తెలంగాణ పులులు: ఆధిపత్య పోరులో అంతమవుతున్నాయా? విషప్రయోగాలకు బలవుతున్నాయా

ఫొటో సోర్స్, NTCA
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో ఇటీవల రెండు పులులు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాయి.
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో జనవరి 7న ఒక ఆడపులి చనిపోయినట్లుగా గుర్తించామని తెలంగాణ అటవీ అధికారులు తెలిపారు. ఆ తరువాత జనవరి 9న మగ పులి కళేబరం కనిపించిందని చెప్పారు.
ఇది ఆడపులి మృతదేహానికి సమీపంలోనే కనిపించింది.
ఇలా కవ్వాల్ పులుల అభయారణ్యంలో వరుసగా పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఫొటో సోర్స్, NTCA
'టెరిటరీ' కోసం ఘర్షణ
మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి ప్రధాన కేంద్రంగా ఉంటోంది.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి పెన్ గంగా, పెద్దవాగు, ప్రాణహిత మీదుగా పులులు కవ్వాల్ రిజర్వ్ అటవీప్రాంతంలోకి వస్తూపోతుంటాయి.
ఇలా వచ్చిన ఒక పులుల జంట, వాటికి పుట్టిన నాలుగు పిల్లలు కొంతకాలంగా కాగజ్ నగర్ అటవీ రేంజ్ పరిధిలో సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
వీటిలో రెండు పులులు దరిగాం, సర్కెపల్లి అటవీ ప్రాంతాల నడుమ జనవరి మొదటి వారంలో చనిపోయి కనిపించాయి.
చనిపోయిన వాటిలో మగ పెద్దపులి, ఆడ పులి పిల్ల ఉన్నాయి.
టెరిటరీ (నిర్దిష్ట ప్రాంతం) కోసం పులుల మధ్య జరిగిన గొడవల్లో ఆడ పులిపిల్ల చనిపోయిందని అధికారులు తెలిపారు.
విష ప్రయోగం వల్ల మగపులి చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చేంతవరకూ నిర్ధరణకు రాలేమని తెలంగాణ ఫారెస్ట్ శాఖ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, Telangana forest dept
పురుగుల మందు చల్లారా?
చనిపోయిన మగ పెద్దపులి మెడకు ఉచ్చు కనిపించినట్లుగా చెబుతున్నారు.
మగపులి చనిపోయిన స్థలానికి కాస్త దగ్గరలో ఒక ఆవు కళేబరం ఉంది.
ఆ ఆవు మీద ముసిరిన ఈగలు చనిపోయి ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
పులి దాడిలో ఆవును కోల్పోయినవారు ప్రతీకారంలో భాగంగా ఆవు కళేబరం మీద పురుగు మందు చల్లి ఉంటారని, అది తిన్న పులి మరణించి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
కాగా ఇదే అటవీ ప్రాంతంలో మరో నాలుగు పులుల జాడ కనిపించడం లేదు.
వాటి కోసం 150 మంది సిబ్బందితో కూడిన 35 బృందాలు అన్వేషిస్తున్నాయి.
వీటిలో రెండు పులుల పగ్ మార్క్స్, అంటే కాళ్ల అడుగు జాడలు కనిపించాయని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Telangana forest dept
మనుషులతో ఘర్షణ
కవ్వాల్ పులుల అభయారణ్యం సుమారు 1,015 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులోని కోర్ ఏరియాలో 10 నుంచి12 గ్రామాలున్నాయి. అందువల్ల మనుషులు, పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతోంది.
కోర్ ఏరియాలోని గ్రామాల్లో తొలివిడతగా రాంపూర్, మైసంపల్లి అనే ఊర్లను ఖాళీ చేయించాలని గతంలో నిర్ణయించారు.
కానీ పునరావాస ప్యాకేజీ సమస్యల వల్ల ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఆ గ్రామాలను ఖాళీ చేయడానికి ప్రజలు నిరాకరిస్తుండటం కూడా మరొక సవాల్ అని నేషనల్ టైగర్ కన్జర్వేసన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) చెబుతోంది.
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో ఇటీవల చనిపోయిన మగపులి మీద విషప్రయోగం జరిగిందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే, మనుషులు, పులులకు మధ్య ఘర్షణకు ఇది నిదర్శనం.
జనాభా విస్తరణ, పులుల ఆవాసాల ఆక్రమణలు మానవ-వన్యప్రాణుల మధ్య సంఘర్షణకు దారితీస్తున్నాయి. తమ సహజ ఆవాసాలు కోల్పోతున్న పులులు వేటలో భాగంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తుండడంతో ఈ ప్రాంతంలో పశువులపై దాడులు పెరిగాయి. అలా పశువులు కోల్పోయిన వారు పులులపై ప్రతీకారానికి దిగుతున్నారు.
