అభినందన్ వర్ధమాన్ : ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో తెరవెనుక ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నియాజ్ ఫరూఖి
- హోదా, బీబీసీ ఉర్దూ, దిల్లీ
2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారత ఫైటర్ జెట్‌ను కూల్చివేసి పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను కస్టడీలోకి తీసుకోవడంతో రెండు దేశాల సరిహద్దుల్లోనే కాదు దౌత్యపరంగానూ ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఆ సమయంలో పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా అప్పటి పరిణామాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘యాంగర్ మేనేజ్‌మెంట్: ద ట్రబుల్డ్ డిప్లొమేటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ పేరిట వెలువడిన ఈ పుస్తకంతో ఫిబ్రవరి 27 నాటి సంఘటనలు మరోసారి చర్చనీయంగా మారాయి.
ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై కొత్త వాదనలు ప్రజల ముందుకు వచ్చాయి.
దీంతో.. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ సమాధానమిస్తూ '' ఈ పుస్తకం కల్పిత కథలను ప్రోత్సహించేలా ఉంది'' అన్నారు.
అయితే, 2019 ఫిబ్రవరిలో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన పుస్తకం 'నెవెర్ గివ్ ఏ ఇంచ్'లో రాశారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయని, అణుయుద్ధం జరగొచ్చన్న భయాందోళన నెలకొందని మైక్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
భారత పైలట్‌ను తిరిగి పంపించాలని, లేకుంటే మోదీ 12 మిస్సైల్స్‌తో సిద్ధంగా ఉన్నారని అమెరికా పాకిస్తాన్‌ను కోరిందంటూ 2019 ఏప్రిల్‌లో గుజరాత్‌లో జరిగిన ఒక ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పేర్కొనడాన్ని ఇక్కడ ప్రస్తావించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ వ్యాఖ్యలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ''బాధ్యతారాహిత్యం, యుద్దోన్మాదం''గా పేర్కొంది.
బాలాకోట్ దాడులకు తమ సైన్యం సమర్థంగా ప్రతిస్పందించిందని, యుద్ధ విమానాన్ని కూల్చివేసి పైలట్‌ను కస్టడీలోకి తీసుకుందని తెలిపింది. అది తమ సైన్యం శక్తిసామర్థ్యాలకు నిదర్శనమని చెప్పింది.
భారత పైలట్ అభినందన్‌ను నిర్బంధించిన తర్వాత, అప్పటి పాకిస్తాన్ ఫ్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీతో మాట్లాడాలని అనుకున్నారని భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో రాశారు. అయితే, అందుకు ఇండియా సుముఖత చూపలేదని పేర్కొన్నారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో పాకిస్తాన్ నిజంగానే భయపడిందని ఆయన రాశారు.
దీనికి సంబంధించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఇంకా స్పందించలేదు. అయితే, వారాంతపు విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందిస్తూ, ''అభినందన్‌ను తిరిగి అప్పగించడం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. ఈ పుస్తకం ఫిబ్రవరి 2019 గురించి భారత్ అనుకూల కల్పిత కథనాన్ని ప్రోత్సహించేలా ఉంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 27న అసలేం జరిగింది?
2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ప్రాంతంలో బాంబుదాడులు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు భారత్ పేర్కొంది.
అప్పుడు భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, భారత పైలట్ అభినందన్‌ను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది.
న్యూదిల్లీకి చెందిన అలిఫ్ పబ్లికేషన్స్ ఇటీవల ప్రచురించిన అజయ్ బిసారియా పుస్తకంలో, పాకిస్తాన్‌లో ఆయన అనుభవాలతో పాటు, ఫిబ్రవరి 27 గురించి కూడా ప్రస్తావించారు.
