INDvsAFG: ఇషాన్ కిషన్‌కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా

ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇషాన్ కిషన్ జట్టులో లేకపోవడానికి గల కారణాన్ని జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించారు.

అఫ్గానిస్తాన్‌, భారత్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభమైంది.

ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు లేకపోవడానికి కారణం.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడమేనంటూ వస్తున్న మీడియా కథనాలను టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు.

ఏడాదిగా జట్టులో ఉన్న ఇషాన్ కిషన్‌కు అఫ్గానిస్తాన్‌తో ఆడే టీ20 సిరీస్‌లో స్థానం లేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు.

బుధవారం ఈ విషయమై జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టతనిచ్చాడు. దక్షిణాఫ్రికా టూర్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషాన్ తనకు మానసిక అలసట ఉందని, విరామం కావాలని కోరాడని, అతడి అభ్యర్థనను జట్టు యాజమాన్యం ఆమోదించిందని తెలిపాడు.

టీ20 సిరీస్‌కు ఎంపిక ప్రక్రియకు అతడు దూరంగా ఉన్నాడని, కోలుకున్నాక అతడే తిరిగి వస్తాడని అన్నారు.

రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, "ఇది క్రమశిక్షణ చర్య కాదు" అని స్పష్టం చేశారు. సెలక్షన్ సమయంలో కూడా అతడు అందుబాటులో లేడని తెలిపారు.

ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Getty Images

అసలేమైంది?

ఇషాన్ కిషన్‌తోపాటు శ్రేయస్‌ను ఎంపిక చేయకపోవడంపై ద్రవిడ్ స్పందిస్తూ, "అతడిపై కూడా క్రమశిక్షణ చర్యలేవీ తీసుకోలేదు. కేవలం అతనొక్కడే కాదు, చాలామంది బ్యాటర్లకు జట్టులో చోటు లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా శ్రేయస్‌ ఆడలేదు. ప్లేయర్లందరికీ జట్టులో స్థానం కల్పించడం సాధ్యం కాదు కదా" అన్నారు.

శ్రేయస్ గురించి మాట్లాడుతూ, "శ్రేయస్ మంచి ప్లేయర్. కానీ, ఎలెవన్ జట్టులో అందరికీ స్థానం కల్పించడం సాధ్యం కాదు. అంతేకానీ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమనే ప్రస్తావనే లేదు" అన్నారు.

జనవరి 12న ఆంధ్రప్రదేశ్, ముంబయి జట్ల మధ్య జరిగే రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున శ్రేయస్ ఆడనున్నాడు.

మొహాలిలో జనవరి 11 నుంచి భారత్, అఫ్గాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలిమ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టీ20 సిరీస్ సందర్భంగా బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ ద్రవిడ్ జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లను ఎంపిక చేసినట్లు తెలిపారు. విరాట్ కోహ్లీకి కూడా జట్టులో స్థానం కల్పించారు. అయితే, గురువారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ పాల్గొనలేదు.

టీమిండియా జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఏడాదిగా జట్టులో ఉన్నా అవకాశం దక్కింది మాత్రం..

ఇషాన్ కిషన్ చాలాకాలంగా టీమిండియా జట్టుతోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. జట్టులో ఉన్నప్పటికీ రెగ్యులర్ ప్లేయర్లు మ్యాచ్‌కు దూరమైన సమయంలోనే ఇషాన్ కిషన్‌కు మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం లభించింది.

తను మ్యాచ్ ఆడే అవకాశం రావడంపై నెలకొన్న అనిశ్చితి, ఇతర కారణాల వల్ల ఇషాన్ కిషన్ కొంతకాలంగా మానసిక అలసట చెందాడని చెప్తున్నారు.

దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ జట్టు నుంచి ఇషాన్ కిషన్ వైదొలగడంతో మానసిక అలసటతో బాధపడుతున్నాడంటూ చర్చ మొదలైంది.

గతేడాది జనవరి 3వ తేదీ నుంచి మొదలుకొని అతడి ప్రయాణం టీమిండియాతో కొనసాగుతూనే ఉంది.

దాదాపు అన్ని ఫార్మాట్‌ల కోసం ఎంపిక చేసి టీమిండియా జట్టులో అతడికి స్థానం లభించినప్పటికీ, ఇన్నింగ్స్ ఆడే అవకాశం మాత్రం అరుదుగా దక్కింది.

