'నా బిడ్డను ఎవరూ టెర్రరిస్ట్ అనకూడదు' -ఇస్లామిక్ స్టేట్‌లో పదేళ్ళు నరకం అనుభవించి స్వదేశం చేరుకున్న ఫాతిమా

కిర్గిజిస్తాన్ పునరావాస కార్యక్రమంలో భాగంగా నిరుడు స్వదేశానికి తీసుకొచ్చిన 110 మంది మహిళల్లో ఫాతిమా ఒకరు.
ఫొటో క్యాప్షన్, కిర్గిజిస్తాన్ పునరావాస కార్యక్రమంలో భాగంగా ఐఎస్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన 110 మంది మహిళల్లో ఫాతిమా ఒకరు.
    • రచయిత, బీబీసీ ముండో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

“కిర్గిజిస్తాన్‌కు స్వాగతం” తరగతి గదిలో ఉన్న20 మంది మహిళలకు షుకుర్ షెర్మటోవ్ ఆహ్వానం పలికారు.

ఆయన ఖరీదైన సంప్రదాయ టోపీ ధరించారు. కానీ, ఈ పాఠశాల నిర్వహణలో మాత్రం సంప్రదాయం ఏమీ లేదు. దీనికి సైనిక బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. ఇందులో చదువుకుంటున్నవారంతా మహిళలు. వీరంతా సిరియాలోని వివిధ క్యాంపుల నుంచి ఇక్కడకు చేరుకున్నారు. అక్కడ వారు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ సభ్యులతో ఉండేవారు.

ఈ పునరావాస కేంద్రం ఉత్తర కిర్గిజిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉంది. ఇస్లామిక్ స్టేట్‌లో పని చేశారని భావిస్తున్న మహిళలు, వారి పిల్లలు స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఆరు వారాల పాటు ఇక్కడ గడిపారు.

ఈ ప్రాంతాన్ని బీబీసీ బృందం తొలిసారి సందర్శించింది. స్థానికుల మాదిరే మా మాటలు, చేతలను ప్రభుత్వ నిఘా అధికారులు నిశితంగా పరిశీలించారు.

షుకుర్ చెప్పేది ఇద్దరు మహిళలు శ్రద్ధగా వింటున్నారు. ఆయన వాళ్లకు తొలిసారి పాఠం చెబుతున్నారు. ఇందులో పౌరసత్వం, మత విశ్వాసానికి సంబంధించిన నైతిక అంశాలు, కోపాన్ని నిభాయించుకోవడం వంటి అంశాలపై బోధిస్తున్నారు. మానసిక భావనల్ని అదుపు చేసుకోవడం ఎలా అనే దానికి సంబంధించి గోడ మీద అంటించిన పోస్టర్లలో కొన్ని టిప్స్ ఉన్నాయి.

సిరియా నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళలకు పాఠాలు బోధిస్తున్న షుకుర్ షెర్మాటోవ్
ఫొటో క్యాప్షన్, సిరియా నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళలకు పాఠాలు బోధిస్తున్న షుకుర్ షెర్మాటోవ్

విద్యా బోధనకు తోడుగా ఈ కుటుంబాలకు వైద్యం, మానసిక ఒత్తిడి నుంచి బయటపడే శిక్షణ, కొన్నేళ్లలో తొలిసారిగా వారికి సరిపడా ఆహారం, తాగునీరు, వసతి లభించింది.

నాలుగు మంచాలు వేసి ఉన్న ఒక బెడ్‌రూమ్‌లోకి మేము వెళ్లాం. అక్కడ ఒక ఊదారంగు హిజాబ్ ధరించిన మహిళ ఉన్నారు. మేము ఆమెను ఫాతిమా (భద్రత కోసం పేరు మార్చాం) అని పిలిచాం. అయితే అది ఆమె అసలు పేరు కాదు. ఆ గదికున్న చిన్న కిటికీలో నుంచి చూస్తే, దూరంగా నీటి వాగు ఒడ్డునే కనిపిస్తున్న పచ్చిక బయలు మొన్నటి వరకు సిరియాలో ఆమె ఉంటున్న క్యాంపులో కనిపించే దృశ్యాలకు అంత భిన్నమైనదైమీ కాదు.

