El Dorado: బంగారంతో మెరిసే భూభాగం కోసం చరిత్రలో సాగిన సాహస యాత్రలు

El Dorado

ఫొటో సోర్స్, Public Domain

    • రచయిత, ఎడిసన్ వెయ్‌గా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎటు చూసినా స్వచ్చమైన బంగారంతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా కనిపించే నేల. ద సిటీ ఆఫ్ గోల్డ్ - ఎల్‌డొరాడో.

వందల ఏళ్లుగా యూరోపియన్ అన్వేషకులు స్వర్ణంతో తులతూగే ఈ భూతల స్వర్గం కోసం అన్వేషించారు.

ఆ నగరం ఎక్కడ ఉందా అని ఆఫ్రికా, ఆసియాల్లో సుదూర ప్రాంతాలను వెతికారు. అది హిందూ మహాసముద్రంలో ఎక్కడో ఒక చోట ఉండవచ్చని అనుకునేవారు.

అమెరికాలో క్రిస్టఫర్ కొలంబస్ నౌకాదళం ( 1451- 1506) ఏర్పడిన తర్వాత, 1492లో వారి చూపు ఈ ప్రాంతాలపై పడింది.

ఆ సందర్భం ఇంగ్లిష్ అన్వేషకుడు వాల్టర్ రాలీని ( 1552-1618) ఇంగ్లండ్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ శకంలోని( 1533-1603) ప్రముఖులలో ఒకరిగా చేసింది. గయానా ఆధీనంలో ఉండి వెనెజ్వెలా తమదని వాదిస్తున్న ఎస్సీక్విబో నది ఉన్న ప్రాంతానికి అబద్దాల ఆధారంగా కీర్తిని తెచ్చి పెట్టింది.

అయితే, ఈ కథనం మూడు అంశాల గురించి ప్రస్తావిస్తుంది.

మొదటిది, అసలు ఈ ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది?. రెండోది వాల్టర్ రాలీ ఎవరు? మూడోది అప్పటి వరకూ యూరోపియన్లకు తెలియని ప్రస్తుత గయానాకు ఆయన రెండు సార్లు ఎలా వెళ్లారు?

అప్పట్లో ఆయనకు విలువైన ఖనిజ వనరులేవీ దొరకలేదు. తన అన్వేషణకు ఒక విలువైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో తాను ఎల్‌డొరాడో కనుక్కున్నట్లు చెప్పారు.

1588లో ఓ రచయిత రూపొందించిన వాల్ట‌ర్ రాలీ వర్ణ చిత్రం

ఫొటో సోర్స్, PUBLIC DOMAIN

ఫొటో క్యాప్షన్, 1588లో ఓ రచయిత రూపొందించిన వాల్ట‌ర్ రాలీ వర్ణ చిత్రం

పార్ట్ 1 - ఎల్‌డొరాడో

“బైబిల్ ప్రవచనాలకు ముందు సంపద, విజ్ఞానాన్ని అందించే కింగ్ సాలమన్‌కు చెందిన గనులున్న భూములే ఎల్‌డొరాడో అని అనేకమంది యూరోపియన్ అన్వేషకులు, యుద్ధ విజేతలు భావించారు” అని చరిత్రకారుడు విక్టర్ మిస్సియాటో బీబీసీతో చెప్పారు.

“మధ్య యుగం నాటి పరిస్థితులు, మానసిక స్థితిని బట్టి చూస్తే, బైబిల్ సూక్తులకు అనుసంధానిస్తూ అభిప్రాయాలను ముడి పెట్టారు. వీరిలో అనేకమంది యూరప్ అంతటా పర్యటించారు. వీరు యుద్ధాలు, వ్యాధులు, అమెరికాను కనుక్కోవడం అనేవి దైవదూత బహుమతులని భావించారు.” అని ఆయన చెప్పారు.

ఈ ప్రాంతంలో బంగారం, విలువైన రాళ్లను భగవంతుడు బహుమతిగా ఇచ్చారనే నమ్మకం వారిని ప్రోత్సహించింది.

