బిల్కిస్ బానో కేసు: సుప్రీంకోర్టు తీర్పులోని తీవ్రమైన వ్యాఖ్యలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిల్కిస్ బానోపై అత్యాచారం, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
దోషులంతా రెండు వారాల్లో జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
“ఇది చాలా మంచి నిర్ణయం, ఇది చట్టాన్ని బలంగా ఉంచుతుంది, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని, ముఖ్యంగా మహిళలకు, న్యాయం జరిగేలా హామీ ఇస్తుంది" అని బిల్కిస్ బానో న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటి ఈ కేసు?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో (ఆ సమయంలో గర్భవతి)పై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురు సహా 14 మందిని హత్య చేశారు.
అయితే, నిందితులను కనుగొనలేకపోయామని, ఈ కేసును మూసివేయాలనుకున్నట్లు 2002లో గుజరాత్ పోలీసులు ప్రకటించారు.
దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బిల్కిస్ బానో సుప్రీంకోర్టును కోరారు. విచారణలో పాదర్శకత కొరకు సీబీఐ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు మార్చారు.
సుదీర్ఘ విచారణ అనంతరం 2008లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, జీవిత ఖైదు విధించింది.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీ, 14 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత ఆ వ్యక్తి నడవడికను చూసి విడుదల చేసే హక్కు ప్రభుత్వాలకు ఉంది.
సంబంధిత ఖైదీని ఎప్పుడు విడుదల చేయాలి? వంటి ఇతర షరతులను కూడా ప్రభుత్వం విధించవచ్చు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
వివాదం ఎప్పుడు మొదలైంది?
గుజరాత్ 1992 సంవత్సరంలో ప్రకటించిన శిక్ష తగ్గింపు విధానం తనకు వర్తింపజేసేలా ఆదేశించాలంటూ దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ భగవాన్ షా అనే వ్యక్తి 2022 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. దీనికి ముందు గుజరాత్ హైకోర్టులో రాధేశ్యామ్ ఇదే విధమైన పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్షమాభిక్ష అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉందని గుజరాత్ హైకోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.
కాగా, రాధేశ్యామ్ వినతిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. దీంతో ఓ కమిటీ వేసి, దాని సూచన మేరకు 2022 ఆగష్టు 10న గుజరాత్ ప్రభుత్వం 11 మంది నేరస్థులను విడుదల చేసింది.
అయితే, బాధితురాలు బిల్కిస్ బానోతో పాటు మహువా మొయిత్రా, సుహాసిని అలీ వంటి పలువురు మహిళలు దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీం గడప తొక్కారు.
'మహారాష్ట్ర అధికారం లాక్కున్నారు'
సోమవారం నాటి తీర్పులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఉపశమనం మంజూరు నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపింది. శిక్షను ఖరారు చేసిన రాష్ట్రమే శిక్షను రద్దు చేయడాన్ని నిర్ణయిస్తుందని వెల్లడించింది.
ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
11 మంది నేరస్థుల్లో ఒకరితో గుజరాత్ ప్రభుత్వం 'కుమ్మక్కైంది' అని కోర్టు వ్యాఖ్యానించింది.
గతంలో ఈ కేసులో కోర్టు మూడుసార్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కూడా గుర్తుచేసింది.
తొలుత గుజరాత్ పోలీసుల నుంచి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని, ఆ తర్వాత కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు పంపామని కోర్టు తెలిపింది.
2022 నాటి తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసి ఉండాల్సిందని పేర్కొంది.
శిక్షను రద్దు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని లాక్కోవడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ కేసులో సీబీఐ ముంబై ప్రత్యేక న్యాయమూర్తి, సీబీఐ దాహోద్ ఎస్పీ, గుజరాత్ పోలీసులు దోషుల విడుదలను వ్యతిరేకించారు. కానీ గుజరాత్ ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని పట్టించుకోలేదు.
వారి అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది.
మొత్తం 11 మంది నేరస్థుల శిక్షను మార్చే ఉత్తర్వు కాపీలు ఒకేలా ఉన్నాయని, ఇది "ఆయా కేసుల్లోని వాస్తవాల స్వతంత్ర పరిశీలనను ప్రతిబింబించలేదు" అని తెలిపింది.
2022లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయని, దోషులు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని కోర్టు పేర్కొంది.
శిక్షను తగ్గించాలని రాధేశ్యామ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కోరారు. అయితే, ఆయన శిక్షను తగ్గించవద్దని అధికారులు సూచించారు.
ఈ విషయం సుప్రీంకోర్టుకు గానీ, గుజరాత్ ప్రభుత్వానికి గానీ రాధేశ్యామ్ చెప్పలేదని సుప్రీం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
దోషుల శిక్షను మహారాష్ట్ర తగ్గిస్తుందా?
ఈ కేసుతో సంబంధం ఉన్న నేరస్తులందరూ మరో రెండు వారాల్లోగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వారి శిక్షను తగ్గించగలదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఈ దోషుల శిక్ష రద్దు లేదా తగ్గించడం అంత తేలిక కాదని బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా తెలిపారు.
“మహారాష్ట్ర క్షమాపణ విధానం మరింత కఠినమైనది. చట్ట పరంగా వెళితే ఈ [బిల్కిస్ బానో] కేసులో ఉపశమనం పొందడం అసాధ్యం'' అని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వ 11.04.2008 పాలసీ ప్రకారం బిల్కిస్ బానో దోషులు కనీసం 28 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే వారికి శిక్ష నుంచి ఉపశమనం లభించదని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి గతంలోనే చెప్పారు.
మహారాష్ట్రలో 2008లో అమలు చేసిన విధానం ప్రకారం హత్యలు, మహిళలు లేదా పిల్లలపై అత్యాచారం కేసుల్లో 28 ఏళ్లు జైలు శిక్ష తర్వాత మాత్రమే శిక్షలో ఉపశమనం లభిస్తుంది.
ఈ నిర్ణయంలో కోర్టు అనేక అంశాలను వివరించిందని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసులో క్షమాపణకు అవకాశముందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ అన్నారు.
“ప్రభుత్వం ఏకపక్ష అధికారాలను వినియోగించడాన్ని ఆపాలి. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి, తీసుకొనే నిర్ణయానికి కారణాలను తెలియజేయాలి'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం శిక్షను తగ్గించినా ప్రజలు కోర్టు తలుపులు తట్టగలరని నేటి తీర్పు చాటుతుందని న్యాయవాది వృందా గ్రోవర్ అభిప్రాయపడ్డారు.
“నేటి తీర్పు శిక్షల ఉపశమనానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ అధికారం ఎలా ఉపయోగిస్తున్నారనేదాన్ని ప్రశ్నించింది, అందరికీ ఇదే లభిస్తుందా?” అని అన్నారు.
శిక్షల ఉపసంహరణ కోసం, ప్రభుత్వం అన్ని వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని, ఆయా అధికారుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
అయితే, గుజరాత్ ప్రభుత్వం దీనిని పాటించలేదు. కోర్టు తీర్పు భవిష్యత్తులో క్షమాభిక్ష కేసులపై ప్రభావం చూపుతుందని బాంబే హైకోర్టులో న్యాయవాది విజయ్ హిరేమత్ అభిప్రాయపడ్డారు.
శిక్ష విధించిన చోట మాత్రమే శిక్షల ఉపసంహరణపై నిర్ణయం జరుగుతుందని నేటి తీర్పు స్పష్టంచేస్తోందని తెలిపారు.
అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే శిక్షను మాఫీ చేయడం జరుగుతోందని విజయ్ అన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఇలాంటి కేసులకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














