లఖ్బీర్ సింగ్ లండా: కెనడాలోని ఈ 'ఏ-కేటగిరీ' గ్యాంగ్‌స్టర్‌ను భారత్ ఎందుకు తీవ్రవాదిగా ప్రకటించింది?

ఫొటో సోర్స్, PUNJAB POLICE
కెనడా దేశంలో నివసిస్తున్న లఖ్బీర్ సింగ్ లండాను భారత ప్రభుత్వం తీవ్రవాదిగా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర హొం శాఖ జారీ చేసిన ప్రకటనను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.
అందులో పేర్కొన్నదాని ప్రకారం ఖల్సా అనే పేరున్న అంతర్జాతీయ సంస్థ కోసం లఖ్బీర్ సింగ్ లండా అలియాస్ లండా బబ్బార్ పనిచేస్తున్నారు.
పంజాబ్‌లోని మొహాలీ, తర్న్ తరన్ జిల్లాల్లో జరిగిన రాకెట్ దాడుల వెనుక లఖ్బీర్ హస్తం ఉన్నట్లుగా ఆయనపై 24 కేసులకు పైగా నమోదయ్యాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అతడిని తీవ్రవాదిగా ప్రకటించారు.
అసలు ఎవరీ గ్యాంగ్‌స్టర్?

ఫొటో సోర్స్, ANI
కేంద్ర హోం శాఖ ఏం చెప్పింది?
కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం, లఖ్బీర్ సింగ్ లండా 4 ఆగస్టు 1989న జన్మించాడు.
తండ్రి పేరు నిరంజన్ సింగ్, తల్లి పర్మీందర్ కౌర్. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లా అతడి స్వస్థలం.
ప్రస్తుతం కెనడా దేశంలోని అల్బర్టాలో ఉన్న ఎడమోంటన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.
కేంద్ర హొం శాఖ విడుదల చేసిన ప్రకటనలో “సీమాంతర ఏజెన్సీల మద్దతుతో లండా అధునాతన ఆయుధాలు, ఐఈడీలు, పేలుడుపదార్థాలను భారత్‌లోకి తీసుకుని వచ్చి, పలు ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేస్తున్నాడు.
పంజాబ్‌లో పలు ఉగ్రవాద కార్యాచరణల అమలుకు ఆయుధాలను సరఫరా చేస్తున్నాడు”అని పేర్కొంది.
“9 మే 2022లో పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన రాకెట్ దాడి వెనుక ఉన్న సూత్రధారి అతడే.
పంజాబ్ పోలీసులతోపాటు ఎన్ఐఏ కూడా అతడి కోసం వెతుకుతోంది” అని పేర్కొంది.
అంతేకాకుండా, లఖ్బీర్ తీవ్రవాద కార్యకలపాల నిర్వహణ, హత్యలు, దోపిడీలు, ఐఈడీలు అమర్చడం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ వంటి క్రిమినల్ కేసుల్లోనూ ఉన్నాడని, పంజాబ్‌తోపాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యచరణ కోసం డబ్బును వినియోగించిన పలు కేసుల్లో అతడి ప్రమేయం ఉందని పేర్కొంది.
లఖ్బీర్ సింగ్, అతడి సహచరులు దేశంలోని పలు ప్రాంతాల్లో టార్గెట్ కిల్లింగ్స్, దోపీలతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్రలు చేస్తున్నారు.
వీటితోపాటుగా అతడిపై ఓపెన్ ఎండ్ వారెంట్ జారీ అయింది. 2021లో లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

ఫొటో సోర్స్, Punjab State Intelligence Headquarters
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
జనవరి 2022లో పంబాజ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో లఖ్బీర్ సింగ్ అలియాస్ లండా పంజాబ్‌తోపాటు విదేశాల్లో కూడా పలు నేరాలకు పాల్పడ్డాడు.
పంజాబ్ పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ల జాబితాను రూపొందించి, వారిని పలు వర్గాలుగా విభజించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖ్బీర్ సింగ్ లండా ఏ కేటగిరీ గ్యాంగ్‌స్టర్. చాలా నేరాలకు పాల్పడి 2017లో కెనడాకు పారిపోయాడు.
కెనడాలో ఉంటూనే, పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్‌లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దోపిడీలు, హత్యలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న కొంతమందిని కలుపుకుని ఈ నేరాలు చేస్తున్నాడని పంజాబ్ పోలీసులు విడుదల చేసిన స్టేట్మెంట్‌లో ఉంది.
పాకిస్తాన్‌లో నివసించే హర్వీందర్ సింగ్ అలియాస్ రిండాతో లఖ్బీర్‌కు సంబంధాలున్నాయి. రిండా పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ మద్దతుతో పని చేస్తున్నాడు.
లఖ్బీర్‌పై 31 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిల్లో హత్య, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్స్ సబ్‌స్టెన్స్ యాక్డ్ (ఎన్‌డీపీఎస్ యాక్ట్), దోపిడీ, ఉగ్రవాదం వ్యాప్తి వంటి నేరాలకు సంబంధించినవి ఉన్నాయి.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN
పంజాబ్‌లో ఏం చేశాడు?
9 మే 2022 రాత్రి 7.45 గంటల సమయంలో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో పేలుడు సంభవించింది.
సెక్టార్ 77లో ఉండే ఈ భవనం నివాస ప్రాంతాల మధ్యన ఉంది. ఈ పేలుడు వెనుక లఖ్బీర్ హస్తం ఉందని పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
9 డిసెంబర్ 2022న తర్న్ తరన్ జిల్లాలోని సర్హాలీ పోలీస్‌స్టేషన్‌పై ఆర్‌పీజీ గ్రనేడ్‌తో దాడి జరిగింది. ఈ దాడిలో పోలీస్‌స్టేషన్‌లోని కిటికీలు దెబ్బతిన్నాయి.
స్టేషన్‌ను టార్గెట్‌గా చేసుకుని గ్రనేడ్ దాడి చేశారని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆ సమయంలో తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లఖ్బీర్ సింగ్ లండా యూరోపిన్ అసోసియేట్స్ సత్వీర్ సత్తా, గురుదేవ్ జస్సాల్‌లతో కలిసి ఉగ్రవాద కార్యాచరణ అమలు చేసి, పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాలతో ఈ దాడికి పాల్పడ్డాడు.
ఈ ఏడాది ఆగస్టులో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది ఎన్ఐఏ. ఆ జాబితాలో లఖ్బీర్ సింగ్ పేరు కూడా ఉంది.
అదే నెలలో తర్న్ తరన్ జిల్లాలోని లఖ్బీర్ సింగ్ లండాకు చెందిన ఆస్తిని జప్తు చేయాలని ఎన్ఐఏ ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
- కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ అయిందా? అందుకే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టిందా
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














