బంగ్లాదేశ్‌కన్నా పాకిస్తాన్ ఆర్థికంగా ఎందుకంత వెనకబడింది, 50 ఏళ్లలో ఎలా దిగజారుతూ వచ్చింది?

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తన్వీర్ మాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిటిషర్ల నుంచి 1947 ఆగస్టు 14న స్వాతంత్య్రంపొందిన తూర్పు,పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతాలు భవిష్యత్తు వైపు ప్రయాణించాయి. కానీ పది పన్నెండేళ్ళు గడిచేసరికి ఈ రెండు ప్రాంతాలమధ్యన ఆర్థిక, సామాజిక వ్యత్యాసం భారీగా పెరిగింది.

దీనిపై ‘లాస్ట్ డేస్ ఆఫ్ యునైటెడ్ పాకిస్తాన్’ పేరుతో గులామ్ వాజిద్ చౌధురి (జీడబ్ల్యు చౌధురి) రాసిన పుస్తకంలో వివరించారు.

1960లో పశ్చిమ పాకిస్తాన్ తలసరి ఆదాయం తూర్పు పాకిస్తాన్ కంటే అదికంగా 32 శాతం ఉండేది. ఆ తరువాత పదేళ్ళలో ఈ తేడా 81 శాతం పెరగనుందని రాశారు.

పాకిస్తాన్‌లోని జనరల్ యాహ్యఖాన్ ప్రభుత్వంలో జీడబ్ల్యు చౌధురి మంత్రిగా ఉండేవారు.

తూర్పుపాకిస్తాన్ 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఆ సమయంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక సూచీల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉండేది.

దేశ ఆర్థిక పురోగతి, తలసరి ఆదాయం తదితర విషయాలలో భారీగా తేడా కనిపిస్తుండేది.

కానీ 52 ఏళ్ళ స్వతంత్ర బంగ్లాదేశ్ చరిత్రలో గత రెండు దశాబ్దాల కాలంలో ఆర్థిక పురోగతి వేగం పుంజుకుని పాకిస్తాన్ కంటే మెరుగైనస్థితిలో నిలిచింది.

బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో పాకిస్తాన్ కంటే చురుకుగా పనిచేస్తూ తన విదేశీ వాణిజ్యాన్ని పెంచుకుంది.

మరోపక్క బంగ్లాదేశ్‌లో పేదరికం రేటు కూడా తగ్గుముఖం పట్టింది.

ఆర్థికరంగంలో పాకిస్తాన్‌లోకంటే బంగ్లాదేశ్‌లో మహిళల పురోగతి కూడా ఎక్కువగా ఉంది.

అనేక సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత, తీవ్రవాదం, శాంతి భద్రతలు క్షీణించడం, పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోవడం, విదేశీ వాణిజ్యంలో చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోవడం, జీడీపీ పెరుగుదల, తలసరి ఆదాయం, పేదరికం విషయంలో పాకిస్తాన్ వెనుకబడిపోయింది.

52 ఏళ్ళ తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్థికస్థితిగతులను పోల్చి చూస్తే బంగ్లాదేశ్ చాలా విషయాలలో పాకిస్తాన్ కంటే ముందుంది. ముఖ్యంగా తనకు ఆయువుపట్టుగా ఉన్న వస్త్రాల ఎగుమతి రంగంలో చాలా ముందుంది.

ప్రస్తుతం చైనా తరువాత ప్రపంచంలో వస్త్ర ఎగుమతి రంగంలో బంగ్లాదేశ్ రెండోస్థానంలో ఉంది. మరోపక్క వస్త్ర ఎగుమతి రంగంలో పాకిస్తాన్ కనీసం టాప్ 5 జాబితాలో కూడా చోటు సంపాదించలేకపోయింది.

నిజానికి బంగ్లాదేశ్‌లో పత్తి ఉత్పత్తి లేకపోయినా ఆశ్చర్యకరంగా ఎగుమతులలో ముందుంది. కానీ ఓ కాటన్ ఉత్పత్తి దేశంగా పాకిస్తాన్ వస్త్రాల ఎగుమతిలో బంగ్లాదేశ్ కంటే ఎంతో వెనుకబడి ఉంది.

