దిల్లీ అల్లర్ల కుట్ర కేసు: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ల బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
అయితే, ఈ కేసులోని మరో ఐదుగురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజరియాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ఇతర నిందితుల పాత్రతో పోలిస్తే ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ పాత్ర భిన్నంగా ఉందని కోర్టు పేర్కొంది. అల్లర్లకు ప్రణాళికలు, వ్యూహరచనలో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ప్రమేయాన్ని కేసులోని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

ఈ ఉత్తర్వులు వెలువడిన ఒక ఏడాది తర్వాత, లేదంటే కేసులో సాక్షుల విచారణ పూర్తయిన అనంతరం ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.
ఖలీద్, షర్జీల్ సహా ఏడుగురు నిందితులపై 2019లో జరిగిన సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) నిరసనల ముసుగులో, 2020 ఫిబ్రవరిలో దిల్లీలో మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాము ఐదేళ్లకు పైగా జైలులో ఉన్నప్పటికీ, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని నిందితులు వాదించారు.
ఈ కేసులోని ఇతర నిందితులలో చాలా మందికి ఇప్పటికే బెయిల్ లభించినందున, తమకు కూడా బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు.
గత సెప్టెంబర్‌లో, ఈ ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

ఫొటో సోర్స్, ANI
ఐదేళ్లుగా జైలులోనే
విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్ సెప్టెంబర్ 2020 నుంచి జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 2020లో ఈశాన్య దిల్లీలో హింసను ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
వీటిల్లో ఓ కేసులో ఉమర్‌కు ఏప్రిల్ 2021లో బెయిల్ లభించింది. రెండో కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇప్పటివరకు రెండు కోర్టులు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా, ఆయన బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 2023 నుండి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
ఉమర్ ఖలీద్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు చాలా బలహీనంగా ఉన్నాయని, అందువల్ల ఆయనను బెయిల్ పై విడుదల చేయాలని చాలా మంది న్యాయ నిపుణులు అంటున్నారు.
ఖలీద్‌పై 2020 నుంచి విచారణ ప్రారంభం కాలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉమర్ ఖలీద్ పై ఉన్న అభియోగాలేంటి?
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా డిసెంబర్ 2019లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ చట్ట సవరణ ద్వారా ముస్లింలకు తప్ప హిందువులకు, జైనులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.
దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో ఉమర్ ఖలీద్ చురుకుగా పాల్గొన్నారు. దాదాపు మూడు నెలలపాటు సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగాయి.
2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగాయి. 53 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు.
ప్రదర్శనల సందర్భంగా హింసను ప్రేరేపించడానికి ఉమర్ ఖలీద్ కుట్ర పన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
ఉమర్ ఖలీద్‌కు వ్యతిరేకంగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుయ్యాయి.
ఈశాన్య దిల్లీలో ఎఫ్ఐఆర్ నెంబర్ 101/2020 ను ఫిబ్రవరి 24, 2020న నమోదు చేశారు.
ఇందులో ఉమర్‌పై దాడులుచేయడం, రాళ్ళు విసరడం, బాంబులు పేల్చడం, రెండు మతాల మధ్య ద్వేషం పెచ్చరిల్లేలా చేయడం, పోలీసులపై దాడులు చేయడం, ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించడం తదితర అభియోగాలు మోపారు.
ఈ కేసులో దిల్లీలో దాడులు జరగడం వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
ఈ కేసులోని నిందితుడు సీఏఏకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, రహదారులను దిగ్భంధించడం తదిర అభియోగాలు కూడా ఉమర్ పై మోపారు.
ఈ కుట్రకుసంబంధించి నిందితుడిని ఉమర్ ఖలీద్ కలిసినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారని తెలిపారు.
రాళ్ళ దాడి జరిగినప్పుడు ఉమర్ ఖలీద్ అక్కడ లేరని ఆయన తరపు న్యాయవాది చెప్పారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఉమర్ ఖలీద్‌ను అరెస్ట్ చేశారని, ఇదొక రాజకీయ కుట్ర అని వాదించారు.
హింస జరిగిన ప్రాంతంలో ఉమర్ ఖలీద్ లేరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే ఆయన ఈ హింసలో పాల్గొన్నారని చెప్పడానికి తగిన ఆధారాలు కూడా లేవని తెలిపింది.
బెయిల్ మంజూరు చేస్తూ ‘‘ఇలాంటి అరాకొరా ఆధారాలతో ఉమర్ ఖలీద్‌ను జైల్లో పెట్టలేం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఉమర్ ఖలీద్ పై ఉన్న ఇతర కేసుల గురించి వ్యాఖ్యానించడం లేదని కోర్టు అప్పుడు తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎఫ్ఐఆర్ నంబర్ 59
మొదటి ఎఫ్ఐఆర్‌లో ఉమర్ ఖలీద్‌కు బెయిల్ లభించినా తనపై ఉన్న రెండో కేసు కారణంగా ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు.
