గుజరాత్ పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో కూరగాయలు, బెలూన్లు ఎందుకు అమ్మారు?

పోలీసుల మారువేషం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, కూరగాయలు అమ్మేవారిలా పోలీసులు మారువేషం వేశారు
    • రచయిత, భార్గవ్ పరిఖ్
    • హోదా, బీబీసీ

అహ్మదాబాద్‌లో వివిధ రకాల పనులు చేసే మేస్త్రీల సాయంతో ఓ దొంగల ముఠా రెచ్చిపోవడం మొదలైంది. దొంగతనాలు చేశాకా, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్నగ్రామంలో తలదాచుకునేది.

సరిగ్గా దొంగలు చేస్తున్న ఈ పనే పోలీసులకు వారిని పట్టిచ్చింది. ఈ గ్రామంలో అహ్మదాబాద్ పోలీసులను ఎవరూ గుర్తించలేరు కాబట్టి, పోలీసులు కూడా కూరగాయలు అమ్మేవారిలానూ, బూరలు అమ్మేవారిలానూ నటించి దొంగలను పట్టుకోగలిగారు.

తాము దొంగలను ఎలా పట్టుకున్నదీ పోలీసు ఇన్‌స్పెక్టర్ రవియా మీడియాకు తెలిపారు.

చాలా కాలంగా అహ్మదాబాద్‌లో వివిధ ప్రాంతాలలో చోరీలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందుతోంది. ఈ దొంగతనాలన్నీ కొత్తగా కట్టిన ఇళ్ళలోనూ, లేదంటే ఇటీవలే రంగులు వేసిన ఇళ్ళలోనో జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.

అనేక సీసీటీవీల సమాచారాన్ని క్రోడీకరించుకున్నాకా పోలీసులకు ప్రాథమికంగా ఓ వ్యక్తిపై అనుమానం కలిగి, అతనిపై నిఘా వేసి తదుపరి విచారణ మొదలుపెట్టారు.

కాకపోతే పోలీసులు అనుమానించిన వ్యక్తిని ఆధారంగా దొంగలను పట్టుకోవడం పోలీసులకు అంత తేలిక కాలేదు. ఎందుకంటే ఈ అనుమానితుడు తరచూ మధ్యప్రదేశ్‌కు వెళుతుండేవాడు.

అయితే పోలీసులు అతనిని పట్టుకుని నిజం కక్కించేందుకు ఓ 48 గంటల డ్రామాను సృష్టించారు.

పోలీసుల మారువేషం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, చిత్రంలో కనిపిస్తున్న బంగారు రంగు స్కూటర్ కూడా ఓ క్లూగా మారింది.

దొంగతనాలు ఎలా చేసేవారు?

వివిధ ప్రాంతాలలో ఈ ముఠా దొంగతనాలు ఎలా చేసింది పోలీసు ఇన్‌స్పెక్టర్ కె.డి.రవియా బీబీసీకి తెలిపారు.

మధ్యప్రదేశ్‌ నుంచి అనేకమంది పెయింటింగ్, తాపీ పనుల కోసం అహ్మదాబాద్‌కు వచ్చేవారు. ముందు తాము పనిచేసే ఇంటిని లక్ష్యంగా చేసుకునేవారు. ఆ ఇంటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని తరువాత దొంగతనం చేసి మధ్యప్రదేశ్‌కు వెళ్ళిపోయేవారు.

ఈ దొంగతనాల విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఆనందశర్మ అనే వ్యక్తిని అనుమానించారు.

‘‘ఆనందశర్మ కూడా మధ్యప్రదేశ్‌నుంచే వచ్చేవాడు. అతను మేస్త్రీగా పనిచేసేవాడు. ఇల్లు గలవాళ్ళతో మాట కలిసి ఆ ఇంటి సమాచారమంతా రాబట్టేవాడు. ఆ తరువాత మధ్యప్రదేశ్ నుంచి తన ముఠాను పిలిచి చోరీ చేసేవాడు’’ అని కేడీ రవియా తెలిపారు.

కొత్తగా కట్టిన ఇళ్ళలో దొంగనతాలు జరుగుతుండటంతో, నగరంలో ఎక్కడెక్కడ ఇళ్ళు నిర్మిస్తున్నారో ఆ ప్రాంతాలలో పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ముఖ్యంగా చాణక్యపురిలో గస్తీని ముమ్మరం చేశారు.

ఆనందశర్మ చాణక్యపురి ప్రాంతంలో కొత్తగా కట్టిన ఇళ్ళలో ఫర్నీచర్ పనిచేసేవాడు. ఇక్కడి ఫ్లాట్స్‌లో నివసించేసేవారు వాకింగ్ కోసం బయటకు వెళతారని కూడా అతనికి తెలుసు.

‘‘ఆనందశర్మపై కన్నేసి ఉంచాం. అతను తన ఊరి నుంచి ఇద్దరిని పిలిచాడు. కానీ వారు వెంటనే మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కానీ కొన్నిరోజులలోపే చాణక్యపురిలోని ఓ లాయర్ ఇంట్లో దొంగతనం జరిగింది. లక్షన్నర రూపాయల విలువైన బంగారు నగలు చోరీ అయ్యాయి.

