దళితుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని కూతుర్ని చెట్టుకు ఉరివేసి చంపిన తండ్రి... తమిళనాడులో ఘాతుకం

- రచయిత, ప్రభాకర్ తమిళరుసు
- హోదా, బీబీసీ తమిళం
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరణలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుల దురహంకార హత్య వెలుగుచూసింది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమ కుమార్తెను దారుణంగా హత్య చేసినట్లు తల్లిదండ్రులపై కేసు నమోదైంది.
తంజావూరు జిల్లా పట్టుకొట్టై సమీపాన ఉన్న పూవలూర్ గ్రామానికి చెందిన భాస్కర్ కుమారుడు నవీన్, సమీప గ్రామమైన నెయ్వావిడిదిలో నివసించే 19 ఏళ్ల ఐశ్వర్యలు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు.
నవీన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.
అయిదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ గతేడాది డిసెంబర్ 31న తిరుప్పూర్ జిల్లాలోని అవరప్పాలాయంలోని వినాయకుడి గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే నవీన్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు.
కులాంతర వివాహం పట్ల ఐశ్వర్య కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివాహమైందని తెలుసుకుని, నవీన్, ఐశ్వర్యలను విడదీయడానికి ప్రయత్నించారు.
జనవరి 2వ తేదీన ఐశ్వర్య తల్లిదండ్రులు, బంధువులు కలిసి తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేశారు. కానీ, ఐశ్వర్యను ఆమె తల్లిద్రండులకు అప్పగించారు. ఆ తరువాతే ఈ దారుణం జరిగింది.

అసలు ఏం జరిగింది?
జనవరి 7వ తేదీన ఐశ్వర్య భర్త నవీన్ వాత్తికొట్టై పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్య తల్లింద్రుల తీరుపై ఫిర్యాదు చేశారు. అందులో, తాము ఐదేళ్లగా ప్రేమలో ఉన్నామని, ఐశ్వర్య బీసీ సామాజిక వర్గానికి చెందినదని పేర్కొన్నారు.
“మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఐశ్వర్య, ఆమె తండ్రి, బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అరగంట తర్వాత ఐశ్వర్యను ఆమె తండ్రి, బంధువులు కలిసి స్టేషన్ బయట పార్క్ చేసి ఉన్న కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నవీన్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం, జనవరి 3వ తేదీ తెల్లవారుజామున ఐశ్వర్యను హత్య చేసి, వెంటనే శ్మశానవాటికలో దహనం చేసినట్లు నవీన్‌కు సమాచారం తెలిసింది. ఈ ఘటనను స్థానికులకు తెలీకుండా దాచిపెట్టారు.
పోలీసులు విచారణలో ఐశ్వర్యను ఆమె తల్లిదండ్రులే నెయ్వావిడిది గ్రామంలోని చింతచెట్టుకు ఉరివేసి హత్య చేసినట్లు తెలిసింది. చెట్టుకు ఉరివేసి ఐశ్వర్యను హత్య చేశారని పోలీసులు బీబీసీకి తెలిపారు.
బీబీసీ ప్రతినిధి ఐశ్వర్య నివసించే గ్రామానికి చేరుకుని, పొరుగువారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారు బహిరంగంగా ఘటన గురించి చెప్పకపోయినప్పటికీ, కొన్ని వివరాలు తెలిపారు.
ఐశ్వర్యను ఆమె తండ్రి బలవంతంగా లాక్కెళ్లారని ఓ సాక్షి చెప్పారు. అయితే హత్యను ధ్రువీకరించలేదు.
“బయట మాకు పెద్దగా అరుపులు వినిపించాయి. ఏం జరిగిందోనని మేం బయటకు వెళ్లాం. ఆయన ఆ యువతిని చింతచెట్టు దగ్గరకు లాక్కెళ్లాడు” అని గ్రామస్తులు చెప్పారు.

చింతచెట్టుకు వేలాడదీసి...
ఐశ్వర్యను క్రూరంగా హత్య చేశారని, ఆ కేసును విచారిస్తున్న ఎస్ఐ నవీన్ ప్రసాద్ ధ్రువీకరించారు. ఈ కేసుకు సంబంధించి ఐశ్వర్య తండ్రి పెరుమాళ్, ఆయన భార్య రోజాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పెరుమాళ్ తాను ఎలా హత్య చేశారో సీన్ రీకన్సస్ట్రక్షన్ చేసినట్లు తెలిపారు.
డీఎస్పీ ఆశిష్ రావత్ ఈ కేసు సంబంధించిన వివరాలు తెలిపారు.
“యువతి తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఐశ్వర్యను తిరుపూర్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన వెంటనే, ఆమెను ఉరి వేసి చంపారు. తన భార్యను కుర్చీ, తాడు తీసుకురావల్సిందిగా పెరుమాళ్ కోరాడు. ఆ తరువాత క్షమాపణలు అడిగి, ఉరివేసుకోమని తన కూతురు ఐశ్వర్యకు చెప్పాడు. ఉరి వేసుకున్న తరువాత తాడు తెంచి, కిందకు దించారు. కూతురు ఇంకా ప్రాణాలతో ఉన్న విషయం గ్రహించి ఆమె గొంతు నులిమి హత్యచేశారు. అదెలా చేశారో, పెరుమాళ్ మాకు చేసి చూపారు” అని వివరించారు.
ఈ జంట స్కూలులో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నవీన్ గ్రామాన్ని సందర్శించేందుకు ప్రయత్నించిన బీబీసీ ప్రతినిధిని పోలీసులు ఆపారు. మీడియాకు అనుమతి లేదంటూ అనుమతి నిరాకరించారు.

