గుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు మాస్ లుక్ అదిరిందా... త్రివిక్రమ్ మార్క్ కనిపించిందా?

gunturu karam

ఫొటో సోర్స్, Haarika & Hassine Creations

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

మహేష్ బాబు త్రివిక్రమ్‌ది మ్యాజికల్ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలసి చేసిన అతడు, ఖలేజా దేనికవే ప్రత్యేకమైన చిత్రాలుగా నిలిచాయి.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి `గుంటూరు కారం`తో సంక్రాంతి బరిలో దిగారు.

ప్రచార చిత్రాల్లో మహేష్ బాబు మాస్ అవతార్ ఆకర్షించింది.

మహేష్‌ను చాలా మాస్‌గా చూపించారని పాటలు.. ప్రోమోలు చూస్తే అర్ధమైపోయింది.

అటు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురంలో’లాంటి విజయం తర్వాత చేస్తున్న సినిమా కావడం మరింత ఆసక్తిని రేపింది.

మరి ఇన్ని విశేషాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుందా?

మహేష్ మాస్ అవతార్ పంచిన వినోదం ప్రేక్షకులని ఆలరించిందా?

గుంటూరు కారం

ఫొటో సోర్స్, AdityaMusic/YouTube

తల్లీకొడుకుల ప్రేమ కథ

గుంటూరు కారం సినిమా కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తల్లీ కొడుకుల ప్రేమ కథ. తన కొడుకు రమణ (మహేష్ బాబు)ని ఐదేళ్ల వయసులో వదిలేసి మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది వసుంధర (రమ్యకృష్ణ). దీనికి గల కారణాలు ఏమిటి ? రమణ పెద్దవాడయ్యాక తల్లిని కలిశాడా? వసుంధర మళ్లీ రమణ జీవితంలోకి వచ్చిందా లేదా అనేది మిగతా కథ.

క‌థాపరంగా చూస్తే మంచి ఆలోచన ఇది. కథ ఎత్తుగడలో కావల్సినంత ఎమోషన్ వుంది.

ఒక సన్నివేశంలో ‘గడ్డం ఎందుకు పెంచావ్’ అని అడుగుతుంది తల్లి వసుంధర.

`లవ్ ఫెయిల్యూర్` అని చెబుతాడు రమణ. ‘ఎవరా అమ్మాయి’ అని తిరిగి అడిగితే.. ‘నువ్వే’ అంటాడు రమణ.

చాలా అందమైన భావోద్వేగంతో కూడుకున్న సన్నివేశం ఇది.

ఈ క‌థ‌లో తల్లీ కొడుకుల ప్రేమకథని చెప్పాలనుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్.

ఆలోచన వరకూ బావుంది కానీ అది తెరపైకి వచ్చిన విధానం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అసలు పాయింట్ ఎక్కడో వదిలేసి.. అనవసరమైన ఫిల్లర్స్‌తో కాలయాపన చేశారు దర్శకుడు.

దీంతో తల్లీ కొడుకుల ప్రేమకథ కేవలం ఆ ఒక్క డైలాగ్ కు మాత్రమే పరిమితమైయింది కానీ ఇందులోని ఆత్మని ప్రేక్షకుల ముందు ఆవిష్క‌రించ‌లేక‌పోయింది.

Mahesh Babu

ఫొటో సోర్స్, trivikram srinivas/fb

‘రమణ గాడి’ జీవితం నిజంగా మిరాకిలా?

కథ కంటే కథానాయకుడి పాత్రని బలంగా నమ్ముకొని సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లాడు దర్శకుడు.

మహేష్ బాబు పాత్ర‌ని హుషారుగా సూపర్ మాస్ గా డిజైన్‌ చేస్తూ వెళ్ళినప్పటికీ .. అతని పాత్ర ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వదు.

‘నీ సమస్య ఏమిటో అసలు నీకు తెలీదు’అని అంటాడు రమణ తండ్రి సత్యం (జయరాం) నిజమే.. ఇందులో దాదాపు సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి మనసుని హత్తుకోకుండానే సాగుతుంటాయి.

దీనికి కారణం హీరో సమస్య ఏమిటి? తనకి జీవితంలో ఏం కావాలి? తను ఏం కోల్పోయాడు? అనేది ప్రేక్షకుల‌కు రిజిస్టర్ చేయనివ్వకుండానే ఆ పాత్ర చివరి వరకూ నడిపేశారు.