ఐదు దశాబ్దాల రెండు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక ప్రగతిలో భాగంగా జడీపీ, తలసరి ఆదాయం, విదేశీ వాణిజ్యం, పేదరికం ఆధారంగా ఈ ఇరుదేశాలకు చెందిన ప్రభుత్వసంస్థలు, ప్రపంచబ్యాంకు నివేదికలు విడుదల చేశాయి.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్, బంగ్లాదేశ్ పెరుగుదల రేటు

డిసెంబర్ 16,1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడిన మొదటి ఏడాది ఆ దేశ ఆర్థిక పెరుగుదల రేటు మైనస్ 13 శాతంగా నమోదైంది.

ప్రపంచ బ్యాంక్ వెబ్‌సైట్‌లో లభిస్తున్న సమాచారం ప్రకారం ఆ సమయంలో పాకిస్తాన్ పెరుగుదల రేటు 1శాతంగా ఉంది.

అయితే యుద్ధం కారణంగా ఈ రెండుదేశాల ఆర్థికరంగం మందగమనంలోకి పడిపోయింది. కానీ తరువాత సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్థిక పెరుగుదల రేటు 7శాతానికి పెరిగింది. అప్పటికి బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు మైనస్‌లోనే ఉంది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ ఆర్థిక సంవత్సరాలు ప్రతి ఏటా జులై 1న ప్రారంభమై తరువాత ఏడాది జూన్ 30న ముగుస్తాయి.

52 ఏళ్ళ తరువాత ఆర్థిక సర్వే ప్రకారం, 2023 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ గ్రోత్ రేటు 1 శాతానికి కన్నా తక్కువగా 0.29శాతంగా నమోదైంది.

మరోపక్క బంగ్లాదేశ్ ఆర్థిక సమీక్ష ప్రకారం ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ ఆర్థిక పెరుగుదల రేటు 6శాతంగా ఉంది.

వరుసగా పదిపన్నెండేళ్ళనుంచి బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు 6శాతానికి మించి కొనసాగుతోంది. ఇదే కాలానికి పాకిస్తాన్ విషయాన్నే తీసుకుంటే 3 నుంచి 4 శాతం మధ్య ఊగిసలాడింది. మధ్యలో ఓ రెండేళ్ళు 1 శాతానికన్నా తక్కువకు కూడా పడిపోయింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ విలువ 454 బిలియన్ డాలర్లు ఉండగా, పాకిస్తాన్ విలువ 340 బిలియన్ డాలర్లుగా ఉంది.

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రాన్ని బోధించే ఆదిల్ మాలిక్ బీబీసీతో మాట్లాడుతూ 1990లో బంగ్లాదేశ్ ఆర్థిక పెరుగుదల రేటు 0.2శాతంగా ఉండేదని, కానీ తరువాత క్రమంగా ఈ రేటు పెరిగి 2022 నాటికి 6 శాతానికి చేరుకుందని చెప్పారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఇరుదేశాల తలసరి ఆదాయమెంత?

గడిచిన 52 సంవత్సరాలలో బంగ్లా, పాకిస్తాన్ దేశాల మధ్య తలసరి ఆదాయం విషయంలో కూడా భారీ తేడా ఉంది.

ప్రపంచబ్యాంక్ వద్ద ఉన్న సమాచారం మేరకు 1972లో బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయం 90 డాలర్లుగా ఉండగా, పాకిస్తాన్ తలసరి ఆదాయం 150 డాలర్లుగా ఉండేది.

ఆ తరువాత బంగ్లాదేశ్ తలసరి ఆదాయ సూచిక పైపైకి ప్రయాణిస్తుండగా, పాకిస్తాన్ తలసరి ఆదాయ సూచీ ఒడిదుడుకుల మధ్య సాగింది.

కిందటి ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ తలసరి ఆదాయం 1568 డాలర్లుగా ఉన్నట్టు ఆ దేశ ఆర్థిక సర్వే తెలిపింది.

అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2687 డాలర్లుగా ఉన్నట్టు ఆ దేశ ఆర్థిక సమీక్ష నివేదిక చెప్పింది.

