి దగ్గర మారణాయుధం ఉంది. ఆ కుట్ర పన్మింది నాలుగో దోషి. పెట్రోలు కొని, దాన్ని దాచి పెట్టి, కాల్చేందుకు దాన్ని తీసుకొచ్చాడు' అని సుప్రీం కోర్టులో తుషార్ మెహతా వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ ప్రభుత్వ విధానం ప్రకారం శిక్ష అనుభవిస్తున్న వారిని ముందుగా విడుదల చేయొచ్చా? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం, తుషార్ మెహతాను ప్రశ్నించింది.
అయితే టెర్రరిస్ట్ అండ్ డిజ్రప్టివ్ యాక్టివిటీస్(ప్రివెన్షన్) (టాడా) కింద దోషుల మీద కేసులు ఉన్నాయి కాబట్టి, గుజరాత్ విధానం కింద వారు ముందస్తు విడుదలకు అర్హులు కారని ఎస్‌జీ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.
అయితే దోషుల్లో ఒకరికి గుజరాతీ భాష తెలియదని, తనకు పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను చదవకుండానే వేలి ముద్ర వేశాడంటూ ఒక దోషి తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కేటీఎస్ తులసి అన్నారు.
రెండు వైపులా వాదనలు విన్న ధర్మాసనం, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వమని ఆదేశించడంతోపాటు కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
2002 ఫిబ్రవరి 27న గోధ్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-6 కోచ్‌ను తగలబెట్టారు. ఈ ఘటనలో 59 మంది హిందువులు చనిపోయారు.
2011 మార్చిలో ట్రయిల్ కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితకాల కారాగార శిక్ష విధించారు. మరొక 63 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చారు.
2017లో గుజరాత్ హై కోర్టు ఆ 11 మందికి విధించిన మరణశిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చింది. 20 మందికి విధించి జీవితకాల కారాగార శిక్షను అలాగే ఉంచింది.
పోయిన ఏడాది డిసెంబరు 15న, దోషుల్లో ఒకరైన ఫరూక్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. అప్పటికి 17ఏళ్లుగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
తమకు విధించిన శిక్షల మీద చాలా మంది దోషులు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. 2018 నుంచి అవి కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గోధ్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం ఘటనలో హిందువులు చనిపోయిన తరువాత గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వందల మంది ముస్లింలను చంపేశారు.
ఈ అల్లర్లకు సంబంధించి బిల్కిస్ బానో కేసు ఒకటి.
బిల్కిస్ బానో కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వారిని పోయిన ఏడాది సత్పవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:
- మగవారికి గర్భనిరోధక మాత్రలు ఎందుకు లేవు... ‘సెక్స్’ మీద ప్రభావం పడుతుందని భయపడుతున్నారా
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- రవీంద్ర జడేజా: టెస్టు క్రికెట్లో సూపర్ ఆల్‌రౌండర్‌గా అవతరిస్తున్నాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









