అయోధ్య: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్ట పోతుందా?

అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 22వ తేదీన జరిగే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
    • రచయిత, మాన్సీ దాశ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ ‘మర్యాదపూర్వకం’గా తిరస్కరించింది.

ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ కొన్ని వారాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానాలు అందాయి. సమావేశాలు, చర్చల అనంతరం కాంగ్రెస్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించడమే కాక, ఇంకా నిర్మాణం పూర్తి కాని ఆలయాన్ని ప్రారంభించడం వెనుక ఎన్నికల ప్రయోజనాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్/బీజేపీపై విమర్శలు చేసింది.

కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం పట్ల బీజేపీ విమర్శలకు దిగింది. ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకి అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా అన్నారు.

రామమందిర నిర్మాణ అంశం బీజేపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. ఈ సమయంలో ఆలయాన్ని ప్రారంభిస్తే, ఎన్నికల ముందు నుంచే ప్రతిపక్షాలపై బీజేపీ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రామమందిర నిర్మాణంలో ఎవరికి ఎక్కువ లాభిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోల్పోతుందా? ఎన్నికల్లో ఈ అంశం ఎవరికి అనుకూలంగా మారనుంది?

అయోధ్యలోని రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకపోతే ఏమవుతుంది?

అయోధ్య మందిరం

ఫొటో సోర్స్, KABIR JHANGIANI/NURPHOTO VIA GETTY IMAGES

కాంగ్రెస్ ఏం చెప్పింది?

జనవరి 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, నాయకులు అధిర్ రంజన్‌లు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిపింది.

గతనెలలో ఆహ్వానం అందిందని, కార్యక్రమంలో పాల్గొనాలా? వద్దా? అని పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

తృణముల్ కాంగ్రెస్, మహారాష్ట్రలోని ఎన్సీపీలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

కార్యక్రమంలో పాల్గొనాలా, వద్దా? అని నిర్ణయించుకోవడం ఆయా పార్టీల సొంత నిర్ణయమని, కానీ బీజేపీ మాత్రం దీనికి రాజకీయరంగులు అద్దుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో,

“మతం అనేది ఒకరి వ్యక్తిగత విషయం. కానీ, బీజేపీ/ఆర్ఎస్ఎస్ మతాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే, ఇంకా నిర్మాణం పూర్తికాని ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు. 2019లో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుకు కట్టుబడి, కోట్లమంది రామభక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ, మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌధురిలు ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ పంపిన ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నారు” అని పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కాంగ్రెస్ నేత, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఈ అంశం గురించి మీడియాతో మాట్లాడుతూ, “మేం రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదు. గ్రామాల్లో ఉన్న రామ మందిరాలకు వెళ్తాం. కానీ, ప్రత్యేకించి ఈ అంశాన్ని రాజకీయీకరణ చేయడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం” అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, “ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప వారికి మరోపని లేదు. మొదట హిందూ, ముస్లింలను మతం పేరుతో విడగొట్టారు. ఇప్పుడు రాముడి పేరుతో శంకరాచార్య, రామానుజాచార్య మఠాలను విడదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు” అని విమర్శించారు.

“ఎంతమంది మతపెద్దలు ఈ ఆహ్వానాన్ని స్వీకరించారు? ప్రముఖ మతపెద్దలెవరూ ఆహ్వానాన్ని స్వీకరించినట్లు లేరు. దీనర్థమేంటి?” అని దిగ్విజయ్ ప్రశ్నించారు.

“నిర్మాణం పూర్తికాని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదని మత గ్రంథాల్లో ఉంది. అలా చేయడం అశుభంగా భావిస్తారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకపాత్ర పోషించిన శివసేన కూడా కార్యక్రమానికి దూరంగా ఉంటోంది. ఆహ్వానాన్ని నిరాకరించింది. రాముడు అందరివాడు. మందిర నిర్మాణం పూర్తయ్యాక అక్కడికి తప్పకుండా వెళ్తాం” అని దిగ్విజయ్ మీడియాతో అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నవాదనలు..

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు.

కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ క్రిష్ణం ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, “రాముడు, రామ మందిరం అందరిది, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లేదా బజరంగ్‌దళ్‌లు వారికి మాత్రమే అన్నట్లుగా వ్యవహరించడం దురదృష్టకరం.

కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకమో లేదా రాముడికి వ్యతిరేకమో కాదని నా విశ్వాసం. కానీ, అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కొంతమంది పాత్ర ఉంది. పార్టీ నిర్ణయం నాకు బాధను కలిగించింది. రాముడిని ఆరాధించే కోట్లమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేరు.

రాముడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందీ, ఆలయ తాళాలు పగులగొట్టి, ఆలయాన్ని తెరిచిందీ రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీనే. అలాంటిది ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకోవడం బాధాకరం” అన్నారు.

గుజరాత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అర్జున్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు.

“ఇది దేశ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ నాయకత్వం ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు దూరంగా ఉండాల్సింది” అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, KABIR JHANGIANI/NURPHOTO VIA GETTY IMAGES

ఈ నిర్ణయం ఎందుకని ముఖ్యం?

ఈ నిర్ణయం సవాళ్లతో కూడుకున్నదని కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడంతో, నిర్ణయాన్ని సోనియా గాంధీ పార్టీకే వదిలేశారని రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయ్ అన్నారు.

“దక్షిణాది రాష్ట్రాల నుంచే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఆ ప్రాంతంలో మద్దతు కోల్పోకూడదు. మరోవైపు ఉత్తర భారతంలో 2014, 2019లోనూ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోలేదు. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది” అన్నారు.

“కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించారు. కానీ, ఉత్తరాన ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆలోచనతోనే ఉన్నాయి” అని పేర్కొన్నారు.

“ఇండియా కూటమిలో ఉన్న తృణముల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, వామపక్షాలు కూడా కార్యక్రమానికి వెళ్లడంలేదు. ఆ పార్టీలకు కూడా మద్దతునిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో వారి మధ్య ఐక్యత ఉందని చెప్పినట్లయింది” అని చెప్పారు.

మరో రాజకీయ విశ్లేషకులు వినోద్ శర్మ మాట్లాడుతూ, “కూటమిలోని పార్టీలు, పార్టీ అంతర్గత శ్రేణులతో నిర్వహించిన చర్చల అనంతరమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందలేదు, కొంతమందికి మాత్రమే అందాయి. అందుకు గల కారణాలు కూడా వెల్లడించలేదు” అన్నారు.

ఆహ్వానాల విషయమే కాక, మతపెద్దలు రాకపోవడాన్ని ప్రస్తావించారు. శంకరాచార్య వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ, రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లకపోవడం వల్ల రాముడిపై విశ్వాసం లేనట్లో, తప్పు చేస్తున్నట్లో కాదని అన్నారు.

“హిందూ మతంలో ప్రముఖులుగా పరిగణించే నలుగురు శంకరాచార్యులూ ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని ప్రకటించారు. అంటే, వారికి రాముడిపై విశ్వాసం లేనట్లా?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP) (PHOTO BY NOAH SEELAM/AFP VIA GETTY IMAGES)

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌పై ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?

కాంగ్రెస్ పార్టీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఎన్నికల సమయంలో వారు ఈ అంశాన్ని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రయోగించబోతుంది అన్నట్లుగానే ఉన్నాయి.

రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని సీనియర్ బీజేపీ నేతలు అంటున్నారు.

“1980లలో బీజేపీ ఆవిర్భావం నుంచి మతం, విశ్వాసం, రాజకీయాలను మిళితం చేయడంలో చూపుతున్న సంకోచాన్ని, 2014లో మోదీ పార్టీ పగ్గాలు చేపట్టాక దూరం చేశారు. అప్పటి నుంచి, పార్టీ వైఖరి స్పష్టంగా తెలిపేలా ముందుకు వెళ్తున్నారు. ఇదే అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పటి కాలానికి, ఇప్పటికీ తేడా.” అని రషీద్ కిద్వాయ్ అన్నారు.

“మెజారిటీవాదం, హిందూ ప్రయోజనాలు, ఎన్నికల గురించి మాట్లాడే సందర్భంలో బీజేపీ స్పష్టంగా ఉంది. కానీ కాంగ్రెస్‌ మెజారిటీవాదానికి అనుకూలంగా లేదు. దానికి సరైన పరిష్కారాన్ని వెతకడంలో కాంగ్రెస్ వెనకబడింది” అన్నారు.

సున్నితమైన వివాదాలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టంగా చెప్పలేక పోవడానికి ఆ పార్టీలో ఉన్న ఓటుబ్యాంకు కారణమని, బీజేపీ విషయంలో మొదటి నుంచి స్పష్టమైన వైఖరి కనిపిస్తోందని అన్నారు.

