భారత్-మాల్దీవుల వివాదం: ఇండియాకు సాయంగా లక్షదీవుల్లో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది?

భారత్, మాల్దీవులు, లక్షద్వీప్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాటర్ డీశాలినేషన్ టెక్నాలజీ -ఫైల్ ఫోటో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవులకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజాగా భారత్-మాల్దీవుల మధ్య వివాదంలో తాజాగా ఇజ్రాయెల్ కూడా చేరింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేతిలో ఒక తోలుబొమ్మ అని ఆ మంత్రి అన్నారు. ఇజ్రాయెల్‌, మాల్దీవుల మధ్య దౌత్యసంబంధాలు లేవు.

మాల్దీవులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1965 నుంచి 1974 వరకు ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత అవి నిలిచిపోయాయి.

ఈరోజుకి కూడా ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడలేదు. కానీ, ఇజ్రాయెల్ నుంచి మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్దం మొదలైన తర్వాత పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవుల్లో ప్రదర్శనలు జరిగాయి. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఈ యుద్దం మొదలైంది.

మాల్దీవులకు ఇజ్రాయెల్ టూరిస్టులు రాకుండా ఆపేయాలంటూ నిరసకారులు డిమాండ్ చేశారు.

భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ, తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సోమవారం లక్షద్వీప్ అందాలను వర్ణిస్తూ ఫోటోలను షేర్ చేయడంతో భారత్- మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదంలోకి ఇజ్రాయెల్ చేరినట్లయింది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, @ISRAELININDIA

ఇజ్రాయెల్ ఏం చెప్పింది?

సోమవారం లక్షద్వీప్ ఫోటోలను షేర్ చేస్తూ, గత ఏడాది తమ బృందం ఒకటి అక్కడికి వెళ్లిందని భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్‌లో పేర్కొంది.

‘‘డీశాలినేషన్ ప్రాజెక్టు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం మేం లక్షద్వీప్‌కు వెళ్లాం. ఈ ప్రాజెక్టుపై పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు లక్షద్వీప్ అద్భుత అందాలను చూడనివారి కోసం ఇక్కడ ఫొటోలను షేర్ చేస్తున్నాం’’ అంటూ ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్‌ చేసింది.

ఇజ్రాయెల్ ఇండియా

ఫొటో సోర్స్, @IsraelIndia

ప్రధాని మోదీపై మాల్దీవులు మంత్రి చేసిన కామెంట్ల తర్వాత సోషల్ మీడియాలో లక్షదీవుల ఫోటోలు వైరల్ కావడం మొదలైంది.

మాల్దీవులకు బదులుగా దేశంలోని లక్షదీవుల అందాలను చూడటానికి వెళ్లాలంటూ చాలా మంది ప్రముఖులు పిలుపునిచ్చారు.

భారత్‌తో నెలకొన్న వివాదంతో పర్యాటక రంగం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాల్దీవుల ప్రజలు భయపడుతున్నారు.

నిజానికి లక్షద్వీప్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువ. దీనికి కారణం సులువైన ప్రయాణ మార్గాలతో పాటు మౌలిక సదుపాయాలు లేకపోవడం.

ఈ దిశగా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుంది. లక్షద్వీప్‌లో ఒక కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఒక నివేదిక పేర్కొంది.

ఇజ్రాయెల్ ఎంబసీ ట్వీట్ తర్వాత లక్షద్వీప్‌లో ప్రతిపాదిత మౌలిక సదుపాయాలపై చర్చ మొదలైంది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ ప్రస్తావించిన ఆ టెక్నాలజీ ఏంటి?

లక్షద్వీప్‌లో డీశాలినేషన్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ట్వీట్‌లో ఇజ్రాయెల్ పేర్కొంది.

సులువైన పదాల్లో చెప్పాలంటే, ఉప్పు నీటి నుంచి లవణాలు, ఖనిజాలను తొలగించి తాగునీటిగా మార్చే ప్రక్రియను డీశాలినేషన్ అంటారు.

డీశాలినేషన్ చేసిన నీటిని తాగడానికి ఇతర అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి కొరత ఉంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, ప్రపంచంలోని 200 కోట్ల మందికి శుభ్రమైన తాగునీరు అందుబాటులో లేదు.

సముద్రపు నీటిలో ఉప్పు సాంద్రత 35,000 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది.

డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా దాన్ని 10పీపీఎంకు తగ్గించవచ్చు. ఇలా చేసిన నీటిని తాగడానికి అనువైనదిగా పరిగణిస్తారు.

ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో కేవలం డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా అందుబాటులో ఉన్న తాగునీరు ఒక శాతం మాత్రమే.

లక్షద్వీప్ అనేది చిన్న దీవుల సమూహం. అక్కడ మంచినీటి సమస్య సర్వసాధారణం. ఉప్పునీటిని తియ్యగా మార్చే టెక్నాలజీలో ఇజ్రాయెల్‌కు నైపుణ్యం ఉంది.

