మాల్దీవుల నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తే ఏ దేశానికి నష్టం?

మోదీ, మయిజ్జూ

ఫొటో సోర్స్, ANI

మార్చి 15లోగా తమ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవులలోని మొమహ్మద్ మయిజ్జా ప్రభుత్వం ఇండియాకు ‘డెడ్‌లైన్’ విధించింది. భారత బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియకు ఇరు దేశాలు అంగీకరించినట్టు మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

అయితే భారత దళాల ఉపసంహరణకు ఎటువంటి గడువు విధించలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలియజేస్తోంది.

భారత విదేశీ వ్యవహారాల శాఖ జారీచేసిన ఓ ప్రకటనలో- ‘‘మాలేలో ఉన్నతస్థాయి అధికారిక సమావేశం జరిగింది. పరస్పర సంబంధాల బలోపేతం, సహకారం పెంపొందించుకోవడంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి’’ అని పేర్కొంది.

మాల్దీవులలోని ప్రజలకు మానవీయ, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటుచేసిన ఏవియేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ పరిష్కారం కనుగొనే విషయం చర్చించామని, త్వరలోనే ఇరు దేశాల మధ్య మరో సమావేశం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.

కీలక ఉన్నతాధికారవర్గ సమావేశం తరువాత భారత భద్రతాదళాలను ఉపసంహరించుకునే విషయమై ఇరుదేశాలు చేసిన ప్రకటనలో సారూప్యం కనిపించడం లేదు.

ఓ పక్క దళాల ఉపసంహరణకు ఇండియా సిద్ధమైందని మాల్దీవులు చెబుతుంటే, ఇండియా అటువంటిదేమీ లేదంటోంది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, GETTY IMAGES

మాల్దీవుల వివాదంపై జై శంకర్ ఏం చెప్పారు?

మాల్దీవుల నుంచి భారత దళాల ఉపసంహరణ విషయాన్ని ఆదివారం జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాల్దీవుల అధ్యక్షుడి ప్రజావిధానాల ముఖ్యకార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలియజేశారు.

పీటీఐ వార్తా సంస్థ కథనం మేరకు.. భారత ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మాల్దీవులలో 88 మంది భారత సైనికులు ఉన్నారు.

మొహమ్మద్ మయిజ్జా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో ఇటీవల ఎన్నికలలో గెలిచారు.

దీంతో తమ దేశం నుంచి భారత్ దళాలను వెనక్కు పంపడం ఆయన ప్రాథమ్యాలలో ఒకటిగా నిలిచింది.

కిందటివారం నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో- మాల్దీవులతో క్షీణిస్తున్న భారత సంబంధాల గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను ప్రశ్నించగా, ‘‘రాజకీయాలు రాజకీయాలే. ప్రతి ఒక్కరూ, ప్రతి దేశం రోజూ ఇండియాకు మద్దతు ఇస్తుందని, లేదంటే విభేదిస్తుందని చెప్పలేం. మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. పదేళ్ళుగా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తున్నాం. చాలా విషయాలలో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాం. రాజకీయా ప్రకంపనలు వస్తుంటాయి. కానీ మాల్దీవులలోని ప్రజలు భారత్ పట్ల సానుకూలమైన అభిప్రాయంతోనే ఉన్నారు. అలాగే భారత్‌తోని మంచి సంబంధాల ప్రాముఖ్యం కూడా వారికి తెలుసు’’ అని ఆయన బదులిచ్చారు.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, ANI

మాల్దీవుల మీడియా ఏం చెబుతోంది?

మాల్దీవులలోని భారత సైన్యాన్ని ఉపసంహరించుకునే విషయమై మాల్దీవులు భారత్‌తో సంప్రదింపులు మొదలుపెట్టిందని మాల్దీవియన్ మీడియా సంస్థ ‘ది ప్రెస్’ తెలిపింది.

ఈ సంప్రదింపులలో భారత్ తరపున మాల్దీవులలోని భారత హై కమిషనర్ మును మహవీర్, విదేశాంగ అధికారులు, ప్రత్యేక సంయుక్త కార్యదర్శి పునీత్ అగర్వాల్ పాల్గొన్నారని పేర్కొంది.

