ఎక్సర్‌సైజ్‌: ఉదయం చేస్తే మంచిదా, సాయంత్రం బెటరా, ఏమిటి తేడా?

ఎక్సర్‌సైజ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనాబెల్ బోర్న్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రతిరోజూ మనం నిర్ణీత సమయంలో చేసే ఎక్సర్‌సైజ్ లు మన ఆరోగ్యం, శారీరక సామర్థ్యాల విషయంలో ప్రభావం చూాపుతాయనే విషయాన్ని నిరూపించే ఆధారాలు ఇటీవల కాలంలో ఎక్కువగా లభిస్తున్నాయి.

మరి మన శరీరాన్ని రోజులో వివిధ సమయాల్లోనూ ఇలా ప్రభావితమయ్యేలా చేయగలమా?

మరి కొద్ది నెలల్లో పారిస్‌లో జరిగే ఒలిపింక్ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఆటగాళ్ళు సిద్ధమవుతున్నారు.

అదరగొట్టే ప్రదర్శనతో చరిత్రపుటల్లోకి ప్రవేశించాలనుకునే క్రీడాకారులు తాము పోటీకి దిగేముందు బహుశా గడియారం వంక చూసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈతగాళ్ళు ఇలా చేసే అవకాశం ఉంది. దీనికొక కారణం కూడా ఉంది.

ఓ శాస్త్రీయ అధ్యయనం ప్రకారం ఏథెన్స్ (2004), బీజింగ్ (2008), లండన్ (2012), రియో (2016)లో జరిగిన ఒలింపిక్స్‌లో స్మిమ్మింగ్ పోటీలలో అత్యంత వేగంగా ఈది 144 పతకాలు గెలిచిన ఆటగాళ్ళందరూ సాయంత్రం వేళ జరిగిన పోటీలలో బాగా సత్తా చాటారు.

మరీ గట్టిగా చెప్పాలంటే సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు తమ పూర్తి సామర్థ్యాన్ని చూపారు. సమయాన్ని బట్టి తమ శరీర సామర్థ్యం గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని చెప్పే రుజువులకు ఇదో తార్కాణంగా నిలుస్తోంది.

ఇది కేవలం పతకాలు గెలిచిన స్విమ్మర్లకే పరిమితం కాలేదు. సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేసేవారి వేగం కూడా ఎక్కువగా ఉంది.

మనం రోజులో ఏ సమయంలో వ్యాయామాలు చేస్తామనే విషయం చాలా కీలకం. ముఖ్యంగా సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల మధ్య చేసే వ్యాయామాలు బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి.

ఇలా ఒకరోజులో ఓ ప్రత్యేక సమయంలో చేసే వ్యాయమాలు మహిళలు, పురుషుల మధ్య కూడా వేరు వేరు ప్రభావాన్ని చూపుతాయి.

సాయంత్రంవేళ చేసే ఎక్సర్‌సైజ్‌లే గరిష్ఠ ప్రయోజనాలు కలిగిస్తాయనే అధ్యయనాల నేపథ్యంలో ఒకవేళ మీకు ఉదయం 7గంటలకే ఎక్సర్‌సైజ్‌లు చేసే అలవాటు ఉంటే కంగారుపడాల్సిన పనిలేదు. మీరు కూడా ఇలాంటి గరిష్ఠ ప్రయోజనాలు పొందొచ్చనే సంకేతాలు కూడా ఉన్నాయి.

ఎక్సర్‌సైజ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

సర్కాడియన్ రిథమ్

మనశరీరం ఎలా పనిచేయాలి, వ్యాయామానికి ఎలా స్పందించాలో నిర్ణయించేది మనలోని సర్కాడియన్ రిథమ్.

సర్కాడియన్ రిథమ్-సింపుల్‌గా చెప్పాలంటే మన శరీరంలో జరిగే ఓ సహజమైన అంతర్గత ప్రక్రియ ఇది. జీవగడియారం అనుకోవచ్చు.

ఈ ప్రక్రియ కారణంగానే 24గంటలు ఉండే రోజులో మనకు పగలు, రాత్రి తేడా తెలియడం, ఆకలి, నిద్ర కలుగుతాయి.