“ఇక్కడున్న ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైనది. అందరూ దీన్ని కీర్తిస్తారు. పిల్లలు ప్రేమిస్తారు” అని కాసేపాగారు. మరోసారి అవే మాటలను చెప్పారు “ఇక్కడ నిశబ్ధంగా ఉంది”.

2013లో ఫాతిమా ఆమె భర్తతో కలిసి తుర్కియే వెళ్లారు. తనకు ఆ దేశంలో పని దొరికిందని ఆమె భర్త చెప్పడంతో ఫాతిమా ముగ్గురు పిల్లలలు, మనవడితో కలిసి కుటుంబం అంతా తుర్కియే వెళ్లింది. ఆకాశంలో యుద్ధ విమానాల హోరు, నేల మీద నుంచి వాటిపైకి కాల్పులు జరుపుతున్న ఇస్లామిక్ స్టేట్ గార్డులను చూసినప్పుడే తాము సిరియాలో ఉన్నట్లు వాళ్లకు తెలిసింది.

“మీరు ఎక్కడ ఉన్నారో మీకు నిజంగా తెలియదా” అని మేము ఆమెను అడిగినప్పుడు ఆమె, “నిజంగానే నాకు తెలియదు. మహిళలు సాధారణంగా భర్తను అనుసరించి వెళతారు. నేను కూడా అలాగే చేశాను” అని చెప్పారు.

వాళ్లు సిరియా వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త ప్రయాణిస్తున్న కారులో బాంబు పేలడంతో ఆయన సజీవంగా దహనం అయ్యారు. ఆమె కుమారుల్లో ఒకరు స్నైపర్ కాల్చిన తూటా తగిలి చనిపోయారు. మరో కుమారుడు జబ్బు పడి మరణించారు.

సిరియాను వదిలి వెళ్లలేని స్థితిలో ఆమె ఆరేళ్ల పాటు ఇస్లామిక్ స్టేట్ పాలనలో నరకం అనుభవించారు. అక్కడ ఫాతిమా కుమార్తెకు నలుగురు పిల్లలు పుట్టారు.

సిరియా నుంచి వచ్చిన వారి విషయంలో తమకు ఆందోళన ఉందటున్న కిర్గిజ్ ప్రజలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సిరియా నుంచి వచ్చిన వారి విషయంలో తమకు ఆందోళన ఉందటున్న కిర్గిజ్ ప్రజలు

అల్ హాల్ శరణార్థి శిబిరం

సిరియా నుంచి మిలిటెంట్లను తరిమి వేసిన తర్వాత ఫాతిమా ఆమె మనుమరాలు, నలుగురు మనుమళ్లను అల్ హాల్ శరణార్థి శిబిరానికి తరలించారు. సిరియాలో ఉంటున్న అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు, వారి కుటుంబ సభ్యులను నిర్బంధించిన అతి పెద్ద క్యాంప్ ఇది.

స్వదేశానికి తిరిగి రావాలనే బలమైన ఆకాంక్ష మధ్యే వాళ్లక్కడ నాలుగేళ్లు గడిపారు.

“మహిళలు జబ్బున పడితే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవారు. మమ్మల్ని వెనక్కి పంపించాలని మేము వాళ్లను బతిమాలాం” అని ఆమె చెప్పారు. “మేము ఏదో బతికున్నామంటే ఉన్నామంతే. మమ్మల్ని స్వదేశానికి తీసుకు వెళ్లేందుకు కిర్గిజిస్తాన్ నుంచి అధికారుల బృందం వచ్చిందని తెలియగానే మేము నిర్ఘాంత పోయాం”

ఆమె కుమార్తె, పిల్లల్ని స్వదేశానికి తీసుకువెళుతున్నట్లు నిరుడు అక్టోబర్‌లో వారికి సమాచారం అందింది. అయితే ఫాతిమా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది.

