లక్షదీవులకు వెళ్ళడం అంత సులభం కాదు, ఎందుకంటే...

ఫొటో సోర్స్, Twitter/Modi
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ వెళ్లారు. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్‌లో పర్యటించాలంటూ పిలుపునిచ్చారు.
లక్షదీవుల అందాలు తనకు ఎంతో నచ్చాయంటూ తన అధికారిక ఖాతా ద్వారా ఎక్స్‌లో మోదీ ట్వీట్ చేశారు.
మోదీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను చూసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లండని చెప్పడం ప్రారంభించారు.
దీని తర్వాత భారత ప్రధాని మోదీపై, లక్షదీవుల మీద మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద చర్చ మొదలైంది.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది.
ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ తెందూల్కర్ వంటి భారత ప్రముఖులు భారత తీరాలు, దీవులకు మద్దతుగా స్పందించారు.
ఇంతకీ ఇప్పుడు చర్చల్లో నిలిచిన లక్షద్వీప్ ఎక్కడ ఉంది?
అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది?
అక్కడ చూడదగిన ప్రదేశాలు? సాహసక్రీడల గురించి తెలుసుకుందాం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లక్షద్వీప్‌కు ఎలా వెళ్లాలి?
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ వెళ్లడానికి నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు.
అక్కడికి వెళ్లాలంటే వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు.
కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది.
కాబట్టి, అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్ చేరుకోవచ్చు.
కొచ్చికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
విమాన సర్వీసులు
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి ప్రతిరోజూ విమాన సర్వీసులు ఉన్నాయి.
కొచ్చికి వెళ్లడానికి నెల రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 4,500 ఉంటుంది.
లక్షదీవుల్లో ఏకైక విమానాశ్రయం ‘అగత్తి’లో ఉంది.
కొచ్చి నుంచి అగత్తికి వెళ్లడానికి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 5,500 ఉంటుంది.

ఫొటో సోర్స్, Twitter/Modi
రైలు మార్గం
లక్షద్వీప్ వెళ్లడానికి మొదట కోచీ చేరుకోవాలంటే ఈ నగరానికి సమీపంలోని ఎర్నాకులం టౌన్ కానీ ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు కానీ చేరాలి.
హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్(నాంపల్లి) నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్ (కొచ్చి/ఎర్నాకులం)కు రోజూ శబరి ఎక్స్‌ప్రెస్ (17230) నడుస్తుంది. ప్రయాణ సమయం 23:35 గంటలు.
విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేరళ ఎక్స్‌ప్రెస్, అలప్పీ ఎక్స్‌ప్రెస్ రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
కేరళ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 18:30 గంటలు కాగా, అలప్పీ 21:20 గంటల్లో కేరళ చేరుకుంటున్నట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ చూపిస్తోంది.
విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలప్పీ-బొకారో ఎక్స్‌ప్రెస్ రోజూ కేరళకు వెళ్తుంది. దాని ప్రయాణ సమయం 28:05 గంటలు.
రోడ్డు మార్గం
కేరళలోని కొచ్చి పట్టణాన్ని పొరుగు రాష్ట్రాలతో జాతీయ రహదారి అనుసంధానిస్తుంది. ముంబయి, కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ సాగే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది.
కాబట్టి ఈ నగరాల నుంచి అక్కడికి రోడ్డు మార్గాన వెళ్లొచ్చు.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికి ఎలా చేరుకోవాలో చూశాం. ఇప్పుడు కొచ్చి నుంచి నీటి మార్గం, వాయు మార్గాన లక్షద్వీప్‌కు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
కొచ్చి నుంచి లక్షద్వీప్ ప్రయాణం..
లక్షద్వీప్‌కు కొచ్చి గేట్‌వే లాంటిది. కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి.
లక్షద్వీప్‌లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి గంటన్నర సమయం పడుతుంది.
కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటే కనీస ధర రూ. 5,500 ఉంటుంది.
జల మార్గానికొస్తే కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు ఏడు ప్రయాణికులు ఓడలు అందుబాటులో ఉన్నాయని ‘యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్’ అనే భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ, ఎంవీ లాగూన్, ఎంవీ కోరల్స్, ఎంవీ అమిందివి, ఎంవీ మినీ కాయ్ అనే ఓడలు ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుంటాయి.
