అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో కేటాయించిన స్థలం
    • రచయిత, విష్ణు స్వరూప్
    • హోదా, బీబీసీ తమిళ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ధన్నీపూర్ గ్రామం అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జనసంచారం పెద్దగా లేని ఆ గ్రామంలో చిన్నచిన్న ఇళ్లు, కొన్ని దుకాణాలు, కొన్ని మసీదులు, ఒక మదరసా కనిపిస్తాయి.

ఈ గ్రామంలోకి ప్రవేశించే రహదారి మొదట్లోనే పెద్ద ఖాళీ స్థలం ఉంది. అక్కడ కొందరు యువకులు క్రికెట్ ఆడుతూ, ఒకరు మేకలు మేపుకుంటూ ఉండడం చూసి అది మామూలు ఖాళీ స్థలం అనిపించొచ్చు.

కానీ, ఆ స్థలం ముందు ఏర్పాటు చేసిన బోర్డు దాని ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, ధన్నీపూర్ ప్రారంభంలో మసీదు నిర్మాణ స్థలాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డు

బోర్డు మీద 'ఇండో - ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్' అని రాసి ఉంది. దానిపై భవనం నమూనా కూడా ఉంది.

అయోధ్య కేసులో వివాదం నెలకొన్న స్థలాన్ని ట్రస్టుకు అప్పగించి, అక్కడ రామమందిర నిర్మాణం చేయొచ్చని 2019లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, ఐదెకరాల భూమిని కేటాయించి, అందులో మసీదు నిర్మించుకోవచ్చని ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్‌బోర్డుకు తెలిపింది.

అదే ఈ స్థలం. ఇండో - ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అనేది మసీదు నిర్మించేందుకు వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన సంస్థ.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, ధన్నీపూర్ గ్రామంలో ఒక వీధి

అయోధ్యలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణ పనులు మొదటి దశ పూర్తి కావొచ్చినప్పటికీ, మసీదుకు కేటాయించిన స్థలంలో నేటికీ ఎలాంటి పనులూ ప్రారంభం కాలేదు.

ఆ స్థలంలో ఉన్న పాత దర్గాను పునరుద్ధరించారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై ఉన్న నిర్మాణ ఆకృతి ఆ స్థలంలో నిర్మించనున్న నూతన మసీదు ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. అక్కడ నిర్మించబోయే మసీదును 'మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా' అని పేర్కొన్నారు.

బీబీసీ ధన్నీపూర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు మసీదు స్థలం గురించి, అక్కడి పరిస్థితి గురించి మాట్లాడేందుకు అయిష్టత చూపారు. మీడియా ప్రతినిధులని తెలియడంతో ఇళ్ల బయట కూర్చున్న కొందరు ఇళ్లలోకి వెళ్లిపోయారు.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, ఇక్బాల్ అన్సారీ

పనులు ఎందుకు ప్రారంభం కాలేదు?

అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న భూమికి సంబంధించిన వివాదంలో ఇక్బాల్ అన్సారీ లిటిగెంట్ (కోర్టు వ్యాజ్యంలో ముస్లింల తరఫు వ్యక్తి). ఆయన తండ్రి హషీమ్ అన్సారీ ఈ కేసులో సీనియర్ లిటిగెంట్‌గా ఉన్నారు. 2016లో ఆయన మరణానంతరం ఇక్బాల్ ఆ కేసును కొనసాగించారు.

రామ మందిరం నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోనే ఒక చిన్న ఇంట్లో ఇక్బాల్ నివాసముంటున్నారు. ఆయనకు ప్రస్తుతం ఇద్దరు సాయుధ పోలీసుల రక్షణ కల్పించారు.

ఇంట్లో గోడలపై ఆయన తండ్రి ఫోటో, బాబ్రీ మసీదు చిత్రాలు మనల్ని పలకరిస్తాయి.

మీడియా ఆయన వెంటపడుతోంది. ఒక ఇంటర్వ్యూ పూర్తయిత తర్వాత, ఆయన మాతో మాట్లాడారు. మసీదుకి కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విసుగు ఆయన గొంతులో కనిపించింది.

''వక్ఫ్‌ బోర్డుకి భూమిని కేటాయించారు. అక్కడ మసీదు నిర్మించాల్సిన బాధ్యత వారిదే. దాని కోసం ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్క పని కూడా చేపట్టలేదు. దేశంలోని ముస్లింలు ఎవరూ దీనిని ప్రశ్నించరు'' అని ఆయన అన్నారు.