“నా పేరు వారి జాబితాలో లేదన్న విషయం చెప్పినప్పుడు నేను ఏడ్చాను. నా పేరు ఎందుకు జాబితాలో లేదు?. నేను ఆమె తల్లిని” అంటూ ప్రాధేయ పడ్డానని ఫాతిమా చెప్పారు. “ అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. త్వరలో నా కుటుంబ సభ్యులను కలుస్తాను. నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను. నా మనవరాలు, మనవళ్లు చదువుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్లు సైన్సు చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే వారికి ప్రపంచం బాగా అర్థమవుతుంది.”

57 ఏళ్ల ఫాతిమా ఈ పునరావాస కేంద్రంలో అందరి కంటే పెద్ద మహిళ. నిరుడు సిరియా నుంచి కిర్గిజిస్తాన్ తీసుకు వచ్చిన 110 మంది మహిళలు, 229 మంది చిన్నారుల్లో ఆమె కూడా ఒకరు. అల్ హాల్ క్యాంపు నుంచి అత్యధికులకు విముక్తి కల్పించిన దేశాల్లో ఇరాక్ తర్వాతి స్థానంలో కిర్గిజిస్తాన్ ఉంది.

సిరియాలో చిక్కుకుపోయిన వారి కోసం వారి బంధువులు ఏళ్ల తరబడి పోరాటం చేసిన తర్వాత కిర్గిజిస్తాన్ 260 మంది చిన్నారు, మహిళలను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఐసిస్ ఫైటర్లని ముద్ర పడిన వారికి జీవించేందుకు మరో అవకాశం కల్పించడమే ఈ ప్రణాళిక లక్ష్యం.

సిరియా నుంచి స్వదేశానికి వచ్చిన వారంతా రీ ఇంటిగ్రేషన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారి స్వస్థలాలకు వెళతారు. వారి మీద నిఘా కొనసాగుతుంది.

పది మందిలో తొమ్మిది మంది విచారణ ఎదుర్కొన్నారని కిర్గిజిస్తాన్ జాతీయ భద్రతా మండలి అధిపతి మాతో చెప్పారు. వాళ్లు కిర్గిజిస్తాన్ వదిలి వెళ్లినప్పుడు వారి పరిస్థితి ఏంటనే దానిపై జాతీయ భద్రత బృందాలు ఆరా తీస్తున్నాయి. అప్పట్లో వాళ్లు ఎవరితో ఉన్నారు. వారికి నిజంగానే టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయా, యుద్ధ క్షేత్రాల్లోకి పిల్లలను అక్రమంగా తరలించారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

తిరికి వచ్చిన వారిలో ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు. వారిలో ఎవరికీ శిక్షలు పడలేదు. వారు నేరం చేసినట్లు రుజువైతే 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

సిరియా నుంచి ఐసిస్ మిలిటెంట్లను తరిమివేసిన తర్వాత అల్ హాల్ క్యాంపులో ఉన్న మహిళలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సిరియా నుంచి ఐసిస్ మిలిటెంట్లను తరిమివేసిన తర్వాత అల్ హాల్ క్యాంపులో ఉన్న మహిళలు

ఎల్మైరా కథ

మేము మరో మహిళను కలిశాం. అమె ఎల్మైరా. పునరావాస కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ శివారులోని ఓ గ్రామంలో ఆమె తన జీవితాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నారు.

రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ సభ్యులు తరచుగా ఆమె వద్దకు వస్తున్నారు. ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ఆమె కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కేస్ వర్కర్ మమ్మల్న కలిశారు. ఆమె ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. మేము అక్కడకు వెళ్లిన తర్వాత ఇద్దరు తీవ్రవాద వ్యతిరేక దళం అధికారులు కూడా అక్కడ ఉన్నారు. కాసేపు చర్చించిన తర్వాత వారు బయటకు వెళ్లేందుకు అంగీకరించారు.

అధికారుల నిరంతర పర్యవేక్షణ, ఆరోపణల కారణంగా మహిళలు సిరియాలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఆందులోనూ వారు అక్కడ ఎదుర్కొన్న భయానక జీవితాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

ఆన్‌లైన్‌లో కలిసిన వ్యక్తి ద్వారా తాను సిరియా చేరుకున్నట్లు ఎల్మైరా చెప్పారు. ఆమె అతడిని తుర్కియేలో కలిసేందుకు ఒప్పించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఆనందంగా జీవించవచ్చని భావించారు. ఆమె 18వ పుట్టిన రోజు జరుపుకున్న నాలుగు రోజుల తర్వాత అతనిని కలిసేందుకు తుర్కియే బయల్దేరారు.

అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఆమె అతడి స్నేహితుడిగా చెప్పుకున్న మరో వ్యక్తి కలిశాడు. అతడితో కలిసి 17 గంటలు ప్రయాణించిన తర్వాత సిరియా చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత వెనక్కి రావాలని భావించినా వీలు కాలేదని ఆమె చెప్పారు.

ఆమెకు అక్కడ రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటి భర్త పెళ్లైన రెండు నెలల తర్వాత చనిపోయాడు. తర్వాత ఆమె దగిస్తాన్‌కు చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికో బిడ్డ పుట్టారు. సిరియాలో ఆమె రెండో భర్త ఏం చేసేవాడో చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. అయితే ఏదో ఒక క్షిపణి దాడిలో చనిపోవడానికి ముందే తాము ఆ దేశం వదిలి వెళ్లేందుకు మార్గాలను అన్వేషించినట్లు ఆమె చెప్పారు.

తన కుమార్తె చనిపోవచ్చన్న ఆలోచన వచ్చిన క్షణాలు తన జీవితంలో అత్యంత కఠినమైనవని ఎల్మైరా చెప్పారు. ఒక రోజు కుమార్తెను ఇంట్లో వదిలి బయటకు వచ్చినప్పుడు తమ పక్క ఇంటిపై క్షిపణి దాడి జరిగిందని కుమార్తె గురించి భయపడ్డానని అన్నారు.

“దాడి జరిగిందని తెలియగానే ఇంటికి పరుగెత్తి వెళ్లి కుమార్తె కోసం చూస్తూ పెద్దగా కేకలు పెడుతూ ఏడ్చాను. కొంతమంది వచ్చి నా పాపను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఆమెకు ఏమీ కాలేదు. నా కాళ్లు వణికాయి. ఆ బాంబు దాడిలో చుట్టుపక్కల ఉన్న చిన్నారులు కొందరు చనిపోయారు” అని చెప్పారు. ఫాతిమా మాదిరిగానే ఎల్మైరా ఆమె కుమార్తెను కూడా తర్వాత అల్ హోల్ క్యాంపుకు తరలించారు.

“నా కిప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఒక్కోసారి అర్థరాత్రి నిద్ర లేచి నేనేమైనా కల కంటున్నానా అని అనుకుంటుటాను”. అని ఆమె చెప్పారు. “మమ్మల్ని అక్కడ వదిలేయకుండా ఇక్కడకు తీసుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను. మిగతా దేశాలన్నీ ఇలా చేయడం లేదని మాకు తెలుసు”.

కిర్గిజిస్తాన్‌లో మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలు సిరియాలోని బంజరు మైదానాలతో పోలిస్తే భిన్నం
ఫొటో క్యాప్షన్, కిర్గిజిస్తాన్‌లో మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలు సిరియాలోని బంజరు మైదానాలతో పోలిస్తే భిన్నం

మేమూ మనుషులమే

ఎల్మైరా ప్రస్తుతం దుస్తులు కుట్టడం నేర్చుకుంటున్నారు. తన అసలు పేరు బయట పెట్టవద్దని మమ్మల్ని కోరారు. సిరియా నుంచి వచ్చిన వారి గురించి కిర్గిజ్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చూసిన తర్వాత ఆమె తన గతం గురించి ఎవరితోనూ మాట్లాడవద్దనుకుంటున్నారు.