అలాగే మాల్దీవుల తరపున మొహమ్మద్ మయిజ్జా చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్లా ఫయాజ్, చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్ రహీమ్ లతీఫ్, రాయబారి అలీ నజీర్, ఇండియాలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం సాహిబ్ పాల్గొన్నారు.

ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ధృవీకరించినట్టు ‘ది ప్రెస్’ కథనం తెలిపింది.

కిందటేడాది నవంబర్ 17న మొహమ్మద్ మయిజ్జా అధికార పగ్గాలు చేపట్టాక ఇండియా తన భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రస్తుతం మాల్దీవులలో 88 మంది భారత సైనికులు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం కూడా ధృవీకరించింది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

మోదీతో భేటీలో మయిజ్జా ఏమన్నారు?

భారత సైనికుల ఉపసంహరణకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జా మార్చి 15ను డెడ్ లైన్ గా విధించినట్టు ‘వన్’ ఆన్‌లైన్ కథనం పేర్కొంటోంది.

భారత సైనికులు మాల్దీవులలో ఉండటానికి వీల్లేదని, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని మాల్దీవులప్రభుత్వంలోని పబ్లిక్ పాలసీ చీఫ్ సెక్రటరీ అబ్దుల్లా నజీమ్ చెప్పారని తెలిపింది.

ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో మయిజ్జా కూడా లేవనెత్తారని ఆ కథనం పేర్కొంది.

మాల్దీవుల నుంచి తక్షణం తన దళాలను ఉపసంహరించుకోవడానికి ఇండియా అంగీకరించినట్టుగా ‘ది ఎడిషన్’ కథనం తెలుపుతోంది. ఈ విషయంపై త్వరలో తదుపరి సమావేశం కూడా జరగనునున్నట్టు మాల్దీవుల విదేశీ వ్యవహారాలశాఖను ఉటంకిస్తూ ఆ కథనం తెలిపింది.

ఈ విషయాన్ని చర్చించేందుకు భారత్ నుంచి ప్రత్యేక బృందం వచ్చినట్టు పేర్కొంది.

సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరుదేశాల మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారని ‘ది సన్’ తెలిపింది. దీంతోపాటుగా కొన్ని ఉమ్మడి అంశాలు, పరస్పర సహకారం గురించి కూడా చర్చించారు. త్వరలోనే ఈ విషయంపై మరోసారి ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది అని పేర్కొంది.

ప్రధాని మోదీ, మయిజ్జా సమావేశం అయ్యాక ఈ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఫొటో క్యాప్షన్, మాలేలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మయిజ్జాతో సమావేశమైన భారత మంత్రి కిరణ్ రిజిజు

మాల్దీవుల నుంచి సైన్యం ఉపసంహరణతో నష్టమేంటి?

‘‘హిందూ మహాసముద్ర దేశమైన మాల్దీవులలో ఐదున్నరలక్షల మంది జనం నివపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ దేశ చైనా అనుకూల పాలకుడు బీజింగ్ వెళ్ళి వచ్చాక భారత్‌కు డెడ్‌లైన్లు విధిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రకటనలు చేస్తున్నారు. మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ల మెయింటినెన్స్ కోసం అక్కడున్న భారత దళాలను ఇండియాకు తిప్పి పంపేయవచ్చు’’ అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లని సామాజిక మాధ్యమాలలో రాశారు.

దీనిపై ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం మహమ్మద్ మయిజ్జా తాను చెప్పినట్టే భారత సైనికులను వెనక్కి పంపుతారు. కానీ అలా చేయడం వల్ల దౌత్యపరంగా మాల్దీవులు ప్రతికూలతను ఎదుర్కొంటుంది. భారత్ పట్ల వ్యతిరేతను ప్రకటించడం ద్వారా ఆ దేశం తనంతట తానుగా అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కూడా దూరమవుతుంది. అమెరికా ఈ విషయంలో కొంత దూరంగానే ఉండొచ్చు. కానీ హిందూ మహాసముద్రంలో చైనా జోక్యం పెరుగుతుంది. బహుశా ఈ వ్యవహారం అమెరికాను ఆందోళనకు గురిచేయచ్చు.

