పాకిస్తాన్ ఎన్నికల్లో తొలి హిందూ మహిళా అభ్యర్థి డాక్టర్ సవీరా ప్రకాశ్

ఫొటో సోర్స్, SAVEERA PRAKASH
- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్
పాకిస్తాన్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళా అభ్యర్థిగా నిలిచారు డాక్టర్ సవీరా ప్రకాశ్. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని బునెర్ జనరల్ స్థానం నుంచి ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.
పష్తూన్‌లు (పష్తూ మాట్లాడే ప్రజలు) ఎక్కువగా ఉండే బునెర్ ప్రాంతం, భారత్ - పాకిస్తాన్ విభజనకు ముందు స్వాత్ రాజసంస్థానంలో భాగంగా ఉండేది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు ఉత్తరంగా వంద కిలోమీటర్ల దూరంలో ఈ బునెర్ జిల్లా ఉంటుంది.
2009లో స్వాత్ లోయను స్వాధీనం చేసుకున్న తెహ్రీక్-ఇ-తాలిబాన్, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసే నెపంతో బునెర్‌ను కూడా తమ ఆధీనంలోని తెచ్చుకునేందుకు ప్రయత్నించింది.
కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పర్వతప్రాంతాలను ఆక్రమించింది. ఆ తర్వాత మిలటరీ ఆపరేషన్ ద్వారా వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.
''గతంలో బునెర్ అంటే ఆపరేషన్ బ్లాక్ థండర్‌స్టోమ్(పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్) గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఇతర కారణాలతో, ముఖ్యంగా మంచి విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. వాటిలో నా నామినేషన్ ఒకటి. నా కారణంగా మా పట్టణం వార్తల్లో నిలిచినందుకు సంతోషంగా ఉంది'' అని సవీరా అన్నారు.
ఆ విషయం చెప్పేప్పుడు ఆమె కళ్లలో ఓ మెరుపు కనిపించింది.
తెహ్రీక్-ఇ-తాలిబాన్ నుంచి స్వాత్, బునెర్, దిగువ దీర్, షంగ్లా జిల్లాలను విడిపించేందుకు పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషనే బ్లాక్ థండర్‌స్టోమ్.

ఫొటో సోర్స్, SAVEERA PRAKASH
'నాన్నే స్ఫూర్తి'
సవీరా ప్రకాశ్ తండ్రి ఒక వైద్యుడు, సామాజిక కార్యకర్త కూడా. ఆయన గత 30 ఏళ్లకు పైగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో నాన్నే తనకు స్ఫూర్తి అని సవీరా చెప్పారు. పీపీపీ తరఫున శాసన సభ స్థానానికి పోటీ చేస్తున్న సవీరా, అందుకు అవసరమైన నామినేషన్ పత్రాలను ఇప్పటికే సమర్పించారు.
''నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి చాలా మానవీయ కారణాలున్నాయి. మెడిసిన్ చేయడానికి కూడా అవే కారణం. నా చుట్టుపక్కల ఉన్నవారికి సాయం చేయాలనుకున్నా. కానీ, ఇళ్లకే పరిమితమైన ఈ వ్యవస్థలో దానివల్ల పెద్దగా మార్పు రాదని భావించా. ఇప్పుడైతే రోగులకు వైద్యం చేయగలను, కానీ నేను ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నా. ఈ వ్యవస్థను మార్చాలనుకుంటున్నా. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా'' అని ఆమె చెప్పారు.
విద్య, వైద్యం, పర్యావరణ సమస్యలపై ఆమె పనిచేయాలనుకుంటున్నారు. మహిళా సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని ఆమె భావిస్తున్నారు.
''ఈ ప్రాంతంలో చదువు ఒక పెద్ద సమస్య. బాలికలకు అవకాశాలు మరీ తక్కువ. చాలా మంది పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఉచితంగా చదువు చెబుతారని మగపిల్లలను మదర్సాలకు పంపుతున్నారు. బాలికలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరికొందరు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేసేందుకు పనిమనుషులుగా వెళ్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనుకుంటున్నా. వైద్య వృత్తి ద్వారా వీటిని పరిష్కరించడం సాధ్యం కాదు'' అని సవీరా బీబీసీతో చెప్పారు.
బునెర్ గురించి మాట్లాడుతూ, ఇది చాలా వెనకబడిన ప్రాంతం. మహిళలు బయటికి వెళ్లేప్పుడు తమ శరీరం అంతా కప్పుకుని వెళ్లాలి, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లాలని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SAVEERA PRAKASH
పార్టీలకు అతీతంగా మద్దతు
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగిస్తారని అడిగినప్పుడు, ''మొదట నేను కూడా భయపడ్డా. కానీ, నామినేషన్ వేసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఆ భయం పోయింది'' అని డాక్టర్ సవీరా అన్నారు.
''ఇప్పటి వరకూ బునెర్ నుంచి మహిళలు రాజకీయాల్లోకి రాలేదు. గతంలో కొన్నిప్రాంతాల్లో, ఓటు వేసేందుకు కూడా మహిళలను అనుమతించేవారు కాదు. మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు భయమేసింది. చాలా మంది పురుషులు మాట్లాడారు. అయితే, ప్రజల నుంచి నాకు మంచి స్పందన వచ్చింది. నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత ఒక నిమిషం పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు'' అని ఆమె చెప్పారు.
కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో పాటు అన్నివర్గాలూ తనకు తోడుగా ఉన్నాయని సవీరా అంటున్నారు.
''రాజకీయాలతో సంబంధం లేకుండా, మనస్ఫూర్తిగా అందరూ నాకు మద్దతిస్తున్నారు. బునెర్ డాటర్, బునెర్ ప్రైడ్ అని పిలుస్తున్నారు'' అని సవీరా చెప్పారు.
''వివిధ పార్టీలకు చెందిన వారు మా నాన్నను కలుస్తున్నారు. నేను ఎన్నికల్లో నిలబడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నాకే ఓటేస్తామని చెప్పి వెళ్తున్నారు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SAVEERA PRAKASH
ఆలోచనా విధానంలో మార్పు
''ప్రజల ఆలోచనా విధానం మారుతోంది. సమాజంలో యువత, మహిళలు, మైనార్టీలు కూడా భాగం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారి అంచనాలకు నేను దగ్గరగా ఉన్నా. అందుకే, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ నాకు మద్దతు ఇస్తున్నారు'' అని సవీరా అన్నారు.
ఒక హిందువుగా తానెప్పుడూ వివక్ష ఎదుర్కోలేదని, మతవిశ్వాసాల కారణంగా ఎప్పుడూ అన్యాయం జరగలేదని ఆమె చెప్పారు.
''మేం పష్తూన్లం. మాకు కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. హిందువనే వివక్ష ఎప్పుడూ లేదు. విభజన తర్వాత భారత్‌కు వెళ్లిపోవాలని మా పూర్వీకులు కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇదే మా ఇల్లు. మేం ఇక్కడి వాళ్లమే'' అన్నారు సవీరా ప్రకాశ్.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం: ‘నా కుటుంబం ఒక్కపూట భోజనానికి రూ.1500 కావాలి’
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- పాకిస్తాన్: కూతురి మార్ఫింగ్ ఫోటోను చూసి పరువు హత్యకు పాల్పడిన తండ్రి
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














