రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?

రాజీవ్ గాంధీ, మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES/ANI

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ (ఫైల్)
    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కష్టకాలంలో భారత్ ఏ పొరుగు దేశానికైతే మద్దతుగా నిలిచిందో అదే దేశానికి చెందిన మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనకు సంబంధించిన చిత్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవుల బహిష్కరణ, లక్షద్వీప్‌ విషయాలు వెతకడం వంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో సామాన్య ప్రజలే కాకుండా దేశంలోని ప్రముఖులు కూడా మాల్దీవులపై విమర్శలు గుప్పించారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం మంత్రుల వ్యాఖ్యలను ఖండించింది. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.

2023 మాల్దీవుల ఎన్నికల ప్రచారంలో మొహమ్మద్ మయిజ్జూ ఇండియా అవుట్ అనే నినాదం ఇచ్చారు.

ఆయనే ఎన్నికల్లో గెలిచి, నవంబర్‌లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో ఇక భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలపై ప్రశ్నలు తలెత్తాయి.

అయితే, చరిత్రాత్మకంగా పరిశీలిస్తే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలంగా ఉన్నాయి.

మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ.. మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత చేసిన ఒక ప్రకటన దీనిని ధృవీకరిస్తుంది.

''భారత్ మాకు 911 కాల్ లాంటిది, మాకు అవసరమైనప్పుడు సాయానికి ముందుకొస్తుంది'' అని ఆమె చెప్పారు.

కాగా, గత చరిత్రను పరిశీలిస్తే మాల్దీవులు సంక్షోభంలో కూరుకుపోయిన నాలుగు ప్రధాన సమయాల్లో భారత్ అండగా నిలిచింది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం

ఫొటో సోర్స్, INDIANEXPRESS

ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం

1. 'ఆపరేషన్ కాక్టస్'

1988 నాటి సంఘటనను రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు.

ఆ సమయంలో మాల్దీవులలో తిరుగుబాటు జరిగింది, దాన్ని భారత సైన్యం సహాయంతో ఎదుర్కొన్నారు. ఆ క్యాంపెయిన్ పేరు - 'ఆపరేషన్ కాక్టస్'.

1988 నవంబర్ 3న మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. ఆయనను తీసుకురావడానికి భారత విమానం దిల్లీ నుంచి మాలే బయలుదేరింది.

భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచార నిమిత్తం దిల్లీ నుంచి బయటకు వెళుతుండగా గయూమ్‌ నుంచి అత్యవసర సమాచారం అందింది. దీంతో రాజీవ్ గాంధీ మళ్లీ దిల్లీకి వచ్చారు.

మాల్దీవుల వ్యాపారవేత్త అబ్దుల్లా లుథూఫీ, ఆయన భాగస్వామి సిక్కా అహ్మద్ ఇస్మాయిల్ మానిక్‌లు గయూమ్‌కు వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాటు చేశారు.

వారు అప్పటికే శ్రీలంక తీవ్రవాద సంస్థ 'పీఎల్ఓటీ' (పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం) కిరాయి సైనికులను పర్యాటకుల ముసుగులో స్పీడ్ బోట్ల ద్వారా మాలేకు తరలించారు.

కొద్దిసేపటికే రాజధాని మాలే వీధుల్లో తిరుగుబాటు జరిగింది, కిరాయి సైనికులు వీధుల్లో బుల్లెట్లు కాల్చడం ప్రారంభించారు.

ఈ క్లిష్ట సమయంలో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ ఒక సురక్షితమైన ఇంట్లో తల దాచుకున్నారు. అనంతరం తనను, ప్రభుత్వాన్ని రక్షించాలంటూ భారత సహాయం కోరారు గయూమ్ .

అప్పటికి వందలాది మంది తిరుగుబాటుదారులు రాజధాని మాలేలోని హుల్‌హులే విమానాశ్రయాన్ని, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌నీ స్వాధీనం చేసుకున్నారు.

దీంతో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని మాల్దీవులకు పంపాలని నిర్ణయించుకున్నారు.