డీశాలినేషన్ ప్రక్రియను ఇజ్రాయెల్ 50 ఏళ్లుగా వాడుతోంది. సముద్రతీరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌కు 5 డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

2019 వరకు ఇజ్రాయెల్ 70 శాతం నీటి అవసరాల్ని డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా తీర్చుకుంది. 25 శాతం తాగునీరు కూడా ఈ ప్రక్రియ ద్వారానే వస్తుంది.

డీశాలినేషన్ మాత్రమే కాకుండా మురుగునీటి శుద్ధిలో కూడా ఇజ్రాయెల్ విజయవంతమైంది.

అక్కడ మురుగునీటి రీసైక్లింగ్‌ రేటు 90 శాతానికి చేరుకుంది. రీసైక్లింగ్ చేసిన ఈ నీటిని వ్యవసాయం, ఇతర రోజువారీ అవసరాలకు వాడతారు.

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, 80 శాతం వృథా నీరు మళ్లీ పర్యావరణంలోకే చేరుతోంది.

వ్యర్థ జలంలోని ప్రతీ నీటిబొట్టును వాడుకునేందుకు అనువుగా మార్చి మురుగునీటి శుద్ధి, నిర్వహణలో ఇజ్రాయెల్ అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది.

సరైన నిర్వహణ, సాంకేతికత ద్వారా నీటి కొరతను అధిగమించవచ్చని ఇజ్రాయెల్ చెబుతోంది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

సవాళ్లు

ప్రతీ టెక్నాలజీలో కొన్ని నిర్దిష్ట లోపాలు ఉంటాయి. డీశాలినేషన్ ప్రక్రియ ఇందుకు మినహాయింపు కాదు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా 100 బిలియన్ లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుంది. కానీ, ఈ ప్రక్రియతో అదే స్థాయిలో ఉప్పు నీరు కూడా మిగిలిపోతుంది.

ఇలా మిగిలిన నీటిని మళ్లీ సముద్రంలోకే చేర్చడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడొచ్చు. నిజానికి ఈ నీటిని తిరిగి వాడుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.

డౌన్ టు ఎర్త్ వెబ్‌సైట్ ప్రకారం, డీశాలినేషన్ ప్రక్రియకు సంబంధించి రెండో సవాలు ఏంటంటే ఇది చాలా ఖరీదైనది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది.

డబ్బు ఉండటం, లేబర్‌కు ఖర్చు తక్కువ కావడం కారణంగా ఈ టెక్నాలజీలో ఇజ్రాయెల్‌ విజయవంతమైందని, ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండకపోవచ్చని నీటి పరిశ్రమ నిపుణుడు క్రిస్టోఫర్ గాసన్ చెప్పారు.

ఇంధన వినియోగం మరో పెద్ద సవాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియకు చాలా విద్యుత్‌ను వినియోగిస్తారు. ఇజ్రాయెల్ 10 శాతం విద్యుత్‌ను ఈ ప్రక్రియ కోసమే వినియోగిస్తుంది.

డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయిన నీటి విషయంలో కూడా ఆందోళనలు ఉన్నాయి. యునెస్కో ప్రకారం, డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయిన నీటిలో మెగ్నీషియం లోపం ఉంది. మన రోజువారీగా తీసుకునే ఆహారంలో మెగ్నీషియం చాలా కీలకం.

మెగ్నీషియం లోపం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని యునెస్కో చెబుతోంది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో డీశాలినేషన్ ప్లాంట్

2010లో భారత్‌లో తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ నెలకొల్పారు. తమిళనాడులోని మింజుర్‌లో దీన్ని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం భారత్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు పెద్ద డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన నాలుగో రాష్ట్రం మహారాష్ట్ర.

భారత్‌లోని పెద్ద నగరాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఇప్పుడు సాధారణంగా మారింది.

మింజుర్‌లో ఏర్పాటు చేసిన తొలి డీశాలినేషన్ ప్లాంట్, చెన్నైలోని అయిదు లక్షల మందికి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.

మహారాష్ట్రలో నిర్మిస్తోన్న ప్లాంట్‌తో ముంబయికి మంచి నీరు అందుతుంది. దేశంలోని రెండో అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. మరో 8 ప్లాంట్లను నిర్మించాలని గుజరాత్ అనుకుంటోంది.

అయితే, లక్షద్వీప్‌లో ఏ రకమైన డీశాలినేషన్ ప్లాంట్‌ను నిర్మించాలని అనుకుంటుందో ఇజ్రాయెల్ ఇంకా వెల్లడించలేదు.

వీడియో క్యాప్షన్, లక్షదీవుల్లో పెరిగిన టూరిస్టుల సందడి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)