పైగా ఈ కథలో సంఘర్షణ అనేది పెద్దగాలేదు. తల్లితో కూర్చుకొని మాట్లాడిన మరుక్షణమే ఈ కథ అయిపోతుంది. ఇంత పల్చటి కథని నడపాలంటే మిగతా పాత్రలు, వాటి కోణాలు నుంచి కూడా ఎమోషన్ డ్రామా వర్క్ అవుట్ కావాలి. కానీ ఇందులో మాత్రం సింగిల్ లేయర్ అలా నిదానంగా సాగుతూనే వుంటుంది.

తన తల్లిని రమణ ఎంతలా మిస్ అవుతున్నాడో కనీసం ఒక్క సన్నివేశంలోనైనా చూపించాల్సింది. అప్పుడు రమణ ప్రయాణంపై ప్రేక్షకులకు ఒక కనెక్ట్ వచ్చే అవకాశం వుండేది.

`ర‌మ‌ణ‌గాడి జీవితం ఓ మిరాకిల్ రా బాబూ` అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది.

అంత వింత‌లూ, విడ్డూరాలూ అత‌ని పాత్ర‌లో ఏం క‌నిపించ‌వు.

Mahesh Babu

ఫొటో సోర్స్, Trivikram Srinivas/fb

తివిక్రమ్ మార్క్ ఎక్కడ?

తివిక్రమ్ మంచి కథకుడు. ఆయన కథనంలో ఒక గమ్మత్తు వుంటుంది. చెప్పాల్సిన పాయింట్ చిన్నదైనప్పటకీ ఆ పాయింట్ చుట్టూ ఆకట్టుకునే పాత్రలు వాటి మధ్య వినోదం పుట్టించి ఎక్కడా బోర్ కొట్టించకుండా కథని నడపటంలో ఆయన దిట్ట.

కానీ గుంటూరు కారంలో ఆయన మార్క్ కనిపించకపోవడం నిరాశపరుస్తుంది.

నిజానికి ఈ కథని మంచి ఎమోషనల్ కోణంలో మొదలుపెడతారు. తొలి నాలుగు సన్నివేశాలు చూశాక.. మహేష్ బాబు లాంటి హీరోతో ఒక మంచి కుటుంబ కథని చూపించబోతున్నారనే ఆశలు కలుగుతాయి.

కానీ ఆశ్చర్యంగా ఆ ఎమోషన్ ని అక్కడే వదిలేసి.. అవసరం లేని చాలా సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్ళారు. దీంతో కాసేపటికే అంచనాలు సన్నగిల్లిపోతాయి.

తెరపై ఏవో సన్నివేశాలు వస్తుంటాయి కానీ ‘వావ్’ అనిపించే ఫీలింగ్ మాత్రం తీసుకురావు.

చివరికి ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా సాదాసీదాగా ముగిసిపోతుంది.

సంతకం కోసం అంత డ్రామా అవసరమా?

గుంటూరు కారం తొలి సగం అంతా ఒక సంతకం చుట్టూ నడిపేశారు.

నిజానికి రెండు సీన్స్ లో చెప్పాల్సిన విషయాన్నీ బాగా సాగదీశారు.

రమణ గుంటూరుకి హైదరాబాద్ కి తిరగడానికే తొలిసగం సరిపోయింది. పైగా హీరోయిన్ శ్రీలీల పాత్ర పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

సంతకం కోసం ఆమె గుంటూరులో రమణ ఇంటికి రావడం కూడా రొటీన్ గా వుంటుంది.

ఇక యాక్షన్స్ సీన్స్ కూడా సహజంగా కుదరలేదు.

ఫైట్ కావాలి కదా అని చేసినట్లుగా వుంటుంది కానీ కథ నుంచి ఫైట్స్ జనరేట్ కాకపోవడం మరో పెద్ద ఇబ్బంది.

`నాదీ న‌కిలీసు గొలుసు` లాంటి పాట‌ల‌తో ఓ మెడ్లీ త‌యారు చేశారు.

