గర్భవతులను చేసే జాబ్: ‘మహిళతో ఒకరాత్రి గడిపితే రూ.5 లక్షలు, ఆమె ప్రెగ్నెంట్ అయితే రూ.8 లక్షల గిఫ్ట్...’అంటూ సాగే ఈ స్కామ్ కథ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సైబర్ స్కామ్‌లలో ఇదొక వింతైన, విలక్షణమైన స్కామ్
అది డిసెంబర్ మొదటి వారం. మహేశ్ (పేరు మార్చాం) ఫేస్‌బుక్ చూస్తుండగా ఒక జాబ్ ఆఫర్ కనిపించింది.
‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ అనే పేరుతో ఉన్న వీడియోలో ఆ జాబ్ గురించి వివరణ ఉంది. ఇదేదో బాగుందనుకుని ట్రై చేయడానికి నిర్ణయించుకున్నారు మహేశ్.
ఈ ఉద్యోగం చేస్తే డబ్బుతోపాటు ఇంకా చాలా వస్తాయి. ఇందులో చేయాల్సిన పని...సంతానం లేని మహిళలను గర్భవతిని చేయడం.
చూడటానికి ఇది చాలా ఆకర్షణీయమైన ఉద్యోగంలా కనిపించింది.
కానీ ఇదొక స్కామ్. ఇన్నాళ్లూ వెడ్డింగ్ పార్టీ డెకరేషన్ కంపెనీలో పని చేస్తూ నెలకు రూ.15,000 సంపాదిస్తున్న 33 ఏళ్ల మహేశ్...మోసగాళ్ల చేతిలో పడి ఇప్పటికే రూ. 16వేలు పోగొట్టుకున్నారు. నువ్వు ఇంకా డబ్బులు చెల్లించాలని సదరు మోసగాళ్లు మహేశ్‌ను అడుగుతూనే ఉన్నారు.
ఇలా మోసగాళ్ల ట్రాప్‌లో చిక్కుకున్న వ్యక్తి బిహార్‌లో మహేశ్ ఒక్కడే కాదు.
బిహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాలో సైబర్ సెల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పని చేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కల్యాణ్ ఆనంద్ ఈ సైబర్ నేరం గురించి బీబీసీతో మాట్లాడారు.
మంచి జీతాల ఆశచూపి అమాయకులను ఈ ట్రాప్‌లోకి దింపే మోసగాళ్ల నెట్‌వర్క్ చాలా పెద్దదని ఆయన వివరించారు. పిల్లలు కలగని మహిళతో ఒక రాత్రి హోటల్‌లో గడిపితే మంచి శాలరీ ఇస్తామంటూ ఈ సైబర్ నేరస్తులు అమాయకులను మోసం చేస్తున్నారు.

ఎలా ఇరుక్కున్నారంటే?
కల్యాణ్ ఆనంద్ బృందం ఈ మోసగాళ్ల ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఇంకా ఇందులో18 మంది ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నామని కల్యాణ్ ఆనంద్ చెప్పారు.
అయితే, ఇక్కడ నిందితులను కనుక్కోవడం కన్నా బాధితులను కనుక్కోవడం చాలా కష్టం.
"ముఠా ఒక ఏడాదిపాటు చాలా యాక్టివ్‌గా పని చేసింది. వందలమందిని మోసం చేసి ఉంటుందని భావిస్తున్నాం. కానీ, చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందు రావడం లేదు. పరువు పోతుందనే భయం దీనికి కారణం కావచ్చు’’ అని కల్యాణ్ ఆనంద్ చెప్పారు.
ఇద్దరు బాధితులతో బీబీసీ మాట్లాడింది. ఈ జాబ్‌కు అప్లై చేయడం ద్వారా రూ.799 పోయాయని, ఇంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేనని ఒక బాధితుడు వెల్లడించారు. అయితే, తాను ఈ స్కామ్‌లో ఎలా ఇరుక్కున్నాడో మహేశ్ పూసగుచ్చినట్లు వివరించారు.
‘‘నేను ఆ వీడియో క్లిక్ చేసిన పది నిమిషాలకు నా ఫోన్ మోగింది. ఉద్యోగం కోసం నమోదు చేయాలనుకుంటే రూ.799 రూపాయలు చెల్లించాలని అవతలి వ్యక్తి నన్ను అడిగాడు’’ అని మహేశ్ వివరించారు.
తనతో మాట్లాడిన వ్యక్తి పేరు సందీప్ అని, అతను ముంబైలో ఒక కంపెనీలో పని చేస్తున్నట్లు తనతో చెప్పాడని మహేశ్ చెప్పారు. మహేశ్ ఆ వ్యక్తిని సందీప్ సర్ అని సంబోధించారు. ఈ జాబ్‌కు సైన్‌అప్ చేస్తే గర్భం దాల్చడానికి ఎదురు చూస్తున్న మహిళ వివరాలు పంపిస్తానని సందీప్ చెప్పాడని మహేశ్ వెల్లడించారు.