మనం వెళ్లాల్సిన దీవుల ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం 14 నుంచి 18 గంటలు ఉంటుంది.
ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ (రెండు బెర్తులు), సెకండ్ క్లాస్ ఏసీ (నాలుగు బెర్తులు) అనే కేటగిరీలు ఉంటాయి. ఓడలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
ఓడను బట్టి క్లాస్‌ల ఆధారంగా టిక్కెట్ ధరలు రూ. 2,200 నుంచి గరిష్ఠంగా రూ. 6 వేల వరకు ఉంటాయని ట్రిప్ ట్రావెలింగ్ గైడ్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.
మరిన్ని వివరాల కోసం https://samudram.utl.gov.in/ , http://lakport.nic.in అనే వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
పర్మిట్ పొందడం కోసం ఏం చేయాలంటే?
అన్నింటి కంటే ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా లక్షద్వీప్ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
‘లకాదీవ్, మినీ కాయ్, అమిందివి ఐలాండ్స్ నిబంధనలు-1967’ ప్రకారం.. లక్షద్వీప్ స్థానికులు కాని వారంతా అక్కడికి వెళ్లడానికి, ఉండటానికి తప్పనిసరిగా అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
కేవలం ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
విదేశీయులు, టూరిస్టులు, మతబోధకులు/స్కాలర్లు, పర్యాటక అధికారులు/ప్రభుత్వ సిబ్బంది/ప్రభుత్వ సిబ్బంది బంధువులు, ఎల్‌పీడబ్ల్యూడీ సివిల్ వర్క్‌కు సంబంధించిన కాంట్రాక్టర్లు లేబర్లు, ఇతరుల కోసం అనుమతులు మంజూరు చేయడానికి వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు.
వారి వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.
అనుమతి నిరాకరణ, మంజూరు, పునరుద్ధరణ, ఇతర అంశాల్లో సహాయం కోసం కూడా కొన్ని మార్గదర్శకాలు, నియమ నిబంధనల్ని రూపొందించారు.
ఎంట్రీ పర్మిట్ కోసం http://epermit.utl.gov.in అనే పోర్టల్ అందుబాటులో ఉంది. ఇందులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
ఇంతకీ లక్షద్వీప్‌లో ఎన్ని దీవులు ఉన్నాయి
భారత్‌కు చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్.
ఇది 36 దీవుల సమూహం. 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ఈ దీవులు ప్రకృతి అందాలకు నెలవు. లక్షద్వీప్ రాజధాని కవరత్తి.
కేరళలోని తీరప్రాంత నగరం కొచ్చికి లక్షద్వీప్‌లోని అన్ని దీవులు దాదాపు 220 నుంచి 440 కి.మీ దూరంలో విస్తరించి ఉంటాయి.
లక్షద్వీప్ మొత్తం జనాభా దాదాపు 64 వేలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభాలో 96 శాతం ముస్లింలు ఉన్నారు. అక్ష్యరాస్యత 91 శాతం.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
బంగారం ద్వీపంలో 61 మంది
లక్షద్వీప్‌లో 10 జనావాస ప్రాంతాలు ఉన్నాయి. వీటి పేర్లు కవరత్తి, అగత్తి, అమిని, కద్మత్, కిల్టాన్, చెట్లత్, బిత్రా, ఆందోహ్, కల్పేనీ, మినికాయ్. బిత్రాలో 271 మంది మాత్రమే నివసిస్తున్నారు.
బంగారం ద్వీపంలో 61 మంది మాత్రమే నివసిస్తున్నారు.
ఇక్కడ మలయాళం మాట్లాడతారు.
మినీకాయ్‌లో ప్రజలు మహే మాట్లాడతారు. దీని లిపి దివేహి.

ఫొటో సోర్స్, https://lakshadweep.gov.in/
ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే పనిచేస్తాయి
లక్షద్వీప్‌లో బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ కంపెనీలు టెలీ కమ్యూనికేషన్ సేవల్ని అందిస్తున్నాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ అన్ని జనావాస ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.
ఎయిర్‌టెల్ సేవలు కవరత్తి, అగత్తి అనే రెండు ప్రాంతాల్లోనే లభిస్తాయి.