ఈ సర్కాడియన్ రిథమ్ మన శరీరంలోని వివిధ అవయవాలకు సంకేతాలను పంపుతూ మొత్తం శరీరాన్ని సమన్వయం చేస్తుంది.

అయితే నిర్దుష్ట సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఈ జీవగడియారాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. సర్కాడియన్ రిథమ్ మాత్రమే కాకుండా, మన అవయవాలలోని పెరిఫరల్ క్లాక్స్ కూడా మనం చేసే వివిధ రకాల పనులను గుర్తుంచుకుని ప్రభావితమవుతుంటాయి.

మనం లేటుగా నిద్రపోయి త్వరగా లేవడానికి, లేదంటే నిర్ణీత సమయాలలో చేసే పనులు వాయిదా వేసుకున్నా అదే సామర్థ్యంతో చేసేందుకు ఈ పెరిఫరల్ క్లాక్స్ ఉపయోగపడతాయి.

అంటే గరిష్ఠ ప్రయోజనాలు ఇచ్చే సమయాలలో కాకుండా ఇతర సమయాలలోనూ ఎక్సర్‌సైజలు చేసినా తగిన ప్రయోజనం కలిగేలా ఈ పెరిఫరల్ క్లాక్స్ పనిచేస్తాయి. కాకపోతే దీనివలన మనకు ఆరోగ్యపరమైన మేలు ఎంత జరుగుతుందన్నదే అసలు ప్రశ్న.

స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లో ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టుగా పనిచేస్తున్న జులీన్ జీరత్ వ్యాయామానికి, సర్కాడియన్ వ్యవస్థకు మధ్య జరిగే సమాచార ప్రసారాలపై పరిశోధన చేస్తున్నారు.

ఈమె, ఈమె సహచరులు ఉదయం వేళ వ్యాయమం చేసిన ఎలుకల్లో వేగంగా కొవ్వు కరిగినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా జీవనశైలి కారణంగా వచ్చే టైప్ 2 మధుమేహం, స్థూలకాయంతో బాధపడేవారు నిర్ణీత సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల గరిష్ఠమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటారు ఆమె.

‘‘రోజులో ఏ సమయంలో చేస్తారనే విషయంతో సంబంధం లేకుండా ఎక్సర్‌సైజులు చేయడం మంచిదని అందరూ అంగీకరిస్తారు. కానీ మెరుగైన జీవక్రియ ఫలితాలు రావాలంటే మీరే సమయంలో ఎక్సర్‌సైజులు చేస్తున్నారన్నదే ముఖ్యం’’ అంటారు జీరత్.

ఇటీవల వీరు మనుషులపై చేసిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వారంలో ఒకరోజు ఉదయం వేళ గంటపాటు పరిగెత్తడం, స్ట్రెచింగ్ తదితర వ్యాయామాలు చేసిన మహిళల్లో పొత్తికడుపు కొవ్వు, రక్తపోటు తగ్గాయి. అయితే ఆసక్తికరంగా ఇవే ఎక్సర్‌సైజలు మహిళలు సాయంత్రం వేళ చేస్తే వారి కండరాల సామర్థ్యం పెరిగింది.

కానీ మగవారికి మాత్రం సాయంత్రం వేళ చేసే వ్యాయమాలు రక్తపోటును తగ్గించి, కొవ్వు స్థాయిని తగ్గించాయి.

అయితే దీనిపై ఇంకా పూర్తిగా అధ్యయనం జరగాల్సి ఉంది. ఏ సమయంలో వ్యాయమాలు చేస్తే సంపూర్ణ ప్రయోజనాలు కలుగుతాయనే విషయంపై గతంలో జరిగిన అధ్యయనాల ఫలితాలు అసంపూర్ణంగానే ఉన్నాయి.

దీనికి కారణం అందరికీ ఒకేరకమైన ఫలితాలు కాకుండా, ఆయా వ్యక్తుల మధ్య భిన్నమైన ఫలితాలు రావడమే.

ఉదాహరణకు వ్యక్తుల మధ్య గరిష్ఠస్థాయి సామర్థ్యంలో తేడాలు ఉంటాయి. అంటే నిర్ణీత సమయానికి నిద్రలేచి, నిర్ణీత సమయానికి నిద్రపోయే వ్యక్తులకు, ఇవే పనులు ఆలస్యంగా చేసేవారికి మధ్య ఫలితాలలో వ్యత్యాసం ఉంటుంది.

