రొమాంటిక్ రిలేషన్‌షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విలియం పార్క్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అనే నానుడి వినే ఉంటారు.

ఇతరుల నుంచి గౌరవమర్యాదలు పొందడంలో ఎంత అందంగా కనిపిస్తున్నామనేది ముఖ్యమైనప్పటికీ, వ్యక్తిత్వం కూడా అందులో కీలకపాత్ర పోషిస్తుంది.

సాధారణంగా, బయటికి ఎలా కనిపిస్తున్నామనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. రూపాన్ని బట్టి అవతలివారిపై వెంటనే ఒక అంచానకు వచ్చేస్తుంటాం.

ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందడంలో రూపం కీలకమైనప్పటికీ, వ్యక్తిత్వం కూడా ప్రధానం.

ఇతరులు కోరుకునే లక్షణాల ర్యాంకింగ్స్‌లో రూపానికి ఇచ్చే ప్రాధాన్యత మధ్యస్తంగా ఉంది. అంటే, అదే అన్నింటి కంటే ప్రధానమైనదీ కాదు, అలాగని అన్నింటికంటే చివరి ప్రాధాన్యం కూడా కాదు. సొంత ఇల్లు ఉండడం, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వంటి విషయాలకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని సర్వే చెబుతోంది.

అలాగే, తెలివితేటలు, చురుకుదనం, అర్థం చేసుకోగలగడం వంటి లక్షణాలు భౌతికంగా కలిగే ఆకర్షణ కంటే ముందున్నాయి. పురుషులు, మహిళలు, భిన్న లింగ సంపర్కులు తమ భాగస్వాముల్లో ఇవే చూస్తున్నారు.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

భాగస్వామిలో ఏం ఉండాలని కోరుకుంటాం?

ఇలాంటి సర్వేల్లో పాల్గొన్నవారు తాము మంచిగా కనిపించాలనే ఉద్దేశంతో సమాధానాలు ఇచ్చే అవకాశం ఉందని, ఇది ఫలితాలను తారుమారు చేయగలదని అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ గ్రెగ్ వెబ్‌స్టర్ అన్నారు.

సర్వేల్లో పాల్గొనేవారు చెప్పే సమాధానాలు ఫలితాలను తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నప్పటికీ, తాము రూపం కంటే తెలివితేటల వంటి లక్షణాలకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతారు.

కానీ, నిజజీవితంలో భాగస్వామిని ఎంచుకునేటప్పుడు రూపం కంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా?

డేటింగ్ యాప్ 'సో సింక్‌డ్'‌లో వ్యక్తిత్వ లక్షణాలను కొలిచేందుకు సైకోమెట్రిక్ టెస్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తాము రూపం కంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఈ యాప్ సహ వ్యవస్థాపకులు(కో ఫౌండర్) జెస్ అల్డర్సన్ చెప్పారు. వెయ్యికి పైగా యాప్ వినియోగదారుల డేటా ప్రకారం, అందులో దాదాపు 90 శాతం మంది అందం కంటే వ్యక్తిత్వాన్నే ఇష్టపడుతున్నారని ఆయన బీబీసీ ఫ్యూచర్ వెబ్‌సైట్‌తో చెప్పారు.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

ఐదు ప్రాథమిక లక్షణాలు

వాస్తవానికి, ఒకరి వ్యక్తిత్వాన్ని కొలవడమనేది చాలా సంక్లిష్టమైన విషయం. సాధారణంగా సైకియాట్రీలో సైకోమెట్రిక్ టెస్టులు, ప్రశ్నపత్రం వంటి వాటి ఆధారంగా వ్యక్తిత్వాన్ని కొలుస్తారు. (పార్టీలో నేనే ప్రధాన ఆకర్షణ, వంటి వాక్యాలతో ఇలాంటి పరీక్షల్లో వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.)

సైకాలజిస్టులు 'బిగ్ ఫైవ్' టెస్టు కూడా చేస్తుంటారు. ఇది మనుషుల్లోని ఐదు లక్షణాలను అంచనా వేస్తుంది. కొత్త విషయాలపై నిజాయితీగా ఉండడం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకోవడం, చురుకుదనం, అర్థం చేసుకోవడం, ప్రతికూల భావోద్వేగాలను ఇందులో పరీక్షిస్తారు. ఈ ఐదు లక్షణాలను అత్యంత సాధారణ లక్షణాలుగా పరిగణిస్తారు.

అయితే, ఈ బిగ్ ఫైవ్ పరీక్షపై విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఐదు విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసే అవకాశం లేదని, అది చాలా తక్కువ అవగాహన మాత్రమే కల్పిస్తుందని వెబ్‌స్టర్ చెప్పారు.

సైకోమెట్రిక్ టెస్టుల ఫలితాలు కచ్చితమైన వివరాలు ఇవ్వకపోయినా, అవి వ్యక్తుల మధ్య సారూప్యతలను, వ్యత్యాసాలను చూపుతాయి.

ఇది వ్యక్తిత్వం గురించి లోతైన అవగాహన కల్పించగలదు. వ్యక్తిత్వాన్ని తెలిపే కొన్ని అంశాలు శాశ్వత సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ఉత్తమ సంకేతాలుగా చెప్పొచ్చు.

