కశ్మీర్‌లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అకిబ్ జావేద్
- హోదా, శ్రీనగర్, కశ్మీర్
భారత పాలిత కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో 17 ఏళ్ళుగా హోటల్ నిర్వహిస్తున్న మంజూర్ అహ్మద్ మంచుకురవని చలి కాలాన్ని ఎప్పడూ చూడలేదు.
కానీ ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
మంచుతో నిండి ఉండాల్సిన పర్వతాలు బోసిపోయి గోధుమవర్ణంలో బంజరుభూముల్లా కనిపిస్తున్నాయి.
‘‘దీన్ని ఊహించలేదు’’ అని 50 ఏళ్ళ అహ్మద్ చెప్పారు.
దీనివల్ల పర్యాటకులు తమ హోటల్‌ను బుక్ చేసుకోవడం కూడా తగ్గిందని వివరించారు.
ఏటా చలికాలంలో వేలాదిమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తుంటారు.
అక్కడ మంచుపై స్కీయింగ్ చేసి, చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
కానీ ఈ ఏడాది మంచుకురవకపోవడంతో ఈ ప్రాంత పర్యాటకరంగం కుదేలైంది.
కిందటేడాది జనవరిలో దాదాపు లక్షమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించగా ఈ ఏడాది ఆ సంఖ్య సగానికంటే ఎక్కువగా పడిపోయిందని అధికారులు చెబుతున్నారు.
జమ్ము కశ్మీర్ జీడీపీలో పర్యాటకరంగం వాటా 7శాతం కన్నా ఎక్కువగా ఉంది.
మంచు లేని చలికాలం వల్ల పర్యటకుల రాక తగ్గడంతో దీనిప్రబావం ఆర్థికరంగంపై పడుతుదని నిపుణులు పేర్కొంటున్నారు.
పర్యాటకరంగంపైనే కాక దీని ప్రభావం పంటలు, మంచినీటి సరఫరాపైనా ఉంటుందంటున్నారు.
భూగర్భజలాలలు కూడా తగినంతగా నిండవని తెలిపారు.
వాతావరణ మార్పులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయడం మొదలైందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
దీనివల్ల తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అటు చలికాలంలోనూ, ఇటు వేసవి కాలంలోనూ దీర్ఘకాలంపాటు పొడివాతావరణం కొనసాగుతోందని చెబుతున్నారు.
జమ్ముకశ్మీర్ వాతావరణ శాఖ డిసెంబర్‌లో 79శాతం, జనవరిలో 100శాతం వర్షపాతంలోటు నమోదైనట్టు తెలిపింది.
కశ్మీర్ లోయలో వేడివాతావరణం పెరుగుతోంది.
కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో ఈ చలికాలంలో 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, FAISAL BASHIR
పర్యాటకుల తిరుగుముఖం
పర్యాటకులు హోటళ్ళ రిజర్వేషన్లన్నీ రద్దు చేసుకుంటున్నారని యజమానులు చెబుతున్నారు. వచ్చిన పర్యాటకులు కూడా స్కీయింగ్, గుర్రపుబగ్గీ ప్రయాణాలు చేసే పరిస్థితి లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు.
‘‘40శాతానికి పైగా హోటల్ రిజర్వేషన్లు రద్దు అయ్యాయి. కొత్త రిజర్వేషన్లు నిర్థరణ కావడంలేదు’’ అని గుల్మార్గ్ హోటల్స్ క్లబ్ అధ్యక్షుడు అకిబ్ చాయా చెప్పారు.
కశ్మీర్‌ను చూడటానికి మొదటిసారి కుటుంబంతో వచ్చిన మహారాష్ట్రకు చెందిన రాజ్‌కుమార్ తామెంతో నిరుత్సాహానికి గురైనట్టు చెప్పారు.
‘‘ఇక్కడ కురిసే హిమపాతాన్ని చూద్దామని వచ్చాను. కేబుల్ కారులో ప్రయాణం చేయాలనుకున్నా, కానీ మంచులేని గుల్మార్గ్‌ను చూసి నిరుత్సాహం వచ్చింది’’ అని చెప్పారు.
పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం స్థానిక వ్యాపారులను ఆవేదనకు గురిచేస్తోంది.
శీతాకాలంలో జరిగే వ్యాపారమే వారి జీవానాధారం.
కశ్మీర్‌కు వచ్చే పర్యాటకులు ఎత్తైన కొండల్లో పోనీ రైడ్స్ (పొట్టి గుర్రాలపై ప్రయాణం) చేయడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. కానీ గడిచిన మూడునెలల్లో పోనీ రైడ్స్ ద్వారా పెద్దగా సంపాదించుకోలేకపోయామని గుల్మార్గ్‌లోని పోపీ రైడర్స్ అసోసియేషన్ నాయకుడు తారిక్ అహ్మద్ చెప్పారు. ఈ అసోసియేషన్‌లో 5వేలమంది సభ్యులున్నారు.
