చర్చి పాస్టర్ అత్యాచారాలు : ‘మమ్నల్ని నగ్నంగా మార్చి చావబాదేవారు, రేప్ చేసేవారు’: బీబీసీకి వివరించిన బాధితులు

సినాగోగ్ చర్చిలో అఘాయిత్యాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అత్యంత ప్రసిద్ధి పొందిన సినాగోగ్ చర్చి ఆఫ్ ఆల్ నేషన్స్‌ను టీబీ జాషువా స్థాపించారు
    • రచయిత, చార్లీ నార్త్‌కాట్, హెలెన్ స్పూనర్
    • హోదా, బీబీసీ న్యూస్

గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీస్తు బోధనల చర్చిలో జరిగిన అత్యాచారాలు, హింస బీబీసీ ఫైండ్ పరిశోధనలో బయటపడ్డాయి.

అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన సినాగోగ్ చర్చి ఆఫ్ ఆల్ నేషన్స్ వ్యవస్థాపకుడు టీబీ జాషువా అనేక అత్యాచారాలు చేశారని, కొందరు మహిళలకు బలవంతంగా అబార్షన్ చేయించారని చర్చికి చెందిన ఐదుగురు బ్రిటీషర్లు సహా అనేకమంది మాజీ సభ్యులు ఆరోపించారు.

ఈ అత్యాచారాలన్నీ నైజీరియాలో ఉన్న లాగోస్‌లోని చర్చి ప్రాంగణంలో 20 ఏళ్ళకు పైగా సాగాయి.

అయితే ఈ ఆరోపణలపై సినాగోగ్ చర్చి ఆఫ్ ఆల్ నేషన్స్ స్పందించలేదు. కానీ గతంలో వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపింది.

టీబీ జాషువా 2021లో మరణించారు. ఆయన ప్రసిద్ధి పొందిన బైబిల్ బోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫాలోయర్లు భారీ సంఖ్యలో ఉన్నారు.

ఈ మెగాచర్చిపై వచ్చిన ఆరోపణలపై బీబీసీ రెండేళ్ళపాటు చేసిన పరిశోధనలో కనుగొన్న విషయాలు ఇలా ఉన్నాయి:

జాషువా వల్ల అనేకమంది శారీరక హింసకు గురైనట్టు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాల ద్వారా తెలిసింది. అలాగే చాలామంది చిన్నపిల్లలను వేధించడం, ప్రజలను బంధించి కొరడాలతో హింసించినట్టు తేలింది.

చర్చి ప్రాంగణంలో జాషువా తమను ఏళ్ళ తరబడి లైంగింకంగా హింసించాడని, చాలాసార్లు రేప్ చేశాడని అనేకమంది మహిళలు చెప్పారు.

తాను రేప్ చేయడం వలన గర్భవతులైన వారికి జాషువా బలవంతంగా అబార్షన్స్ చేయించేవారని, ఒక మహిళ తనకు ఐదుసార్లు అబార్షన్ జరిగిందని వెల్లడించారు.

ప్రపంచంలోని నలుమూలలకు ప్రసారమయ్యే జాషువా ‘మిరకిల్ హీలింగ్’ కార్యక్రమం ఒక బూటకమని పలువురు తెలిపారు.

సినాగోగ్ చర్చి లో అఘాయిత్యాలు
ఫొటో క్యాప్షన్, జాషువా ప్రాంగణంలో రే 12 సంవత్సరాలపాటు ఉన్నారు

‘21 ఏళ్ళ వయసులో చేరా..నరకం చూశా’

జాషువా బాధితులలో ఒకరైన ‘రే’ బ్రిటీషు మహిళ. ఆమెకు 21 సంవత్సరాల వయసులో ఉండగా బ్రైటన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి జాషువా చర్చిలో చేశారు.

లాగోస్ లోని జాషువా కాంక్రీట్ కీకారణ్యలో ఆయన శిష్యురాలిగా 12 ఏళ్ళపాటు గడిపారు.

‘‘మేమందరం స్వర్గంలో ఉన్నట్టుగా బోధించేవారు. కానీ అదో నరకం. అక్కడ నరకప్రాయమైన ఘటనలే జరిగాయి’’ అని రే బీబీసీకి చెప్పారు.

