షేక్ హసీనా: ఒకప్పుడు ఇందిరా గాంధీ ఆమెను ఇండియా రప్పించి రహస్యంగా ఎందుకు ఉంచారు?

షేక్ హసీనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆ రోజు 1975 ఆగస్ట్ 15. షేక్ హసీనా, ఆమె భర్త డాక్టర్ వాజెద్, సోదరి రెహానాలు బంగ్లాదేశ్ రాయబారి సనాల్ హక్‌తో బెల్జియం రాజధాని నగరం బ్రసెల్స్‌లో ఉన్నారు.

వారు పారిస్ వెళ్లాలనుకుంటున్నారు. కానీ, అంతకు ఒక్క రోజు ముందు వాజెద్ చేయి కారు డోరులో ఇరుక్కుపోయి గాయమైంది.

వారిద్దరూ పారిస్ వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధతలో ఉన్నప్పుడు, బెల్జియంకు బంగ్లాదేశ్ రాయబారి అయిన సనావుల్ హక్‌ ఇంట్లో ఫోన్ రింగ్ అయింది.

ఆ కాల్ చేసింది జర్మనీలో బంగ్లాదేశ్ రాయబారి హుమాయున్ రషీద్ చౌధురి. ఈ ఉదయం బంగ్లాదేశ్‌లో ఆర్మీ దాడులు ప్రారంభించిందని చౌధురి చెప్పారు.

దీంతో వెంటనే సనావుల్ హక్ ‘‘ మీరు పారిస్ వెళ్లడానికి వీలు లేదు. వెంటనే జర్మనీ వెళ్లిపోండి’’ అని షేక్ హసీనాకు, ఆమె భర్త వాజెద్‌కు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షేక్ హసీనా

ఫొటో సోర్స్, UN

ఫొటో క్యాప్షన్, హుమాయున్ రషీద్ చౌధురి

సైనిక తిరుగుబాటులో షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ స్వాతంత్రపోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేశారన్న విషయం బెల్జియంలోని బంగ్లాదేశ్ రాయబారి సనావుల్ హక్‌కు రషీద్ చౌధురి ద్వారా తెలిసింది. ఈ ఘటనలో ముజిబుర్ రెహ్మాన్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా హత్యకు గురయ్యారు.

ఈ వార్త విన్న తర్వాత షేక్ హసీనా, ఆమె భర్త, సోదరిలకు సాయం అందించడానికి సనావుల్ హక్ నిరాకరించారు. అంతేకాదు, మీరు నా ఇంట్లో ఉండొద్దంటూ వారిని బయటకు పంపేశారు.

షేక్ ముజిబుర్ రెహమాన్ వర్ధంతి సందర్భంగా కొన్నేళ్ల క్రితం ఈ సంఘటనను గుర్తు చేసుకున్న షేక్ హసీనా.. ‘‘ఆయనకు మేం భారంగా మారాం. చెప్పాలంటే, బెల్జియంకు బంగ్లాదేశ్ రాయబారిగా ఆయన్ను నియమించింది షేక్ ముజిబుర్‌ రెహమానే. కానీ, మేం జర్మనీ వెళ్లేందుకు మాకు కారు ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించారు’’ అని చెప్పారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షేక్ ముజీబుర్

జర్మనీలో బంగ్లాదేశ్ రాయబారి హుమాయున్ రషీద్ చౌధురి సాయంతో వారందరూ ఎలాగో జర్మనీకి చేరుకున్నారు. ఆ తర్వాత అర్థగంటలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ కమల్ హుస్సేన్ కూడా అక్కడికి వచ్చారు.

అదే రోజు సాయంత్రం జర్మన్ రేడియో డాయిష్ వెల్లే, కొన్ని జర్మనీ వార్తాపత్రికలకు చెందిన జర్నలిస్ట్‌లు బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటుపై ఆయన స్పందన తెలుసుకునేందుకు రాయబారి కార్యాలయానికి వచ్చారు.

షేక్ హసీనా, ఆమె సోదరి రెహానా ఇద్దరూ షాక్‌లో ఉన్నారు. వారితో మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడే ఉన్న కమల్ హుస్సేన్ కూడా వారితో ఒక్క మాట మాట్లాడలేదు.

హుమాయున్ రషీద్ చౌధురి కొడుకు నౌమన్ రషీద్ చౌధురి దీనిపై బంగ్లాదేశ్‌లోని ప్రముఖ వార్తా పత్రిక ‘ది డైలీ స్టార్’కి 2014 ఆగస్ట్ 15న ఒక ఆర్టికల్‌ రాశారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా, ఆమె చెల్లెలు రెహానా

ఆ ఆర్టికల్ పేరు ‘డాటర్స్ ఆఫ్ బంగబంధు’. అందులో వీటి గురించి వివరించారు.