ఉమర్ ఖలీద్ సహా మరికొందరు 59/2020 ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు.
ఇతర సెక్షన్లతోపాటు ఉమర్ ఖలీద్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదం, కుట్ర, అక్రమ కార్యకలాపాల చేసినట్టుగా ఉపా కింద అభియోగాలు మోపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనవ్యక్తం చేసేందుకు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ), పంజరంతోడ్ సంస్థలు కుట్రలు పన్నినట్టు ప్రభుత్వం తెలిపింది.
‘‘ఇందులో భాగంగా పోలీసులు, పారామిలటరీ బలగాలపై దాడులు, హింసను ప్రేరేపించడం, ముస్లీమేతరులపై దాడులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించడం’’ ఉన్నాయని పేర్కొంది.
వీటన్నింటి వెనుక ఉన్న సూత్రధారి ఉమర్ ఖలీదేనని, దూరం నుంచి ఆయన వాటిని నిర్దేశించారని ప్రభుత్వం చెబుతోంది.
ఇందుకోసం ప్రభుత్వం గుర్తుతెలియని వ్యక్తుల ప్రకటనలపై ఆధారపడింది.
ఉమర్ ఖలీద్ సభ్యుడుగా ఉన్న వాట్సాప్ గ్రూపులకు వచ్చిన ఫోన్ కాల్స్, నిరసన ప్రదర్శనల సందర్భంగా జరిగిన సమావేశాలలో ఉమర్ ఖలీద్ పాల్గొన్న ఫోటోలను ఆధారంగా చూపుతోంది.
అల్లర్లు జరిగినప్పుడు తాను దిల్లీలోనే లేనని, తానెటువంటి విద్వేష ప్రసంగాలు చేయలేదని, హింసను ప్రేరేపించలేదని ఉమర్ ఖలీద్ చెబుతున్నారు.
ప్రాసిక్యూషన్ చూపుతున్న ఆధారాలు ఎటువంటి నేరాన్ని నిరూపంచలేవని అన్నారు.
ఉమర్ ఖలీద్ మన:స్తత్వం ఎలాంటిదో తెలియాలంటే ఆయన సమర్పించిన పీహెచ్‌డీ థీసెస్‌ను చూడాలని ఆయన లాయర్ చెబుతున్నారు.
ఝార్ఖండ్‌లోని గిరిజనులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలో ఆయన ఆ పీహెచ్‌డీ థీసీస్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోర్టులు చెప్పిన కారణాలేంటి?
దిల్లీలోని కర్కర్‌డూమా ట్రయల్ కోర్ట్, దిల్లీ హైకోర్టు ఉమర్ ఖలీద్ బెయిల్ అభ్యర్థనను గతంలో తిరస్కరించాయి.
ఉమర్ ఖలీద్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని ఈ రెండు కోర్టులు అభిప్రాయపడ్డాయి.
ఉమర్ ఖలీద్ అనేక వాట్సాప్ గ్రూపులలో ఉన్నారు. ఆ గ్రూపులలో కొందరు దాడులు గురించి, రహదారులు, వాహనాల దిగ్బంధనం గురించి కుట్రలు పన్నినవారు కూడా ఉన్నారు.
దాడులు మొదలయ్యాక ఇతర నిందితులు ఉమర్ ఖలీద్‌కు అనేకసార్లు కాల్ చేశారు.
ఇది దాడులలో ఉమర్ ప్రమేయాన్ని సూచిస్తోంది. అనేకమంది సాక్షులు ఖలీద్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అయితే ఈ సాక్షులు ఎవరనేది తెలియదు.
ఖలీద్ రహదారులపై వాహనాలను కదలనీయకుండా చేయడానికి, ప్రభుత్వాన్ని దించేయాలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు వారు తెలిపారు.
ఖలీద్ తాను చేసిన ఓ ప్రసంగంలో మహారాష్ట్రను సందర్శించడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పడు ప్రజలందరూ రోడ్లపైకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఉమర్ ఖలీద్ విప్లవానికి పిలుపునిచ్చారని,ఇది అక్కడ లేని వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుందని, విప్లవమంటే తప్పనిసరిగా రక్తపాతహీనమైనదే కానక్కరలేదని దిల్లీ హైకోర్టు గతంలో పేర్కొంది.
తాజా తీర్పుకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఇంకా బయటికి రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బెయిల్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
నిందితులకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అందులో మొదటిది నిందితుడు తదుపరి విచారణకు అందుబాటులో ఉంటాడా లేదా అని, అతను ఏమైనా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా, సాక్ష్యాలను తారుమారు చేయడం, లేదా సాక్షులను బెదిరించడం చేస్తాడా అనే విషయాలను పరిశీలిస్తాయి.
