‘నా నాలుక కోసేశారు’.. ‘హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉండగా నన్ను ఎత్తుకొచ్చి నిర్బంధించారు’.. మానవ అక్రమ రవాణా ముఠా దారుణాలను వివరించిన బాధితులు

ఫొటో సోర్స్, PRAVIN THACKERAY/BBC
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీగొండలోని బెల్వండి ప్రాంతంలో మానవ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు 21 మంది బాధితులను పోలీసులు రక్షించారు.
స్థానిక ముఠాలు బాధితులతో బలవంతంగా పనులు చేయించాయని, క్రూరంగా హింసించాయని పోలీసులు చెప్పారు.
బాధితుల్లో చాలామందికి తమ పేరు, ఊరు కూడా గుర్తులేదు.
ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేయగా, మరో 7 మంది పరారీలో ఉన్నారు.
వరుసగా మృతదేహాలు దొరుకుతుండడంతో..
శ్రీగొండ తాలూకా బెల్వండి పోలీస్ స్టేషన్ పరిధిలో 48 గ్రామాలు ఉన్నాయి.
ఏడాది కిందట 2022 నవంబర్ 30న సురేగావ్ శివార్లలో గోనె సంచిలో ఒక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఆ తర్వాత 2023 మే నెలలో ధాల్‌గావ్‌లోని ఒక బావిలో గుర్తు తెలియని వికలాంగుడి మృతదేహం కనిపించింది. తరువాత 2023 సెప్టెంబర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.
ఈ అనుమానాస్పద మరణాలపై ఏడాది కాలంగా పోలీసులు దృష్టి సారించారు.
అనుమానితులను విచారించి, సాక్ష్యాలను సంపాదించిన తరువాత, 2023 డిసెంబర్ 18న దాడులు చేసి, నిందితులను అరెస్టు చేశారు.
“2011 నుంచి ఈ ప్రాంతంలో 71 గుర్తు తెలియని మృతదేహాలు దొరికాయి. అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా లేదు కాబట్టి సందేహం కలిగింది. ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తుండగా ఈ తాలూకాలో స్థానిక ముఠాలు కొంతమందిని బందీలుగా ఉంచి, వారితో బలవంతంగా ఇంటి, వ్యవసాయ పనులు చేయిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఈ ముఠాలు వారిని వివిధ రైల్వే స్టేషన్లలో భిక్షాటనకు పంపేవారు. ఒకవేళ వారు చనిపోతే మృతదేహాలను నీటిలో లేదా గోనె సంచులలో వేసి పడేస్తారు' అని బెల్వాండి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ థెంగే తెలిపారు.
'బాధితులు ఇటుక బట్టీలు, పొలాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో బెల్వాండి ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బృందాలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, PRAVIN THACKERAY/BBC
బెల్వాండి ప్రాంతంలోని ఎనిమిది చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి 12 మంది పురుషులు, ఒక మహిళను రక్షించారు. పలువురిని అరెస్టు చేశారు.
ఖరత్‌వాడిలోని ఒక ఇంటి నుంచి సల్మాన్ అలియాస్ కరణ్ కుమార్‌ను రక్షించారు. పిలాజీ భోంస్లే అనే వ్యక్తి ఆయనను నిర్బంధించి పనులు చేయించుకుంటున్నారు.
ఘోటవీలోని బోద్‌ఖే మాల ప్రాంతంలో అమోల్ గిరిరాజ్ భోంస్లే అనే వ్యక్తి బిహార్‌కు చెందిన లల్లాన్ సుఖ్‌దేవ్ చోపాల్‌ను పనిలో పెట్టుకున్నారు. లల్లాన్‌ను కూడా పోలీసులు రక్షించారు.
భౌసాహెబ్ హరిభౌ మోరేతో పాటు మరికొంతమందిని అశోక్ దావూద్ భోంస్లే, జంగ్యా గఫూర్ కాలేల చెర నుంచి పోలీసులు రక్షించారు.
బీడ్‌లోని అంబేజోగై తాలూకాలోని చనై గ్రామ వాసి భౌసాహెబ్.
బాధితులు బబ్లూ, నర్శిం, కల్లు, సిద్ధీశ్వర్, ప్రకాష్ భోంస్లే, వసీం, జన్సూర్ అలీ, గణేష్, ప్రవీణ్, వీర్ సింగ్ గురించి పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు.