బాబ్రీ మసీదు ఉన్నంత వరకూ తన తండ్రి ఆ మసీదు బాగోగులు చూసుకునేవారని ఆయన అన్నారు.

కొత్త మసీదు గురించి ఇక్కడి ముస్లింలు పెద్దగా ఆందోళన చెందడం లేదని, వారికి ఇక్కడ తగినన్ని మసీదులు ఉన్నాయని అన్నారు ఇక్బాల్.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, ఖాలిక్ అహ్మద్ ఖాన్

'మసీదుకు మరో ప్రత్యామ్నాయం ఉండదు'

''కొత్త మసీదు నిర్మాణంపై ముస్లింలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు'' అని అయోధ్య కేసులో ముస్లింల తరఫున మరో ప్రతినిధి, కేసు గురించి పూర్తి అవగాహన కలిగిన అయోధ్యకు చెందిన ఖాలిక్ అహ్మద్ ఖాన్ అన్నారు.

ఇస్లామిక్ షరియా చట్టం, వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం, ''మసీదును ఒక చోటు నుంచి మరోచోటుకి తరలించకూడదు. లేదా మసీదుని మరో చోటుకి మార్చకూడదు.''

''ఇస్లామిక్ చట్టాల ప్రకారం మసీదును ఒక చోటు నుంచి మరోచోటుకు మార్చడం కుదరదు. అలాగే, మసీదును తనఖా పెట్టడం, ఒక మసీదు స్థానంలో మరో మసీదు నిర్మించడం కుదరదు. అందువల్ల బాబ్రీ మసీదును మరో చోటుకు తరలించడం అంటూ ఉండదు. అందుకే, కొత్తగా నిర్మించనున్న మసీదుపై ముస్లింలు ఆసక్తి చూపించడం లేదు'' అని ఆయన చెప్పారు.

అయితే, కొత్తగా నిర్మించ తలపెట్టిన మసీదుకు ఎవరూ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, అత్తార్ హుస్సేన్‌

మసీదు నిర్మాణం ఎప్పుడు?

మసీదు నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం గురించి లక్నోలో ఉండే మసీదు ట్రస్ట్ సెక్రటరీ అత్తార్ హుస్సేన్‌తో మేం మాట్లాడాం.

నిధుల సమీకరణ సరిగ్గా జరగకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు.

వక్ఫ్‌బోర్డుకి ఇచ్చిన స్థలంలో మసీదుతో పాటు ఉచిత క్యాన్సర్ ఆస్పత్రి, కమ్యూనిటీ క్యాంటీన్, 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి గుర్తుగా మ్యూజియం నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

''అయితే, మేం అనుకున్నంత వేగంగా నిధుల సమీమరణ జరగలేదు. అందువల్ల వేగంగా నిధులు సమీకరించేందుకు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేశాం'' అని బీబీసీతో చెప్పారు హుస్సేన్.

ఫౌండేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత మొదట అనుకున్న మసీదు డిజైన్‌ను కూడా మార్చినట్లు ఆయన చెప్పారు.

మరో రెండు, మూడు నెలల్లో మసీదు నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు.

అయోధ్య మసీదు
ఫొటో క్యాప్షన్, కొత్తగా నిర్మించనున్న మసీదు డిజైన్ తెలియజేస్తున్న చిత్రం

'అది బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయం కాదు'

ఒక మసీదును మరో చోటుకు తరలించడం లేదా నిర్మించడం కుదరదనే భావన గురించి అడిగినప్పుడు, కొత్తగా నిర్మించే మసీదు బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఇస్లామిక్ జురిస్‌ప్రుడెన్స్ 'ఫిఖ్‌'‌ను ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయని హుస్సేన్ అన్నారు. అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోనూ ఐదెకరాల భూమిని బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయంగా పేర్కొనలేదని చెప్పారు.

కొత్త మసీదు నిర్మాణంపై ముస్లింలలో ఆసక్తి లేదన్న వాదనపై స్పందిస్తూ, ''మొదట్లో కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఇప్పుడిప్పుడే మసీదు, మసీదు పరిధిలో జరగనున్న అభివృద్ధి పనులకు ఆమోదం, ఆసక్తి పెరుగుతోంది'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)