థియేట‌ర్లో అప్ప‌టిక‌ప్పుడు ఇలాంటి సీన్లు హైప్ తీసుకురావొచ్చు గాక‌. కానీ కాల‌గ‌మ‌నంలో ఇలాంటి ఎపిసోడ్లు ఏమాత్రం నిల‌బ‌డ‌వు. కేవ‌లం ఆ స‌న్నివేశం శ్రీ‌లీల డాన్స్ ప్ర‌తిభ ను చూపించ‌డానికి అన్న‌ట్టు త‌యారు చేశారు.

క‌థ‌ని ఎలా న‌డ‌పాలో అర్థం కాని ప‌రిస్థితుల్లోంచే ఇలాంటి సీన్లు పుట్టుకొస్తాయి.

తొలిసగంలో పెద్దగా కథ జోలికి వెళ్ళలేదు.

తల్లీ కొడుకుల ప్రేమ కోణంలో సన్నివేశాలు నడిపి ఉంటే అందులో నుంచి ఘర్షణ పుట్టేది.

ఇక సెకండ్ హాఫ్ ని ఇంకా నీర‌సంగా నడిపారు. ఇక్కడ కూడా కథకు అవసరం లేని పాత్రలతో యాక్షన్ సీన్స్ వస్తాయి. అవి కథకు అడ్డు తగిలినట్లు వుంటుందే గానీ వాటితో కథకు చేకూరిన లాభం ఏమీ వుండదు.

చివర్లో మాత్రం అమ్మ సెంటిమెంట్ పర్వాలేదనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చే డైలాగులు ఆకట్టుకున్నాయి. మహేష్, రమ్య కృష్ణ నటన కూడా దీనికి తోడై ఒక ఫీల్ గుడ్ టచ్ ఇస్తుంది.

Trivikram Srinivas

ఫొటో సోర్స్, Haarika & Hassine Creations

ఖలేజా చూపించిన మహేష్

ఖలేజా సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అందరికీ గుర్తుండే వుంటుంది.

రమణ పాత్రలో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి. ఎప్పటిలాగే మహేష్ తన లుక్ ప్రజెన్స్ తో కట్టిపడేశాడు.

ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు డ్యాన్స్ లు కూడా బాగా చేశాడు. నిజానికి రమణ పాత్రలోని బాధని ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేసుంటే..అది మరో స్థాయిలో నిలబడేది. శ్రీలీల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు.

ఆమెను డ్యాన్స్ కోసం తీసుకున్నట్లుగానే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా చాలా చోట్ల ఆమె మహేష్ బాబు వెంట వుండటం గమనించవచ్చు.

మీనాక్షి చౌదరి పాత్రని మరీ ప్రదర్శనకు ఉంచిన బొమ్మలా డిజైన్ చేశారు.

ఆ పాత్ర ఎందుకుందో తెలీదు.

ఒక సన్నివేశంలో మహేష్ బాబుకి మందు పోయడానికి వాడుకున్నారు తప్పితే మరో ఉపయోగం లేదా పాత్రతో.

రమ్యకృష్ణ తన అనుభవం చూపించింది. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది.

ప్రకాష్ రాజ్ కు అలవాటైన పాత్రే. రఘుబాబు , రావు రమేష్, ఈశ్వరీరావు పరిధిమేర కనిపించారు.

ప్రొడక్షన్ కి ఏమయింది?

టెక్నికల్ గా ఈ చిత్రానికి బిలో యావరేజ్ మార్కులు పడతాయి.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించవు ఇందులోని ప్రొడక్షన్ డిజైన్.

నాలుగు లోకేషన్స్ లో చుట్టేసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

మనోజ్ పరమహంస కెమెరా పనితనం బ్రైట్ గా వుంది. కానీ గొప్పగా అనిపించిన ఒక్క షాట్ కూడా కనిపించదు.

అన్నీ రెగ్యులర్ షాట్స్ తో లాగించేశారు. తమన్ పాటల్లో కుర్చీ మడత పెట్టి, టైటిల్ సాంగ్ థియేటర్ లో చూడటానికి బావున్నాయి. నేపధ్య సంగీతం హెవీగా చేశాడు.

నిర్మాణంలో పరిమితులు పాటించినట్లు కనిపించింది.

త్రివిక్రమ్ మాటల్లో అండర్ లైన్ చేయదగ్గ మాటలు లేవు.

మహేష్ బాబు యాక్షన్, డ్యాన్స్, మాస్ డైలాగ్స్ ఈ సినిమాకి బలం.

కేవలం మహేష్ బలంతోనే ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు ముందు నిలబడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)