ఇరుదేశాల ఎగుమతులు

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల విదేశీ వాణిజ్యంలో కూడా గడిచిన 52 ఏళ్ళలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

1972లో బంగ్లాదేశ్ ఎగుమతులు 350 మిలియన్ డాలర్లు ఉండగా, ఆ సమయంలో పాకిస్తాన్ ఎగుమతులు దాదాపు రెండింతలు ఎక్కువగా 675 మిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే ఐదుదశాబ్డాల కాలంలో బంగ్లాదేశ్ ఎగుమతుల రంగంలో ఎదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రత్యేకించి గడిచిన 20 ఏళ్ళలో ఆ దేశాభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది.

వస్తుసేవల ఎగుమతి రంగంలో కిందటి ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ 64 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. వీటిల్లో 55 బిలియన్ డాలర్లు వస్తువులవికాగా, 9 బిలియన్ డాలర్లు సేవల రంగానికి చెందినవి.

ఇదే ఏడాదిలో పాకిస్తాన్ ఎగుమతులు 35 బిలియన్ డాలర్లుగా ఉంది. వీటిల్లో వస్తువుల ఎగుమతులు 27 బిలియన్ డాలర్లు కాగా, సేవలరంగం వాటా 8 బిలియన్ డాలర్లుగా ఉంది.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్,పాకిస్తాన్‌లో పేదరికం రేటు

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ దేశాల మధ్య పేదరికం రేటును పోల్చి చూస్తే గడిచిన 52 సంవత్సరాలలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.

బంగ్లాదేశ్‌లో 2016లో పేదరికం రేటు 13.47 శాతంగా ఉందని, ఈ రేటు 2022 నాటికి 10.44శాతానికి పడిపోతోందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. నిజానికి బంగ్లాదేశ్ పేదరికం రేటు 2000 సంవత్సరంలో 49 శాతంగా ఉంది.

కానీ రెండుదశాబ్దాల కాలంలో ఆ దేశం పేదరికం రేటు గణనీయంగా తగ్గినట్టు ప్రపంచ బ్యాంక్ నివేదిక చెబుతోంది.

పాకిస్తాన్ విషయాన్ని తీసుకుంటే ఆ దేశంలో పేదరికం రేటు పెరుగుతూ పోతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆ దేశ పేదరికం రేటు 39.4శాతానికి పెరిగింది. 2018లో పాకిస్తాన్ పేదరికం రేటు 22 శాతం మాత్రమే.

బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతికి కారణమేంటి?

పాకిస్తాన్‌ను మించి బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి ఎలా సాధిస్తోందనే ప్రశ్నపై ఆదిల్ మాలిక్ మాట్లాడుతూ ‘‘ దీనివెనుక ఉన్న కారణాలను మనం పరిశీలిస్తే కనిపించే విషయం ఏమిటంటే ఈ ఇరుదేశాలలోని ఎలైట్ సెక్షన్ల ఆలోచనాధోరణి, దూరదృష్టిలోని తేడానే’’ అని చెప్పారు.

దీనిని మరింతగా విశ్లేషిస్తూ ‘‘బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలైనా, వ్యాపారవేత్తలైనా దేశంలో పరిశ్రమలను వృద్ధి చేయడం ద్వారా ఎగుమతులు పెంచాలనే విషయంలో ఏకాభిప్రాయంతో ఉంటారు’’ అని చెప్పారు.

‘‘ప్రధాని నుంచి సామాన్యుల దాకా ఈ విషయంలో ఐక్యంగా ఉన్నారు. కానీ మరోపక్క పాకిస్తాన్‌లోని రాజకీయ, సైనిక, ఉన్నత వర్గాలన్నీ రియల్ ఎస్టేట్ రంగంపై తమ దృష్టి కేంద్రీకరించి, దానిపైనే పనిచేస్తున్నాయి’’

‘‘పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాలంలో విదేశాల నుంచి పెద్ద ఎత్తున సొమ్మలు వచ్చాయి. కానీ అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ ఉత్పత్తి రంగంపై దృష్టి సారించి ముందుకు సాగిపోయింది’’.