అయితే, వారి కథలు మనసును కలిచివేస్తున్నాయి. చాలామంది తమ పూర్తి పేరు, అసలు చిరునామా చెప్పలేకపోతున్నారు. ముగ్గురు మాత్రమే తమ పూర్తి వివరాలు ఇవ్వగలిగారు.

ఫొటో సోర్స్, PRAVIN THACKERAY/BBC
హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉండగా..
కరణ్ కుమార్ స్వస్థలం ఛత్తీస్‌గఢ్. కొన్ని సంవత్సరాల క్రితం, ఆయన తన గ్రామం నుంచి తప్పిపోయి హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరుపేదగా జీవించడం ప్రారంభించారు.
భిక్షాటన చేస్తూ గడిపేవారు. అయితే, పిలాజీ భోంస్లే అనే వ్యక్తి కరణ్ కుమార్‌ను మహారాష్ట్రలోని శ్రీగొండ తీసుకొచ్చి, ఆహారం, దుస్తులు ఇచ్చి ఆయనను బానిసగా చేసుకున్నారు.
పొలానికి నీరు పెట్టడం, పేడ తీయడం, పశువుల కాపలా తదితర పనులు చేయించేవారు.
“యజమాని కరెంటు తీగతో కొట్టేవాడు. కంటిపై పెద్ద గాయమైందిది. కొన్నిసార్లు గాయం మీద కారం చల్లేవారు” అని కరణ్ తెలిపారు.
కరణ్‌కి పిలాజీ సగం ఆహారం మాత్రమే పెట్టేవాడు, పని చేసినందుకు డబ్బులూ ఇవ్వలేదు. పారిపోయేందుకు ప్రయత్నించగా మోటార్‌సైకిల్‌పై వెంబడించి తిరిగి పొలానికి తీసుకెళ్లేవారు.
బాధితుల కోసం పోలీసులు ఇంటింటికి వెళ్లి విచారిస్తున్నప్పుడు కరణ్‌ని పొలానికి పారిపోవాలంటూ పిలాజీ సూచించాడు. అయితే, కరణ్ మాత్రం పోలీసుల వద్దకు వచ్చాడు.
కాగా, కరణ్‌కి తన వివరాలు ఏవీ గుర్తు లేవు. తనకు బబ్లూ అనే అన్న ఉన్నాడని, దిల్లీలో బస్సులో పనిచేసేవారని మాత్రం చెప్పారు.
ఒక్క వాక్యం కూడా సరిగా మాట్లాడలేకపోతున్న కరణ్‌కి ఎక్కడికైనా వెళ్లాలంటే భయం. ''నన్ను మీతో ఉండనివ్వండి. ఇంకెక్కడైనా వుంటే పిలాజీ వచ్చి తీసుకెళతాడు'' అని పోలీసులతో భయంభయంగా చెప్పారు కరణ్.

ఫొటో సోర్స్, PRAVIN THACKERAY/BBC
'అడుక్కునేవాడిని'
బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన లల్లాన్ మాట్లాడుతూ ''గుజరాత్‌లోని రైస్ మిల్లులో పనిచేసేవాడిని. బిహార్ నుంచి సబర్మతి రైలులో గుజరాత్‌కు వస్తుండగా మార్గమధ్యంలో స్టేషన్‌లో బలవంతంగా దింపారు'' అని అన్నారు.
ముంబయిలోని బోరివలిలో మరికొందరితో పాటు భిక్షాటన చేయించారని లల్లాన్ అంటున్నాడు.
బలవంతంగా వంట, పొలం పనులు, పిల్లలను బడికి తీసుకెళ్లే పనులు చేయించేవారని తెలిపారు.
అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పని చేయించుకునేవారు. యజమాని అమోల్ భోంస్లే తనలాంటి 10-12 మందిని నిమ్మతోటలో దాచాడని చెప్పారు.
లల్లాన్ యజమాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాని అతన్ని ట్రాక్ చేసి తిరిగి తీసుకువచ్చారు. పోలీసుల అంచనాల ప్రకారం లల్లాన్ వయసు దాదాపు 45 ఏళ్లు.
భౌసాహెబ్ మోరే చెరుకు కార్మికుడు. రైల్వేస్టేషన్‌లో ఉండగా పిలాజీ భోంస్లే ఆయనను నమ్మించి శ్రీగొండకు తీసుకువచ్చారు.

