సైంధవ్ రివ్యూ: వెంకీ@75.. రూ. 17 కోట్ల ఇంజక్షన్, పాప సెంటిమెంట్... వెంకటేశ్ ‘వన్ మ్యాన్ షో’ చేశారా?

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/venkateshdaggubati

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

కథానాయకుడిగా 75 సినిమాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. ఈ డైమండ్ జూబ్లీ నంబర్ అందుకున్నారు వెంకటేశ్‌.

'సైంధవ్' వెంకటేశ్‌కి 75వ చిత్రం. సంక్రాంతికి హిట్ సెంటిమెంట్ వున్న ఆయన ఇప్పుడు ‘సైంధవ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

‘HIT’ ఫ్రాంచైజీతో రెండు విజ‌యాలు అందుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ప్రచార చిత్రాల్లో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా కనిపించింది.

మరి వెంకీ 75వ చిత్రం.. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిందా? దర్శకుడు శైలేష్ కొలను హ్యాట్రిక్ కొట్టాడా?

ఒక్క‌ ఇంజెక్షన్ ఖరీదు రూ. 17 కోట్లు

అరుదైన వ్యాధి బారిన పడిన తన కూతురుని ప్రాణాలతో కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటమే సైంధవ్.

పాప ప్రాణాలతో వుండాలంటే ఒక ఇంజెక్షన్ కావాలి.

మామూలు ఇంజెక్షన్ కాదది. దాని ఖరీదు రూ. 17 కోట్లు.

ఇంజెక్షన్, క్రౌడ్ ఫండింగ్ అంశాలకు సినిమాటిక్ ఎలిమెంట్స్ జోడించి సైంధవ్‌ను నడిపించాడు దర్శకుడు.

అయితే, ఈ కంటెంట్ తెరపై వచ్చిన విధానం సాదాసీదాగా, ప్రేక్షకుడి ఊహకు ముందే అందిపోతూ, ఎక్కడా పెద్ద మలుపులు లేకుండా సాగింది.

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/NIharikaentertainments

చంద్రప్రస్థ అనే ఊహా లోకంలో ఓ విక్రమ్

దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రం కోసం చంద్రప్రస్థ అనే ఒక పోర్ట్ ఏరియాని సృష్టించాడు.

అందులో డ్రగ్స్, గన్ డీలింగ్ లాంటి అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో కమల్ హసన్ ‘విక్రమ్’ లాంటి క్యారెక్టర్‌గా సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేశ్‌) పాత్రని తీర్చిదిద్ధి డార్క్ యాక్షన్ గా కథని నడిపాడు.

సైంధవ్‌ను లోతుగా పరిశీలిస్తే విక్రమ్‌ సినిమాతో చాలా పోలికలు వుంటాయి. కానీ విక్రమ్ ఇచ్చిన అనుభూతిని ఇవ్వలేకపోయింది.

సైకో కి ఒక గతం వుందని చెబుతూ కథని మొదలుపెట్టారు.

ఇలాంటి కథలు మెల్లగా మొదలైనప్పటికీ క‌నీసం 20 నిమిషాల తర్వాత అయినా వేగం పుంజుకోవాలి. క్యారెక్టర్ ఎమోషన్ ఏమిటనేది ప్రేక్షకులకు పట్టాలి. కానీ `సైంధ‌వ్`లో అది జరగదు.

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/NIharikaentertainments

కేవలం యాక్షన్ వుంటే సరిపోతుందా?

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు హై యాక్షన్ వున్న సినిమాలు ఎక్కువగా చూస్తున్నారనే మాట వాస్తవం. అయితే కేవలం యాక్షన్ సన్నివేశాల్ని గొప్పగా తీస్తే సరిపోదు.

ఒక యాక్షన్ సీన్‌కి ముందు డ్రామా క్రియేట్ కావాలి. ఎమోషన్ రావాలి. యాక్షన్ ని కథ డిమాండ్ చేయాలి. అప్పుడే యాక్షన్ పండుతుంది.

లేదంటే ఏదో విడిగా ఒక ఫైట్ సీక్వెన్స్ చూసినట్లు వుంటుంది. సైంధవ్‌లో కూడా ఇదే జరిగింది.

సైంధవ్ సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ తో నింపారు. కొన్ని ఫైట్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. విరామం లేకుండా గన్స్, బుల్లెట్లు, గ్రానైడ్స్ పేలుతుంటాయి. ఇందులో పాత్రలని, వాటి ఎమోషన్ సంపూర్ణంగా తీర్చిదిద్దలేదు. కథానాయకుడితో పాటు ఇందులో చాలా పాత్రలు పైపైనే అన్నట్టుగా వుంటాయి.

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/NIharikaentertainments

ఇంజెక్షన్ సరిగ్గా పని చేసిందా ?