అయితే ఉపా కేసులలో నిందితుడికి వ్యతిరేకంగా ఉన్న అభియోగాలు తప్పని భావించడానికి తగిన కారణాలు ఉన్నాయా లేదా అని కోర్టులు చూస్తాయి.
అందుకే ఈ కేసులలో బెయిల్ విచారణ సందర్భంగా ఓ చిన్నపాటి విచారణా పర్వమే కొనసాగుతుంది.
ఇక్కడ కోర్టు నిందితుడుకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అని చూస్తుంది.
బెయిల్ మంజూరు చేసేటప్పుడు సాక్ష్యాలను విచారించాల్సిన పనిలేదని 2019లోసుప్రీం కోర్టు పేర్కొంది.
అందుకే ప్రభుత్వం సాక్ష్యాలపైనే ఆధారపడినా, వీటిని బెయిల్ మంజూరు చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు.
కానీ తరువాత వచ్చిన సుప్రీం కోర్టు తీర్పులు ఉపా చట్టం కింద బెయిల్ పొందడాన్ని క్లిష్టతరంగా మార్చేశాయి.
అయితే ఉమర్ ఖలీద్ కేసులో సాక్ష్యాలు చాలా అస్పష్టంగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయాలంటున్నారు.
తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా తనపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం తగదని ఉమర్ ఖలీద్ కూడా వాదిస్తున్నారు.
కేవలం వాట్సాప్ గ్రూపులలో భాగమైనంత మాత్రానా, రహదారులు, వాహనాలను స్తంభింపచేయడం నేరమేమీ కాదని, ఇవి రాజకీయ పార్టీలు ఉపయోగించే చట్టబద్ధమైన నిరసనేనని ఉమర్ వాదిస్తున్నారు.
హింసను ప్రేరేపించేలా తానెటువంటి ప్రసంగాలు చేయలేదని, కానీ ఈ విషయంలో కొందరు సాక్షులు విరుద్ధమైన సాక్ష్యాలు చెప్పారని అంటారు.
అయితే హింస చెలరేగడానికి ముందు అనేకమంది బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, కానీ వారినెవరినీ విచారించలేదని అనేకమంది చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కేసు లిస్టింగ్‌లో లోపాలు ఉన్నాయా?
ఉమర్ ఖలీద్‌కు బెయిల్ రాకపోగా, ఆయన మేటర్ లిస్ట్ అయిన విధానంపైనా విమర్శలు వస్తున్నాయి.
ఆయన పిటిషన్ మొట్టమొదటిసారిగా 2023 మేలో లిస్ట్ అయింది. ఆ సమయంలో ఈ కేసుకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీచేసింది.
అప్పటి నుంచి ఈ కేసు వాయిదా పడుతూనే ఉంది.
గతంలో మరింత సమయం కావాలని దిల్లీ పోలీసులు కోరడం వల్ల ఈ కేసు వాయిదాపడింది.
దీని తరువాత ఈ కేసును విచారించడానికి ఓ న్యాయమూర్తి తిరస్కరించారు.
దీంతోపాటు ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు సుప్రీం కోర్టులో ఇతర కేసులలో బిజీగా ఉండటం వల్ల వాయిదాలు తీసుకున్నారు.
ఉమర్ ఖలీద్‌కు వ్యతిరేకంగా ఎటువంటి కేసు లేదని తేల్చేయడానికి తనకు 20 నిమిషాల సమయం చాలని ఆయన తరపున న్యాయవాది అక్టోబర్‌లో చెప్పారు.
తరువాత ఉపాలోని కొన్ని సెక్షన్ల రాజ్యంగబద్ధతను సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్లతోపాటుగా ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ని కూడా జత చేశారు.
అయితే ఉమర్ తరపు న్యాయవాది ఉపా చట్టం రాజ్యాంగబద్ధతతోపాటుగా బెయిల్ పిటిషన్ విచారించడాన్ని వ్యతిరేకించారు.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా విచారించాలని ఆయన కోరారు.
‘ఉపా’ రాజ్యాంగబద్ధతకు సంబంధించిన కేసును వాదిస్తున్న న్యాయమూర్తులలో ప్రశాంత్ భూషణ్ కూడా ఒకరు.
ఈయన కేసుల లిస్టింగ్‌లోని అక్రమాలపై సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు ఓ లేఖ రాశారు.
డిసెంబర్6న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు.
లిస్టింగ్ రూల్స్‌ను ఉల్లంఘించి కొన్ని కేసులను కొన్ని బెంచ్‌లకు కేటాయిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
కానీ ఏ కేసులు తప్పుగా కేటాయించారనే విషయాన్ని దవే పేర్కొనలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














