ఫిటో జైలు నుంచి తప్పించుకుంటే దేశంలో ఎమర్జెన్సీ, నగరాల్లో కర్ఫ్యూ... ఇంతకీ ఎవరీ గ్యాంగ్‌స్టర్?

ఈక్వెడార్

ఫొటో సోర్స్, ECUADORIAN ARMED FORCES

ఫొటో క్యాప్షన్, నిరుడు అత్యంత భద్రత ఉన్న మరో జైలుకు తరలిస్తుండగా ఫిటో ఇలా కనిపించారు
    • రచయిత, క్రిస్టినా జె. ఆర్గాజ్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

లాస్ చోనెరోస్ అన్నది ఓ క్రిమినల్ గ్యాంగ్. అది ఈక్వెడార్‌లోని అత్యంత డేంజరస్ నేర ముఠాల్లో ఒకటి. ఈ గ్యాంగ్‌ లీడర్ అడాల్ఫో మసియాస్ విల్లారమర్ అలియాస్ ఫిటో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆయన జైలు నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు.

మత్తుపదార్థాల రవాణా, హత్య, వ్యవస్థీకృతనేరాల్లో ఫిటోకు 2011లో 34 ఏళ్ల జైలు శిక్ష పడింది. లిటోరల్ డి గ్వయాకిల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు ఫిటో.

స్థానిక మీడియా ప్రకారం, ఆదివారం అత్యంత పటిష్ట భద్రత ఉండే మరో జైలుకు తరలించడానికి అతని వద్దకు ఆర్మీ వెళ్లడానికి ముందు 44 ఏళ్ల ఫిటో స్పృహ కోల్పోయారు. తర్వాత అదృశ్యమయ్యారు. ఆయన కోసం 3 వేలకు పైగా పోలీసు అధికారులు వెదికారు. జైళ్లోని పైకప్పులు, మురికి కాలువలను కూడా వారు వదల్లేదు.

ఫిటో పారిపోయాడని అధికారులు నిదానంగా గుర్తించారు. వారు తొలుత ఫిటో జైలు లోపలే దాక్కొని ఉండే అవకాశముందని అనుకున్నారు.

జైళ్లలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థ ‘ఎస్ఎన్ఏఐ’ ఒక ప్రకటన విడుదల చేసింది.

మసియాస్ అలియాస్ ఫిటో పారిపోవడం గురించి ఫిర్యాదు నమోదు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫిటో పారిపోవడానికి సంబంధం ఉందంటూ ఇద్దరు జైలు గార్డుల మీద ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది.

ఫిటో పారిపోవడం, తదనంతరం పలు జైళ్లలో చెలరేగిన అల్లర్ల కారణంగా దేశంలో 60 రోజుల అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు సోమవారం ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా ప్రకటించారు.

ఆ తర్వాతి రోజు నోబోవా దేశంలో అంతర్గత సాయుధ సంఘర్షణ ఉందని పేర్కొంటూ వీధుల్లో శాంతిభద్రతల్ని పునరుద్ధరించాలని ఆర్మీని ఆదేశించారు.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే పలు ముఠాలను ఆయన టెర్రరిస్టులుగా పేర్కొన్నారు. అందులో లాస్ చోనెరోస్ ముఠా కూడా ఉంది.

గ్వయాకిల్‌లోని ఒక టీవీ స్టేషన్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా తుపాకులతో దుండగులు ప్రవేశించినట్లు వార్తలు వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత ఆయన పై ప్రకటనను విడుదల చేశారు.

లాస్ చోనెరోస్ ముఠా మీద డ్రగ్ అక్రమరవాణాతో పాటు కాంట్రాక్టు హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈక్వెడార్

ఫొటో సోర్స్, ECUADORIAN ARMED FORCES

ఫొటో క్యాప్షన్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేయడమే కాకుండా వాటి ఉత్పత్తి, సరఫరాకు కూడా ఈక్వెడార్ కేంద్రంగా మారింది.

నేరస్థుల చోటు

‘‘అమెరికా, యూరప్‌కు కొకైన్ రవాణాలో కొంతకాలంగా ఈక్వెడార్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. కోకా ఆకులు ఉత్పత్తి చేసే కొలంబియాలోని ప్రాంతంతో ఈక్వెడార్ సరిహద్దును పంచుకుంటుంది’’ అని బీబీసీతో నేషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఫర్ అర్జెంటీనా రీసెర్చర్, డాక్టర్ కరోలినా సంపో చెప్పారు.

‘‘ఇంకా వీటికి అదనంగా ప్రభుత్వ బలహీనత, ప్రభుత్వ సంస్థల వనరుల లేమి కారణంగా అక్రమ కార్యకలాపాలకు ఈక్వెడార్ కేంద్రంగా మారింది. ఇవన్నీ నేర సంస్థలు కోరుకునే ప్రదేశంగా ఈక్వెడార్‌ను మార్చాయి’’ అని కరోలినా వివరించారు.

పర్యవసానంగా కొన్నేళ్లుగా ఈక్వెడార్ హింసాత్మక ఘటనలతో బాధపడుతోంది.

