బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?

ఫొటో సోర్స్, PTI
- రచయిత, నిఖిలా హెన్రీ
- హోదా, బీబీసీ కోసం
వ్యాపార,వాణిజ్య బోర్డులన్నీ కన్నడంలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లీషులో ఉన్న బోర్డులను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేయడంతో భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు నగరం, కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు పతాక శీర్షికలలో నిలిచింది.
నగరంలో బోర్డులన్నీ తప్పనిసరిగా 60 శాతం కన్నడంలోనే ఉండాలనే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వి) ఆందోళనకు దిగింది.
కేఆర్‌వీకి దేశంలోని కొన్ని ముఖ్యమైన రాజకీయపక్షాలు మద్దతు పలికాయి. కానీ, హింసను ఖండించాయి. అయితే, కన్నడభాషలో బోర్డులు ఉండాలని డిమాండ్ చేయడంలో తప్పులేదని చెప్పాయి.
‘‘కన్నడంలో బోర్డులు ఉంటే నష్టమేముంది? ఇదేమీ ఇంగ్లాండ్ కాదు, ఇంగ్లీషులో రాయడానికి’’ అని భారతీయ జనతాపార్టీకి చెందిన ఓ మంత్రి స్థానిక న్యూస్ ఛానల్‌తో అన్నారు.
కర్ణాటకలో జరిగిన ఆందోళన పెద్ద ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. దేశంలో 300లకు పైగా భాషలు ఉన్నాయి. భాషాపరమైన గుర్తింపులు ఇక్కడ సాధారణమే.
ఉదాహరణకు కర్ణాటకకు పొరుగునే ఉన్న తమిళనాడులో తమిళ భాష అనుకూల నిరసనకారులు 1930 నుంచి ‘‘తమిళుల కోసమే తమిళనాడు’’ అనే నినాదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు.
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకే భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒక చోట చేర్చి ఆయా భాషా రాష్ట్రాలుగా ఏర్పరిచారు. అలా 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది.
అయితే, దేశం నలుమూలలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నగరానికి వచ్చి జీవిస్తున్న నేపథ్యంలో బెంగళూరులో కన్నడం మాట్లాడేవారు వెనుకబడిపోతున్నారని, గతనెలలో ఇంగ్లీషు సైన్ బోర్డులను పీకిపారేసిన కేఆర్‌వి దశాబ్దాలుగా వాదిస్తోంది.
బెంగళూరు నగరలో నివసించే ప్రతి పదిమందిలో నలుగురు బయటి నుంచి వచ్చినవారేనని నివేదికలు చెబుతుప్పటికీ రెండింట మూడొంతులమంది ప్రజలు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు.
ఇలా వలసలు వచ్చేవారు త్వరలో మైనార్టీలుగా మారతారని కొంతమంది స్థానికులు భావిస్తున్నారు.
కేఆర్‌వి నినాదమైన ‘కన్నడ ఫస్ట్’ భాషా జాతీయవాదం నుంచి పుట్టుకొచ్చిందే.
కన్నడం మాట్లాడేవాందరూ 1920లోనే ప్రత్యేక రాష్ట్రం కోరారని సాంస్కృతిక చరిత్రకారిణి జానకి నాయర్ తన పరిశోధనా పత్రంలో తెలిపారు.
మొదట్లో కన్నడజాతీయవాదులు ఇంగ్లీషు సహా అనేక ఇతర భాషలకు అనుకూలంగానే ఉండేవారని నాయర్ తెలిపారు.
‘‘ఇంగ్లీషు మా సంస్కృతిక, రాజకీయ భాష. సంస్కృతం మా ఆధ్యాత్మిక, శాస్త్రీయ భాష. కన్నడం మా స్థానిక మాట్లాడే భాష అని ఓ కన్నడ జాతీయవాది చెప్పినట్టు’’ ఆమె రాశారు.
‘‘తొలి రోజులలో ఈ భాషా వివాదం ఎప్పుడూ గొడవలకు దారితీయలేదు. అప్పుడు భాషాభివృద్ధి, సాహిత్యంపైనే దృష్టి సారించేవారు. తరువాత ఉద్యమాలు తీవ్రరూపం దాల్చడం మొదలైంది’’ అని కన్నడ పండితుడు ముజఫర్ అస్సాది బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, K VENKATESH
సినీస్టార్ల మద్దతు
కర్ణాటకలో 1980లో తీవ్రమైన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వీరు ఇంగ్లీషును వ్యతిరేకించే ముందు కన్నడ జాతీయవాదులు ఇతర భారతీయ భాషలైన సంస్కృతం, తమిళం, ఉర్దూ, హిందీలను వ్యతిరేకించినట్టు విద్యావేత్తలు చెప్పారు.
పాఠశాలల్లో సంస్కృతానికి బదులుగా కన్నడం ప్రథమ భాషగా ఉండాలని డిమాండ్ చేస్తూ 1982లో జరిగిన గోకాక్ ఉద్యమమే తొలి తీవ్రమైన ఆందోళన.
ఈ ఉద్యమానికి కన్నడ సినీ పరిశ్రమ కూడా మద్దతు పలికింది. సూపర్ స్టార్ రాజ్ కుమార్ దీనికి నాయత్వం వహించారు. దీనితరువాత 1991లో తమిళ వ్యతిరేక అల్లర్లు జరిగాయి. బెంగళూరు, మైసూరు నగరాలు దిగ్బంధానికి గురయ్యాయి. కావేరి నదీ జలాల వాటాపై ఈ వివాదం రేగింది.
అటు తమిళనాడు ప్రజలు, ఇటు కన్నడ ప్రజలు ఎవరికి వారు తమకే అత్యధిక నీటి వాటా కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
తరువాత 1996లో ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్‌లో ఉర్దూభాషలో కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
రెండుదశాబ్దాల తరువాత 2017లో కేఆర్‌వి హిందీకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సందర్బంగా బెంగళూరు మెట్రోలైన్‌లో చేసే బహిరంగ ప్రకటనలు, హిందీ బోర్డులను తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
‘‘నమ్మ మెట్రో, హిందీ బేడ’’ ‘ (మన మెట్రో, హిందీ వద్దు) అంటూ చేసిన నినాదం సామాజిక మాధ్యమాలలో కొన్నిరోజులపాటు ట్రెండ్ అయింది.
1990లో సమాచార సాంకేతిక రంగం అభివృద్ది చెందడం మొదలై, ఇంగ్లీషు మాట్లాడే ఉద్యోగులు పెరుగుతున్నసందర్భంగా కన్నడ జాతీయవాదులు ఇంగ్లీషుకు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు.
ఇంగ్లీషు మాట్లాడే వారు తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారనే ఓ సాధారణ అబిప్రాయం కన్నడిగులలో ఉంది.
దీంతో 1980లో సరోజిని మహిషి కమిటీ సిఫార్సుల మేరకు కన్నడిగులకు తగిన కోటాను అమలు చేయాలని కేఆర్‌వి డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.
భారతదేశ సమాఖ్య విధాన మూలాలు ప్రాంతీయ స్వయంప్రతిపత్తిలో ఇమిడిపోయి ఉన్నాయని, దీనికి ఇంగ్లీషు అడ్డుగా ఉన్నందున తాము ప్రాంతీయభాషలకు మాత్రమే మద్దతు ఇస్తామని కేఆర్‌వికి చెందినవారు చెబుతున్నారు.
అయితే, తాము ఇంగ్లీషు కీలక పాత్ర పోషించే బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకం కామని వారు చెప్పారు.
‘‘కన్నడం, కన్నడ ప్రజలు ముందు వరుసలో ఉండాలన్నదే మా ఆలోచన’’ అని కేఆర్‌వి కార్యనిర్వాహక కార్యదర్శి అరుణ్ జవగల్ చెప్పారు.
అరుణ్ కూడా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, PTI
బెంగళూరు ప్రతిష్ఠకు దెబ్బా?
కన్నడ జాతీయవాదంపై కర్ణాటకలో వ్యతిరేకత కనిపించదు.
కొంతమంది కన్నడిగులు కన్నడ రక్షణ వేదిక డిమాండ్లకు ఆవేశంగా మద్దతు పలుకుతుంటారు.
కన్నడ రక్షణ వేదికకు కర్ణాటకలో బెంగళూరు సహా ఎంతోమంది మద్దతు ఉందని అరుణ్ జవగల్ చెప్పారు.
అయితే, ఇంగ్లీషు బోర్డులను తొలగించడం బెంగళూరుకు ఉన్న విశ్వనగరం ప్రతిష్ఠను దెబ్బతీయదా? అంటే కానే కాదని పేర్కొంది ఫెడరేషన్ ఆప్ కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కెసిసి).
ఈ సంస్థ రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ‘‘చట్టాన్ని అనుసరించి సైన్ బోర్డులలో కన్నడాన్ని ప్రముఖంగా వాడమని మేం వ్యాపార సంస్థలను కోరాం’’ అని ఎఫ్‌కెసిసి అధ్యక్షుడు రమేష్ చంద్ర చెప్పారు.
సైను బోర్డులన్నీ కన్నడంలోకి మార్చేందుకు ఫిబ్రవరి 28ని గడువు తేదీగా నిర్ణయించారు.
యురోపియన్ దేశాల్లోని బోర్డులన్నీ వారి భాషల్లో ఉన్నప్పుడు 6 కోట్ల జనాభా ఉన్న కర్ణాటకలో ఎక్కువ మంది కన్నడమే మాట్లాడే రాష్టంలో స్థానిక భాషలో బోర్డులు ఉంటే తప్పేంటని కన్నడ రక్షణ వేదిక నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్: ‘మహిళను గర్భవతిని చేస్తే రూ.5 లక్ష లు ఇస్తాం’ అంటూ సాగే ఈ స్కామ్‌లో బాధితులు ఎలా చిక్కుకుంటున్నారంటే...
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- రొమాంటిక్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
- కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