దీనికి కారణం ‘‘మన జీవగడియారంలోని తేడాలు’’ అంటారు కార్యన్ ఎస్సెర్. ఆయన అమెరికాలోని గైనెస్విల్లేలోని యూనివర్సిటీ ఆఫ్ ప్లోరిడాలో ఫిజియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

‘‘త్వరగా నిద్రలేచి, త్వరగా పడుకునేవారి జీవగడియారం 24గంటలకంటే తక్కువగా ఉంటుంది. అదే ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్రలేచేవారి జీవగడియారం 24గంటలకంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది’’ అని తెలిపారు.

ఎక్సర్‌సైజ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

నిర్ణీత సమయమే కీలకం

జులీన్ జీరత్ ఆధ్వర్యంలో కొంతమంది పరిశోధకుల బృందం క్రమం తప్పకుండా కొన్ని ఎలుకలను ఉదయం వేళ నిర్ణీత సమయంలో పరుగుపెట్టేలా శిక్షణ ఇచ్చారు. ఈ కొత్త ఎక్సర్‌సైజ్ పద్దతికి ఎలుకల శరీరాలు అలవాటుపడటాన్ని వారు గమనించారు. ఈ వ్యాయామం వాటి కండరాలు, ఊపిరితిత్తుల కండరాల్లోని జీవగడియారాన్ని గతంలోని సమయాలకు భిన్నంగా మార్చినట్టుగా కనిపిస్తోంది.

ఉదయం వేళ శిక్షణ తీసుకున్న ఎలుకలకు, మధ్యాహ్నం సమయంలో శిక్షణ ఇచ్చిన ఎలుకల కంటే పనితీరుసామర్థ్యం మెరుగ్గా ఉండటాన్ని గమనించారు. అయితే ఆరువారాల శిక్షణ తరువాత ఉదయంపూట శిక్షణ పొందిన ఎలుకలు, మధ్యాహ్నం వేళ శిక్షణ పొందినవి ఒకే తరహా సామర్థ్యస్థాయిని ప్రదర్శించాయి.

ఈ అధ్యయనం ఇంకా పీర్ రివ్యూ జర్నల్‌లో ప్రచురితం కావాల్సి ఉంది.

ఇదే విధమైన ప్రభావాన్ని మనుషులలో కనుగొంటే , ఆటగాళ్ళు సరైన సమయంతో తమ శరీరంలోని అంతర్గత గడియార శక్తిని పెంపొందించుకోవచ్చు.

వ్యాయామాలు మనుషులలోని సర్కాడియన్ రిథమ్‌ను మార్చుతాయనేందుకు కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.

ఇది షిఫ్ట్‌ల వారీగా పనిచేసేవారికి, జెట్‌లాగ్‌తో ఇబ్బంది పడేవారికి ఉపయోగపడొచ్చు.

‘‘ఇక్కడ మనకు కలిగే సాధారణ భావన ఒక్కటే. సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మాత్రమే మనలోని అంతర్గత గడియారం శ్రద్ధగా పనిచేస్తుంది’’ అంటారు ఎస్సెర్.

రోజూ ఒకే సమయంలో ఎక్సర్‌సైజులు చేయడం వల్ల మన శరీరం మెరుగ్గా మారుతుంది.

‘‘మీరు సాధారణ వ్యక్తులే అయినా, లేదా అగ్రశ్రేణి ఆటగాడైనా, లేదూ మీరు ఎందులోనైనా పోటీపడాలనుకుంటున్నా, నిర్ణీత సమయంలో శిక్షణ తీసుకోవడానికి ప్రయత్నించాలి’’ అంటారు జులీన్.

‘‘నిర్ణీత సమయంలో చేసే వ్యాయామం మీకు గరిష్ఠ ప్రయోజనాన్నిఅందిస్తుంది’’

ఏ సమయంలో ఎక్సర్‌సైజులు చేసినా మంచిదే అని చాలామంది పరిశోధకులు చెబుతుంటారు. కానీ మీరో నిర్ణీత సమయాన్ని అనుకుని, తదనుగుణంగానే మీరు ఎక్సర్‌సైజులు క్రమం తప్పకుండా చేస్తే మీ శరీరం మీకు అదనపు ప్రయెజనాలు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి: