హనుమాన్ సినిమా రివ్యూ: సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే...

ఫొటో సోర్స్, HANU MAN
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
తెలుగులో ‘సూపర్‌మ్యాన్’ జోనర్ చిత్రాలు అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా కలసి సూపర్ హీరో సినిమాగా హను-మాన్ తో ప్రేక్షకుల ముందు వచ్చారు.
ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్ ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్ ని సిద్ధం చేశారు.
మరోవైపు పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో నిలిచిందీ సినిమా. ఈ చిత్రానికి తగిన థియేటర్స్ దొరకలేదనే వివాదం కూడా నడిచింది. కంటెంట్ పై నమ్మకంతో సంక్రాంతి రేసులోనే సినిమాను విదుదల చేశారు.
మరి హనుమంతుడి స్ఫూర్తితో రూపొందిన ఈ సూపర్ హీరో చిత్రం పంచిన వినోదాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయా?

ఫొటో సోర్స్, Primeshow Entertainment/YouTube
సూపర్ పవర్స్ కథ
హను-మాన్ ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ సాధారణ కుర్రాడు హనుమంతు( తేజ సజ్జా)కి సూపర్ పవర్స్ వస్తే.. ఏం చేశాడు ? ఎలాంటి శత్రువులని ఎదుర్కొన్నాడు?తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే కథ.
సూపర్ పవర్స్ ను చూపించే సినిమాలన్నీ దాదాపు ఇదే టెంప్లెట్ తో వుంటాయి.
ఈ టెంప్లెట్ ని ఎంత జనరంజకంగా చెప్పామనేదే అసలు పాయింట్.
హనుమాన్ విషయానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ కథకంటూ ఒక ప్రత్యేకమైన ఊహాజనిత ప్రదేశం అంజనాద్రిని సృష్టించాడు.
దీంతో ఈ కథకు ఒక ప్రత్యేకమైన టోన్ సెట్ అయ్యింది.
కథని మొదలుపెట్టిన విధానంగా కూడా ఆసక్తిగానే వుంది.
ప్రతినాయకుడు మైఖేల్ (వినయ్ రాయ్) బాల్యం సన్నివేశాలు, సూపర్ మ్యాన్ అవ్వాలనే అతని ఆకాంక్షలోని తీవ్రతని తొలి సన్నివేశాల్లో ఎస్టాబ్లిస్ చేశాడు. తర్వాత కథ అంజనాద్రికి షిఫ్ట్ అవుతుంది.
హనుమంతుని పాత్ర పరిచయం, అతని చేతివాటం, హనుమంతు అక్క అంజమ్మ( వరలక్ష్మీ శరత్ కుమార్), అంజనాద్రి ఊరు, అక్కడి ప్రజలు.. ఇవన్నీ కథలోకి తీసుకెళతాయి.

ఫొటో సోర్స్, Primeshow Entertainment/YouTube
రుధిరమణి మాయాజాలం అలరించిందా ?
సూపర్ మ్యాన్ కథల్లో కామన్ మ్యాన్ కి సూపర్ పవర్ ఎప్పుడు వస్తాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో వుండాలి.
ఇందులో కూడా ఆ ఆసక్తిని బాగానే కలిగించారు. పోపులు డబ్బా తీయడానికి కూడా గోడ సాయం తీసుకునేంత బలహీనుడు హనుమంతు. అలాంటి వ్యక్తికి రుధిరమణిద్వారా సూపర్ పవర్స్ రావడం, తర్వాత హనుమంతు చేసే విన్యాసాలు.. ముఖ్యంగా పిల్లల్ని బాగా అలరిస్తాయి.
ఈ క్రమంలో తెలుగు మాస్ హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్ ల గురించి వచ్చే సన్నివేశం, అలాగే బాలకృష్ణ ట్రైన్ సీక్వెన్స్ ని ఇమిటేట్ చేసే సీన్ కడుపుబ్బా నవ్వి స్తాయి.
అయితే సూపర్ పవర్ ని యధేచ్చాగా వాడేయకుండా దానికి కొన్ని పరిమితులు పెట్టాడు దర్శకుడు. అవి డ్రామాని సృష్టించడానికి ఉపయోగపడ్డాయి.
తొలి సగంలో రాకేశ్ మాస్టర్, గెటప్ శీను, సత్య చేసే కామెడీ కూడా నవ్వులు పంచుతుంది.

