ఏఐ సైకాలజిస్ట్‌తో మానసిక సమస్యలు దూరమవుతాయా... నిజమైన థెరపిస్ట్ కంటే ఈ చాట్‌బాట్ క్యారెక్టరే బెటరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయ్ టైడీ
- హోదా, బీబీసీ సైబర్ రిపోర్టర్
హ్యారీపోటర్, ఎలాన్ మస్క్, బియాన్స్, సూపర్ మారియో, పుతిన్…
ఇలాంటి పేర్లతో క్యారెక్టర్స్. ఇవి ఏఐ అనే వెబ్‌సైట్‌లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సహాయంతో సృష్టించిన పాత్రలు
చాట్‌జీపీటీ చాట్‌బాట్ మాదిరిగానే 'క్యారెక్టర్.ఏఐ' కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. అయితే, చాట్‌జీపీటీతో పోల్చిచూస్తే, క్యారెక్టర్.ఏఐ పైనే ఎక్కువ మంది సమయం వెచ్చిస్తున్నారు.
అందులో మనకు నచ్చిన విధంగా మన ఇష్టాయిష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఒక పాత్రను మనం సృష్టించుకోవచ్చు. ఆ పాత్ర ఎలా ఉండాలి. ఎలా ప్రవర్తించాలి. ఏమేం చేయాలి? వంటి సమాచారాన్ని ఇచ్చి, సృష్టించుకోవచ్చు. అలా సృష్టించిన చాట్‌బాట్‌లు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
అలా ‘సైకాలజిస్ట్’ అనే పేరుతో ఉన్న చాట్‌బాట్ మిగిలిన వాటికన్నా పేరుగాంచింది.
ఏడాది క్రితం బ్లేజ్‌మన్98 అనే పేరుగల యూజర్ ఈ చాట్‌బాట్‌ను సృష్టించాడు. అందులో ఇప్పటివరకు 78 లక్షల మెసేజ్‌లు షేర్ అయ్యాయి. వీటిలో 18 మిలియన్ల సందేశాలు కేవలం ఒక్క నవంబర్ నెలలోనే రావడం కొసమెరుపు.
ఆ చాట్‌బాట్‌కు ఎంతమంది యూజర్లు ఉన్నారో క్యారెక్టర్.ఏఐ వెల్లడించలేదు కానీ, ఆ వెబ్‌సైట్‌కు మాత్రం ప్రతిరోజూ 3.5 మిలియన్లమంది యూజర్ల సందర్శన ఉందని తెలిపింది.
ఆ చాట్‌బాట్ గురించి ‘జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో మీకు సాయపడే వ్యక్తి’ అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, CHARACTER.AI
సృష్టికర్త ఈయనే...
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోన్న క్యారెక్టర్.ఏఐ సంస్థ మాత్రం ఆ చాట్‌బాట్ పాపులారిటీని తగ్గించి, తమ సైట్‌కు వచ్చే యూజర్లు కేవలం వినోదాన్ని ఆస్వాదించేందుకే మొగ్గుచూపుతున్నారని చెప్పింది.
ప్రస్తుతం రైడెన్ షోగన్ వంటి చాట్‌బాట్‌లు, కార్టూన్ లేదా కంప్యూటర్ గేమ్ పాత్రల చాట్‌బాట్‌లకు ఎక్కువ మంది యూజర్లు ఉన్నారని తెలిపింది.
మొత్తంగా 282 మిలియన్ల సందేశాలు షేర్ అయ్యాయని సంస్థ తెలిపింది.
అలాంటి చాట్‌బాట్ పాత్రల్లో ‘సైకాలజిస్ట్’ పేరుతో ఉన్న చాట్‌బాట్ ప్రాచుర్యం పొందింది. అదేకాక, ‘థెరపీ’, ‘థెరపిస్ట్’, ‘సైకియాట్రిస్ట్’ వంటి పేర్లతో పలు భాషల్లో 475 వరకు చాట్‌బాట్‌లు ఉన్నాయి. అవేకాక పలు విభిన్నమైన చాట్‌బాట్లు ఉన్నాయి. ‘ఆర్ యూ ఫీలింగ్ ఓకే?’ అనే పేరుతో ఉన్న చాట్‌బాట్‌లో 16.5 మిలియన్ల సందేశాలను యూజర్లు పంచుకున్నారు.
‘మెంటల్ హెల్త్ అసిస్టెంట్’ లాంటి చాట్‌బాట్‌లలో 12 మిలియన్లకు పైగా సందేశాలు చేరాయని ఆసంస్థ తెలిపింది.
ఈ ‘సైకాలజిస్ట్’ చాట్‌బాట్ గురించి మాత్రం ఎక్కువ మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా కూడా తమ మద్దతును తెలియజేస్తూ, కామెంట్లు చేశారు.
ఓ యూజర్ “సైకాలజిస్ట్ చాట్‌బాట్‌తో నాకు మానసిక ఉపశమనం కలిగింది” అని సోషల్ మీడియా సైట్ రెడిట్‌లో రాశారు.