మొదట ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం నుంచి 6 పారా బలగాలకు చెందిన 150 మంది కమాండోలతో నిండిన విమానం మాల్దీవులకు వెళ్లింది.

మరికొంత సమయం తరువాత రెండో భారత విమానం కూడా మాల్దీవులలో ల్యాండ్ అయింది. వెంటవెంటనే ఎయిర్‌పోర్టు ఏటీసీ, జెట్టీ, రన్‌వే ఉత్తర, దక్షిణ ప్రాంతాలను నియంత్రణలోకి తెచ్చారు.

అనంతరం భారత సైనికులు రాష్ట్రపతి సురక్షిత గృహానికి భద్రతగా ఉన్నారు. మాల్దీవుల ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని కొద్ది గంటల్లోనే భారత సైనికులు విఫలం చేశారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునామీ తర్వాత మాల్దీవుల ఫోటో (2004)

2. ఆపరేషన్ సీ వేవ్స్

2004 డిసెంబర్ 26. చెన్నైలో భూ ప్రకంపనలు వచ్చినట్లు న్యూస్ చానెల్స్‌లో ఓ చిన్న వార్త కనిపించింది, కానీ కొద్దిసేపటికే అది ఎవరూ ఊహించని విషాదంగా మారింది.

వాస్తవానికి ఆ రోజు సముద్రగర్భంలో భూకంపం సంభవించింది, దీని తీవ్రతను మొదట్లో రిక్టర్ స్కేలుపై 6.8గా అంచనా వేశారు. కానీ తర్వాత దాని తీవ్రత 9.3గా తెలుసుకున్నారు.

ఈ భూకంపం వల్ల ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్, టాంజానియా, మాల్దీవులు వంటి దేశాల తీరప్రాంతాలలో దాదాపు 55 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి.

అప్పుడు సంభవించిన సునామీలో అత్యధిక మరణాలను నమోదు చేసిన దేశాలలో మాల్దీవులు ఒకటి. ఆ కష్ట సమయంలో మాల్దీవులకు భారత్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

వెంటనే 'ఆపరేషన్ సీ వేవ్స్' ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం ఇండియన్ కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, రెండు ఎయిర్ ఫోర్స్ అవ్రోస్ ఎయిర్‌క్రాఫ్ట్ 24 గంటల్లో అంటే డిసెంబర్ 27న రిలీఫ్ మెటీరియల్‌తో మాల్దీవులకు చేరుకున్నాయి.

మరుసటి రోజు అంటే డిసెంబర్ 28న ఐఎన్ఎస్ మైసూర్, రెండు హెలికాప్టర్లు 20 పడకల ఆసుపత్రి సౌకర్యాలతో మాల్దీవులకు చేరుకున్నాయి. ఈ సహాయ చర్యలకు మరుసటి రోజు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ ఆదిత్య సాయం చేశాయి.

ఈ నౌకలు మాల్దీవులలో అత్యంత ప్రభావిత ప్రాంతమైన సౌత్ అటోల్‌లో పనిచేశాయి. ఈ నౌకలు ఉపయోగించి ఆహారం, వైద్య సామగ్రి అందజేశారు, హెలికాప్టర్ల సాయంతో ప్రజలను రక్షించారు.

ఈ సహాయక చర్యల్లో దాదాపు రూ.36.39 కోట్లు ఖర్చు చేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దీని తరువాత 2005లో సునామీ అనంతరం పునరుద్దరణ చర్యల్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు గయూమ్ భారత్‌కు చెప్పారు.

దీంతో మాల్దీవులకు భారత్ 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. ఇది కాకుండా 2007లో భారత్ మరోసారి మాల్దీవులకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

మాల్దీవులకు భారత్ సాయం

ఫొటో సోర్స్, MEA

3. 'ఆపరేషన్ నీర్' మాల్దీవుల దాహార్తిని ఎలా తీర్చింది?

2014 డిసెంబర్ 4న మాల్దీవుల రాజధాని మాలేలోని అతిపెద్ద నీటి శుద్ధి కర్మాగారంలో మంటలు చెలరేగాయి. దీంతో దాదాపు లక్ష మంది మాలే ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం, తాగునీటి వినియోగానికి మాల్దీవులకు స్వంత శాశ్వత నదులు లేవు. నీటి శుద్ధి కర్మాగారాల సాయంతో తాగునీటిని పౌరులకు సరఫరా చేస్తుంది మాల్దీవులు ప్రభుత్వం.

