నా సామిరంగ రివ్యూ: నాగార్జున సంక్రాంతి 'హిట్' సెంటిమెంట్ ఈసారి కలిసొచ్చిందా? వింటేజ్ హీరో కనిపించాడా?

ఫొటో సోర్స్, Junglee Music Telugu/YT
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల ప్రోమోలలో పండగ కళ కొట్టొచ్చినట్లు కనిపించిన చిత్రం మాత్రం నాగార్జున 'నా సామిరంగ'.
ఈ సినిమాని సంక్రాంతి విడుదల కోసమే అన్నట్టు కేవలం మూడు నెలల్లో సిద్ధం చేశారు.
‘పోరింజు మరియం జోష్’ అనే మలయాళం సినిమాకి రీమేక్ ఇది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు నాగార్జున.
ట్రైలర్లలో పండగ వాతావణం కనిపించింది. 'ఈసారి పండక్కి బాక్సాఫీసు కొడుతున్నాం' అని చెప్పి ఇంకాస్త ఆసక్తిని పెంచారు నాగార్జున. మరి, ఆయన చెప్పినట్లు నా సామిరంగ బాక్సాఫీసుని కొల్లగొట్టే చిత్రమేనా? నాగార్జునకు సంక్రాంతి హిట్ సెంటిమెంట్ పని చేసిందా ?

ఫొటో సోర్స్, Junglee Music Telugu/YT
కిష్టయ్య- అంజిల కథేంటి?
1980 ప్రాతంలో గోదావరి జిల్లా అంబాజీపేటలో కిష్టయ్య(నాగార్జున) అంజి (అల్లరి నరేష్) అనే ఇద్దరి స్నేహితుల కథ ఇది. ఈ రెండు పాత్రలతో ముడిపడిన స్నేహంతో పాటు ప్రేమ, విశ్వాసం, పగ, ప్రతీకారం లాంటి భావోద్వేగాలతో కథ నడుస్తుంది.
ఈ చిత్రానికి మాతృక 'పోరింజు మరియం జోష్' చర్చి ఫెస్టివల్ నేపథ్యంలో జరిగితే, తెలుగు రీమేక్‌లో అది సంక్రాంతి పండగకు మార్చడం చాలా చక్కగా కుదిరింది. ఈ విషయంలో దర్శక రచయితల పనితీరుని మెచ్చుకోవాల్సింది.
భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు పర్వదినాలు నేపథ్యంలోనే ఈ కథంతా నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇందులో దాదాపు ప్రతి ఫ్రేంలో పండగ వాతావరణం కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Junglee Music Telugu/YT
ప్రేమకథ ఆకట్టుకుందా ?
కిష్టయ్య, అంజి పాత్రల మధ్య వున్న స్నేహాన్ని పరిచయం చేస్తూ ఫీల్ గుడ్ ఎమోషన్‌తో కథ మొదలవుతుంది. బాల్యంలో వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుని హత్తుకునేలా వుంటాయి. కిష్టయ్య, అంజి పాత్రల మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ఆయువు పట్టు. అది బలంగా కుదిరింది. ఈ కథని స్క్రీన్ ప్లే చేసుకున్న విధానం కూడా బావుంది.
60- 80 దశకాల మధ్య జరిగే కథ ఇది. చిన్నతనంలోనే కిష్టయ్య, వరాలు( అషికా రంగనాథ్) పాత్రల మధ్య చిగురించిన ప్రేమ, తర్వాత వారి మధ్య ఎడబాటు.. మళ్ళీ యవ్వనంలో కలవడం, వాళ్ళ ప్రేమకథకు వరాలు తండ్రి( రావు రమేష్) అడ్డు తగలడం, పెద్దయ్య( నాజర్) పాత్ర రూపంలో తెరపైకి వచ్చిన సంఘర్షణ ..ఇవన్నీ ప్రేమకథకు బలాన్ని చేకూర్చుతాయి.