‘‘బంగ్లాదేశ్‌లో ఉన్నతవర్గాల ప్రయోజనాలు పరిశ్రమలకు సంబంధించినవిగా ఉంటే, పాకిస్తాన్‌లోని ఇదే సెక్షన్ రియల్ ఎస్టేట్‌పై దృష్టిసారించడమే అతిపెద్ద తేడా. అందుకే ఈ 20 ఏళ్లలో ఈ ఇరుదేశాలు భిన్నమైన ఆర్థిక పరిస్థితులను కలిగి ఉన్నాయి’’ అని ఆదిల్ మాలిక్ చెప్పారు.

‘‘బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్, ఇండియాల నుంచి వేరుచేస్తున్న మరో అంశం కూడా ఉంది. ఇక్కడ ముందుగా భూ సంస్కరణల ద్వారా జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు, భారత్‌లో మాదిరిగా ఇక్కడ కులవ్యవస్థ సమస్య లేదు’’ అని మాలిక్ విశ్లేషించారు.

‘‘బంగ్లాదేశ్‌లో ఫ్యాక్టరీ ఓనర్ అయినా, కార్మికుడైనా సామాజికంగా ఎటువంటి అంతరాలు ఉండవు. ఒక కార్మికుడు పనిలో నైపుణ్యం చూపి ఎదిగితే, అతనికి కూడా సొంత ఫ్యాక్టరీ పెట్టుకునే అవకాశం దక్కుతుంది’’

బంగ్లాదేశ్‌లో విద్యను విశ్వజనీనంగా మార్చడం వలన అందరికీ చదువు అందుబాటులోకి వచ్చింది.

‘‘అందుకే ప్రస్తుతం పాకిస్తాన్‌లో బడికి వెళ్ళని చిన్నారుల సంఖ్య 22 మిలియన్లు ఉంటే బంగ్లాదేశ్‌లో ఈ సంఖ్య 72వేలుగా ఉంది’’ అని ఆదిల్ చెప్పారు.

‘‘అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వం, శాంతియుత పరిస్థితుల కారణంగా ఆర్థికరంగంలో ప్రగతి సాధించడం సాధ్యమైంది. కానీ మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్యలకు పాకిస్తాన్ బలైంది. దీనికారణంగా ఆ దేశ ఆర్థికరంగం కుదేలు కావడంతోపాటు విధానాల కొనసాగింపు కొరవడింది’’ అని ఆదిల్ విశ్లేషించారు.

‘‘పాకిస్తాన్‌లో అనేక సవాళ్ళు ఉంటాయి. వీటిల్లో అతిపెద్ద సమస్య మారకం రేటు. దీనిని నియంత్రించడానికి నిరంతరం ప్రయత్నిస్తుండట వల్ల దాని ప్రభావం పాకిస్తాన్ ఎగుమతులపై పడుతోంది. దీంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోయింది’’ అని డాక్టర్ హఫ్సా హైనా చెప్పారు. ఈయన పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక నిపుణుడిగా పనిచేస్తున్నారు.

‘‘ దేశంలోని పరిశ్రమలకు రక్షణ కల్పించేందుకు చార్జీలు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. దీని వల్ల పాకిస్తాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా పోటీపడలేకపోతున్నాయి. స్థానిక వినియోగంపై ఆధారపడి ఎగుమతుల రంగం అభివృద్ధి చెందలేకపోతోంది. దీనికితోడు భారీగా ఉన్న కరెంటు చార్జీలు పరిశ్రమలను కుదేలు చేసి, ప్రపంచంలో పోటీ పడలేని పరిస్థితికి తెచ్చాయి’’ అని చెప్పారు.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్ ఎలా ఎదిగింది?

బంగ్లాదేశ్ గడిచిన రెండు దశాబ్డాల కాలంలో వస్త్ర ఎగుమతులలో అద్భుతమైన ప్రగతి సాధించింది. కిందటేడాది 42 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను బంగ్లాదేశ్ ఎగుమతి చేసింది.

అదే సమయంలో పాకిస్తాన్ కేవలం 10 బిలియన్ డాలర్లు మాత్రమే చేయగలిగింది. చైనా తరువాత వస్త్రాల ఎగుమతిలో బంగ్లాదేశ్ రెండోస్థానంలో నిలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో వస్త్రపరిశ్రమలలోనే మూడున్నర బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని ప్రొఫెసర్ ఆదిల్ చెప్పారు.