బిగ్ ఫైవ్ టెస్టులోని 'అర్థం చేసుకునేతత్వం' అవతలి వారు మనపై ఎంత శ్రద్ధ చూపుతారనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇతరులతో ఎంత కలిసిపోగలరో కూడా అంచనా వేస్తుంది. ఇది తమ భాగస్వామిని ప్రాథమికంగా అంచనా వేసేందుకు భాగస్వాములు(ఆడ, మగ, ఇతర జెండర్స్) ఇద్దరిలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.

భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఉంటారా, లేక విడిపోతారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన అంచనా ఇది. భాగస్వాములు ఇద్దరిలోనూ శారీరకంగా కలిగే ఆకర్షణ మానసికంగా దగ్గర చేయడంతో పాటు, వారిలో శాశ్వతంగా కలిసి ఉండే కోరికను అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

ఆకర్షణకు అసలు సూత్రమేంటి?

మంచిగా ఉండడమనేది ఎక్కువ కాలం కలిసి ఉండేందుకు చాలా అవసరమని వెబ్‌స్టర్ చెప్పారు. ''దయ, మర్యాద, స్నేహపూర్వకంగా ఉండడమనేవి అతి ముఖ్యమైనవి'' అని ఆయన అన్నారు. దయాదాక్షిణ్యాలు లేని వ్యక్తితో రిలేషన్‌షిప్ కారణంగా సమస్యలు తలెత్తొచ్చు.

''మన వ్యక్తిత్వంపై, ఇతరుల వ్యక్తిత్వాలపై మనకు కలిగే ఆలోచన, మన దృక్పథంపైనే ఆధారపడి ఉంటుంది'' అన్నారు వెబ్‌స్టర్.

ఉదాహరణకు, ''దయాగుణం ఉన్న వ్యక్తులు ఇతరులతో ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. తమలాంటి లక్షణాలు ఉన్న వారిపట్ల వెంటనే ఆకర్షితులవుతారు. మనలాంటి లక్షణాలున్న వ్యక్తులతో మనం త్వరగా కలిసిపోగలం'' అన్నారు.

ఒక వ్యక్తికి శారీరకంగా, జన్యుపరంగా ఇతరులతో ఎంత సారూప్యత ఉంటుంది, ఇతరులతో ఎంత సన్నిహితంగా ఉంటారనే లక్షణాలు కూడా ముఖ్యమైనవని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజిస్ట్ సుసాన్ స్ప్రెచర్ అన్నారు.

'బిగ్ ఫైవ్' టెస్టులో సారూప్యతలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు సమస్యల పరిష్కారం, రోజువారీ వ్యవహారాల్లో మెరుగ్గా ఉన్నారు.

మనకు ఎలాంటి వారు నచ్చుతారు, వ్యక్తిత్వ లక్షణాలు, వారి రూపం, చుట్టూ ఉన్న వారితో కలిసిపోవడం వంటివి ఆకర్షణకు ప్రాథమిక సూత్రాలని మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన ఎలెన్ బెర్షీడ్, న్యూయార్క్‌లోని రోచెస్టర్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ హ్యారీ రీడ్ చెప్పారు.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

కొద్దిగా సున్నితత్వం, కొద్దిగా ఆధిపత్యం

రిలేషన్‌షిప్స్‌లో ఇద్దరి మధ్య ఉండే సారూప్యత, వారిలోని ఇతర ఆకర్షణీయ లక్షణాలతో కలిసి ఉంటుందని వెబ్‌స్టర్ చెప్పారు.

అర్థం చేసుకోగలిగిన వ్యక్తిత్వం ఉన్నవారిపై సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల కలిగే ప్రభావాలపై సామాజిక మనస్తత్వవేత్తలు ఏంజెలా బ్రయాన్, అమండా మహఫేతో కలిసి వెబ్‌స్టర్ అధ్యయనం నిర్వహించారు.

అందులో మూడు రకాల ఆధిపత్యాలు బావుంటాయి. ఆహారం, కనీస అవసరాలు వంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదన్న భావన వంటి వాటితో పాటు విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన ఇతర అవసరాల వంటి విషయాల్లో బావుంటుంది. అయితే, ఇదే ఆధిపత్యాన్ని మంచిగానూ, చెడుగానూ ఉపయోగించే అవకాశం ఉంది.

రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

మనం ఏం చూస్తాం?

''ఆధిపత్యం రిలేషన్‌షిప్‌ను బలంగా, లేదా బలహీనంగా చేయగలదని అనిపిస్తుంది" అని వెబ్‌స్టర్ అన్నారు.

''సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా బలంగా ఉన్నవారు కావాలని కోరుకుంటారు. కానీ, తమతో అలా ఉండకూడదని అనుకుంటారు'' అన్నారాయన.

''ఇతరులపై ఆధిపత్యం చెలాయించే వారి కోసం చూస్తుంటారు. కానీ, తమపై ఆధిపత్యం చెలాయించే వారి కోసం కాదు.''

భాగస్వామిని వెతుక్కునే క్రమంలో సామరస్యం, అర్థం చేసుకునేతత్వం అన్నింటికంటే కీలకపాత్ర పోషిస్తాయని వెబ్‌స్టర్ చెప్పారు.

దయతో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)