మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది

మల్టిపుల్ స్ల్కెరోసిస్

ఫొటో సోర్స్, SAYOSTUDIO

    • రచయిత, ఫిలిప్పా రాక్సీ
    • హోదా, హెల్త్ రిపోర్టర్

యూరప్‌లోని కొన్ని చోట్ల ఇతర ప్రాంతాలతో పోలిస్తే వ్యాధులు ఎక్కువ. దీనికి కారణమేంటి?

దక్షిణ యూరోపియన్ల కంటే ఉత్తర యూరోపియన్లు ఎందుకు పొడవుగా ఉంటారు?

ఇలాంటి ప్రశ్నలకు పురాతన దంతాలు, ఎముకలలోని డీఎన్‌ఏ నుంచి సమాధానాలు కనుగొన్నామని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి చెప్పింది.

జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన పూర్వీకులను రక్షించిన జన్యువులు ఇప్పుడు మల్టిపుల్ స్ల్కెరోసిస్ (ఎంఎస్) వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.

ఈ వ్యాధి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో తాజా ఆవిష్కరణ ఒక పెద్ద పురోగతి అని పరిశోధకులు అభివర్ణించారు.

ఇది ఎంఎస్ వ్యాధి కారకాలపై అభిప్రాయాన్ని మార్చగలదని, దాని చికిత్స విధానాలపై ప్రభావం చూపగలదని వారు చెబుతున్నారు.

ఎంఎస్

ఫొటో సోర్స్, NATURE / UNIVERSITY OF COPENHAGEN

ఫొటో క్యాప్షన్, 1947లో డెన్మార్క్‌లోని పోర్స్‌మోస్‌లో లభ్యమైన నియోలిథిక్ పురుషుడి పుర్రె

మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ అంటే ఏంటి?

మల్టిపుల్ స్ల్కెరోసిస్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక తీవ్రమైన వ్యాధి.

ఇందులో మెదడు, ఆప్టిక్ నర్వ్, వెన్నుపాములోని నరాల రక్షక కవచం మీద మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే దాడి చేస్తుంది.

దీనివల్ల నడవటం, మాట్లాడటంలో సమస్యలతో పాటు కండరాలు బిగుసుకుపోవడం వంటివి జరుగుతాయి.

దీని తీవ్రత ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.

దక్షిణ యూరప్‌తో పోల్చితే యూకే, స్కాండినేవియాతో సహా వాయువ్య యూరప్‌లో ఎంఎస్ కేసులు రెండింతలు ఎక్కువ.

దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి కేంబ్రిడ్జి, కోపెన్‌హాగన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 10 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు.

ఎంఎస్ వ్యాధి ముప్పును పెంచే జన్యువులు 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య యూరప్‌లోకి ప్రవేశించాయని పరిశోధకులు కనుగొన్నారు.

‘యమ్నాయా’ అనే పశువుల కాపరులు భారీగా వలస రావడంతో ఈ జన్యువులు వాయువ్య యూరప్‌లోకి వచ్చినట్లు వారు గుర్తించారు.

పశ్చిమ రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్ నుంచి యమ్నాయా ప్రజలు పశ్చిమాన యూరప్ వైపు తరలి వెళ్లినట్లు ఈ అంశం మీద నేచర్ మ్యాగజీన్ ప్రచురించిన వరుస కథనాల్లోని ఒకటి పేర్కొంది.

ఈ పరిశోధన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పురాతన డీఎన్‌ఏ విశ్లేషణ నిపుణుడు, రచయిత డాక్టర్ విలియం బారీ చెప్పారు.

ఆ సమయంలో కాపరుల్లో ఉన్న జన్యువైవిధ్యాలు తమ గొర్రెలు, పశువుల నుంచి వ్యాధులు సోకకుండా వారికి రక్షణ కల్పించాయి.

అయితే, ఇప్పుడు ఆధునిక జీవనశైలి, ఆహారపద్ధతులు, మెరుగైన పరిశుభ్రతతో ఈ జన్యువైవిధ్యాల పాత్ర మారిపోయింది.

ఇప్పుడు ఇవే లక్షణాలు మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి నిర్ధిష్ట వ్యాధులు ఏర్పడే ముప్పును పెంచుతున్నాయి.