ఈ ప్రేమకథ చాలా సరదాగా మొదలైనప్పటికీ ఆ ప్రేమ ఎదురుకున్న సవాల్.. కథకి ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకొస్తుంది. వయసుకు తగ్గట్టు ఆ ప్రేమకథలో పరిణితి కనిపిస్తుంది.
ఇందులో మరో ఉప ప్రేమ కథ భాస్కర్( రాజ్ తరుణ్) కుమారి (రుక్సర్)లది. ఇది కూడా కథలో కీలకమే. ఈ ప్రేమకథ ద్వారానే, ప్రీ క్లైమాక్స్‌లో ప్రభల తీర్ధం ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. ఈ రెండు ప్రేమకథలు, కిష్టయ్య, అంజి మధ్య స్నేహం నేపధ్యంలో వచ్చే సరదా సన్నివేశాలతో విరామం వరకూ కథ సజావుగా సాగిపోతుంది.
విరామానికి ముందు దాసు (షబీర్ కళ్లారక్క) పాత్ర రూపంలో ఈ కథలో సంఘర్షణని తెరపైకి తెచ్చారు. అది ద్వితీయార్ధం పై ఆసక్తిని పెంచుతుంది.

ఫొటో సోర్స్, Junglee Music Telugu/YT
రీమేక్ చేయాల్సినంతగా ఏముంది ?
రీమేక్ సినిమాలకు వుండే గొప్ప సౌకర్యమేంటంటే, కథ పక్కాగా చేతిలో వుంటుంది. అది మన నేటివిటికీ తగ్గట్టుగా మార్చుకుని, పాత్రల మధ్య ఎమోషన్‌ని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మలిస్తే, ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతారు. నా సామిరంగలో కూడా ఈ కనెక్షన్ చక్కగా కుదిరింది. ఇదొక మలయాళం కథ అని ఎక్కడా అనిపించదు. నిజానికి ఈ కథ ఎప్పుడూ చూడని కొత్త కథేమీ కాదు. స్నేహం, ప్రేమ, విశ్వాసం, పగ., ప్రతీకారం ఇలాంటి హ్యూమన్ ఎమోషన్ ఆధారంగా గతంలో చాలా కథలు వచ్చాయి.
అదే ఎమోషన్‌ని కొత్తగా ప్రజెంట్ చేయడం మరి ఇందులో వున్న విశేషం. ఆ కొత్తదనం ఇందులో కుదిరింది. కిష్టయ్య, అంజి పాత్రల మధ్య ఎమోషన్, అటు కిష్టయ్య, వరాలు మధ్య వున్న ప్రేమని ప్రేక్షకుడు ఫీలవుతాడు. కొన్ని సన్నివేశాలని మాతృక కంటే మెరుగ్గా తీశారు. పాత్రల మధ్య ఎమోషన్ కూడా బాగా తెలుగీకరించారు.
ద్వితీయార్ధంలో కోనసీమలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం నేపథ్యాన్ని తీసుకున్న విధానం ఆకట్టుకునేలానే వుంది. అంజి పాత్రతో ఈ కథకు ఒక భావోద్వేగంతో కూడిన ముగింపు దొరికింది.

ఫొటో సోర్స్, Junglee Music Telugu/YT
సంక్రాంతి ఫార్ములా..
పల్లెటూరికథలు నాగార్జునకు భలే నప్పుతాయి. ఇందులో కిష్టయ్య పాత్రలో ఒదిగిపోయారు నాగార్జున. ఆయన లుక్, డైలాగ్ చెప్పే విధానం, యాక్షన్‌లో మాస్ అన్నీ ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత ఆయన ఒక ప్రేమకథ టచ్ ఉన్న పాత్ర చేశారు. అది కూడా అందంగా తెరపైకి వచ్చింది. విరామం సన్నివేశంలో సైకిల్ చైన్ లాగే సీక్వెన్స్ ఫ్యాన్స్‌కి పండగే. నాగార్జున తర్వాత అంతటి నిడివి వున్న పాత్రలో కనిపించారు అల్లరి నరేష్. అంజి పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
కిష్టయ్య అంజి స్నేహం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అషికా రంగనాథ్‌కు కీలకమైన పాత్ర దక్కింది. ఆమె పాత్రలో మూడు వేరియేషన్స్ వున్నాయి. తరుణ్ భాస్కర్ కూడా ఆకట్టుకునారు. రుక్సర్, మిర్న పాత్రలు కూడా కథలో కీలకమే.
దాసు (షబీర్) పాత్రలో హింస ఎక్కువైపోయింది. ఆ పాత్రకు ఒక సైకో టచ్ ఇచ్చారు. దాన్ని ఇంకాస్త మన నేటివిటీకి తగ్గట్టు రాస్తే బావుండేదనిపించింది. పైగా కోనసీమ వాతావరణానికి ఆ పాత్ర సింక్ కాలేదనిపిస్తుంది. నాజర్‌తో పాటు మిగతా పాత్రలన్నీ పరిధిమేర ఉన్నాయి.
ఇంతకీ ఎలా ఉంది?
“సినిమాని మూడు నెలల్లో ఎలా తీయాలో నా సామిరంగ విడుదలైన తర్వాత పుస్తకం రాస్తాం” అని ప్రకటించారు నాగార్జున. నిజంగా ఈ సినిమా అవుట్ పుట్ చూస్తే ఆయన పుస్తకం రాసి ఇవ్వాల్సిందే అనిపించింది. అందరూ చాలా చక్కని పనితీరు కనబరిచారు.
ఎక్కడా కూడా ఈ సినిమాని తొందరగా చుట్టేశారనే ఫీలింగ్ కలిగించలేదు. అన్ని విషయాల్లో జాగ్రత పడ్డారు. పీరియడ్ టచ్ వున్న ఈ కథని ఇంత త్వరగా చేయడం మామూలు విషయం కాదు. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి.
‘దేవుడే.. ’పాట నేపథ్య సంగీతంలో బాగా వర్క్ అవుట్ అయ్యింది. యాక్షన్ సీన్‌లో ఆ పాట ట్యూన్‌ని విజిల్‌గా వాడుకోవడం చాలా బావుంది.
దాశరథి శివేంద్ర కెమరా పనితనం నీట్‌గా వుంది. విజువల్స్ అన్నీ ఆహ్లాదకరంగా తీశారు. కలర్స్ కంటికి ఇంపుగా కనిపిస్తాయి.
పాటల్లో మంచి కొరియోగ్రఫీ కనిపించింది. ఒక్కసారిగా అలనాటి పాటలని గుర్తుకు తెస్తాయి. నాగార్జున తో పాటు ఇంత మంది నటీనటులని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్.
కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ ఈ విషయంలో మంచి పని తీరు కనబరిచాడు. ప్రతి పాత్రకు న్యాయం జరిగేలా చూసుకొని కథని, ఎమోషన్‌ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాడు.
సంక్రాంతి కళ వున్న సినిమా. ఈ చిత్రాన్ని యుద్ధప్రాతిపదికన అన్నట్టుగా పండక్కే ఎందుకు విడుదల చేశారో సినిమా చూశాక అర్ధం అవుతుంది.
నిజంగా పండక్కి రావాల్సిన సినిమానే ఇది. నాగార్జునకు ఈసారి సంక్రాంతి కూడా కలిసొచ్చిందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
- ‘నా నాలుక కోసేశారు’.. ‘హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా నన్ను ఎత్తుకొచ్చి నిర్బంధించారు’.. మానవ అక్రమ రవాణా ముఠా దారుణాలను వివరించిన బాధితులు
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం: ‘నా కుటుంబం ఒక్కపూట భోజనానికి రూ.1500 కావాలి’
- పాకిస్తాన్ వాఖీ మహిళా గొర్రెల కాపరుల ప్రత్యేకత ఏంటి... వీరు ఎందుకు కనిపించకుండా పోతున్నారు?
- పాకిస్తాన్: కూతురి మార్ఫింగ్ ఫోటోను చూసి పరువు హత్యకు పాల్పడిన తండ్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