ఆ కథనం మేరకు- భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కొనసాగడానికి భారత్ తన భూభాగంలోని ఏ ద్వీపం నుంచైనా తన బలగాలను, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మాల్దీవులలో రాడార్ వ్యవస్థను కోల్పోవడం భారత్‌కు విస్మయం కలిగించే విషయమే. మాల్దీవుల ముందు ఈ విషయాన్ని ఉంచి ఈ ప్రాంతంలో తన ఉనికి కోసం భారత్ ఆ దేశాన్ని ఒప్పించాలి.

‘‘మయిజ్జా తనదైన రాజకీయం చేస్తూ దాన్నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు’’ అని భారత మాజీ దౌత్యవేత్త రాకేష్ సూద్ ‘ద హిందూ’ పత్రికతో చెప్పారు.

‘‘వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. అయితే దెబ్బకు దెబ్బ తీసేలా సమాధానం ఇవ్వడం భారత్‌కు మంచిది కాదు. సామాజిక, ఆర్థిక విషయాల్లో తన ప్రాముఖ్యమేమిటో మాల్దీవులు గుర్తెరిగేలా భారత్ చేయాలి’’ అని ఆయన సూచించారు.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ

భారత్‌పై పొరుగు దేశాల్లో పెరుగుతున్న అపనమ్మకం

ఇటీవల కాలంలో పొరుగు దేశాలకు భారత్ దూరమవుతోంది.

ఇలా దూరమైన దేశాల జాబితాలో చైనా, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఉన్నాయి.

‘‘భారత్ తన పొరుగునున్న చిన్నదేశాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో అపనమ్మకం పెరుగుతోంది. ఈ దేశాలలోని ప్రభుత్వాలను భారత్ నమ్మడం లేదు. ప్రత్యేకించి చైనాతో సంబంధం ఉన్న విషయాలలో అస్సలు నమ్మడం లేదు. ’’ అని దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ఓ మాజీ విదేశాంగ మంత్రి చెప్పినట్టు ‘నిక్కీ ఆసియా’ రిపోర్ట్ తెలిపింది.

మాల్దీవులతోపాటు నేపాల్‌తో సంబంధాల విషయంలోనూ భారత్‌కు దూరం పెరిగింది.

కాలాపానీ, చెక్‌పోస్టు, మ్యాప్‌ల విషయంలో ఈ దేశంతో భారత్‌కు వివాదం ఉంది.

ఇక పాకిస్తాన్‌తో భారత్ దూరం చరిత్రాత్మకమైనది.

2019 తరువాత ఈ దూరం మరింత పెరగడం చూడొచ్చు.

గల్వాన్‌ లోయలో 2020లో జరిగిన ఘర్షణల తరువాత భారత్, చైనా సంబంధాలు క్షీణించాయి.

అనేక మీడియా కథనాలతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు.

కానీ ఇలాంటి ప్రకటనలను భారత ప్రభుత్వం తోసిపుచ్చుతోంది.

చైనాతో శ్రీలంకకు పెరుగుతున్న అనుబంధం ఇండియాకు మంచిది కాదని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.

భారత్ ఆందోళనలను పక్కనపెట్టి శ్రీలంక 2020లో ‘యువాన్ వాంగ్ 5’ చైనా నౌకను హంబన్‌టోటా ఓడరేవుకు అనుమతించింది.

ఈ ఓడరేవును చైనా తన సైనిక కార్యకలాపాలకు వినియోగించుకుంటుందేమోనని భారత్ ఆందోళ చెందింది.

1.5 బిలియన్ డాలర్ల హంబన్‌టోటా ఓడరేవు ఆసియా, యూరప్‌లకు అతిపెద్ద దగ్గరి నౌకా మార్గం.

అప్పును తీర్చలేక హంబన్‌టోటా ఓడరేవును శ్రీలంక 99 ఏళ్ళపాటు చైనాకు తాకట్టు పెట్టడంపై భారత్ ఆందోళన చెందుతోంది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

మయిజ్జాకు చేదు అనుభవం

చైనా నుంచి మయిజ్జా ఇటీవలే తిరిగొచ్చారు. ఆయన చైనా నుంచి తిరిగిరాగానే ‘‘మా దేశం చిన్నదే కావచ్చు. దానర్థం మమ్నల్ని బెదిరించడానికి ఇతరులకు లైసెన్స్ ఉందని కాదు’’ అని చెప్పారు.

