మీరా మురాటి: అల్బేనియా నుంచి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ‘క్వీన్’గా ఎదిగిన ఈమె ఎవరు? పేద దేశంలో పుట్టి సిలికాన్ వ్యాలీలో ప్రభావవంతంగా ఎలా మారారు

ఫొటో సోర్స్, Getty Images
నవంబర్ నెల చివరలో ఓపెన్ ఏఐ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరా మురాటి వార్తల్లో నిలిచారు.
అంతటి బాధ్యతాయుతమైన పోస్టులో నియమితులైన మీరా అంతకుముందు ఒక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
అలా ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మీరా మురాటి కంపెనీ ముఖ్యుల్లో ఒకరిగా మారారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చాట్ జీపీటీ ఈ కంపెనీ రూపొందించినదే.
అల్బేనియాకు చెందిన ఈ 34 ఏళ్ల ఇంజినీర్‌ను ఈ ఏడాది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలలో ఒకరిగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. అలాగే, టెక్నాలజీ హబ్ అయిన సిలికాన్ వ్యాలీలో ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా మారారామె.
అయితే, కంపెనీలో తన బాధ్యతలు అంత సులభం కాదని మీరా మురాటి అంటున్నారు.
'ది డైలీ షో' ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ''నిత్యం ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అల్బేనియా మూలాలు
మీరా మురాటి అల్బేనియాలో 1988లో జన్మించారు. బాల్కన్ ద్వీపకల్పంలోని ఒక చిన్న దేశమైన అల్బేనియాలో కమ్యూనిస్ట్ పాలన పతనం అయ్యేందుకు కొన్నేళ్ల ముందు ఆమె జన్మించారు. యూరప్‌లోని అత్యంత పేద దేశాల్లో ఇదొకటి.
లిటరేచర్ ప్రొఫెసర్ కుమార్తె మీరా. దేశం క్రూరమైన కమ్యూనిజం నుంచి ఉదారవాద పెట్టుబడిదారీ విధానంలోకి పరివర్తన చెందుతున్న కాలంలో ఆమె బాల్యం గడిచింది.
'బిహైండ్ ది టెక్'తో మాట్లాడుతూ, "నాకు రెండేళ్ల వయసులో, నియంతృత్వ ప్రభుత్వం పడిపోయింది. రాత్రికిరాత్రి అరాచకం జరిగింది" అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి ఉండేదన్నారు.
"ప్రస్తుతం ఉత్తర కొరియా తరహాలో అల్బేనియా కూడా ఒంటరి దేశం" అని ఆమె అన్నారు. పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడిపేదాన్నని, అంతకుమించి ఇతర అభిరుచులు పెద్దగా లేవని అన్నారు.
పదహారేళ్ల వయసులో కెనడాలోని వాంకోవర్‌లో చదువుకునేందుకు ఆమె స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యారు. రెండేళ్ల హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత, డార్ట్‌మౌత్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓపెన్ ఏఐలో ఉద్యోగం
అనంతరం ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎలన్ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీలో చేరారు. అక్కడ కొత్త మోడల్స్ రూపకల్పనలో ఆమె పనిచేశారు.
టెస్లా తర్వాత లీప్ మోషన్ కంపెనీలో ప్రొడక్ట్స్ అండ్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా కొద్దికాలం పనిచేశారు.
అనంతరం 2018లో ఆమె ఓపెన్ ఏఐలో చేరారు. సంస్థ పేరు మార్మోగేలా చేసిన చాట్ జీపీటీ, డల్ - ఇ రూపకల్పనలో టెక్నాలజీ విభాగంలో కీలకపాత్ర పోషించారు.
ఆ సమయంలో ఓపెన్ ఏఐ లాభాపేక్ష లేని ఒక పరిశోధనా సంస్థగా ఉండేది. ఆ తర్వాత అది వాణిజ్య సంస్థగా మారింది.
ఆమె అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఓపెన్ ఏఐ కంపెనీలో చేరారు. అనంతరం 2020లో ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత 2022లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఓపెన్ ఏఐ సంబంధాల్లో మీరా మురాటి కీలకపాత్ర పోషించారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్ ఏఐలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, అమెరికాతో పాటు యూరప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలకు మద్దతుగా నిలిచింది.
''ఆమెకున్న సాంకేతిక నైపుణ్యం, వ్యాపార చతురత, మిషన్ పూర్తి చేసేందుకు అవసరమైన టీమ్స్ ఏర్పాటు చేయడంలో ఆమె సామర్థ్యం'' గురించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టైమ్ మ్యాగజైన్‌కి రాసిన వ్యాసంలో ప్రస్తావించారు.
''అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో మునుపెన్నడూ లేని కొత్త అప్లికేషన్లు రూపొందించడంలో ఆమెకు సాయపడ్డాయి'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏఐ ప్రమాదకర సామర్థ్యాలు
తనను ఇబ్బంది పెట్టే విషయాల్లో ప్రమాదకరమైన సామర్థ్యాలున్న ఏఐ టెక్నాలజీ టూల్స్ ఒకటని ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
''మేం సృష్టించిన వాటిలో అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన టెక్నాలజీ ఇదే. అణ్వాయుధాలకు సంబంధించిన వ్యవహారమే ఇందులో అతిపెద్ద సమస్య'' అన్నారామె.
అలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడానికి మనం ఏదో ఒకవిధంగా నిబంధనలను రూపొందించడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆమెను ప్రశ్నించినప్పుడు, కొన్ని మంచి ప్రయోజనాలు, కొంత ప్రమాదకర పరిస్థితులు ఉండొచ్చని, రెండింటికీ అవకాశం ఉందని అన్నారు.
“అంతా సవ్యంగా జరిగేలా చూసుకోగలమని అనుకుంటున్నా. కానీ, టెక్నాలజీతో రెండు అవకాశాలూ ఉంటాయి. ఇది కూడా మేము రూపొందించిన ఇతర టూల్స్ తరహాలోనే ఉంది. అంత ప్రమాదకర, విపత్కర పరిస్థితులకు దారితీసే అవకాశమేమీ కనిపించలేదు'' అని ఆమె చెప్పారు.
''మిగిలిన వాటితో దీనికి వ్యత్యాసమేంటంటే, ఇది మానవ మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉండొచ్చు. అయితే, నా అభిప్రాయం ఏంటంటే, అలా జరిగే అవకాశం చాలా తక్కువ. కానీ, చిన్న అవకాశాన్ని కూడా వదిలేయకూడదు. దాని గురించి కూడా క్షుణ్ణంగా ఆలోచించాల్సిందే'' అని మీరా అన్నారు.
తన టీమ్ అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ టూల్స్‌లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశాలను కూడా మీరా మురాటి టైమ్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
''టెక్నాలజీ మనల్ని ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగానే దీన్ని కూడా తయారుచేశాం. అయితే, పరిష్కరించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనం కోరుకున్నట్లు కచ్చితంగా ఎలా రూపొందించగలం, అలాగే మనుషుల ఇష్టాన్ని బట్టి పనిచేస్తుందని, మనుషులకు ఉపయోగపడేందుకే ఇది పని చేయాలని ఎలా చెప్పగలం'' అన్నారామె.
''దీనికి ఇప్పటికైతే మా దగ్గర సమాధానం లేదు. అలాగే నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిదనే ప్రశ్నకు కూడా ప్రస్తుతం సమాధానం లేదు. కొత్త కృత్రిమ మేధస్సును ఎవరు నియంత్రిస్తారు? కంపెనీలా? లేకపోతే ప్రభుత్వాలా? '' అన్నారు.

ఫొటో సోర్స్, MIRAMURATI
'అన్ని రంగాలనూ మార్చేస్తుంది'
చాట్ జీపీటీ, జీపీటీ - 4 వంటి టెక్నాలజీ టూల్స్ కాపీరైట్ ప్రపంచంలో సృష్టించగల సమస్యలను మీరా మురాటి వైర్డ్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
''ఇది అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తుంది. ప్రజలు దీన్ని విద్యుత్ లేదా ప్రింటింగ్ ప్రెస్‌తో పోల్చారు. అయితే అన్ని రంగాల్లోకి ఇది అందుబాటులోకి రావాలంటే కాపీరైట్ చట్టాలు, ప్రైవసీ, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉండేలా తీసుకురావడం ముఖ్యం'' అని ఆమె అన్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) దిశగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ప్రకటనలు లేని సేవల కోసం ఇకపై సబ్స్క్రిప్షన్ తప్పనిసరి... దీనికి ఎంత చెల్లించాలి?
- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్: ఏఐ దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతాయా... భారత్‌లో ఈ భయాలు ఎలా ఉన్నాయి?
- పాయింట్ నెమో: అంతరిక్ష నౌకల శ్మశాన వాటిక అని దీనిని ఎందుకు అంటారు?
- భూమిని ఢీకొట్టబోయే బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించిన నాసా స్పేస్‌షిప్ 'ఒసిరిస్-రెక్స్', ఆ శాంపిల్స్ ఫోటోలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