లక్షద్వీప్‌లోని ప్రజలకు చేపలు పట్టడం, కొబ్బరి సాగు ముఖ్యమైన ఆదాయ వనరులు. లక్షద్వీప్‌లో పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
గత సంవత్సరం లక్షద్వీప్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య దాదాపు 25 వేలు అని కొన్ని మీడియా రిపోర్టులు తెలిపాయి.
మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య కంటే ఇది దాదాపు ఎనిమిదింతలు తక్కువ.
లక్షద్వీప్‌లో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
చూడదగిన ప్రదేశాలు
లక్షద్వీప్‌లోని ముఖ్యంగా ఆరు ద్వీపాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. అవేంటంటే బంగారం, అగత్తి, కద్మత్, మినీ కాయ్, కల్పేనీ, కవరత్తి ద్వీపాలు.
కన్నీటి బిందువు ఆకారంలో ఉండే బంగారం ద్వీపం ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లు, టెన్షన్లకు దూరంగా ఉండేందుకు పర్యటకులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది.
రాత్రిపూట సముద్ర తీరం నీలం రంగులో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఇక్కడ జనావాసం ఉండదు.
అగత్తి నుంచి ఇక్కడికి రావడానికి విమానంతో పాటు హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది. రైలు మార్గం లేదు. రోడ్డు మార్గం కూడా లేదు.
అగత్తి చాలా అందమైన ప్రాంతం. ఇక్కడే ఈ దీవుల్లోని ఏకైక విమానాశ్రయం ఉంది. భారతీయ విమాన సంస్థలు సేవలు అందిస్తాయి. ఇక్కడ 20 పడకల టూరిస్ట్ కాంప్లెక్స్‌ను అధునాతన హంగులతో నిర్మించారు.
వాటర్‌స్పోర్ట్స్‌కు కద్మత్ చాలా ప్రసిద్ధి. విశాలమైన బీచ్‌లు, పామ్ చెట్లలో టూరిస్టుల కోసం కట్టిన గుడిసెలు ఆకర్షిస్తుంటాయి.
కయాకింగ్, సెయిలింగ్, స్కీయింగ్ చేయొచ్చు. అడుగు భాగాన గాజుతో నిర్మించిన బోట్లు ఇక్కడ అద్దెకు దొరుకుతాయి. 20 నుంచి 35 మీటర్ల లోతు వరకు చూడగలిగేలా నీరు తేటగా ఉంటుంది.
మినీకాయ్ ద్వీపం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి సంస్కృతి, భాష మిగతా దీవులకు భిన్నంగా ఉంటుంది.
ఇది 11 గ్రామాల సమూహం. ఎన్నిక అయిన ‘బొడు కాకా’ అనే గ్రామపెద్ద ఇక్కడ పాలిస్తుంటారు.
అన్నీ అధికారాలు ఆయనకే ఉంటాయి. ట్యూనా ఫిషింగ్‌కు ఇది పెట్టింది పేరు. ఇక్కడ 1885లో బ్రిటిష్ వారు నిర్మించిన లైట్ హౌస్ ల్యాండ్ మార్క్‌గా ఉంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. పర్యాటకుల కోసం 3 టూరిస్ట్ కాటేజ్‌లు ఉన్నాయి.
కవరత్తి చాలా అభివృద్ధి చెందిన ద్వీపం. ఈ ద్వీపం అంతటా 52 మసీదులు ఉన్నాయి. అన్నింటికంటే ఉర్జా మసీదు చాలా అందమైనది.
ఈ మసీదుకు సమీపంలోని ఒక బావిలోని నీటికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు. వాటర్‌స్పోర్ట్స్, స్విమ్మింగ్, స్నోర్కెలింగ్ అందుబాటులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, lakshadweep.gov.in
ఎప్పుడు వెళ్లాలి?
మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం ఇక్కడకు వెళ్లడానికి ఉత్తమ సమయం.
ఇక్కడ ఉష్ణోగ్రత 22 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ముందుగా చెప్పినట్లుగా లక్షద్వీప్‌లోని అనేక ద్వీపాలకు ప్రవేశం పరిమితం. కాబట్టి ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరం.
లక్షద్వీప్ మలయాళం, సంస్కృతంలో లక్ష దీవులు అని అర్థం.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
- సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