‘‘ఒక రాజకీయ కార్యక్రమంలో, నా తండ్రి పశ్చిమ జర్మనీకి భారత రాయబారి అయిన వై.కె. పురిని కలిశారు. ఆ కార్యక్రమంలో షేక్ హసీనా, ఆమె కుటుంబానికి భారత్ రాజకీయ ఆశ్రయమివ్వగలదా అని అడిగారు. తర్వాత రోజు ఆయన మా నాన్నను కలవడానికి వచ్చారు.

భారత్‌లో రాజకీయ ఆశ్రయమిచ్చే ప్రక్రియ చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పారు. దిల్లీలో మీరు అందరికీ తెలుసు. ఎందుకంటే, స్వాతంత్య్రం రాకముందు బంగ్లాదేశ్ మిషన్‌కు మీరే అధినేత కదా. ఇందిరా గాంధీ, ఆమె అడ్వయిజర్ డీపీ ధార్, పీఎన్ హక్సర్ మిమ్మల్ని ఎంతో అభిమానిస్తారు. మీరు వారిని నేరుగా సంప్రదించవచ్చు కదా? అని సూచించారు’’

‘‘ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పురి అక్కడ ఉండగానే.. ధార్‌కు, హక్సర్‌కు రషీద్ ఫోన్ చేశారు. కానీ, ఆ సమయంలో వారిద్దరూ భారత్‌లో లేరు.

ఇందిరా గాంధీకి కాల్ చేసేందుకు ఆయన ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే, చౌధురి కేవలం రాయబారి మాత్రమే. ఇందిరా గాంధీ ఆ సమయంలో భారత ప్రధాని. ఎన్నోసార్లు ఇందిరా గాంధీని ఆయన కలిశారు. కానీ, అప్పటికి మూడేళ్లుగా ఆమెతో పెద్దగా సంప్రదింపులు లేవు.

రాజకీయాల్లో మూడేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. అంతేకాక, ఆ సమయంలో భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరా గాంధీనే తనకు తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు’’ అని నౌమన్ రషీద్ తన ఆర్టికల్‌లో రాశారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీతో ముజిబుర్ రెహమాన్‌

‘‘ఇక బయటపడేందుకు ఏ మార్గాలు లేవని గుర్తించిన తర్వాత, హుమాయున్ చివరిగా ఇందిరా గాంధీ కార్యాలయానికి కాల్ చేశారు. భారత రాయబారి పురి ఆయనకు ఇందిరా గాంధీ ఆఫీసు నెంబర్ ఇచ్చారు.

కానీ, ఇందిరా గాంధీనే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తారని హుమాయున్ చౌధురి అనుకోలేదు. ఆమె ఫోన్ ఎత్తగానే హుమాయున్ చౌధురి ఆశ్చర్యపోయారు. ఆయన జరిగిన విషయాన్నంతా ఇందిరా గాంధీకి చెప్పారు. బంగబంధు డాటర్స్‌కి రాజకీయ ఆశ్రయమిచ్చేందుకు ఇందిరా గాంధీ వెంటనే అంగీకరించారు’’ అని నౌమన్ రషీద్ చౌధురి తన ఆర్టికల్‌లో వివరించారు.

షేక్ ముజీబుర్ రెహమాన్ కూతుళ్లు, ఆమె కుటుంబాన్ని దిల్లీకి తీసుకు వచ్చేందుకు వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని దిల్లీ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని ఆగస్టు 19న రాయబారి పురి బంగ్లా రాయబారి హుమాయున్ చౌధురికి చెప్పారు.

షేక్ హసీనా, ఆమె కుటుంబం 1975 ఆగస్టు 24న ఎయిరిండియా విమానంలో పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు.

కేబినెట్‌లోని జాయింట్ సెక్రటరీ వారికి ఆహ్వానం పలికారు. తొలుత వారిని ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచిన తర్వాత, డిఫెన్స్ కాలనీలోని ఇంటికి తరలించారు.

ఆ తర్వాత పది రోజులకు సెప్టెంబర్ 4న ‘రా’(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) అధికారులు వారిని తీసుకుని సఫ్దర్‌‌జంగ్ రోడ్డు 1లో ఉన్న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఇంటికి తీసుకెళ్లారు.

కుటుంబంతో షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

ఫొటో క్యాప్షన్, కుటుంబంతో షేక్ హసీనా

ఇందిరా గాంధీతో సమావేశమైన తర్వాత, ‘‘ఆగస్టు 15న ఏం జరిగిందో మీకు ఏమైనా కచ్చితమైన సమాచారం ఉందా?’’ అని ఆమెను అడిగారు షేక్ హసీనా.