“అదంత మంచిది కాదు” అని ఆమె చెప్పారు. “వాళ్లు మా గురించి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మాకు కూడా వాళ్లను చూస్తే భయమేస్తోంది. మేమేదో మెషీన్ గన్‌లు, బెల్టు బాంబులతో వచ్చామని వాళ్లు అనుకుంటున్నారు. అలా ఏమీ లేదు. మేము కూడా అందరిలాగా మనుషులం. మాకూ కుటుంబాలున్నాయి. పిల్లలున్నారు. మేము కూడా ప్రశాంతంగా జీవించాలనే భావిస్తాం”

“అయినా మా గతం గురించి మేమే మర్చిపోవాలని అనుకుంటుంటే దాని గురించి ఇతరులకు అవసరం ఏముంటుంది?. అని ఎల్మైరా అన్నారు. “అప్పుడు నాకు 18 ఏళ్లు. ఇప్పుడు 27 ఏళ్లు వచ్చాయి. మరీ అమాయకంగా ఉండకూడదని ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాను.”

ఎల్మైరా 9 ఏళ్ల కుమార్తె అందగత్తె. ఆమె జుట్టు పసిడి వర్ణంలో ఉంది. నీలి రంగు కళ్లు. కొంటె నవ్వు. ఆ చిన్నారి తన జీవితంలో ఎక్కువ భాగం అల్ హాల్ క్యాంప్‌లోనే గడిపింది. ఆమె తను గీసిన చిత్రాలను మాకు చూపించింది. “అందులో మేము కిర్గిజిస్తాన్ వెళ్లాలనుకుంటున్నాం, మమ్మల్ని రక్షించండి” అని రాసుంది.

తన కుమార్తెను, మనుమరాలని స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ఎల్మైరా తల్లి హమీదా యుసుపోవా దశాబ్ధ కాలంగా కిర్గిజ్ ప్రభుత్వాన్ని బతిమాలుతూ వచ్చారు. సిరియా వెళ్లిన మహిళల తల్లిదండ్రులతో కలిసి ఆమె ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.

“సిరియాకు వెళ్లడం అంటే తిరిగి రావడం ఉండదని మాకు తెలుసు. మీ కుమార్తె ఇక ఎప్పటికీ మిమ్మల్ని చేరుకోలేదనే చేదు నిజానికి మేము అలవాటు పడిపోయాం”

“ఆమె సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పాలి. నేను నా మనవరాలిని కలిశాను”. అని ఆమె చెప్పారు. అయితే ఎల్మైరా తన జీవితంలో 9ఏళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు. “అది చాలా ఎక్కువ సమయం”. తల్లీకూతుళ్లను తీసుకువెళ్లెందుకు హమిదా పునరావాస కేంద్రానికి వచ్చినప్పడు వారందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.

“ఎల్మైరా ఇప్పుడు తల్లయింది. ఓ బిడ్డను కని 18 ఏళ్ల పాటు పెంచడం ఎంత కష్టమే ఆమె ఇప్పుడు అర్థం చేసుకోగలదు. ఒక రోజు నా భర్త ‘పనికి వెళుతున్నాను’ అని చెప్పి తలుపు వేసి సిరియా వెళ్లాడు. తిరిగి రాలేదు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. అని హమీదా అన్నారు.

సిరియాలోని అల్ హాల్ క్యాంపులో తమ గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నామని చెప్పిన మహిళలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సిరియాలోని అల్ హాల్ క్యాంపులో తమ గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నామని చెప్పిన మహిళలు

తిరిగి వచ్చిన వారి గురించి ఆందోళన

చుట్టూ ఉన్న వారంతా తమ పట్ల ఉదారంగా వ్యహరించరనే విషయం ఎల్మైరా, హమీదాకు బాగా తెలుసు.

మధ్య ఆసియాలో అనేక దేశాల మాదిరిగానే కిర్గిజిస్తాన్‌లో 90 శాతం మంది ముస్లింలు. ఇస్లామిక్ స్టేట్ ఎదిగే దశలో ఇలాంటి దేశాల నుంచి నియామకాలు ఎక్కువగా జరిగాయి.

అల్మైరా కొంతమంది దుర్మార్గుల చేతిలో బాధితురాలిగా మారిందని హమీదా నమ్ముతున్నారు. తన చేతకాని తనం వల్లనే ఇలా జరిగిందని ఆమె తనను తాను నిందించుకుంటున్నారు. ఎల్మైరా వయసున్న ఇతర కిర్గిజ్ మహిళలతో మేము మాట్లాడాము. సిరియా నుంచి తిరిగి వచ్చినవారు ఇతరులను టెర్రరిస్టులుగా మారుస్తారని ఆందోళన చెందుతోన్నట్లు వారు మాతో చెప్పారు. ఆప్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఈ భయం మరింత పెరిగింది.

“తల్లిగా నేను అనేక అవమానాలు, కష్టాలను భరించాను. నా పిల్లలకు అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. ఇరుగుపొరుగువారు నా కూతుర్ని టెర్రరిస్టు అని పిలవడం నేను భరించలేను” అని హమీదా చెప్పారు.

సిరియా వెళ్లిన వారి తల్లిదండ్రులతో బృందాన్ని తయారు చేసిన హమిదా యుసుపోవా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సిరియా వెళ్లిన వారి తల్లిదండ్రులతో బృందాన్ని తయారు చేసిన హమిదా యుసుపోవా

తమది ఉదార ప్రజాస్వామిక విధానమని చాటి చెప్పేందుకు సిరియాలో క్యాంపుల నుంచి స్వదేశానికి తీసుకువచ్చిన వారిని ఉదాహరణగా చూపించాలని కిర్గిజిస్తాన్ ఉప ప్రధాని ఎదిల్ బైసలోవ్ భావిస్తున్నారు.

“వాళ్లు ఇన్నాళ్లు ఎదుర్కొన్న పీడకలను మర్చిపోతున్నారు. అదొక శుభపరిణామం. వారు, వారి కుటుంబ సభ్యులెవరికీ అది గుర్తు లేదు. అందరూ మంచి పౌరులుగా ఉన్నారు”. అని ఆయన చెప్పారు.

ఇదొక వివాదాస్పద అంశమని, ప్రత్యేకించి కొన్ని పాశ్చాత్య దేశాల ఏమనుకుంటాయో బైసలోవ్‌కు తెలుసు.

లండన్‌లో చదువుకుంటున్న బ్రిటన్ బాలిక షమీమా బేగం ఐసిస్‌లో చేరినప్పుడు బ్రిటన్ రాయభారి ఒకరు తన పదవికి రాజీనామా చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ సందేశం కూడా పంపాలని బైసలోవ్ భావిస్తున్నారు. 2020 ఎన్నికల తర్వాత కిర్గిజిస్తాన్‌లో తీసుకువచ్చిన చట్టాల కారణంగా ఆ దేశంలో మానవ హక్కుల అమలుపై రైట్స్ గ్రూప్స్ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

“కిర్గిజిస్తాన్‌కు సంబంధించినంత వరకు ఇదంత తేలికైన నిర్ణయం కాదు” అని ఆయన చెప్పారు. “మా ఇస్లామిక్ విధానం రాడికల్ కాదు, మాకు సహనం ఎక్కువ. ఇతర మతాలను గౌరవిస్తాం. ప్రతి ఒక్కరి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే చిన్న దేశం మాది”. కిర్గిజ్ ప్రభుత్వ నిర్ణయానికి యునిసెఫ్ మద్దతిస్తోంది. ఈ చర్య “ప్రస్తుతించదగినదని” యునిసెఫ్ ప్రతినిధి సిల్వి హిల్ తెలిపారు. సిరియాలో ఐసిస్ అనుమానిత బాధితుల పునరావాస కార్యక్రమాన్ని హిల్ పర్వవేక్షిస్తున్నారు.

“ఇతర దేశాలు కూడా ఇలాగే తమ దేశస్థులను వెనక్కి తీసుకురావాలి. యుద్ధం వల్ల బాధితులైన చిన్నారులకు పునరావాసం కల్పించడంతో పాటు వారిని జన జీవన స్రవంతిలోకి తీసుకు రావాలి”. అని యునిసెఫ్ పిలుపిచ్చింది.

మేము మాట్లాడిన మహిళలందరూ తమకు మరో అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు వెలిబుచ్చారు.

ఎందుకంటే, ఉత్తర సిరియాలోని క్యాంపుల్లో ఇప్పటికీ వివిధ దేశాలకు చెందిన 50వేల మంది బందీలుగా ఉన్నారనే విషయం వాళ్లకు బాగా తెలుసు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)