పోలీసులు సమ్మెలో ఉన్నారని తెలిసి సూపర్ మార్కెట్లను దోచుకున్నారు....

ఘర్షణలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాజధాని పోర్ట్ మోర్స్బీలో నెలకొన్న అల్లర్లలో షాపులు, కార్లను తగలబెట్టారు, సూపర్ మార్కెట్లను దోచుకున్నారు.

పాపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీలో నెలకొన్న పౌర అశాంతి, అల్లర్లలో ఎనిమిది మంది మృతి చెందారు.

జీతాల చెల్లింపుల వివాదంపై పోలీసులు బంద్ నిర్వహిస్తుండటంతో, షాపులు, దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. సూపర్ మార్కెట్లను దొరికిన కాడికి దోచుకున్నారు.

పోర్ట్ మోర్స్బీలో వందలాది మంది బుధవారం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు.

ఈ ఘటనల తర్వాత, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని జేమ్స్ మరాపే, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అసలు సహించేది లేదన్నారు.

‘‘చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల అనుకున్నది సాధించలేరు’’ అని గురువారం చేసిన ప్రసంగంలో అన్నారు.

శాంతి భద్రతను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని మోహరించారు. చాలా అల్లర్లు, నిరసనలు బుధవారం రాత్రి నెలకొన్నాయి.

బయట ఇంకా ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు మరాపే ఒప్పుకున్నారు.

దీన్ని అదునుగా తీసుకున్న అవకాశవాదులు దుకాణాల్లో దొరికిన కాడికి దోచుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు.

పోర్ట్ మోర్స్బీలో దుకాణాలను బద్దలు కొడుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, AFP

‘‘మా నగరంలో అనూహ్య స్థాయిలో పరిణామాలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మా నగరం, మా దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలను మునుపెన్నడూ చూడలేదు’’ అని రేడియో ప్రసంగంలో నేషనల్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పోవెస్ పార్కాప్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.

దురదృష్టవశాత్తు కొంతమంది ఈ ఘర్షణల్లో చనిపోయారని ఆయన ప్రకటించారు. కానీ, ఎంత మంది చనిపోయారో మాత్రం వెల్లడించలేదు.

పోర్ట్ మోర్స్బీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిది చనిపోయినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది.

ఈ ఘర్షణలు రాజధానికి వెలుపల కూడా విస్తరించాయి. లే నగరంలో మరో ఏడుగురు చనిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు.

పాపువా న్యూ గినియాలో రెండో అతిపెద్ద నగరంలో ఏ మేర అల్లర్లు విస్తరించాయన్న దానిపై స్పష్టత లేదు.

పోలీసులు, ఇతర ఉద్యోగుల జీతాలలో 50 శాతం తగ్గుదల కనిపించడంతో, వీరు పార్లమెంట్ బయట నిరసనలకు దిగారు. దీంతో ఈ అల్లర్లు చెలరేగాయి.

కంప్యూటర్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో ఉద్యోగుల వేతనాల నుంచి 100 డాలర్ల(రూ.8,299) వరకు డిడక్ట్ అయినట్లు జేమ్స్ మరాపే చెప్పారు. కొందరు నిరసనకారులు చెబుతున్నట్లు, ప్రభుత్వం పన్నుల పెంపు వల్ల ఇలా జరగలేదని స్పష్టతనిచ్చారు.

‘‘సోషల్ మీడియాలో ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుంది’’ అని మరాపే చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు చేసింది. పోలీసులు చేపడుతున్న ఈ నిరసనలను ప్రజలు అదునుగా తీసుకున్నారు.

నగరంలో పెద్ద ఎత్తున జనాలు గుమికూడటం, దొంగతనాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు టీవీ ఫుటేజీలు చూపిస్తున్నాయి. భవనాల మధ్యనున్న ఒక పెద్ద షాపింగ్ సెంటర్‌ను కూడా తగలబెట్టారు.

సూపర్‌మార్కెట్లను కొల్లగొట్టారు

చైనా రాయబారి కార్యాలయం సైతం ఈ ఘటనలపై పాపువా ప్రభుత్వం వద్ద ఫిర్యాదు చేసింది. పలువురు చైనా వ్యాపారవేత్తలపై దాడులు జరిగాయని, చాలా మంది చైనా దేశస్థులు గాయపడ్డారని తెలిపింది. అయితే, ఎంతమంది గాయాలు పాలయ్యారో తెలుపలేదు.

‘‘చైనా దుకాణాలపై దాడులు జరపడంపై పాపువా న్యూ గినియాలో చైనా రాయబారి కార్యాలయం ఫిర్యాదు దాఖలు చేసింది’’ అని వీఛాట్‌లో ఎంబసీ తెలిపింది.

పాపువా న్యూ గినియా దేశ ప్రజలు శాంతంగా ఉండాలని ఆ దేశానికి కీలక భద్రతా భాగస్వామి, పొరుగు దేశమైన ఆస్ట్రేలియా గురువారం కోరింది.

పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటుతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో.. ప్రధానమంత్రిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

ప్రజల్లో నెలకొన్న అసంతృప్తినే రాజధానిలో బుధవారం చెలరేగిన అల్లర్లకు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజధానిలో 4 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.

‘‘పోర్ట్ మోర్స్బీలో నెలకొన్న ఘటనలు అంతర్గతంగా నెలకొన్న సామాజిక, ఆర్థిక సమస్యలను, ప్రభుత్వంలో పనిచేసే సైన్యం, పోలీసులు, ఇతర ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను బహిర్గతం చేస్తున్నాయి’’ అని పాపువా న్యూ గినియా థింక్ ట్యాంక్ అనలిస్ట్ శామ్సన్ కోమటి ఏబీసీ న్యూస్‌తో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)