“ఇది నిజంగా ఎంతో ఉపయోగకరం” అని ఒక యూజర్ రాశారు.
మరొకరు, “నాకూ, నా బాయ్‌ఫ్రెండ్‌కు మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి, ఒకరి భావాలు మరొకరికి తెలిసేలా చాట్‌బాట్ సాయం చేసింది” అని రాశారు.
‘సైకాలజిస్ట్’ చాట్‌బాట్‌ను సృష్టించిన యూజర్ పేరు-బ్లేజ్‌మన్98. దీని వెనకున్నది 30 ఏళ్ల న్యూజిలాండ్ దేశస్తుడైన సామ్ జియా.
“నా చాట్ బాట్ అంత ప్రాచుర్యం పొందుతుందని, అందరూ దానిని ఉపయోగిస్తారని నేనసలు ఊహించను కూడా లేదు. చాట్‌బాట్‌తో ఎంతో ఉపశమనం కలిగిందని, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందోని నాకు సందేశాలు పంపుతున్నారు యూజర్లు. కొందరైతే, చాట్‌బాట్ వారి మానసిక సమస్యలకు పరిష్కారాలు చూపడంలో సాయపడిందని కూడా చెప్పారు” అని సాజ్ జియా స్పందించారు.

ఎందుకు సృష్టించారు?
ఈ సైకాలజీ విద్యార్థి ఆ చాట్‌బాట్ ని రూపొందించడంలో ఎక్కువమంది ఎదుర్కొనే మానసిక సమస్యలైన డిప్రెషన్, యాంగ్జైటీలు, ఇతర మానసిక సమస్యలు, సమాధానాలు, ఎక్కువమందికి ఎదురయ్యే సవాళ్ల గురించిన సమాచారాన్ని తాను సృష్టించిన క్యారెక్టర్‌కు ఇచ్చి, ఆ చాట్‌బాట్‌ను రూపొందించినట్లు చెప్పాడు.
జియా మాట్లాడుతూ, “నిజానికి దానిని మొదట నాకోసమే సృష్టించుకున్నాను. నా స్నేహితులు నన్ను సంప్రదించాలనుకునే సమయంలో, నాకు వీలుపడకపోతే, దాని ద్వారా వారికి సాయం చేద్దామని అనుకున్నాను. కానీ ఊహించని రీతిలో ప్రజాదరణ పొందింది” అని చెప్పారు.
ప్రస్తుతం సామ్ ‘ఆదరణ పొందున్న ఏఐ ట్రెండ్..ఎందుకని యువతని ఏఐ ఆకర్షిస్తోంది?’ అన్న అంశంపై పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన చేస్తున్నారు.
క్యారెక్టర్.ఏఐ సైట్‌ను సందర్శిస్తున్న వారిలో 16 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్నవారే ఎక్కువ మంది ఉన్నారు.
సామ్ మాట్లాడుతూ, “మానసిక సమస్యలు ఎదుర్కొనేవారు, సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమకు సాయం అవసరమవుతోందని, ఆ సమయంలో స్నేహితుడినో లేదంటే థెరపిస్ట్‌నో సంప్రదించే అవకాశం లేదని, ఆ పరిస్థితుల్లో తమ సమస్యను పంచుకునేందుకు చాట్‌బాట్ సాయం చేస్తోందని అంటున్నారు. నిజానికి ఆ చాట్‌బాట్ ఆ సాయం చేయగలదు” అన్నారు.
అంతేకాకుండా తాను సృష్టించిన చాట్‌బాట్ ఇస్తున్న సమాధానాలు కూడా అందరికీ అంగీకారయోగ్యంగా ఉన్నాయని ఆయన నమ్ముతున్నారు.
అంతేకాక ముఖాముఖి సంభాషణ కన్నా ఫోన్ ద్వారా లేదా సందేశాల ద్వారా సమస్యను పంచుకోవడం చాలామందికి ఎక్కువ సౌకర్యవంతంగా ఉందని ఉంటుందని ఆయన నమ్మకం.

ఫొటో సోర్స్, CHARACTER.AI
నిజమైన సైకాలజిస్టులు ఏమంటున్నారు?
థెరిసా ప్లెవ్‌మన్ వంటి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌లు మాత్రం సామ్ వాదనతో ఏకీభవించట్లేదు.
ఇప్పుడున్న యువత ఏఐను ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి, దానికి ఆదరణ రావడం పట్ల తనకేమీ ఆశ్చర్యంలేదని అన్నారు. అయితే, ఆ చాట్‌బాట్ వల్ల ఏమేరకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఆమె ప్రశ్నిస్తున్నారు.