పుల్వామా దాడి తర్వాత భారత్ సైనిక చర్య చేపట్టినప్పుడు ఆయన దిల్లీలో ఉన్నారు. ఫిబ్రవరి 26న, పొద్దున్నే నిద్రలేవగానే పాకిస్తాన్‌పై ఇండియా బాంబులు వేసినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పాకిస్తాన్ సాయుధ దళాలకు చెందిన మీడియా వింగ్ ఐఎస్‌పీఆర్ (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) అధికార ప్రతినిధి చేసిన ఒక ట్వీట్‌ను ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్న ఆయన సహోద్యోగి షేర్ చేశారు. అందులో 'భారత్ ఫైటర్ జెట్ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి బాంబు దాడి చేసింది' అని ఉంది.
మరుసటి రోజు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక పోస్టులే లక్ష్యంగా బాంబు దాడులు చేసి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుందని ఆయన రాశారు. పాకిస్తాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయని ఆ తర్వాత భారత్ చేసిన ప్రకటన వాటిని ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, ANI
ఫిబ్రవరి 27న జరిగిన ఈ పరస్పర వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఫైటర్ జెట్‌ను తాకింది. నియంత్రణ రేఖకు ఏడుకిలోమీటర్ల దూరంలో ఆ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
'2019 ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అణుయుద్ధంగా మారే అవకాశం ఉందని ప్రపంచానికి నిజంగా తెలియదని భావిస్తున్నా' అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన 'నెవర్ గివ్ ఏ ఇంచ్' పుస్తకంలో రాశారు.
అప్పటి భారత విదేశాంగ మంత్రి ఫోన్ చేసినప్పుడు మైక్ పాంపియో వియత్నాంలో ఉన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ అణ్వాయుధాలను సిద్ధం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ కూడా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
వెంటనే తాను పాకిస్తాన్ జనరల్ బజ్వాను సంప్రదించానని, ఆ వాదనలను ఆయన ఖండించారని, అయితే భారతీయులు అణ్వాయుధాలు మోహరించేందుకు సిద్ధమవుతున్నారని వారు భయపడుతున్నారని మైక్ పాంపియో రాశారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ పీ5 దేశాలు (ఐక్యరాజ్యసమితి భదత్రా మండలిలో శాశ్వత సభ్య దేశాలు) అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, చైనా దౌత్యవేత్తలను పిలిపించిందని ఇటీవల ప్రచురితమైన పుస్తకంలో, భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఆ సమయంలో మన ప్రధాని అందుబాటులో లేరు'
పాకిస్తాన్ బోర్డర్‌లో భారత వైమానిక దళం దాడి, అందుకు ప్రతిస్పందనగా భారత పైలట్‌ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత, ఇది మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ నిజంగా భయపడినట్లు దౌత్యవేత్తలకు అనిపించిందని భారత దౌత్యవేత్త బిసారియా తన పుస్తకంలో రాశారు.
'మీటింగ్ మధ్యలో, సాయంత్రం 5.45 గంటలకు సైన్యం పంపించిన మెసేజ్ వినిపించేందుకు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జాంజువా అంతరాయం కలిగించారు. పాకిస్తాన్‌పై భారత్ 9 మిస్సైల్స్‌ను ఎక్కుపెట్టిందని, ఏ క్షణమైనా దాడి చేయొచ్చనేది ఆ మెసేజ్ సారాంశం' అని తన పుస్తకంలో పేర్కొన్నారు.
'తమ దేశాల నాయకులకు ఈ విషయాన్ని తెలియజేయాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవద్దని భారత్‌ను కోరాలని తెహ్మీనా దౌత్యవేత్తలను కోరారు. ఇది ఇస్లామాబాద్, న్యూదిల్లీతో పాటు పీ5 దేశాల రాజధానులలో దౌత్యకార్యకలాపాలకు దారితీసింది' అని పుస్తకంలో రాశారు.
అప్పుడు పీ5 దౌత్యవేత్తల్లో ఒకరిని పేర్కొంటూ, పాకిస్తాన్ తన ఆందోళనలను స్వయంగా భారత్‌కు తెలియజేయాలని సూచించారని ఆయన రాశారు.
అప్పటి పాకిస్తాన్ హైకమిషనర్ సొహైల్ మహమూద్ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేశారని, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారని బిసారియా రాశారు.