కుటుంబంలో ఒక్కరూ కూడా మిగిలి లేరని అక్కడున్న ఒక అధికారి చెప్పగానే, షేక్ హసీనా కుప్పకూలారు.

‘‘ఇందిరా గాంధీ షేక్ హసీనాను దగ్గరకు తీసుకుని ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు’’ అని షేక్ హసీనా బయోగ్రాఫర్ సిరాజుద్దీన్ అహ్మద్ రాశారు.

‘‘నీకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది. నీకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకును తండ్రిగా, కూతుర్ని తల్లిగా భావించు’’ అని ఇందిరా గాంధీ షేక్ హసీనాకు చెప్పారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీ, ముజిబుర్ రెహమాన్

షేక్ హసీనా భారత్‌లో ఉన్నకాలంలో ఇందిరాతో జరిగిన ఏకైక సమావేశం ఇదేనని సిరాజుద్దీన్ అహ్మద్ తన పుస్తకంలో రాశారు. కానీ, ఇందిరా గాంధీ, షేక్ హసీనా అప్పుడప్పుడు కలుసుకునే వారని ‘రా’ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు.

ఇందిరను కలుసుకున్న పది రోజులకు షేక్ హసీనా కుటుంబానికి ఇండియా గేట్‌కు దగ్గర్లో ఉన్న పండారా పార్క్‌లోని సీ బ్లాక్‌లో ఒక ఫ్లాట్‌ను ఇచ్చారు.

దీనిలో మూడు బెడ్‌రూమ్‌లు, కొంత ఫర్నీచర్ ఉన్నాయి. ఆ తర్వాత వారు కొంత కొనుగోలు చేసుకున్నారు.

భద్రతా కారణాలతో వారు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని, ప్రజల్లో కలవకూడదని ఆదేశాలున్నాయి.

తండ్రి షేక్ ముజీబుర్‌తో షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

ఫొటో క్యాప్షన్, తండ్రి షేక్ ముజీబుర్‌తో షేక్ హసీనా

‘‘షేక్ హసీనా ఫ్లాట్‌కు సెక్యూరిటీగా ఇద్దరిని పంపించాం. వారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్ సత్తో ఘోష్. ఆయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి. మరొకరు 1950 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీకే సేన్. ఘోష్‌‌ను షేక్ హసీనా సెక్యూరిటీ కల్నల్‌గా పంపగా.. ఐజీ లెవల్ పీకే సేన్‌ను హసీనా సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌గా ఉంచాం. ఈ ఇద్దరు అధికారులు హసీనాకు నీడగా ఉన్నారు’’ అని ‘రా’ విభాగానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారు.

‘‘షేక్ హసీనా కుటుంబపు ఖర్చులను పూర్తిగా భారత ప్రభుత్వమే భరించింది. వారి ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి’’ అని మాజీ ‘రా’ అధికారి చెప్పారు.

దిల్లీలో షేక్ హసీనా కుటుంబం పొందిన ఆశ్రయం పూర్తిగా రహస్యంగా ఉంచారు. కానీ, షేక్ హసీనా కుటుంబం దిల్లీలో ఉన్న సంగతి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసు.

భారత్‌కు బంగ్లాదేశ్ రాయబారి అయిన షంసుర్ రెహమాన్, ఆయన భార్యతో పాటు 1976 మే నెల చివరిలో షేక్ హసీనా, ఆమె చెల్లెల్లు రెహానాను దిల్లీలో వారుంటున్న నివాసంలో కలిశారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు వారిని పట్టుకుని గట్టిగా ఏడ్చారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా

షేక్ రెహానా ఆ సమయంలో సీనియర్ సెకండరీ స్కూల్‌కు హాజరు కావాల్సి ఉంది. కానీ, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆ పరిణామాలతో రెహానా తన చదువులను మధ్యలో ఆపేశారు.

జూలై 1976లో శాంతినికేతన్‌లో ఆమెను అడ్మిట్ చేసే ఏర్పాట్లు చేశారు. కానీ, భద్రతపరంగా ఆమెకున్న ముప్పును ఊహించి, ఆ ప్లాన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఆ తర్వాత జూలై 24, 1976లో షేక్ రెహానా లండన్‌లో షాఫిక్ సిద్దిఖీని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి హసీనా, ఆమె భర్త హాజరు కాలేదు.

ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తరచూ షేక్ హసీనా, ఆమె కుటుంబంతో సంప్రదింపులు జరిపేవారు. ప్రణబ్ ముఖర్జీ అధికారిక నివాసంలో హసీనా పిల్లలు ఆడుకునే వారు.

