దళిత రైతులకు కులం పేరుతో ఈడీ సమన్లు

- రచయిత, కే. మాయకృష్ణన్
- హోదా, బీబీసీ తమిళ్ కోసం
తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేపట్టిన ఒక విచారణ వివాదాస్పదంగా మారింది.
సేలం జిల్లా అత్తూరుకు చెందిన దళిత రైతులకు సమన్లు జారీ చేయడంతో పాటు, అందులో వారి కులం పేరు ప్రస్తావించడంతో ఈడీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సేలం జిల్లా అత్తూరు తాలుకాకు చెందిన రామనాయకన్ పాళ్యానికి చెందిన ఇద్దరు సోదరులు కన్నయ్యన్, కృష్ణన్.
వీరిద్దరికీ కల్వరాయన్ కొండల ప్రాంతంలో 6.5 ఎకరాల పొలం ఉంది.
ఈ రైతులకు ఒక కేసులో ఈడీ నుంచి సమన్లు అందాయి. ఈ సమన్లలో వారి కులం పేరు, చిరునామా మాత్రమే కాక, డిపార్ట్‌మెంట్ చేపడుతున్న విచారణకు సంబంధించి పలు ప్రశ్నలు ఉన్నాయి.
దీనిపై ఈడీ స్పందన కోసం బీబీసీ సంప్రదించగా.. ఈ కేసుపై స్పందించేందుకు వారు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని మాత్రమే వారు తెలిపారు.

బీజేపీ నేతపై రైతుల ఫిర్యాదు
ఈ విషయంపై కన్నయ్యన్, కృష్ణన్‌లు సేలం జిల్లా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. తమ భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తోన్న బీజేపీకి చెందిన గుణశేఖరన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
అంతేకాక ఈడీపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తమ కులం పేర్లను ప్రస్తావిస్తూ 2023 జులైలో ఈడీ సమన్లు జారీ చేసిందని అన్నారు.
తమ కులం పేరును ప్రస్తావించి తమకు బాధకలిగించిన, ఈడీ అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా సొంత భూముల్లో కనీసం పంటైనా వేసుకోకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోన్న తమను లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు జరుపుతోందని రైతులు చెప్పారు. దీనిపై వారు తీవ్ర నిరాశ, నిస్పృహ వ్యక్తం చేశారు.
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన రైతులు, సేలం జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జ్ గుణశేఖరన్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారని, తమ 6.5 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

భూయాజమాన్య హక్కు, నకిలీ పత్రాల నేపథ్యంలో సాగుతున్న ఈ వివాదంలో ఈడీ విచారణ జరుపుతోందని కృష్ణన్ చెప్పారు. తమ 5 ఎకరాల పొలాన్ని తనాఖా పెట్టి అత్తూరు సబ్ కోర్టులో గుణశేఖరన్‌పై కేసును దాఖలు చేసినట్లు చెప్పారు.
2020 నుంచి న్యాయ వివాదం నడుస్తుందన్నారు. ఈడీ తప్పుడు డాక్యుమెంట్లను తమపై నమోదు చేసిందని, నకిలీ నోట్లను మార్పిడి చేశామని ఆరోపిస్తోందని కృష్ణన్ చెప్పారు.
జులై 2023లో దళిత రైతులకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిలో వారి కులం పేరును పేర్కొంది.
అలాగే ఎక్కడ వారు హాజరు కావాల్సి ఉందో తెలిపింది. చెన్నైలోని ఈడీ కార్యాలయం వద్ద విచారణకు వారు హాజరైనప్పుడు, వారి న్యాయవాదిని తెచ్చుకోవాలని సూచించింది.
ఒక స్థానిక జర్నలిస్ట్ ఈ కేసును వెలుగులోకి తీసుకురావడంతో ఇటీవలే ఇది మీడియా దృష్టికి వచ్చింది.
ఆ తర్వాత గుణశేఖరన్, ఈడీ అధికారులపై పేద రైతులు తమిళనాడు పోలీసుల వద్ద తమ ఫిర్యాదు దాఖలు చేశారు.

పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి కేసులపై దృష్టిపెట్టాల్సినవసరం ఉందని రైతుల తరఫు న్యాయవాది పర్వినా కోరారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ ఆమె ఆరోపించారు. తగినన్ని ఆధారాలు లేకుండా బ్లాక్ మనీ లాండరింగ్ చట్టం కింద సామాన్య రైతులకు సమన్లు జారీ చేయకూడదన్నారు.
సమన్లలో రైతుల కుల పేరును ప్రస్తావిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు, రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తమిళనాడు రైతులకు జరిగిన ఈ సంఘటనను ఉటంకిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థను బీజేపీ పాలసీ ఈడీగా మార్చారంటూ.. దీనికి బాధ్యతగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తొలగించాలని చెన్నైకు చెందిన ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్(ఐఆర్ఎస్) డిమాండ్ చేశారు.
నిర్మలా సీతారామన్‌ను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చెన్నై(నార్త్)కు చెందిన జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ బాలమురుగన్ లేఖ రాశారు.
ఈ అధికారి ఈ నెలలో పదవీ విరమణ కాబోతున్నారు. దళిత రైతుల తరఫున వాదిస్తోన్న న్యాయవాది పర్వినాకు ఈయన భర్త.
కాగా పొలం చుట్టూ విద్యుత్ కంచె వేసినప్పుడు రెండు అడవి దున్నలు మరణించిన వేరే కేసులో ఈ రైతులు ఇప్పటికే నిర్దోషులుగా విడుదలవడంతో.. ఈడీ ఆ కేసును ముగించాలని చూస్తున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ న్యూస్ రిపోర్టు చేసింది.
వన్యప్రాణుల కేసులను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్న దానిలో భాగంగా తొలుత ఆ కేసును విచారణకు తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు.

ఈడీ ఏం చెబుతోంది?
అంతకుముందు రైతులపై నమోదైన కేసు అటవీ విభాగానికి చెందినది.
రెండు అడవి దున్నలను చంపారన్న ఆరోపణలపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 51, 9 కింద ఈ రైతులపై కేసు నమోదు చేశారు.
కోర్టు, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆదేశాల మేరకు వన్యప్రాణులకు సంబంధించిన కేసులను కూడా విచారిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈడీ అధికారి చెప్పినట్లు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది.
సమన్లలో కులం పేర్లను ప్రస్తావించడంపై స్పందించిన మరో ఈడీ అధికారి, కేసులను నమోదు చేయడంలో ఇది ప్రామాణిక విధానమని వివరించారు. పోలీసులు కూడా ఇదే టర్మినాలజీని వాడుతుంటారని చెప్పారు.

ఈడీ సమన్లను ఖండించిన రాజకీయ నాయకులు
వివాదాస్పదమైన ఈ సంఘటనపై రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈడీ చర్యలను నామ్ తమిళార్ పార్టీకి చెందిన సీమాన్ ఖండిస్తున్నారు. సామాజిక న్యాయంలో బీజేపీ ప్రభుత్వాలు చేస్తోన్న వాగ్దానాలు, డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సమన్లలో కులం ప్రస్తావనను ఆయన ఎత్తిచూపుతున్నారు.
దళిత రైతులకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని మార్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన బాలకృష్ణన్ కూడా ఖండించారు..
రాష్ట్ర ప్రభుత్వాల రికార్డులకు అనుగుణంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరించే ప్రామాణిక విధానం ఇదని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు.
అటవీ విభాగం అంతకుముందు నమోదు చేసిన కేసుకు అనుగుణంగానే ఈడీ అధికారులు రైతుల కులాన్ని సమన్లలో ప్రస్తావించారని ఆయన వివరించారు.
అసలు బీజేపీ పార్టీ క్యాడర్‌కు, ఈడీకి మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర రికార్డులకు తప్పనిసరిగా కట్టుబడి ఉండే ఈ విధానాలను ఈడీ తిరిగి పరిశీలించి, మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
తమ డిపార్ట్‌మెంట్‌పై పెరుగుతోన్న వ్యతిరేకతను, రాజకీయ ప్రభావిత ఆరోపణలను ఈడీ ఎలా తిప్పికొడుతుందో చూడాల్సి ఉంది.
ఈ సంఘటన ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కేసులలో దర్యాప్తు సంస్థల పారదర్శకతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇవి కూడా చదవండి:
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
- చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