ఈ మాటలు ఆయన ఇండియానుద్దేశించే అన్నారని నమ్ముతున్నారు.

మయిజ్జా చైనా పర్యటనకు వెళ్ళినరోజే భారత్‌తో వివాదం మొదలైంది.

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ ఫోటోలపై మయిజ్జా ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింతగా రాజుకుంది.

దీని తరువాత ఇరు దేశాలూ తమ తమ దేశాలలోని హై కమిషనర్లకు సమన్లు పంపాయి.

ఈ పరిణామం తరువాత భారత్‌లోని కొన్ని కంపెనీలు, కొంత మంది ప్రజలు ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ డిమాండ్ మొదలుపెట్టారు. దీనికి ప్రతిగా మాల్దీవులలో పర్యాటక రంగంతో ముడిపడినవారు, ప్రతిపక్షంలోనివారు మయిజ్జా ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతోపాటు మాలేలోని ఖాళీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మయిజ్జా పార్టీ ఓడిపోయింది.

మయిజ్జా అధ్యక్షుడు కాక ముందు ఇక్కడ మేయర్‌గా ఉన్నారు. ఇక్కడ మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆదాం అజీమ్ మేయర్‌గా గెలిచారు. మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ పగ్గాలు మహమ్మద్ ఇబ్రహీం చేతుల్లో ఉన్నాయి. ఈయనకు ఇండియా అనుకూలుడనే పేరుంది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

చైనా నుంచి మాల్దీవులకు ఏం అందుతుంది?

చైనా మాల్దీవులకు 130 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తుంది.

ఈ ఆర్థిక సాయంలో ఎక్కువ మొత్తాన్ని మాల్దీవుల రాజధానిలో రోడ్ల పునర్ నిర్మాణం కోసం వినియోగిస్తారు

మాల్దీవియన్ ఎయిర్‌లైన్ ‘మాల్దీవ్స్’ చైనాలో దేశీయ విమానాలను ప్రారంభిస్తుంది.

హల్‌హుమాలేలో పర్యాటక అభివృద్ధి కోసం చైనా 50 మిలియన్ల యూఎస్ డాలర్లను అందిస్తుంది

విలిమాలేలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికయ్యే ఖర్చును చైనా గ్రాంటుగా ఇస్తుంది.

BOYCOT MALDIVES

ఫొటో సోర్స్, ANI

ఇండియా నుంచి మాల్దీవులకు అందే సాయమేంటి?

గతంలో ఇండియా అనేకసార్లు మాల్దీవులకు సాయం అందించింది.

1988లో కాక్టస్ ఆపరేషన్ కావచ్చు, 2004లో సునామీ వచ్చినప్పుడు కావచ్చు, కోవిడ్ సమయంలో మాల్దీవులకు మందులు పంపడం కావచ్చు.. ఇలా పలు సందర్భాలలో సాయం అందించింది.

మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానిది కీలక పాత్ర కాగా, మాల్దీవులను సందర్శించే పర్యాటకులలో ఎక్కువ మంది భారతీయులే.

నిరుడు మాల్దీవులను రెండు లక్షలమంది భారతీయులు సందర్శించారు.

మాలే ఎయిర్ పోర్ట్ విస్తరణకు భారత్ 134 మిలియన్ల యుఎస్ డాలర్ల అదనపు రుణాన్ని ప్రకటించింది.

భౌగోళికంగా మాల్దీవులు భారత్‌కు దగ్గరగా ఉంటాయి.

ఈ దేశానికి సంబంధించిన వాణిజ్యమంతా ఇండియాతోకానీ, ఇండియా ద్వారా కానీ జరుగుతుంటుంది.

మాల్దీవులకు భారత్‌తో అనేక రక్షణ ఒప్పందాలు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, మాల్దీవుల నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కు రప్పిస్తే ఏ దేశానికి నష్టం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)