పట్టపగలు బ్యాంకు చోరీ.. పోలీసులను తికమక పెట్టి దొంగలు ఎలా పరారయ్యారంటే..

ఆరా జిల్లాలో చోరీ

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, ఆరుగురు యువకులు నాటు తుపాకీలు పట్టుకుని, పట్టపగలే బ్యాంకు చోరీకి పాల్పడ్డారు
    • రచయిత, విష్ణు నారాయణ్
    • హోదా, బీబీసీ కోసం

బిహార్‌లోని ఆరా జిల్లాలో జరిగిన చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

డిసెంబర్ 6వ తేదీన పట్టపగలే, ఆరుగురు వ్యక్తులు నాటు తుపాకులతో యాక్సిస్ బ్యాంకులోకి ప్రవేశించి, రూ.16.5 లక్షలు దోచుకుని, పోలీసులను తప్పుదోవ పట్టించి పరారయ్యారు.

చోరీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

దొంగలు బ్యాంకు లోపలే ఉన్నారని భావించి, అన్ని వైపుల నుంచి బ్యాంకు భవనాన్ని చుట్టుముట్టారు.

అయితే, పోలీసులు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికే దొంగలు పారిపోయినట్లు తెలిసింది.

బ్యాంకు లూటీ

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, దొంగలు బ్యాంకులో ప్రవేశించి, క్యాష్ కౌంటర్‌లో ఉంచిన రూ.16.5 లక్షలను అపహరించి, పరారయ్యారు.

పోలీసులు ఏమన్నారు?

ఆరా జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్‌ ఈ చోరీ గురించి బీబీసీతో మాట్లాడారు.

“దొంగతనం గురించి సమాచారం తెలియగానే పది నిముషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఆ దొంగలు బ్యాంకు లోపలే ఉన్నారని బ్యాంకు ఉద్యోగులు చెప్పడంతో, మేం బ్యాంకును చుట్టుముట్టాం. అప్పటికే దొంగలు పారిపోయారు. దీని వలన దాదాపు 1.15 గంటల సమయం వృథా అయింది” అన్నారు.

“ఉదయం 10:30 గంటల సమయంలో దొంగలు బ్యాంకులో ప్రవేశించారని బ్యాంకు ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసు బృందాలు పది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. అయితే, బ్యాంకు ఉద్యోగి ఒకరు దొంగలు లోపలే ఉన్నారని, తాను బ్యాంకు షట్టర్ మూసి, తాళం వేసినట్లు చెప్పారు.

ఆ సమాచారంతో పోలీసులు బ్యాంకును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి, లోపల ఉన్న వారిని రక్షించి, దొంగలను పట్టుకోవాలని ప్రయత్నించారు. నేను కూడా అక్కడికి చేరుకున్నాను. కానీ, మేం అనుకున్నది జరగలేదు” అన్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. 18 నుంచి 20 ఏళ్ల మధ్యనున్న ఐదుగురు యువకులు నాటు తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించి, క్యాష్ కౌంటర్‌లో ఉన్న 16.5 లక్షల రూపాయల డబ్బును తీసుకుని పారిపోయారు. ఆ సమయంలో బయటి నుంచి బ్యాంకు షటర్‌కు తాళం వేసి వెళ్లారు.

ఎవరినైనా పట్టుకున్నారా? అన్న ప్రశ్నకు ఎస్పీ సమాధానమిస్తూ, “వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం” అన్నారు.

అయితే, ఈ చోరీకి పాల్పడినవారు స్థానికులు కాదని ఎస్పీ అన్నారు.

‘‘ఈ చోరీకి పాల్పడిన వారు స్థానికులు కాదని మేం భావిస్తున్నాం. మొదట మేం వారు ఇక్కడి వారే అనుకున్నాం కానీ, ఫొటోలను బట్టి వీరంతా ముఠాగా గుర్తించాం. ఇలాంటి దొగల ముఠాలు వైశాలి, ముజాఫర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు పట్నాలో వీరు చోరీలకు పాల్పడుతున్నారు. నేరస్థులను సాధ్యమైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం” అని చెప్పారు.

రాజకీయ దుమారం..

ఈ చోరీ రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. బిహార్‌ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత విజయ్ సిన్హా దీనిపై “ఈ ప్రభుత్వం హయాంలో నేరాలు పెరిగిపోయాయి. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు, భూకబ్జాలు పెరిగిపోయాయి. వీటిని అరికట్టకపోవడంతో ఇలాంటి చోరీలు కూడా మొదలయ్యాయి” అని విమర్శించారు.

బీజేపీ విమర్శలపై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ స్పందించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, “ఇలాంటి నేరాలు సవాల్‌గా మారాయి. నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఏ నేరస్తుడినీ రక్షించడానికి పనిచేయడం లేదు. ఎన్ఆర్‌సీబీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) గణాంకాలను బట్టి చూస్తే, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్టమే నేరాల సంఖ్యలో తొలిస్థానంలో ఉంది” అన్నారు.

విమర్శలపై ఆయన స్పందిస్తూ, “విమర్శలు చేసేవారు, అధికారంలో ఉన్నప్పుడు వారేం చేశారో కూడా గుర్తుచేసుకోవాలి” అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)