'వద్దన్నా వినిపించుకోలేదు'
అనంతరం బీబీసీ ప్రతినిధి నవీన్ తండ్రి భాస్కర్‌ను పోలీస్ స్టేషన్ వద్ద కలుసుకుని, వారి ప్రేమ గురించి, వివాహం గురించి అడిగారు.
ఆయన మాట్లాడుతూ “నవీన్‌ను తొమ్మిదో తరగతిలోనే నేను మందలించాను. వారు వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్నారు. రోజూ పాఠశాలకు బస్సులో వెళ్లే సమయంలో వారు ఒకరినొకరు కలుసుకున్నారు. అలా వారి మధ్య స్నేహం మొదలై, ప్రేమగా మారింది” అని చెప్పారు.
వారిని విడదీయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ వారు మాత్రం ఏదో విధంగా కలుసుకునేవారని, చివరకు వివాహం చేసుకున్నారని తెలిపారు.
ఈ హత్యతో పూవలూర్, నెయ్వావిడిది గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భద్రత దృష్ట్యా పోలీసులను మోహరించారు.
ఈ ఘటనకు ముందు నుంచి పెరుమాళ్ తనకు తెలుసని, పరిచయం ఉందని నవీన్ తండ్రి భాస్కర్ తెలిపారు.

వివాహ వీడియో వాట్సాప్‌లో..
నవీన్, ఐశ్వర్యల వివాహానికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్ అవడం కూడా పరిస్థితి తీవ్రతను పెంచింది.
ఆ గ్రామాల్లో లోతుగా పాతుకుపోయిన కుల వివక్ష, అంతరాల కారణంగా ఆ వీడియో సామాజిక వ్యతిరేకతను పెంచింది.
పూవలూర్‌కు చెందిన తమిళ్‌చెల్వి అక్కడి సామాజిక పరిస్థితులు హత్యకు దారితీసిన విధానం గురించి వివరించారు.
“దళితులు, వెనుకబడిన సామాజిక వర్గాల మధ్య కొన్ని కులాంతర వివాహాలు గతంలోనూ జరిగాయి. అలా ప్రేమ వివాహం చేసుకున్నవారు మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టరు. కానీ, వీరి విషయంలో ఆ వీడియో వాట్సాప్‌లో ఎక్కువగా షేర్ అవడంతో, ఉద్రిక్తతలు పెరిగాయి” అని తమిళ్‌చెల్వి చెప్పారు.

పోలీసుల తీరుపై అనుమానాలు..
పల్లడం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న మలుపు కారణంగానే విషాదం చోటుచేసుకుంది.
ఐశ్వర్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, పోలీసులు బెదిరించారని నవీన్ ఆరోపించారు. పల్లడం డీఎస్పీ ఆ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఐశ్వర్య ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులతో కలిసి వెళ్లిందని తెలిపారు.
“మేం ఐశ్వర్య అంగీకారంతోనే, ఆమెను తల్లిదండ్రులతో పంపాం” అని చెప్పారు.
అయితే, వివాహం అయిన యువతిని, తల్లిదండ్రులతో పంపి, హత్యకు కారణమైన పోలీసుల తీరుపై విమర్శల నేపథ్యంలో పల్లడం పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మురుగయ్యను సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు.
గతంలోనూ..
తమిళనాడులో ఇటీవలి కాలంలో కుల దురహంకార హత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
ఈ ఘటనకు ముందు ఉదమలైపేట్ శంకర్ కేసు, ఒమలూర్ గోకుల్‌రాజ్ కేసు, తిరువూర్ అభిరామి కేసు, తిరుణవెళ్లి కల్పన కేసు, నాగపట్టణం అమృతవల్లి కేసు, కన్నంగి-మురుగేశన్ కేసులపై విచారణ కొనసాగింది.
2022 నుంచి తమిళనాడులో ప్రేమ, ప్రేమ వివాహాలకు సంబంధించి, దళితులపై జరుగుతున్న హింసపై తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త కతీర్ మాట్లాడుతూ, “ప్రతి ఏడాది 120 నుంచి 150 హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ క్రూరమైన హత్యలు” అన్నారు.
ఈ రకం హత్య కేసులను విచారించేందుకు ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేయాలని కతీర్ సహా పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం: ‘నా కుటుంబం ఒక్కపూట భోజనానికి రూ.1500 కావాలి’
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- పాకిస్తాన్: కూతురి మార్ఫింగ్ ఫోటోను చూసి పరువు హత్యకు పాల్పడిన తండ్రి
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