ఫొటో సోర్స్, Primeshow Entertainment/YouTube
రామునికి ఇచ్చిన మాట ఏమిటి?
సూపర్ మ్యాన్ కథల లక్ష్యం ఒక్కటే.. లోక కళ్యాణం. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఈ కథని అటువైపే నడిపాడు. తొలిసగం మంచి పట్టుతో ముందుకు తీసుకెళ్ళాడు.
రెండో సగంలో అసలు కథ మొదలవ్వాలి. అయితే ఇక్కడే కొన్ని ఎత్తుపల్లాలు చోటు చేసుకున్నాయి.
హీరోకి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయానే అనేది తెలుసుకోవడానికే విలన్ కి చాలా సమయం పడుతుంది.
మరోవైపు ఇందులో వున్న ప్రేమకథ అంతగా మెప్పించదు. సరిగ్గా డ్రామా క్రియేట్ కావాల్సిన చోట ఆవకాయ ఆంజనేయ అనే పాట వేశారు.
ఇందులో క్లైమాక్స్. చాలా భారీగా తీశారు. ఒక పెద్ద హాలీవుడ్ సినిమా స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు.
ఇలాంటి వార్ సీక్వెన్స్ తెలుగు తెరకు కొత్తే.
సినిమా క్లైమాక్స్ లో ఒక సర్ ప్రైజ్ వుంది. మంచు కొండల్లో హనుమాన్ పాత్రని ఆవిష్కరించిన విధానం, ఈ కథకు ఒక మార్వల్ సిరిస్ లా రూపొందించడానికి దర్శకుడు దగ్గర వున్న ప్రణాళిక.. క్లైమాక్స్ చూస్తున్నపుడు అర్ధమౌతుంది.
అయితే ఈ కథ వరకూ దీనికో సరైన ముగింపు ఆశిస్తే కొంచెం నిరాశ చెందవచ్చు.
రామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో హనుమా అనే డైలాగ్ తో ముగించారు.
ఆ మాట ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టేశాడు దర్శకుడు.
అలాగే రుధిరమణి హనుమంతుకే ఎందుకు దొరకాలి అనే ప్రశ్నకు ఒక డైలాగుతోనే సర్ది చెప్పారు.
కానీ దాని నేపధ్యాన్ని పూర్తిగా చెప్పకపోవడం కూడా ఒక వెలితిలా అనిపించవచ్చు.

ఫొటో సోర్స్, Primeshow Entertainment/YouTube
ఎవరెవరు ఎలా చేశారు?
తేజ సజ్జ కు కెమెరాకొత్త కాదు. హనుమంతు పాత్రని కూడా చాలా సహజంగా చేసుకుంటూ వెళ్ళాడు. నిజానికి ఇలాంటి సూపర్ పవర్స్ వున్న కథల్లో ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయే అవకాశం వుంది. కానీ తేజ చాలా సటిల్డ్ గా తన పాత్రని చేసుకొచ్చాడు.
ఈ పాత్రకు తను సరైన ఎంపిక అనిపించాడు. తన లుక్ బావుంది. యాక్షన్ సీన్స్ లో చాలా కష్టపడ్డాడు. అది తెరపై కనిపిస్తుంది. అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఆకట్టుకుంది.
తనకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. మీనాక్షి పాత్రలో చేసిన అమృత అయ్యర్ మొదట బలమైన పాత్రల కనిపించినా తర్వాత ఆ పాత్ర పెద్ద ప్రభావాన్ని చూపలేదు. వినయ్ రాయ్ నిజంగానే హాలీవుడ్ లుక్ లో కనిపించాడు. అయితే ఆ పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది.
వెన్నెల కిషోర్ కాస్త కొత్తగా కనిపించాడు. సత్య, గెటప్ శ్రీను తో పాటు రాకేశ్ మాస్టర్ కూడా ఆకట్టుకున్నారు. సముద్రఖని పాత్ర మంచి ఎలివేషన్ కి ఉపయోగపడింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

ఫొటో సోర్స్, Primeshow Entertainment/YouTube
నిర్మాణం ఎలా ఉంది?
టెక్నికల్ గా ఈ సినిమా బావుంది. పాటలు కుదరలేదు కానీ గౌరి హరి నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్ళింది.
ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో బీజీఎం బాగా వర్క్ అవుట్ అయ్యింది. దాశరథి శివేంద్ర కెమెరాపని తనం ఉన్నతంగా వుంది. విజువల్స్ రిచ్ గా కనిపించాయి. సీజీ వర్క్ కూడా బాగా కుదిరింది.
పెద్ద హనుమంతుని విగ్రహం నిజమేనా అన్నట్టుగా తీర్చిదిద్దారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. అంజనాద్రి నిర్మించిన తీరు బావుంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ సినిమాని మొదలు పెట్టాడు. ఇది పండగ సీజను. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు మంచి ఆదరణ వుంటుంది.
ఆ రకంగా చూసుకుంటే అసభ్యత లేకుండా పిల్లలు, పెద్దలు కలిసి చూడగలిగే అంశాలతో ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు.
ఎలాంటి అంచనాలు లేకుండా పండక్కి సరదాగా కాలక్షేపానికి ఒక సినిమా చుడాలనుకుంటే.. హను-మాన్ ని జాబితాలో చేర్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- గుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు మాస్ లుక్ అదిరిందా... త్రివిక్రమ్ మార్క్ కనిపించిందా?
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- రొమాంటిక్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
- కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