ఒక ఇంజెక్షన్ రూ.. 17 కోట్లు. దీనికి గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చూస్తారు. బహుశా దర్శకుడికి ఇదే ఆశ్చర్యం కలిగి అలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు.

అయితే నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథని సిద్దం చేసినప్పుడు.. ప్రేక్షకులని నమ్మించేలా కథనం నడపాలి.

ఈ కథని చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ వరల్డ్‌లో నడిపాడు దర్శకుడు. ఇక్కడ వరకూ బావుంది. కానీ ఒక వ్యాధి కోసం ఒక ఎన్జీవో పని చేయడం, ఆ ఒక్క ఎన్జీవోలోనే మూడువందలకు పైగా ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు వుండటం.

రూ.. 17 కోట్ల ఇంజెక్షన్ ని కనీసం ప్రోటోకాల్ లేకుండా ఒక సెక్యురిటీ గార్డ్ కి ఇచ్చి పంపించడం, ఆ సెక్యురిటీ గార్డ్ తన పాప కూడా ఈ వ్యాధితో బాధపడుతుందని చెప్పడం, ఏదో వంద రూపాయిలు అప్పు అడిగినట్లు 17 కోట్ల ఇంజెక్షన్‌ని అడగడం.. మరోవైపు ఇంజెక్షన్ వైల్స్‌ని విలన్ ఎత్తుకుపోవడం, ఆ ఇంజెక్షన్ తయారుచేసే కంపెనీ కూడా విలన్‌దే కావడం.. ఇవన్నీ పంటికింద రాళ్లలా తగులుతూనే వుంటాయి. దీంతో అరుదైన ఈ సమస్య.. ఒక అసంబద్దమైన ప్రహసనంగా మారింది.

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/NIharikaentertainments

సింగల్ హ్యాండ్ సైంధవ్

సైంధవ్ వెంకటేశ్‌ వన్ మ్యాన్ షో. తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. తన గెటప్, లుక్ బావున్నాయి. ఇంత యాక్షన్ వున్న సినిమా గతంలో ఆయన చేయలేదనే చెప్పాలి.

యాక్షన్ సన్నివేశాల్ని చురుగ్గా చేశారు. ఇంటర్వెల్ కి ముందు విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ పవర్ ఫుల్‌గా వచ్చింది. ఇలాంటి సన్నివేశాలు ఇంకొన్ని పడి వుంటే బావుండేది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించారు వెంకీ.

ఇందులో మూడు కీలకమైన స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. మనోజ్న పాత్రలో చేసిన శ్రద్దా శ్రీనాథ్ ఒక క్యాబ్ డ్రైవర్. ఆ పాత్రని చివర్లో యాక్షన్ సీన్‌కి వాడుకున్న విధానం బావుంది. ఆ సీన్ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ క్లైమాక్స్ నుంచి స్పూర్తి పొందినట్లుగా వుంటుంది.

ఎన్జీవో నడుపుతున్న పాత్రలో కనిపించిన రుహానీ శర్మ హుందాగా కనిపించారు. విలన్ గ్యాంగ్‌లో యాక్షన్‌కి స్కోప్ లో వుండే పాత్రలో ఆండ్రియా కనిపించారు.

బేబీ సారా పాత్రలో ఎమోషనల్ గా వుంది. వికాస్ మాలిక్ గా చేసిన నవాజుద్ధీన్ సిద్దిఖీ పాత్రని సరిగ్గా వాడుకోలేకపోయారనిపిస్తుంది.

ఎంత గొప్ప నటుడైనా క్యారెక్టర్ లో దమ్ము లేకపోతే తేలిపోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇలాంటి పాత్ర చేయడానికి ఆయన లాంటి నటుడే అవసరం లేదు.

సైంధవ్

ఫొటో సోర్స్, Twitter/VenkateshDaggubati

సాంకేతికంగా మెప్పించిందా?

టెక్నికల్‌గా సైంధవ్ పర్వాలేదనిపిస్తుంది.

పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతంలో ఒక మార్క్ వుంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎలివేషన్ ట్రాక్ ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. యాక్షన్ సీన్స్ కోసం ఆయన చేసిన స్కోర్ లో శబ్ద కాలుష్యమే ఎక్కువ.

కెమెరా పనితనం మాత్రం బావుంది. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ పదునుగా వుండాలి. కానీ ఇందులో అది కనిపించలేదు.

‘విక్రమ్’ స్ఫూర్తితో అలాంటి డార్క్ యాక్షన్ ని చూపించే ప్రయత్నం సైంధవ్ లో జరిగింది. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

(రివ్యూలో అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

వీడియో క్యాప్షన్, సైంధవ్ రివ్యూ: వెంకటేశ్ 75వ చిత్రం ఎలా ఉందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)