తాను రెండేళ్ళపాటు ఏకాంత నిర్బంధానికి గురయ్యాయని, జాషువా లైంగికంగా వేధించాడని ఆమె చెప్పింది.

‘‘ఆ వేధింపులు చాలా తీవ్రంగా ఉండేవి. చర్చి ప్రాంగణం లోపల నేను ఎన్నోసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను’’ అని రే తెలిపారు.

ది సినాగోగ్ చర్చి ఆప్ ఆల్ నేషన్స్ ( స్కోన్)కు ప్రపంచం నలుమూలలా భక్తులున్నారు.

ఈ చర్చికి ఇమ్మాన్యుయేల్ టీవీ పేరుతో క్రీస్తు బోధనల టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల నెట్ వర్క్‌ ఉంది.

వీటిని లక్షలాదిమంది ప్రేక్షకులు వీక్షించేవారు.

జాషువా ‘హీలింగ్ మిరకిల్స్’ కార్యక్రమాన్ని చూసేందుకు 1990లలో, 2000 ప్రారంభంలో వేలాదిమంది యాత్రికులు యూరోప్, అమెరికా, అగ్నేయాసియా, ఆఫ్రికా నుంచి నైజీరియాలోని లాగోస్ చర్చికి వచ్చేవారు. లాగోస్‌ చర్చి ప్రాంగణంలో కనీసం 150 మంది ఆయన శిష్యులుగా జీవిస్తుండేవారు. కొన్నిసార్లైతే దశాబ్దాల తరబడి అక్కడే ఉండేవారు.

యూకే, నైజీరియా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఘనా, నమీబియా, జర్మనీకి చెందిన పాతికమంది జాషువా మాజీ శిష్యులు బీబీసీతో మాట్లాడారు. వీరంతా చర్చిలోని తమ అనుభవాలను, 2019లో జరిగిన ఉదంతాలను వివరించారు.

చాలామంది ఇక్కడ చేరినప్పుడు టీనేజీలో ఉండేవారని వాళ్లు తెలిపారు. కొంతమంది బ్రిటీషర్ల కేసులోనైతే, యూకేలోని ఇతర చర్చిల సమన్వయంతో వీరందరూ లాగోస్ రావడానికి అయ్యే ఖర్చును జాషువానే భరించేవారు.

రే తోపాటు అనేకమంది బాధితుల ఇంటర్వ్యూలలో వారి అనుభవాలను బేరీజు వేస్తే వారంతా ఒకే విధమైన వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.

నైజీరియాకు చెందిన జెస్సీకా కైము ఐదేళ్ళపాటు తానీ అగ్నిపరీక్ష ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఆమెకు 17 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు జాషువా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పలుమార్లు అత్యాచారం చేసిన జాషువా ఆమెకు బలవంతంగా ఐదుసార్లు అబార్షన్ చేయించారు.

‘‘ఇవ్వన్నీ దొడ్డిదారి వ్యవహారాలు. ఇక్కడ అందించే చికిత్సలు ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది’’ అని చెప్పారు.

తమను నగ్నంగా చేసి ఎలక్ట్రికల్ కేబుల్స్, కొరడాలతో చావబాదేవారు. నిద్ర పోకూడదని చెప్పేవారని మిగతా బాధితులు తెలిపారు.

2021 జూన్‌లో తాను చనిపోయేవరకు ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన పాస్టర్‌గా టీబీ జాషువా పేరు గడించారు.

పేదరికంలో పుట్టిన జాషువా ఏకంగా ఓ క్రీస్తు బోధనల సామ్రాజ్యాన్నే స్థాపించారు. అనేకమంది రాజకీయనాయకులు, సెలబ్రిటీలు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఆయనకు సహచరులుగా ఉండేవారు.

2016లో చర్చికి వచ్చిన యాత్రికులు బసచేసిన ఓ అతిథిగృహం కూలిపోయి 116 మంది చనిపోయినప్పుడు ఆయన వివాదంలో చిక్కుకున్నారు.

సినాగోగ్ చర్చిలో అఘాయిత్యాలు
ఫొటో క్యాప్షన్, నోరు విప్పని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారని అన్నెకా నమ్ముతున్నారు

అంతర్జాతీయ మీడియా వేదిక ఓపెన్ డెమోక్రసీతో కలిసి జాషువా వ్యవహారంపై బీబీసీ పరిశోధన చేసింది. మొట్టమొదటిసారిగా అనేకమంది మాజీ చర్చివాసులు తమ సాక్ష్యాలను నమోదు చేశారు. తాము ఏళ్ళ తరబడి జాషువా విషయంలో ప్రమాదఘంటిక మోగించడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందన్నారు.