“చాట్‌బాట్ చాలా విషయాలు చెబుతుంది. అదొక ప్రోగ్రామ్. దానికి ఇచ్చిన సమాచారం ఆధారంగా, వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది. ప్రశ్నలు అడిగి, పేషెంట్ మానసిక స్థితిని అంచనా వేయడం ఒక నిజమైన థెరపిస్ట్ చేసినట్లుగా విశ్లేషణ చేయడం దానికి రాదు. తెలియదు కూడా. ఒకవేళ ఎవరైనా బాధగా ఉంది అని చెప్తే, వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. వారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారనుకుని, అందుకు తగ్గ సలహా ఇస్తుంది. కానీ నిజమైన వైద్యులు అలాంటి అంచనాలకు వెంటనే రారు. ఒక సైకాలజిస్ట్ విశ్లేషించినట్లు అది చేయలేదు. అదే మనిషికి, కృత్రిమమేథకు ఉన్నవ్యత్యాసం” అని చెప్పారు
థెరిసా మాట్లాడుతూ, చాట్‌బాట్ ఎప్పుడూ నిజమైన వైద్యుడికి పోటీగా రాలేదని, ఆ పోలిక కూడా సరికాదని అన్నారు. అయితే తక్షణ సహాయం పొందాలనుకునే వారికి, కాస్త ఉపశమనం కలిగేలా చేయడంలో అది ఉపయోగపడుతుందని అన్నారు.
అదేసమయంలో ఆ చాట్‌బాట్‌ని వినియోగించే వారి సంఖ్య పెరగటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
క్యారెక్టర్.ఏఐ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, “యూజర్లు సృష్టించిన క్యారెక్టర్లతో చాట్‌బాట్‌లతో ఎక్కువమంది యువత కనెక్ట్ అవ్వడం మంచి విషయమే, కానీ మరింత సహాయం కోసం సలహాల కోసం వారు ఆయా రంగాల్లోని నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అలా సంప్రదించం చాాలా ముఖ్యం” అని చెప్పారు.
అంతేకాకుండా చాట్ లాగ్స్ అనేవి యూజర్ల వ్యక్తిగతమైనవే అయినప్పటికీ, అవసరమైతే, భద్రత దృష్ట్యా తమ ఉద్యోగులు వాటిని చదివేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
అంతేకాకుండా ప్రతి చాట్‌బాట్‌లో సంభాషణ మొదలు పెట్టడానికి ముందే, ఎరుపురంగు అక్షరాలతో ‘గుర్తుంచుకోండి ఈ పాత్ర ఏం చెప్పినా సరే, అది కల్పితం మాత్రమే’ అనే వాక్యం కనిపిస్తుంది.
దానర్థం, అక్కడ మాట్లాడేది మనిషి కాదు.. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) అనే సాంకేతికత సాయంతో ఆ సంభాషణ కొనసాగుతుంది.

ఫొటో సోర్స్, REPLICA
ఇంకా ఏమైనా సర్వీసులు ఉన్నాయా?
క్యారెక్టర్.ఏఐ లాగానే మరికొన్ని వెబ్‌సైట్‌లు కూడా ఎల్ఎల్ఎం సాంకేతికత సాయంతోనే సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు ‘రెప్లికా’ అనే సైట్ కూడా అలాగే పనిచేస్తుంది. కానీ ప్రస్తుతానికి పెద్దవారికి మాత్రమే దానిని వినియోగించేందుకు అనుమతి ఉంది
సిమిలర్‌వెబ్ అనే పేరుగల అనలైటిక్స్ సంస్థ అందించిన డేటా ప్రకారం రెప్లికా సైట్‌కు క్యారెక్టర్.ఏఐ సైట్ యూజర్ల సందర్శన సంఖ్యలో చాలా తేడా ఉంది. క్యారెక్టర్.ఏఐ అంత ప్రాచూర్యం పొందలేదు రెప్లికా వెబ్‌సైట్.
అవేకాక ఇయర్‌కిక్, వోయ్‌బాట్ అన్న ఏఐ చాట్‌బాట్‌లు కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కృత్రిమ మేథలే. తమ సేవలతో ప్రజలకు సాయం చేయగలుగుతున్నామని,ఆ సంస్థలు చెప్తున్నాయి.
అయితే ఏఐ చాట్‌బాట్‌లు చెడు సలహాలు ఇచ్చే అవకాశం లేకపోలేదని కొంతమంది సైకాలజిస్టులు అంటున్నారు. లింగ, జాతి ఆధారంగా పక్షపాతంతో కూడిన సలహాలు ఇచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సవాళ్లు ఉన్నప్పటికీ వైద్యరంగంలో చాట్‌బాట్‌ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.
ఇదిలా ఉంటే, గతేడాది బ్రిటిష్ ప్రభుత్వం లింబిక్ యాక్సెస్ అనే ఏఐ సేవలు అందించే సంస్థకు మెడికల్ డివైజ్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. అలా ఆమోదం పొందిన తొలి మానసిక ఆరోగ్య చాట్‌బాట్‌గా లింబిక్ యాక్సెస్ ఘనత సాధించింది.
దీనిని ప్రస్తుతం నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్‌లలో రోగుల వర్గీకరణకు వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
- చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