పులుల మనుగడలో వాతావరణ, పర్యావరణ మార్పులదీ ప్రధానపాత్ర.
''టైగర్ రిజర్వుల పరిధిలో లాంటానా(Lantana camara) వంటి విదేశీ కలుపు జాతి మొక్కలు (ఎక్సాటిక్ ఏలియన్ వీడ్స్) విస్తృతి పెరుగుతోంది. చొచ్చుకుపోయే స్వభావం ఉండే ఈ మొక్కలు స్వదేశీ గడ్డిజాతి మొక్కల పెరుగుదలను నియంత్రిస్తాయి'' అని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఈఎన్ మూర్తి బీబీసీతో చెప్పారు.
దీని వల్ల మేత లేక జింకలు, లేళ్లు వంటి పులికి ఆహారమయ్యే చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో పులులు తమ ఆవాసాలను వదిలి బయటకు వస్తున్నాయి. ఇలా వచ్చే క్రమంలో వ్యవసాయ బావుల్లో పడిపోవడం, విద్యుత్ తీగలు తగిలి, లేదా ప్రతీకార దాడుల్లో మరణిస్తున్నాయి.
ఇటీవల మహారాష్ట్రలో ఇవే కారణాలతో మూడు పులులు మరణించాయి.
వాతావరణ మార్పుల్లో భాగంగా అడవుల్లో నీటివనరులు తగ్గిపోవడం, పరోక్షంగా పులి అడవి దాటి బయటికి రావడానికి కారణం అవుతోంది.

ఫొటో సోర్స్, Telangana forest dept
పులుల మరణాలు ఇలా..
ఎన్‌టీసీఏ లెక్కల ప్రకారం, 2012-2022 మధ్య పదేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో మొత్తం 1,062 పులులు చనిపోయాయి. ఇందులో 193 పులులు వేటగాళ్ల చేతిలో చనిపోయాయి. సగటున ప్రతి ఏటా దేశంలో వందకు పైగా పులులు మరణిస్తున్నట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి.
గత నాలుగు సంవత్సరాల లెక్కలను ఒకసారి చూస్తే, 2021లో 107, 2022లో 121, 2023లో రికార్డ్ స్థాయిలో 178 పులులు మరణించాయి.
2012-2024 మధ్య పదేళ్ల కాలంలో తెలంగాణలో 11, ఏపీలో 11 పులులు వివిధ కారణాలతో చనిపోయాయి.
తాజాగా 2024లో జనవరి 10 వరకు దేశవ్యాప్తంగా 6 పులుల మరణాలు రికార్డ్ అయ్యాయి. ఇందులో ఇటీవల కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో చనిపోయిన రెండు పులులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Telangana forest dept
పులుల ఆవశ్యకతపై అవగాహన లేకపోవడం..
ఐక్యరాజ్య సమితి అనుబంధ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించే ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’( WWF) ప్రకారం, అడవిలో ఒక పులి జీవిత కాలం 20 ఏళ్ల వరకూ ఉంటుంది.
ఎన్టీసీఏ లెక్కల ప్రకారం, పదేళ్ల కాలంలో 2012-2022 మధ్య అసహజ రీతిలో 44 పులులు చనిపోగా, మరో 95 పులుల చావుకు కారణాలు ఇప్పటికీ తెలియలేదు.
మానవ ప్రేరేపిత మరణాల కింద చూస్తే... పులి శరీర భాగాల కోసం (ఎముకలు, చర్మం, గోర్లు, ఇతర అవయవాలు) వాటిని వేటాడటం జరుగుతుంది. ఈ భాగాలకు ఔషధ గుణాలుంటాయని ఆసియా దేశాల సంప్రదాయ వైద్యంలో ఉన్న నమ్మకంతో వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంది.
పులులు సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లపై నిఘా కొరవడటం, వన్యప్రాణి రక్షణ చట్టాల అమలు, పరిరక్షణ చర్యలు సరిగ్గా లేకపోవడం, నిధుల లేమి, అంతర్జాతీయ సరిహద్దుల గుండా సాగే వన్యప్రాణి అక్రమ రవాణా నెట్ వర్క్‌లను సమర్థవంతంగా కట్టడి చేయలేకపోవడం పులుల మరణాలకు మరికొన్ని కారణాలుగా భావిస్తున్నారు.
ఎన్‌టీసీఏ లెక్కల ప్రకారం, రక్షిత అటవీ ప్రాంతాల పరిధి బయట జరిగిన పులుల మరణాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, పర్యావరణ సమతుల్యతలో పులి ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన లేకపోవడం.
అందువల్ల పులుల సంరక్షణలో అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రజల మద్దతు కరువవుతోంది. పులులను సురక్షిత పునరావాస ప్రాంతాలకు తరలించడంలో వైఫల్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Telangana forest dept
అటవీ అధికారుల వైఫల్యముందా?
మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న పులుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ విఫలమైందన్న వన్యప్రాణి సంరక్షణ స్వచ్చంద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
‘‘హరితహారంపై పెట్టిన శ్రద్ధ వన్యప్రాణుల సంరక్షణపై లేదు. సరిహద్దు కోసం ఆధిపత్య పోరాటం అనేది మగ పులుల మధ్య ఉంటుంది. కానీ, ఆడపులితో కాదు. తెలంగాణలో వన్యప్రాణి అక్రమ రవాణ గ్యాంగ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయనడానికి గతంలో ఇక్కడ పట్టుకున్న పంగోలిన్, తాబేళ్లు, చిరుత పులుల గ్యాంగులే ఉదాహరణ'' అని వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు.
''వన్యప్రాణి సంరక్షణ విభాగం పనితీరు కుంటుపడింది. వన్యప్రాణుల దాడుల్లో మరణించిన పశువులకు పరిహారం ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో యానిమల్ ట్రాకర్స్‌గా పని చేస్తున్న 50 మందికి పైగా సిబ్బందికి గత 9 నెలలుగా జీతాలు లేవు. నిజానికి క్షేత్రస్థాయిలో పనిచేసేది వారే.
పులుల మరణాల్లో చాలా వరకు బయటకు రావు. పశువుల మేత కోసం అటవీ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సరైన చర్యలు చేపడితే పులుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యేందుకు స్థానికులు సిద్దంగా ఉన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. తన వివరాలు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.
అలాగే, చనిపోయిన ఆడపులి పెద్దది కాదు పిల్ల మాత్రమే. అలాంటప్పుడు సరిహద్దు కోసం పిల్ల పులి ఎలా పోట్లాడుతుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, NTCA
‘‘ఇక్కడ భిన్నమైన సవాళ్లు ’’
స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ఆరోపణలపై కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాంను బీబీసీ సంప్రదించింది.
‘’ఇతర టైగర్ రిజర్వ్‌లతో పోలిస్తే కవ్వాల్ లో భిన్నమైన సవాళ్లు ఉన్నాయి. ఇక్కడ అడవి మధ్యలోనే నివాస ప్రాంతాలు ఉన్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు వెళ్తున్నాయి. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. యానిమల్ ట్రాకర్స్‌కు గతేడాది సెప్టెంబర్ వరకు వేతనాలు చెల్లించాం. ప్రతినెల జీతాలు అందేలా ఏర్పాట్లు చేస్తాం.
ఇక పశువులు కోల్పోయిన వారికి అందించే పరిహారం అందించడం నిధుల విడుదలపై ఆధారపడి ఉంటుంది. అయితే, గతంలో జాప్యం జరిగి ఉండొచ్చు, ఇప్పుడు లేదు. టెర్రిటోరియల్ ఫైట్ అనేది మగ పులుల మధ్యే ఉంటుందనేది అవాస్తవం. కలయిక సమయంలో తప్ప, మిగిలిన సమయాల్లో తమ ప్రాంతంపై ఆధిపత్యం కోసం వాటి మధ్య పోరాటం ఉంటుంది’’ అని శాంతారాం అన్నారు.

ఫొటో సోర్స్, Telangana forest dept
అంతరించిపోతున్న జాబితాలో పులి
భారతదేశ అడవుల్లోని మాంసాహార జంతువుల్లో అత్యంత ఆకర్షణీయమైన, శక్తివంతమైన జంతువుగా పులిని భావిస్తారు. బలం, వేగం, చురుకుదనానికి ప్రతీకగా భావించే పులి భారత జాతీయ జంతువు కూడా. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం పులుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఉంది.
వేగంగా అంతరించి పోతున్న జాబితాలో ఉన్న పులి జాతి సంరక్షణ కోసం ‘జాతీయ పులుల సంరక్షణ అథారిటీ’ 2005లో ఏర్పాటైంది.
పులుల సంతతి వృద్ధి కోసం 1972లోనే భారత దేశం ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా 55 అటవీ ప్రాంతాలను పులుల రక్షిత ప్రాంతాలుగా( టైగర్ రిజర్వ్) ప్రకటించింది. వీటిలో తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.
పులుల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల పరిధిలో 78,735 చదరపు కి.మీ అటవీ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- INDvsAFG: ఇషాన్ కిషన్‌కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- పాకిస్తాన్ ఎన్నికల్లో తొలి హిందూ మహిళా అభ్యర్థి డాక్టర్ సవీరా ప్రకాశ్
- భారత్-మాల్దీవుల వివాదం: ఇండియాకు సాయంగా లక్షదీవుల్లో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