తమపై భౌతికంగా దాడులు జరగడం వలన అనేకమంది నైజీరియా సాక్షులు ఈ అఘాయిత్యాలపై పెదవి విప్పలేదు. చర్చిలో జరుగుతున్న దారుణాలను బహిరంగంగా మాట్లాడి, అక్కడ వేధింపులకు సంబంధించిన యూట్యూబ్‌లో వీడియో పోస్టు చేశాక ఓ వ్యక్తిపై కాల్పులు కూడా జరిగాయి.

లాగోస్‌లోని చర్చి ప్రాంగణాన్ని2022 మార్చిలో ఓ వీధిలోనుంచి చిత్రీకరించేందుకు బీబీసీ సిబ్బంది ఒకరు ప్రయత్నించిన సందర్భంలో కూడా చర్చి భద్రతా సిబ్బంది ఆయనపై కాల్పులు జరిపి, గంటల కొద్దీ నిర్బంధించారు.

బీబీసీ పరిశోధనలో బయటపడిన ఆరోపణలపై వివరణ కోరేందుకు ‘స్కోన్’ను సంప్రదించగా, వారు స్పందించలేదు. కానీ టీబీ జాషువాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని తెలిపారు.

‘‘ప్రవక్త టీబీ జాషువాపై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ వాటిల్లో ఒక్కటి కూడా నిరూపితం కాలేదు’’ అని ‘స్కోన్’ రాసింది.

చర్చి నుంచి తప్పించుకున్న తరువాత యూకే అధికారులకు అక్కడి వేధింపుల గురించి ఫిర్యాదు చేసినట్టు బీబీసీతో మాట్లాడిన ఐదుగురు బ్రిటీషు పౌరులు తెలిపారు. ఫిర్యాదు తరువాత ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు.

దీంతోపాటుగా ఓ బ్రిటీషు వ్యక్తి, ఆయన భార్య చర్చి ప్రాంగణంలో తాము పడ్డ ఇబ్బందులను వీడియో రూపంలో ఈమెయిల్ చేశారు.

2010 మార్చిలో తాము చర్చినుంచి పారిపోతూ స్కోన్ సభ్యులు తమను తాము పోలీసులుగా చెప్పుకుంటూ తుపాకులతో తిరుగుతున్న రికార్డింగ్ ను తీసుకువచ్చారు.

ఈమెయిల్‌లో ఆ వ్యక్తి తన భార్యను జాషువా అనేకమార్లు లైంగికంగా వేధించారని చెప్పారు. ఇంకా చర్చి ప్రాంగణంలో బ్రిటీషు పౌరులు ఉన్నారని, వారంతా అణిచివేతను ఎదుర్కొంటున్నారని బ్రటీషు హైకమిషన్‌కు తెలిపారు.

ఫిర్యాదుచేసినా ఎవరూ స్పందించదలేని ఈ వ్యక్తికూడా తెలిపారు.

ఈ ఆరోపణలపై యూకే విదేశీ కార్యాలయం స్పందించలేదు. కానీ లైంగిక వేధింపులు, విదేశీ గడ్డపై బ్రిటీషు పౌరులపై హింసను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు బీబీసీకి తెలిపింది.

స్కోన్ కార్యలకాపాలు ప్రస్తుతం జాషువా భార్య ఎవెలిన్ చూస్తున్నారు. 2023 జులైలో ఆమె స్పెయిన్‌లో పర్యటించారు.

జాషువా చేతిలో బలైపోయినవారు, నోరు విప్పని బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నారని అన్నెకా అనే బాధితురాలు తెలిపారు. ఆమె 17 ఏళ్ళ వయసులో యూకేలోని డెర్బీ నుంచి వచ్చి స్కోన్‌లో చేరారు. జాషువా ఘోరాలు వెలికి తీసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

‘‘సినాగోగ్ చర్చి ఆఫ్ ఆల్ నేషన్స్ పై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. జాషువా ఇంతకాలం ఇలాంటి అకృత్యాలు ఎలా చేయగలిగారుు అనేది బయటపడాలి’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)