ఆ మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు దాదాపు రూ.5 లక్షలు ( మహేశ్ మూడేళ్ల జీతం ) ఇస్తారని, ఆమె గర్భం దాల్చినట్లయితే మరో 8 లక్షల రూపాయలు గిఫ్ట్‌గా కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.
‘‘నేను పేదవాడిని. నాకు డబ్బు చాలా అవసరం. అందుకే నేను వారిని నమ్మాను" అని ఇద్దరు చిన్న పిల్లల తండ్రి అయిన మహేశ్ చెప్పారు.
మరో రెండు వారాల్లో ఆయనకు రూ.16 వేలకు పైగా ఫీజులు చెల్లించాలని సదరు కంపెనీ వాళ్లు అడిగారు. కోర్టు పేపర్లకు రూ.2,550, సేఫ్టీ డిపాజిట్‌గా రూ.4,500, జీతంగా ఇవ్వబోయే డబ్బుకు జీఎస్టీ కోసం రూ. 7,998 చెల్లించాలని చెప్పారు.
‘వీరిలో ఒక మహిళను ఎంచుకో’ అంటూ ఆఫర్
ఆ మోసాల కంపెనీ తనకు ఇచ్చిన నకిలీ కోర్టు పేపర్లు, రసీదులు, బిల్లును మహేశ్ బీబీసీకి చూపించారు. నిజమైన డాక్యుమెంట్లలాగా కనిపిస్తున్న ఆ పేపర్లలో అతని పేరు, ఫోటోపాటు, పోలీస్ యూనిఫాంలో ఉన్న మరో వ్యక్తి ఫోటో కూడా ఉంది. పైన పెద్ద పెద్ద అక్షరాలతో "బేబీ బర్త్ అగ్రిమెంట్" అని దాని కింద ప్రెగ్నెన్సీ వెరిఫికేషన్ ఫామ్ అని రాసి ఉంది.
అమెరికాలో ఫేమస్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే సంతకాన్ని పోలిన సంతకం ఒకటి కింద కనిపించింది.
స్కామర్‌లు అంతటితో ఆగకుండా, ఏడెనిమిది మంది మహిళల ఫోటోలను పంపి అతనిలో ఆసక్తిని మరింత పెంచారు. ఇందులో ఎవరికి గర్భం కలిస్తావో ఎంచుకొమ్మని ఆప్షన్ కూడా ఇచ్చారు.
‘‘నువ్వుండే సిటీలోనే ఒక హోటల్ గది బుక్ చేస్తాం, అక్కడే నువ్వు ఆ మహిళను కలవాలి అని నాతో చెప్పారు’’ అని మహేశ్ వివరించారు.
తనకు ఇస్తానన్న డబ్బు కోసం మహేశ్ అడగగా, అతని బ్యాంక్ ఖాతాలో రూ. 512,400 జమ చేసినట్లు ఒక రసీదును చూపించారు. కానీ, ఆ డబ్బు హోల్డ్‌లో ఉందని, దానికి రూ. 12,600 ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తే, హోల్డ్ తీసేస్తారని సమాధానం చెప్పారు.
ఇప్పటికే ఒక నెల జీతం పోగొట్టుకున్నానని, ఇకపై నా వల్ల కాదని, తన డబ్బు తనకు ఇచ్చేయాలని వాళ్లను అడిగినట్లు మహేశ్ వెల్లడించారు.
‘‘నేను అలా అడిగితే సందీప్ సర్ ఒప్పుకోలేదు. నేను వాళ్లతో కోపంగా మాట్లాడాను. నీ బ్యాంకులో రూ. 5లక్షలు వేశాం. దానికి పన్ను కట్టకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నీ ఇంటి మీద రెయిడ్ చేసి నిన్ను అరెస్టు చేయవచ్చని బెదిరించారు’’ అని మహేశ్ చెప్పారు.
"నేను పేద కూలీని, ఒక నెల జీతం పోయింది. నేను ఏ క్రిమినల్ కేసులో చిక్కుకోవాలనుకోలేదు. నా ఫోన్‌ను 10 రోజులు స్విచ్ ఆఫ్ చేసాను. కొద్దిరోజుల కిందటే తిరిగి స్విచ్ ఆన్ చేసాను. మొదట్లో నన్ను కూడా వాళ్ల గ్యాంగులో చేరమని అడిగారు’’ అని మహేశ్ వివరించారు.

స్కాం చాలా తెలివిగా చేశారు: సైబర్ నిపుణులు
ఈ స్కామర్లంతా చదువుకున్నవారేనని, గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారని, వారికి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు ఎలా వాడాలో బాగా తెలుసని డీఎస్పీ కల్యాణ్ ఆనంద్ చెప్పారు.
బాధితులు చాలా తక్కువ చదువుకున్న వారని, ఇలాంటి వారు దేశంలో చాలాచోట్ల ఈ స్కామ్‌లో చిక్కుకున్నారని ఆనంద్ వివరించారు.