‘‘రెండు కుటుంబాలకు చెందిన వారు తరచూ కలుసుకోవడమే కాదు, దిల్లీ బయటకు పిక్‌నిక్స్‌కు కూడా వెళ్లేవారు’’ అని ‘ది డ్రమాటిక్ డికేడ్’ అనే ఆటోబయోగ్రఫీలో ప్రణబ్ ముఖర్జీ రాశారు.

ప్రణబ్ ముఖర్జీ, షేక్ హసీనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రణబ్ ముఖర్జీ

ఆ తర్వాత 1977లో భారత్‌లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయింది. కొత్త ప్రధానమంత్రిగా ‘మొరార్జీ దేశాయ్’ పదవిలోకి వచ్చారు. ‘రా’ కార్యకలాపాలపై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు.

‘‘ఆగస్ట్ 1977లో షేక్ హసీనా, డాక్టర్ వాజెద్‌లు మొరార్జీ దేశాయ్‌ను కలిశారు. రెహానాను దిల్లీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని కోరారు’’ అని ఎంఏ వాజెద్ మియా తన పుస్తకం ‘బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్‌’ లో రాశారు.

రెహానాను దిల్లీకి తీసుకొచ్చేందుకు మొరార్జీ దేశాయ్ ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 1977లో రెండో వారంలో రెహానా దిల్లీ వచ్చారు. పండారా పార్కులో షేక్ హసీనా ఫ్లాట్‌లో ఉన్నారు.

ఆ తర్వాత మెల్లగా హసీనాకు కల్పించే భద్రతలో తమ ప్రమేయాన్ని మొరార్జీ దేశాయ్ తగ్గించేశారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, PIC COURTESY- SIRAJUDDIN AHMED

‘‘వారికి వారే భారత్ విడిచి వెళ్లాలనే ఒత్తిడి డాక్టర్ వాజెద్, హసీనాలపై పెరిగింది’’ అని సిరాజుద్దీన్ అహ్మద్ రాశారు.

తొలుత వారి ఫ్లాట్‌కు అందిస్తున్న కరెంట్ బిల్లు చెల్లింపులను ఆపేశారు. తర్వాత వాహన సౌకర్యాన్ని వెనక్కి తీసుకున్నారు. డాక్టర్ వాజెద్ తన ఫెలోషిప్‌ను మరో ఏడాది పాటు పొడిగించాలని అటమిక్ ఎనర్జీ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, మూడు నెలలైనా ఎలాంటి స్పందనా రాలేదు. ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

చివరికి మొరార్జీ ఆదేశాలతో కేవలం మరో ఏడాది పాటు ఆయన ఫెలోషిప్‌ను పొడిగించారు. జనవరి 1980లో తిరిగి ఇందిరా గాంధీ అధికారంలోకి రాగానే.. షేక్ హసీనా ఎదుర్కొంటున్న సమస్యలన్ని తీరిపోయాయి.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఆ తర్వాత ఏప్రిల్ 4, 1980లో షేక్ హసీనా తన పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటున్న తన చెల్లెలు రెహానాను కలిసేందుకు వెళ్లారు. ఢాకాకు వెళ్దామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.

ఢాకాకు వెళ్లాలని షేక్ హసీనాకు ఉండేది. కానీ, వాజెద్‌కు అది ఇష్టముండేది కాదు. రాజకీయాలకు హసీనా దూరంగా ఉండాలని వాజెద్ కోరుకున్నారు. చివరికి మే 17, 1981లో తన కూతురు, అవామీ లీగ్ నేతలతో కలిసి ఢాకాకు వెళ్లారు.

ఢాకా విమానశ్రయంలో సుమారు 15 లక్షల మంది ఆమెకు స్వాగతం చెప్పారు. ఫిబ్రవరి 1982లో డాక్టర్ వాజెద్ బంగ్లాదేశ్ అటామిక్ కమిషన్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

అటామిక్ కమిషన్ వారు ఉండేందుకు మొహకాళీలో రెండు గదుల ఇల్లు ఇచ్చింది. హసీనా భర్త వాజెద్, పిల్లలతో కలిసి అక్కడే ఉండేవారు.

(గమనిక: ఈ కథనం బీబీసీ తెలుగులో 2024 జనవరి 11న తొలిసారి పబ్లిష్ అయింది. బంగ్లాదేశ్‌లో పరిణామాలు,షేక్ హసీనాకు మరణశిక్ష నేపథ్యంలో మరోసారి ‘బీబీసీ తెలుగు’ పాఠకుల కోసం అందిస్తున్నాం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)