ఫొటో సోర్స్, PRAVIN THACKERAY/BBC
ఊరిలో నివసించేది తక్కువే
దేశంలోని ముంబయి, దిల్లీ, హైదరాబాద్ ఇలా వివిధ రైల్వేస్టేషన్ల నుంచి ఇలాంటివారిని స్థానిక ముఠాలు తీసుకొచ్చేవి.
వారు మానసికంగా బలహీనపడేలా చిత్రహింసలు పెట్టేవారు. అనంతరం వారిని ఎటూ వెళ్లనివ్వకుండా నిర్బంధించి పనులు చేయించుకునేవారు.
అయితే, మానసికంగా బలహీనంగా ఉన్న వారిని మాత్రమే ఈ ముఠాలు టార్గెట్ చేసి ఉంటారని పోలీసుల అంచనా వేస్తున్నారు.
బాధితులను ఎక్కువగా గ్రామంలో ఉండనివ్వలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులను గొర్రెలు, మేకలు కాయడానికి పంపేవారు.
కాబట్టి ఇతర గ్రామస్థులకు వారి గురించి పెద్దగా తెలియదు.
పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో కోల్‌గావ్, ఘోటావిలోని నిందితుల ఇళ్లను బీబీసీ పరిశీలించింది. కుగ్రామం కావడంతో భయంతో బాధితులు తప్పించుకోలేకపోయారు.
కొన్నిచోట్ల నిరాశ్రయులను పశువుల షెడ్లలో ఉంచేవారు. మరోచోట జొన్న పొలంలో రహస్యంగా దాచేవారు. ఇంట్లో యజమాని మంచం మీద పడుకునేవాడు, బాధితులు నేలపై పడుకునేవాడు.
వారికి మంచం లేదు, దుప్పటి లేదు. వారి ఆహారం కూడా భిన్నంగా ఉండేది.
మహిళ నాలుకనూ కోసేశారు
ప్రస్తుతం బాధితులు అహ్మద్‌నగర్‌లో శ్రీఅమృతవాహిని గ్రామ వికాస్ మండల్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థలో ఉన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థలో బాధితులకు కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నారు.
పోలీసులతో కలిసి బీబీసీ ఆ సంస్థను సందర్శించింది. పోలీసులను చూడగానే వారి ముఖంలో సంతోషం కనపడింది.
బాధితుల్లో ఒక మహిళ తనకు ఏం జరిగిందో వివరించడానికి చాలా కష్టపడింది. ఆమెకు నాలుక లేదు. నిద్రపట్టకుండా చేసేందుకే ముఠా సభ్యులు ఆమె నాలుకను కోసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
“బాధితులు మాట్లాడటానికి ఆర్నెళ్లు కూడా పట్టవచ్చు. వారి పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లు చాలాకాలంగా దోపిడీకి గురయ్యారు, అంత తొందరగా మాట్లాడలేరు'' అని సంస్థ మేనేజర్ సిరాజ్ షేక్ అన్నారు.
చాలామంది బాధితులు ఏళ్ల నుంచి పనిచేస్తుండటం, వారి వివరాలు చెప్పలేకపోవడంతో వారందరినీ ఇంటికి చేర్చే పని పోలీసులకు సవాలుగా మారింది.
ఈ మానవ అక్రమ రవాణా కేసులో నిందితులైన చారుశీల రఘునాథ్ చవాన్, జిలూర్ రైఫిల్ చవాన్, అమోల్ గిరిరాజ్ భోంస్లే, అబా జలీందర్ కాలే, దల్‌ఖుష్ ముకింద కాలే, నందు కిల్‌చంద్ గవానే, సాగర్ సుదమ్ గవానే, అబ్బాస్ శంభాజీ గవానే, సచిన్ పట్‌వింగ్, పావుర్ జాస్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ పులులు: ఆధిపత్య పోరులో అంతమవుతున్నాయా? విషప్రయోగాలకు బలవుతున్నాయా
- ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్: ‘మహిళను గర్భవతిని చేస్తే రూ.5 లక్ష లు ఇస్తాం’ అంటూ సాగే ఈ స్కామ్‌లో బాధితులు ఎలా చిక్కుకుంటున్నారంటే...
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- రొమాంటిక్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి?
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