ప్లాంట్‌ను పునఃప్రారంభించే వరకు మొత్తం నగరానికి ప్రతిరోజూ 100 టన్నుల నీరు అవసరం. ఈ క్లిష్ట సమయంలో మాల్దీవుల విదేశాంగ మంత్రి దున్యా మౌమూన్ అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు.

మాల్దీవులకు సహాయం చేసేందుకు భారత్ 'ఆపరేషన్ నీర్' ప్రారంభించింది. భారత వైమానిక దళం ప్యాక్ చేసిన నీటిని దిల్లీ నుంచి అరక్కోణంకు, అక్కడి నుంచి మూడు సీ-17, మూడు ఐఎల్-76 విమానాల ద్వారా మాలేకు పంపింది.

సంక్షోభం తర్వాత మొదటి 12 గంటల్లోనే భారత విమానాలు నీటితో మాల్దీవులకు చేరుకున్నాయి. మొత్తంగా వైమానిక దళం 374 టన్నుల నీటిని మాలేకు పంపిణీ చేసింది.

దీని తరువాత, భారతీయ నౌకలు ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ సుకన్య సహాయంతో సుమారు 2 వేల టన్నుల నీటిని మాల్దీవులకు రవాణా చేశారు.

ఇది మాత్రమే కాదు నీటి శుద్ధి కర్మాగారం మరమ్మతు చేయడానికి భారతదేశం తన నౌక నుంచి విడిభాగాలను కూడా పంపింది.

జై శంకర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వ్యాక్సిన్లు అందజేస్తున్న జై శంకర్

4. కరోనా సమయంలో సాయం

2020లో ప్రపంచం మొత్తం కోవిడ్-19 ఊబిలో ఉన్నప్పుడు, భారత్ 'నైబర్ ఫస్ట్' పాలసీ కింద మాల్దీవులకు సహాయం చేసింది.

మాల్దీవుల్లోని భారత హైకమిషన్ ప్రకారం కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం పల్మోనాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, వైద్యులు, ల్యాబ్-టెక్నీషియన్‌లతో కూడిన పెద్ద వైద్య బృందాన్ని పంపింది.

2021 జనవరి 16న ప్రధాని మోదీ దేశంలో టీకా కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం 96 గంటల్లో మాల్దీవులకు వ్యాక్సిన్‌ను అందించిన మొదటి దేశం భారత్.

అంతేకాదు, 2021 జనవరి 20న ఇండియా మొదట మాల్దీవులకే లక్ష కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను బహుమతిగా ఇచ్చింది. ఈ టీకాల సహాయంతో మాల్దీవుల ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టీకా క్యాంపెయిన్ ప్రారంభించింది, జనాభాలో యాభై శాతం మందికి టీకాలు వేసింది.

దీని తరువాత, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ 20 ఫిబ్రవరి 2021న మాల్దీవులకు వెళ్లినప్పుడు, రెండో బ్యాచ్‌లో 1 లక్ష మేడిన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్‌లను బహుమతిగా అందించారు.

కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ ఇవ్వాల్సిన సమయంలోనూ మాల్దీవులకు మద్దతు ఇచ్చింది భారత్. 2021 మార్చి 6న 12 వేలు, మార్చి 29న లక్ష కోవిడ్ వ్యాక్సిన్‌లను పంపింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్ మొత్తం 3 లక్షల 12 వేల వ్యాక్సిన్ డోసులను మాల్దీవులకు పంపగా, అందులో 2 లక్షల వ్యాక్సిన్ డోసులు బహుమతిగా అందించారు.

ఈ కాలంలో భారత్ మాల్దీవులకు 250 మిలియన్ యుఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 2 వేల కోట్లు ఆర్థిక సహాయం అందించింది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అప్పటి మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. క్లిష్ట సమయంలో భారతదేశం ఆర్థికంగా సహాయం చేసిందని కూడా ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)