దీంతో పోలీసులు తమ విచారణను మరింత ముమ్మరం చేశారు.

పోలీసుల మారువేషం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, బెలూన్ అమ్మేవారిగా అవతారమెత్తిన పోలీసులు

దొంగలను ఎలా పట్టుకున్నారు?

‘‘మేం వెంటనే సీసీటీవీని పరిశీలించాం. అందులో ఓ స్కూటర్ పై వెళుతున్న వ్యక్తిని గమనించాం. అయితే స్కూటర్ నంబరు కనిపించలేదు. కానీ దొంగతనం జరిగిన తీరు చూస్తే బాగా చేయితిరిగిన దొంగే ఈ పనిచేసినట్టు అర్థమైంది. దీంతో ఈకేసును డిటెక్టివ్ స్టాఫ్‌కు అప్పగించాం’’ అని ఆర్.హెచ్. సోలంకీ చెప్రు.

డీస్టాఫ్‌కు చెందిన కేడీ రవియా మాట్లాడుతూ ‘‘ సీసీ టీవీ ఫుటేజీలో బంగారురంగు స్కూటర్ ఒకటి కనిపించింది. దానికి ముందు నెంబరు ప్లేటు లేదు. వెనుక వైపు ఉన్న నెంబరు ప్లేటు వంగిపోయి ఉంది. నెంబరు ఆధారంగా స్కూటర్‌ను గుర్తించడం కష్టమని అర్థమైంది. కానీ బంగారురంగు స్కూటర్ అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. దీని ఆధారంగా దొంగను కనిపెట్టొచ్చని భావించాం’’ అని చెప్పారు.

‘‘సీసీ టీవీలన్నింటినీ జల్లెడ పట్టాకా, ఈ గోల్డెన్ కలర్ స్కూటర్ అహ్మదాబాద్ నగరం దాటి బయటకు పోలేదని తెలుసుకున్నాం. అయితే స్కూటర్ పై ఉన్న వ్యక్తి ముసుగు కప్పుకోవడం వల్ల అతనెవరో పసిగట్టలేకపోయాం. కానీ అతను మధ్యప్రదేశ్ గానీ, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాడై ఉంటాడని భావించాం’’ అని తెలిపారు.

ఆ తరువాత దీనిపై మరో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు స్కూటర్ పై ఉన్న వ్యక్తి మొహాన్ని పోలీసులు చూడగలిగారు. దీని ఆధారంగా విచారణ జరిపితే ఈ స్కూటర్ పానీపూరీ అమ్మే వ్యక్తిదని తేలింది. అతను కూడా ఆనందశర్మ గ్రామానికి చెందినవాడే. ఇతని స్కూటర్ ను ఆనంద్ ఉపయోగించుకుంటూ ఉండేవాడు.

‘‘ఇప్పుడు మా అసలైన పరీక్ష మొదలైంది’’ అని రవియా చెప్పారు.

దీని తరువాత కొందరు మంచినీటి సరఫరాచేసేవారిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆనంద శర్మ స్వగ్రామమేదో పోలీసులు రాబట్టగలిగారు.

నిందితుడు ఆనందశర్మ స్వగ్రామం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా భ్రదోలీ గ్రామం అని పోలీసులు కనుక్కున్నారు.

ఆనందశర్మ గ్రామమేదో కనుక్కున్న పోలీసులకు నేరుగా అతని ఇంటికి వెళ్ళడం కష్టమైంది. అతను తన గ్రామంలోని లోతట్టుప్రాంతంలో ఇరుకైన వీధులున్న ప్రాంతంలో ఉండేవాడు. ఒకవేళ పోలీసులు నేరుగా వెళితే అతను తప్పించుకునే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు అతను బయటకు వచ్చినప్ప్పుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. దీంతో అతని కదలికలను కనుక్కోవడం కష్టంగా మారింది.

వేషం మార్చిన పోలీసులు

ఆనందశర్మ తన గ్రామంలో టీ తాగడానికి వచ్చే దుకాణానికి దగ్గరలోనే బూరలు అమ్మేవారిగానూ, కూరగాయలు అమ్మేవారిగానూ నటించడం మొదలుపెట్టారు.

ఓ లారీ నిండా బూరలు, కూరగాయలు వేసుకొచ్చి వాటిని ఆనందశర్మ ఇంటి సమీపంలో విక్రయించడం మొదలుపెట్టారు.

ఆనందశర్మను పట్టుకోవడానికి అతనుండే వీధిలోనే మేమొక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నామని రవియా చెప్పారు. అతను ఇల్లేదో మాకు తెలిసిపోయింది. మేము పోలీసులమనే విషయం ఆనందశర్మ సహా ఆ ఊళ్ళో ఎవరికీ తెలియదు. దీంతో మేం అక్కడి నుండే వీధిలో మామూలుగా నడుచుకుంటూ వెళుతుంటే అతను కూడా బయటకు వస్తుండేవాడు అని రవియా తెలిపారు.

ఇలా గ్రామంలో నాలుగురోజులపాటు నటించిన పోలీసులు చివరిరోజు రాత్రి ఆనందశర్మ ఇంటిపై దాడి చేశారు. అతని నుంచి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాను చేసిన దొంగతనాలను ఆనందశర్మ కూడా అంగీకరించడంతో అతనిని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)