‘‘ మా జీవనాధారం మంచుపైనే ఆధారపడి ఉంటుంది. మంచులేని కాలం మా కుటుంబాల్లోకి విషాదం తీసుకువస్తుంది’’ అని తారిక్ చెప్పారు.
దశాబ్దాల తరబడి అనేకమంది ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు.
మరో జీవనాధారాన్ని కనుక్కోవడం వారికిప్పుడు అసాధ్యమైన పని అని ఆయన చెప్పారు.
స్కీ అసోసియేషన్ ఆఫ్ గుల్మార్గ్ కు నాయకత్వం వహించే షౌకత్ అలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘నేను 27 ఏళ్ళుగా స్కీ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాను. మరో పని వెదుక్కోవడం నావల్ల అయ్యే పనికాదు’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FAISAL BASHIR
కరువు తప్పదా?
హిమపాతం లోటు కేవలం పర్యాటకరంగంపైనే కాక, జలవిద్యత్ ఉత్పత్తికి, చెరువులలో చేపలకు, వ్యవసాయానికి కూడా నష్టం కలిగిస్తోంది.
‘‘ఇక్కడి వ్యవసాయమంతా హిమనీనదాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. శీతాకాలంలో హిమపాతం లేదంటే నీటిబుగ్గలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది’’ అని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు.
‘‘హిమాలయ ప్రాంతాలలో అత్యంత పొడిబారిన కాలమిదే అని’’ లేహ్‌లోని వాతావరణ కేంద్రం డైరక్టర్ సోనమల్ లోటస్ తెలిపారు.
కరువులాంటి పరిస్థితులను కొట్టిపారేయలేమని కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇర్ఫాన్ రషీద్ చెప్పారు.
సాధారణంగా ఈ ప్రాంతం డిసెంబర్ 21 నుంచి జనవరి 29 మధ్యన 40 రోజులపాటు భారీగా మంచు కురుస్తుంది. ఈ సమయంలో పర్వతాలు, హిమనీనదాలు మంచుతో నిండిపోతాయి. ఈ పరిణామం ఏడాదంతా నీటి సరఫరాకు హామీ ఇస్తుంటుంది.
గడిచిన కొన్నేళ్ళుగా ఈ ప్రాంతంలో హిమపాతం తగ్గుతూ వస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
‘‘1990కు ముందు హిమపాతం చాలా ఎక్కువగా ఉండేది. దాదాపు మూడు అడుగుల మందాన మంచు కురిసేది. వేసవికాలం వచ్చేవరకూ అది కరిగేది కాదు. కానీ ఇప్పుడు వెచ్చటి శీతాకాలాన్ని చూడాల్సి వస్తోంది’’ భూశాస్త్రవేత్త షకీల్ అహ్మద్ రమ్షూ చెప్పారు.
వాతావరణ మార్పుతో కశ్మీర్‌లోయ ‘మండుతోందని’ నమ్మేవారిలో ఆయనకూడా ఒకరు.
‘‘ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడి తరలసరి కర్బన ఉద్గారాలు చాలా తక్కువ. కశ్మీర్ ప్రజలది నిరాడంబర జీవన శైలి. కానీ ప్రపంచంలో వస్తున్న వాతావరణ మార్పులకు మేం బలవుతున్నాం’’ అని చెప్పారు.
రమ్షూ, ఆయన బృందం చేసిన అధ్యయనం ప్రకారం లడఖ్ సహా ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు ఈ శతాబ్దాంతానికి ప్రమాదకరస్థాయికి చేరతాయని, ఉష్ణోగ్రతలు 3.98 నుంచి 6.93 డిగ్రీలవరకు పెరుగుతాయని తెలిపారు.
ఇంకా ఈ చలికాలంలో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
జనవరి 24వరకూ భారీ హిమపాతం కురిసే అవకాశం లేదని వాతావరణ విభాగం తెలిపింది.
కానీ ప్రకృతి తమపట్ల దయతో ఉంటుందని అహ్మద్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- లక్షద్వీప్ భారీగా పర్యాటకులొస్తే తట్టుకోగలదా?
- చోళులు: ఆ రాజు చనిపోయినప్పుడు అతనితో పాటు ముగ్గురు మహిళలను సజీవ సమాధి చేశారు.
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఆత్మవిశ్వాసంతో మానసిక బలంతోపాటు శారీరక సామర్థ్యం, ఎలాగంటే..
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