గతేడాది కొలంబియాలో ముఠా నాయకుడు జూనియర్ రోల్డన్ మరణించినట్లు ఈక్వెడార్ అధికారులు ధ్రువీకరించిన తర్వాత ఫిటో తదుపరి నాయకుడు అయ్యారు.

ఫిటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిటోను పట్టుకునే ఆపరేషన్ కొనసాగుతోంది

తప్పించుకోవడం తొలిసారేం కాదు

అడాల్ఫో మసియాస్ జైలు నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు.

2013లో గ్వయాకిల్ లా రొకాలోని అత్యంత పటిష్ట భద్రత కలిగిన జైలు నుంచి ఇతర అత్యంత ప్రమాదకర ఖైదీలతో కలిసి ఫిటో పారిపోయాడు. అప్పటికి అతను రెండేళ్లు జైలులో గడిపారు.

జైలుకు సమాంతరంగా ప్రవహించే డౌల్ నదిలో పడవ నడుపుకుంటూ అతను పారిపోయాడు.

మూడు నెలల తర్వాత పోలీసులు మళ్లీ అతన్ని అదుపులోకి తీసుకొని జైల్లో వేశారు.

గ్వయాకిల్ జైల్లో ఉన్న సమయంలో ఫిటో తన న్యాయవాద డిగ్రీని అందుకోవడమే కాకుండా, మాదకద్రవ్యాల రవాణా, దోపిడీ, హత్యలకు ఆదేశించినట్లు స్థానిక మీడియా ప్రిమిసియాస్ పేర్కొంది.

2023 మే నాటికి ఫిటో వద్ద షెల్ కంపెనీలు, ఇతర కార్యకలాపాల ద్వారా లభించిన సొమ్ము రూ. 190 కోట్ల(23 మిలియన్ డాలర్ల)కు పైగా ఉందని ప్రిమిసియాస్ వార్తా పత్రిక స్పష్టం చేసింది.

ఫిటో నాయకత్వంలో అతని ముఠా సభ్యులు జైల్లోని ఇతర ఖైదీలను దోపిడీ చేస్తారని పేర్కొంది.

జైలులో నిర్వహించే నేర కార్యకలాపాల ద్వారా ఒక బోను నుంచి వారానికి రూ. 5.81 లక్షలు (7 వేల డాలర్లు) వస్తాయని యాంటీ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ గణాంకాలను ఉటంకిస్తూ ప్రిమిసియాస్ అంచనా వేసింది.

ఫిటో

ఫొటో సోర్స్, Getty Images

పార్టీలు, దోపిడీలు

జైలులో ఫిటో పార్టీలు చేసుకోవడంతోపాటు వీడియోలు తీయడం, విలేఖరుల సమావేశాల్లో పాల్గొనడం, డ్రోన్లతో కూడిన ఆయుధాలను పరిచయం చేశాడని ఫిటోతో పాటు జైలులో ఉన్న ఒక ఖైదీ ధ్రువీకరించారు.

గత సెప్టెంబర్‌లో చివరిసారిగా ఫిటో కనిపించారు. ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో హత్య అనంతరం గ్వయాకిల్‌లోని అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న జైలుకు తరలించే సమయంలో ఆయన కనిపించారు.

ఆ తర్వాత బయటకు వచ్చిన ఫొటోల్లో ఆయన ఊబకాయంతో, పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించారు.

ఫిటోను జైలుకు తరలించే ఆపరేషన్‌లో వేలాదిమంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు గిలెర్మో లాసో నిర్వహించిన అతిపెద్ద మిలిటరీ, పోలీసు ఆపరేషన్లలో ఒకటిగా ఇది నిలిచింది.

ఫిటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జైల్లో 3 వేల మంది భద్రతా బలగాలు ఫిటో కోసం వెదికారు

ఆరు జైళ్లలో అల్లర్లు

ఫిటో తప్పించుకున్న సమయంలోనే ఈక్వడార్‌లో కనీసం ఆరు జైళ్ళల్లో తీవ్రమైన అల్లర్లు జరిగాయి. ఖైదీలు చాలా మంది గార్డులను బందీలుగా పట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దాంతో, దేశాధ్యక్షుడు డానియెల్ నోబోవా 60 రోజుల పాటు ప్రత్యేక పరిస్థితి విధించాల్సి వచ్చింది.

అంటే, ఈ పరిస్థితుల్లో పరిరక్షణకు పోలీసులకు అండంగా సైనిక బలగాలు రంగంలోకి దిగుతాయి. జైళ్ళతో పాటు అన్ని చోట్లా శాంతిభద్రతలు కాపాడే పనిని సైన్యం చూసుకుంటుంది.

దీనికితోడు, చాలా నగరాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

గత ఏడాది నవంబర్‌లో అధికారంలోకి వచ్చిన నొబోవా దేశభద్రతకు సంబంధించి సరికొత్త నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, భద్రతాదళాలకు వ్యూహాత్మక ఆయుధాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రమాదకర ఖైదీలను తాత్కాలికంగా జైలు నౌకల్లో బంధించే ప్రణాళిక కూడా ఉందని చెప్పారు.

ఈక్వెడార్ జైళ్ళల్లో 2021 నుంచి జరిగిన ముఠా కలహాలకు 400 మందికి పైగా చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)