ఇది చాలా పెద్ద పరిశోధన ప్రాజెక్టు. యూరప్, పశ్చిమాసియాల్లో కనుగొన్న పురాతన మానవ అవశేషాల నుంచి సంగ్రహించిన జన్యు సమాచారాన్ని ఇప్పుడు యూకేలో నివసిస్తున్న వేలాదిమంది జన్యువులతో పోల్చి చూశారు.

ఈ ప్రక్రియలో చాలా దేశాల్లోని మ్యూజియం కలెక్షన్లలో భద్రపరిచిన 5 వేల ప్రాచీన మానవుల డీఎన్‌ఏ బ్యాంకును ఇప్పుడు భవిష్యత్ పరిశోధనల కోసం ఏర్పాటు చేశారు.

పశువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గొర్రెలు, గుర్రాలు వంటి జంతువులతో కలిసి మన పూర్వీకులు జీవించారు

‘స్వీట్ స్పాట్ ’

తాజా ఆవిష్కరణ ఎంఎస్ వ్యాధి రహస్యాలను తెలుసుకోవడంలో సహాయపడుతుందని ఆక్స్‌ఫర్డ్ జాన్ రాడ్‌క్లిఫ్ హాస్పిటల్ ఎంఎస్ డాక్టర్, పేపర్ రచయిత, ప్రొఫెసర్ లార్స్ ఫుగర్ అన్నారు.

టీకాలు, యాంటీబయాటిక్స్, పరిశుభ్రత ప్రమాణాలు వ్యాధుల తీరును పూర్తిగా మార్చేశాయి. ఇప్పటికి చాలా వ్యాధులు అదృశ్యం అయ్యాయి. ప్రజల ఆయుర్దాయం పెరిగింది.

ఆధునిక రోగనిరోధక వ్యవస్థలు ఎంఎస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు రావడానికి మరింత అనువుగా మారాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పుడు ఎంఎస్ వ్యాధి చికిత్సకు వాడుతున్న మందులు శరీర రోగ నిరోధక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, ఇందులో ప్రతికూలత ఏంటంటే, రోగనిరోధక వ్యవస్థను అణచివేస్తే ఇన్‌ఫెక్షన్లపై పోరాడటంలో రోగులు ఇబ్బందిపడతారు.

‘‘రోగనిరోధక వ్యవస్థను తుడిచిపెట్టేలా కాకుండా దానితో సమతుల్యం చేసుకునే చికిత్సా పద్ధతిని కనిపెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్ ఫుగర్ చెప్పారు.

పురాతన డీఎన్‌ఏలోని ఇతర వ్యాధుల గురించి పరిశోధించాలని ఈ బృందం అనుకుంటోంది.

వారి పరిశోధన ఆటిజం, ఏడీహెచ్‌డీ, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ వంటి వ్యాధుల మూలాల గురించి మరింత వెల్లడిస్తుంది.

దక్షిణ యూరోపియన్ల కంటే వాయువ్య యూరోపియన్లు పొడవుగా ఉండటానికి కూడా యామ్నాయా కాపరులకు సంబంధముందనే ఆధారాలను నేచర్ మ్యాగజీన్ ప్రచురించిన మరో పేపర్‌లో పేర్కొన్నారు.

జన్యువుల పరంగా ఉత్తర యూరోపియన్లకు ఎంఎస్ వ్యాధి వచ్చే ముప్పు అత్యధికంగా ఉండగా, దక్షిణ యూరోపియన్లు బైపోలార్ డిజార్డర్ బారిన పడే అవకాశం అధికం. తూర్పు యూరోపియన్లకు అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

వేటగాళ్ల నుంచి వచ్చిన డీఎన్‌ఏ కారణంగా అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందని, పురాతన రైతుల జన్యువులకు ప్రవర్తనా రుగ్మతల(మూడ్ డిజార్డర్స్)కు సంబంధం ఉంటుందని ఈ పరిశోధన వివరిస్తుంది.

మానవులకు పాలు, పాల పదార్థాలు, కూరగాయల భోజనాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం 6 వేల ఏళ్ల క్రితం నుంచే వచ్చిందని, అంతకుముందు మానవులంతా మాంసాన్నే తినేవారని వారు గుర్తించారు.

యూరేషియాలో కనుగొన్న వేలాది పురాతన అస్థిపంజరాలు నుంచి ప్రస్తుత యూరోపియన్ల డీఎన్‌ఏలను ఈ పరిశోధనలో పోల్చి చూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)