టెస్లా చైనాలో 16 లక్షల కార్లను ఎందుకు వెనక్కు రప్పిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇసె గాక్‌సెడెఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కార్ల తయారీ సంస్థ టెస్లా, చైనా నుంచి 16 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తోంది.
ఈ కార్లలో స్టీరింగ్ సాఫ్ట్‌వేర్ సమస్యతోపాటు డోర్ లాకింగ్‌లోను ఇబ్బందులు ఉన్నాయని, అందుకే వాటిని వెనక్కి పిలుపిస్తున్నట్లు చైనాలో ప్రభుత్వ రంగ మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది.
ఇందులో టెస్లా ఎస్, ఎక్స్, 3, వై మోడళ్ల వాహనాలతోపాటు 7,538 ఇంపోర్టెడ్ వాహనాలు ఉన్నాయి.
ఈ వాహనాల్లో లోపాలను సరి చెయ్యాలంటే వాటిని కంపెనీ కర్మాగారాలకు తీసుకువెళ్లి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చెయ్యాల్సి ఉంటుంది.
గ్యారేజ్‌లు లేదా వాహన డీలర్ల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ ఈ సమస్యను పరిష్కరించడం వీలు పడదని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మొన్న అమెరికాలో, ఇప్పుడు చైనాలో
ఇటీవలే టెస్లా అమెరికాలో 20 లక్షల కార్లను ఆటో పైలట్ సమస్య పేరుతో వెనక్కి పిలిపించింది. ఇది జరిగి నెల రోజులైనా గడవక ముందే చైనాలో కార్లను వెనక్కి తీసుకుంటోంది.
దేశంలో 10 లక్షలకు పైగా వాహనాల్లో ఎక్సిలరేషన్, బ్రేకింగ్ వ్యవస్థలలో సమస్యలు వచ్చినట్లు చైనా ప్రభుత్వ రంగ మార్కెట్ నియంత్రణ సంస్థ 2023 మేలో తెలిపింది.
వాహనాల్లో మార్పులన్నీ అమెరికాలో జరుగుతున్నా, ప్రణాళిక ప్రకారమే వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
‘అలా చేస్తే కార్లు ఢీకొనే ప్రమాదం తప్పుతుంది’
మొత్తం 1,610,105 వాహనాల కోసం టెస్లా అందరికీ అందుబాటులో ఉండే సాఫ్ట్‌వేర్ విడుదల చేయనుంది.
దిగుమతి చేసుకున్న ఎస్, ఎక్స్‌తో పాటు 2014 నుంచి 2023 వరకు చైనాలో తయారైన 3, వై మోడళ్లకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుందని ఎస్‌ఏఎంఆర్ తెలిపింది.
ఇదంతా ఆటో స్టీరింగ్ ఫంక్షన్ ఇబ్బందులను తొలగించడానకేనని, ఇది తొలగించడం వల్ల వాహనాలు ఢీ కొనే ప్రమాదం తప్పుతుందని వెల్లడించింది.
“టెస్లా వెనక్కి తీసుకుంటున్న వాహనాలలో ఆటోమేటిక్ స్టీరింగ్ అసిస్టెంట్‌ను ఆన్ చేసినా, వాహనం నడుపుతున్న వ్యక్తి లెవల్ టూలో అసిస్టెంట్ డ్రైవింగ్ ఫంక్షన్ ఉపయోగించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ వల్ల వాహనాలు నడుపుతున్న వారి భద్రతకు ముప్పు ఉంది” అని ఎస్ఏఎమ్ఆర్ విశ్లేషించింది.
దీంతోపాటు 7,538 ఎస్, ఎక్స్ మాడల్ కార్లలో ప్రమాదం జరిగినప్పుడు కార్ డోర్లు తెరుచుకోకుండా ఉండేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని టెస్లా నిర్ణయించింది.
చైనాలో టెస్లాకు సంబంధించి ఇది రెండో అతి పెద్ద ఎదురు దెబ్బ. 2023 చివరి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో చైనా ఆటోమొబైల్ సంస్థ బీవైడీ, టెస్లాను వెనక్కి నెట్టివేసింది.
రియర్ మోటార్ ఇన్వర్టర్‌లో సమస్యలు ఉన్నాయని గుర్తించడంతో 2022లోనూ టెస్లా చైనా నుంచి 1.28 లక్షల కార్లను వెనక్కి పిలిపించింది.
టెస్లాకు చైనాలో భారీ మార్కెట్
చైనాలో టెస్లాకు పెద్ద మార్కెట్ ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది.
2035 నాటికి దేశంలోని మెజారిటీ కార్లు శిలాజ ఇంధన రహితంగా ఉండేలా చూడాలని చైనా లక్ష్యంగా నిర్ణయించుకుంది.
షాంఘైలో టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. టెస్లా, అమెరికా బయట ఏర్పాటు చేసిన అతి పెద్ద మొదటి “గిగా ఫ్యాక్టరీ” ఇదే.
ఈ కర్మాగారంలో 2023లో 9,47,000 కార్లను తయారు చేశారని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షినువా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఎలాన్ మస్క్ 'టెస్లా'ను షేక్ చేస్తున్న చైనా కంపెనీ
- చిన్న వజ్రం కోసం వెతుకుతున్న నిరుపేద కుర్రాళ్లకు రూ. కోట్ల విలువైన డైమండ్ కనిపించింది...ఆ తర్వాత వారికి ఏమైంది?
- అలెగ్జాండర్ పట్టాభిషేకం జరిగిన అగాయ్ ప్యాలస్‌ను తిరిగి తెరిచిన గ్రీస్
- తిన్నది ఒంటబట్టడానికి 7 చిట్కాలు.. పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం
- కిమ్ వారసత్వాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిందన్న సౌత్ కొరియా స్పై ఏజెన్సీ.. ఇంతకీ ఎవరా లీడర్?