గతేడాది వరల్డ్‌కప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

డెంగీ వల్ల జట్టుకు దూరమైన శుభమన్‌ గిల్, తిరిగి రావడంతో ఇషాన్ కిషాన్‌కు అవకాశం మళ్లీ అందలేదు. ఆ సమయంలో వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్న కెఎల్ రాహుల్ బాగా రాణించాడు.

వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం దక్కింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలు సాధించాడు.

ఆ తరువాత ప్రారంభమైన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ టీమిండియా జట్టులో ఇషాన్‌కు చోటుదక్కింది. కానీ, జితేష్ శర్మకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది టీం మేనేజ్మెంట్.

టెస్ట్ సిరీస్‌లోనూ జట్టులో ఉన్నప్పటికీ విరామం కావాలని బీసీసీఐను కోరాడు ఇషాన్.

ఏడాదిగా జట్టులోనే ఉన్నానని, తనకు కాస్త విరామం కావాలని అతడు కోరడంతో బీసీసీఐ అమోదం తెలిపింది.

అంతేకాకుండా సెలక్టర్లను అభ్యర్థించడంతో, జట్టు ఎంపికలో ఆ మేరకు మార్పులు చేశారు.

గతేడాది ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 మధ్య ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టులో ఉన్నాడు ఇషాన్.

టెస్టుల్లో కెఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. మూడు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం వచ్చింది.

ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు ఇషాన్.

ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, Getty Images

డబుల్ సెంచరీతో రికార్డు..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం రెండో వికెట్ కీపర్‌గా ఎంపికై జట్టుతో ఇంగ్లండ్ వెళ్లాడు ఇషాన్ కిషన్.

12 జులై నుంచి 13 ఆగస్టు మధ్య జరిగిన వెస్టిండీస్ టూర్‌కు కూడా ఎంపికై, మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

2021లో ఆరంగ్రేటం చేశాడు ఇషాన్ కిషన్, అప్పటినుంచే రెగ్యులర్ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 27 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వెంటవెంటనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇషాన్‌కు చాలా అరుదుగా దక్కింది. దానితోపాటు జట్టులో అతడి పాత్ర ఎప్పటికప్పుడూ మారుతూ వచ్చింది. కొన్నిసార్లు బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకుంటే, మరికొన్నిసార్లు వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు.

అయితే, టీ20, వన్డే, టెస్ట్ ..ఇలా ఏ ఫార్మాట్‌లో చూసినా అటు వికెట్ కీపర్‌గానూ, ఇటు బ్యాటర్‌గానూ అతడిని తొలి ఎంపికగా ఎప్పుడూ పరిగణించలేదు. ఈ కారణాల వల్లే అతడు మానసిక ఆందోళనతో విరామం కోసం అభ్యర్థించాడు. అవకాశం దక్కకపోయినా ఇషాన్ కిషన్ నిరుత్సాహపడలేదు.

ఓపెనర్‌గా శిఖర్ ధావన్ బరిలోకి దిగి, విజృంభిస్తున్నవేళ, ఇషాన్ కిషన్ కూడా బ్యాటర్‌గా తన సత్తా చూపాడు డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు.

అయినప్పటికీ, ఓపెనర్ స్థానం ఇషాన్‌ కిషన్‌ను వరించలేదు, శిఖర్ ధావన్ స్థానంలోకి శుభ్‌మన్ గిల్ వచ్చాడు. ఫేవరెట్‌గా మారాడు.

మీడియా కథనాల ప్రకారం దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్ దుబాయ్‌లో పార్టీ చేసుకుంటూ కనిపించాడు. ఇది క్రమశిక్షణారాహిత్యంగా చెప్పారు.

అయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం దానిని ఖండించాడు.

కొన్ని మీడియా కథనాల ప్రకారం ప్రపంచ క్రికెట్ కప్ తరువాత ఆస్ట్రేలియాతో ఉన్న టీ20 సిరీస్‌ను ఆడేందుకు ఇషాన్ కిషన్ విముఖత వ్యక్తం చేశాడు. అయితే, అతడి అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించింది.

ప్రయాణాలు చేసి అలసిపోయిన కారణంగా కుటుంబంతో గడిపేందుకు విరామం కావాలని ఇసాన్ కిషన్ కోరినట్లు, కానీ దుబాయ్‌లో పార్టీ చేసుకుంటున్నాడంటూ వార్తలు వచ్చాయి. తన సోదరుడి జన్మదిన వేడుకల కోసం ఇషాన్ కిషన్ దుబయి వెళ్లాడని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)