బంగ్లాదేశ్‌లో మిగిలిన దేశాలే కాకుండా పాకిస్తాన్ కూడా పెట్టుబడులు పెట్టింది.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఫరూక్ ఇక్బాల్ అనే వస్త్రవ్యాపారి బంగ్లాదేశ్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని వ్యాపారం చేస్తున్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఇక్కడ వ్యాపారం చేయడానికి ప్రధాన కారణం శాంతిభద్రతలు చక్కగా ఉండటమే. పైగా ఇక్కడి ప్రజలకు బోలెడు సహనం ఉంది. అందుకే విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడకు వస్తున్నారు. వారిని ఎంతో చక్కగా చూసుకుంటున్నారు’’ అని తన అనుభవాలను పంచుకున్నారు.

సింధ్ నుంచి బంగ్లాదేశ్‌ వస్త్ర రంగంలో పెట్టుబడులు పెట్టిన అందాన్ జఫార్ మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్‌లో పరిశ్రమలకు వసతుల కల్పన వేగంగా జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి కనెక్షన్లు రెండురోజులలోనే సమకూరతాయి. కానీ పాకిస్తాన్‌లో గ్యాస్ కనెక్షన్ దొరకడం లేదు. ఇక కరెంట్ కనెక్షన్‌కు రెండేళ్ళు పడుతుంది’’ అని చెప్పారు.

తాను పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌లోని కార్యకలాపాలను ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షిస్తున్నానని, ఇప్పటిదాకా తానెటువంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపారు.

‘‘బంగ్లాదేశ్‌లో అనేక రకాలైన వస్తువులను తయారుచేసి ఎగుమతి చేస్తారు. కానీ మేం కేవలం నాలుగైదు రకాల ఉత్పత్తులు మాత్రమే చేయగలుగుతున్నాం’’ అని పాకిస్తాన్ లోని అసోసియేషన్ ఆఫ్ ఎక్స్‌పోర్టర్స్ ఆఫ్ గార్మెంట్ సెక్టార్స్ మాజీ అధ్యక్షుడు అజాజ్ కోకర్ చెప్పారు.

పాకిస్తాన్‌లో ఆడవాళ్ళకు కేవలం టీ షర్టులు మాత్రమే తయారుచేస్తారని, కానీ బంగ్లాదేశ్‌లో లోదుస్తులు కూడా తయారుచేస్తారని ఆయన తెలిపారు.

‘‘వారి దగ్గరున్న కార్మికుల సంఖ్య కూడా పెద్ద తేడాను చూపుతోంది. బంగ్లాదేశ్‌లోని కార్మిక శక్తిలో 80శాతం మహిళలు ఉండగా, 20 శాతం మంది మాత్రమే పురుషులు ఉన్నారు’’

‘‘ఇక్కడ మొత్తం 8గంటల పనిలో మహిళలు ఏడున్నరగంటలు పనిచేస్తారు. పురుషులు, ఐదు లేదా ఆరుగంటలు మాత్రమే పనిచేస్తున్నారు’’

కానీ పాకిస్తాన్‌లో మహిళా కార్మికులు కేవలం 10శాతమే ఉన్నారు. ‘‘బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వస్త్రపరిశ్రములు 30 నుంచి 40 శాతం దాకా ఉన్నాయి. కానీ పాకిస్తాన్‌లో కేవలం 7శాతం మాత్రమే పెద్ద పరిశ్రమలు ఉన్నాయి.’’ అని తెలిపారు.

పరిశ్రమలలో మహిళలు పనిచేసే విషయంలో బంగ్లాదేశ్ ప్రశంసనీయంగా ఉంది. కానీ పాకిస్తాన్‌లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని డాక్టర్ హప్ఫా చెప్పారు.

‘‘ప్రభుత్వం మహిళలకు ఎటువంటి సాంకేతిక విద్యను అందించకుండానే ప్రభుత్వ పథకాల ద్వారా కేవలం కొన్ని వేల రూపాయలు ఇస్తే వారు ఉత్పత్తిలో ఎలా భాగస్వాములు కాగలుగుతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)