''నేను ఉన్నతాధికారలతో మాట్లాడానని, ప్రధాన మంత్రి ఇప్పుడు అందుబాటులో లేరని, ఏదైనా ముఖ్యమైన మెసేజ్ ఉంటే తనకు చెప్తే, అది వారికి తెలియజేస్తానని చెప్పాను'' అని ఆయన పుస్తకంలో చెప్పారు.

ఫొటో సోర్స్, PTV
ఆ తర్వాత, ఆ రాత్రి ఇక ఎలాంటి ఫోన్ రాలేదని రాశారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, భారత్ ఇచ్చిన పత్రాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని అమెరికా, బ్రిటన్ కూడా భారత్‌కు చెప్పాయని ఆయన రాశారు.
పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేస్తారని, మరుసటి రోజు పైలట్‌ను భారత్‌కు తిరిగి పంపుతారని కూడా రాయబారులు భారత్‌కు చెప్పారని ఆయన పేర్కొన్నారు.
మార్చి ఒకటిన, భారత్ వర్ధమాన్‌ను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టిందని, అలాగే ఆయన్ను పంపే సమయంలో మీడియా హడావిడి లేకుండా చూడాలని పాకిస్తాన్‌ను కోరాలని భారత్ నిర్ణయించుకుందని ఆయన రాశారు.
''వర్ధమాన్‌ను తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని పంపేందుకు భారత్ సిద్ధం కాగా, అందుకు పాకిస్తాన్ నిరాకరించింది. ఆయన్ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు, కానీ చివరికి 9 గంటల సమయంలో విడుదల చేశారు'' అని బిసారియా తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
'ఇది 2019 ఫిబ్రవరి గురించి భారత్ కల్పిత కథ'
గురువారం వారాంతపు మీడియా సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ''ఈ పుస్తకం 2019 ఫిబ్రవరిలో జరిగిన విషయాల గురించి భారత కల్పిత కథను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది'' అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రితో ఫోన్‌లో మాట్లాడేందుకు భారత్ నిరాకరించిందన్న అజయ్ బిసారియా వాదనలపై మీరేం చెప్తారని ఒక జర్నలిస్ట్ ఆమెను అడిగారు.
దానికి ఆమె బదులిస్తూ, పుల్వామా దాడిని భారత్‌లో అధికారంలో ఉన్న వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ముంతాజ్ అన్నారు. బాలాకోట్ ఘటన భారత మిలటరీ వైఫల్యమని బిసారియాకి బాగా తెలుసు. భారత్ సాహసం చేయాలని ప్రయత్నించి భంగపడిందని, అవమానకరంగా భారత్ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని, భారత పైలట్‌ను నిర్బంధంలోకి తీసుకుందని ఆమె అన్నారు.
అలాంటి పరిస్ధితుల్లోనూ పాకిస్తాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ''ఒక దౌత్యవేత్త బలప్రయోగం, బలవంతంగా చొరబడడం గురించి మాట్లాడడం విచారకరం'' అన్నారు.
భారత పైలట్ వింగ్ కమాండర్ అభినందన్‌ను మార్చి ఒకటిన విడుదల చేయనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి, ఫిబ్రవరి 28న చేసిన ప్రసంగంలో తెలియజేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభలో మాట్లాడుతూ 'పుల్వామా దాడి గురించి భారత్ ఈరోజు సమాచారం పంపింది. కానీ, అంతకుముందే వారు దాడికి దిగారు' అన్నారు.
''మేము ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని చెప్పారు.
ఆయన సభలో మాట్లాడుతూ 'నేను నిన్న కూడా మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించా. దీన్ని వెనక్కి తగ్గినట్లుగా భావించొద్దు. ఇకపై ఎలాంటి చర్యలూ వద్దని భారత్‌కు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అలా ఏదైనా జరిగితే మేము కూడా ప్రతిచర్యకు దిగాల్సి వస్తుంది'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- INDvsAFG: ఇషాన్ కిషన్‌కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