“2014లో రాజ్యాంగానికి కట్టుబడి రామమందిర నిర్మాణానికి అన్ని విధాల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.

2019లోనూ ఇదే హామీకి కట్టుబడి ఉన్నట్లు మరోసారి ప్రకటించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

రానున్న 2024 ఎన్నికల్లో, గత మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని నెరవేర్చామన్న నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్‌కు దీనిని వల్ల కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు” అని కిద్వాయ్ వ్యాఖ్యానించారు.

అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ

ఫొటో సోర్స్, DEEPAK GUPTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ మాట్లాడుతూ, “బీజేపీ ఈ అంశాన్ని రాజకీయీకరణ చేస్తోందని చెప్పడంలో సందేహమే లేదు. కానీ, ఈ సున్నితమైన అంశంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ప్రకటనతోనే సరిపెట్టకూడదు” అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఈ వివాదం గురించి వివరించాలని అన్నారు.

“అధికార పార్టీ ఈ అంశాన్ని క్లిష్టంగా మార్చింది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ, పొత్తులో ఉన్న పార్టీలు దీని వెనుక ఉన్న క్లిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా వారి ముందు పెట్టాలి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అన్నది ఇక్కడ విషయం కాదు. ప్రజల్లోకి వెళ్లి, వివాదాన్ని వివరించడం ముఖ్యం” అన్నారు.

అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్ఠ

ఫొటో సోర్స్, CENTRAL PRESS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మతం, రాజకీయాల అంశాల్లో మహాత్మాాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు తమ అభిప్రాయాలు తెలిపారు.

చరిత్రలో అయోధ్యపై కాంగ్రెస్ ..

ప్రపంచ నిర్మాణంలో మతం పాత్ర పెద్దదేనని, రాజకీయాల నుంచి మతాన్ని దూరం చేయలేమని మహాత్మా గాంధీ ఓ సందర్భంలో చెప్పారు. మత విశ్వాసం ఉన్నవారు ఎప్పుడూ చెడు చేయరని అన్నారు.

కానీ, జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రాజకీయాన్నీ, మతాన్ని వేర్వేరుగా చూడాలని ఆయన అనే వారు.

ఒకవేళ రాజకీయాల్లోకి మతాన్ని తీసుకుని వస్తే, మెజారిటీవాదం విస్తరిస్తుందని, అది ప్రజాస్వామానికి చేటు చేస్తుందని అన్నారు. ఆ కారణంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా పాలన చేయలేవని అన్నారు.

6 డిసెంబర్ 1996లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నారు.

అనంతరం తాను రాసిన పుస్తకంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి వివరించిన సందర్భంలో బీజేపీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌‌ను, కాంగ్రెస్ పార్టీని కూడా నిందించారు. “దీనంతటికీ ఒకరు బాధ్యత వహించాలి. అందుకు నేను బాధ్యుడిని అయ్యాయని నాకు అర్థమైంది” అని రాశారు.

1985లో రామ మందిరం తాళాలు తెరిచిన సమయంలో రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నారు.

1989లో సరయూ నదీ తీరాన నిర్వహించిన బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనలో “రామరాజ్యం” గురించి ప్రస్తావించారు.

ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

ప్రముఖ జర్నలిస్ట్ ఆర్.విజయ్ దార్దా రాసిన కథనంలో “ప్రజలకు రాముడి తత్వమేంటో అర్థంకావాలన్న ఉద్దేశంతో అలా అన్నారు. దానితో రాజకీయ ప్రయోజనాలను పొందాలని ఆయన అనుకోలేదు. నిజానికి రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయాలంటూ 1989లో ఆయనే విశ్వహిందూ పరిషత్‌ను కోరారు. అది జరిగింది కూడా” అని రాశారు.

1999లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హిందుత్వవాదాన్ని దేశంలోని సెక్యూలరిజానికి మారుపేరుగా పేర్కొంది. హిందుత్వవాదమే దేశాన్ని సెక్యూలరిజం వైపు నడుపుతుందని, సంఘ్ పరివార్ మాత్రం ఈ సందేశాన్ని వక్రీకరించిందని సోనియాగాంధీ అన్నారు.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమల్‌నాథ్ తాను హనుమంతుడి భక్తుడినని చెప్పుకున్నారు.

ప్రియాంక గాంధీ వాద్రా కూడా తరచూ ఆలయాలకు వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)