‘‘ సందీప్ సర్ తన ఐడీ కార్డులను పంపాడు. అందులో ఆయన ఇండియన్ ఆర్మీ జవాన్ వేషంలో ఉన్నాడు. ఆయన డిస్‌ప్లే పిక్చర్‌లో ఒక అందమైన విదేశీ మహిళ తన చేతులతో ఒక నవజాత శిశువును ఊయలలో వేస్తున్నట్లుగా ఉంది. వాటిని చూసి నేను నిజమే అనుకున్నా. ఇలాంటివి చూస్తే ఎవరైనా నమ్మకుండా ఎలా ఉంటారు?’’ అని మహేశ్ అన్నారు.
‘‘ఇండియాలో చాలామంది ఇంటర్నెట్‌లో కనిపించే ఇలాంటి వాటిని సులభంగా నమ్మేస్తున్నారు. అవి నిజమా కాదా అని వెరిఫై చేసుకోరు’’ అని సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ అన్నారు.
నవాడాలో జరిగిన స్కామ్ చాలా పకడ్బందీగా, చాలా తెలివిగా జరిగిందని దుగ్గల్ అన్నారు.
"స్కామర్లు సులభంగా డబ్బును, ఉచితంగా సెక్స్‌ను ఎరగా వేశారు. ఇది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. ఇలాంటివి కనిపించినప్పుడు చాలామంది వివేకాన్ని పక్కనబెడతారు.’’ అన్నారు దుగ్గల్.
కోవిడ్-19 రాకతో సెల్‌ఫోన్, నెట్ బ్యాంకింగ్ ప్రాథమిక అవసరాలుగా మారాక సైబర్ నేరాలకు స్వర్ణయుగం మొదలైందని దుగ్గల్ చెప్పారు. ఇలాంటివి ఇప్పట్లో ఆగేవికాదని, దశాబ్దాల పాటు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు కొత్త, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నందున, మహేశ్ బాధితులను వారి నుంచి రక్షించడానికి భారతదేశం మరింత కఠిన చట్టాలను తీసుకురావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
"ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి, రేడియో, టీవీల ద్వారా అవగాహన కల్పించడానికి కృషి చేయాల్సి ఉంది." అన్నారు దుగ్గల్.
ఆమె నాతో ప్రతీరోజూ మాట్లాడుతోంది: మహేశ్
ఇక మహేశ్ విషయానికి వస్తే స్కామర్లు ఆయనను ఇంకా వదిలిపెట్టలేదు.
అతను బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూనే, మేడమ్ కాల్ చేస్తున్నారు అంటూ కాల్ కట్ చేశాడు.
తర్వాత అతను ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో వివరించారు. ఆ మహిళే తాను కలవాల్సిన మహిళగా స్కామర్లు తనకు చెప్పినట్లు మహేశ్ వివరించారు.
ఆమె తనతో దాదాపు ప్రతిరోజూ మాట్లాడుతోందని మహేశ్ వెల్లడించారు.
‘‘సందీప్ సర్ నిజంగా చాలా పెద్ద మోసగాడు. నీకివ్వాల్సిన రూ. 5 లక్షలు నీకు ఇవ్వకుండా మోసం చేశాడు. కానీ నీకు రూ. 90వేలు వస్తాయి. దానికి రూ.3 వేలు జీఎస్టీ కడితే సరిపోతుంది’’ అని ఆ మహిళ తనతో చెప్పినట్లు మహేశ్ వెల్లడించారు.
‘‘నేను చాలా మోసపోయానని, నా డబ్బు నాకివ్వమని నేను ఆమెను వేడుకున్నాను. కానీ అది సాధ్యం కాదని చెప్పింది. ఆమె నాకు రూ. 10వేలైనా ఇస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని మహేశ్ చెప్పారు.
మీరు ఇప్పటికీ స్కామర్లను నమ్ముతున్నారా అని మహేశ్ ను బీబీసీ ప్రతినిధి ప్రశ్నించారు.
"ఇప్పుడేం చేయాలో నాకు అర్ధం కావడం లేదు. ఒక నెల జీతం పోయింది. బిహార్‌లో ఉన్న నా కుటుంబానికి డబ్బు పంపలేకపోయాను. నా భార్య చాలా కోపంగా ఉంది. ఆమె నాతో ఇక మాట్లాడదు." అని మహేశ్ వాపోయారు.
సందీప్ తన కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదని మహేశ్ కోపంగా ఉన్నారు.
"నన్ను మోసం చేసిన వారికి పెద్ద శిక్ష పడాలి. నేను రూ. 500 కోసం రోజంతా కష్టపడి పని చేస్తాను. ఈ స్కామ్‌కు ఆకర్షితుడిని కావడం ద్వారా నేను పెద్ద తప్పు చేశానని నాకు తెలుసు. వాళ్లు నన్ను మోసం చేయడం మాత్రం దారుణం" అన్నారు మహేశ్.
ఇవి కూడా చదవండి
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