“పురాతన సాహస గాధల్లో చెప్పినట్లుగా కష్టాల్ని అధిగమించిన వారే తమ చివరి లక్ష్యమైన అద్భుత ప్రపంచాన్ని చేరుకోగలుగుతారు” అని విక్టర్ మిస్సియాటో ఆన్నారు.

తమ పూర్వీకులు కూడా బంగారం, వెండి ఉపయోగించారని భావించే అమెరికన్ల ఆలోచనలకు యూరోపియన్లలో ప్రచారంలో ఉన్న ఈ కల్పిత కథనాలు ఊపిరి పోశాయి. ఎందుకంటే, అమెరికాలో కూడా ఈ బంగారు నేల కోసం అన్వేషించాలని భావించిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు.

“మధ్యయుగపు సంస్కృతి, ఆలోచనల ఫలితమే ఎల్‌డొరాడో. వాళ్లు బంగారంలో తడిసి ముద్దయిన ఈ స్వర్గం ఉందని నమ్మేవారు. అది కూడా దక్షిణం వైపు ఉందని భావించేవారు. కొంతమంది మూలవాసుల్లోనూ బంగారంతో నిండిపోయిన ప్రాంతం ఉందనే పురాణ గాధలు ప్రచారంలో ఉండేవి” అని ప్రొఫెసర్ పౌలో నిక్కొలి రమిరెజ్ బీబీసీతో చెప్పారు.

అమెరికాలో కనిపించే దృశ్యాలు యూరోపియన్లను ఆశ్చర్యపరచడం ఈ పురాగాధలకు ఆజ్యం పోసిందని రమిరెజ్ గుర్తు చేసుకున్నారు.

తెగుళ్లు, వ్యాధులు, యుద్ధాలు వంటి యూరోపియన్ పరిణామాలకు భిన్నంగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ నగ్నంగా సంచరించే స్థానిక ప్రజలు తమను తాము ఆడమ్, ఈవ్ వారసులుగా భావించారు. పచ్చగా, సమృద్ధిగా ఉన్న ప్రాంతమే స్వర్గం కావచ్చని వారు భావించారు అని ఆయన చెప్పారు.

అమెరికా సందర్శనలో బాగంగా ఎల్‌డొరాడో అనేది స్పానిష్ ప్రపంచం దృష్టి కోణంలో ఉందని చరిత్రకారుడు, సోషియాలజిస్టు సెర్గియో బురాక్ హొలండా తాను డాక్టరేట్ చేసిన సమయంలో రాసిన వ్యాసాల్లో పొందుపరిచారు. తర్వాతి కాలంలో దాన్నే విసవో డొ పరాసియో అనే పుస్తకంగా మార్చారు.

ఇదంతా ఎందుకంటే, ఆసియా, ఆఫ్రికాల్లో బంగారు గనులున్న భూమి కోసం సుదీర్ఘకాలం అన్వేషించిన తర్వాత పోర్చుగీసు వారు విసుగు చెంది ఈ భూముల కోసం వచ్చారనేది హొలండా అభిప్రాయం.

వాళ్లు రాజు ఆజ్ఞతో ఎల్‌డొరాడో అనే స్వర్గాన్ని వెదికేందుకు రాలేదు. ఎందుకంటే వాళ్లు అప్పటికే అనేక పురాణ గాధల గురించి విని ఉన్నారు. అవి వాస్తవం కాదని వారికి తెలుసు అని రమిరెజ్ చెప్పారు.

వాళ్లు వాస్తవికమైన వాటి కోసం వెదుకుతున్నారు. అందుకే వారు పావ్ బ్రసిల్‌లో ఉన్న సంపద కోసం, చెరకు కోసం వెదికారు.

ఈ స్పానిష్ పురాణ గాథ నావికుడైన కొలంబస్‌ను కూడా ప్రభావితం చేసింది. స్థానిక మూలవాసుల ముక్కుకు వేలాడుతున్న బంగారం కూడా ఇక్కడ దొరికిందేనని ఆయన 1492 అక్టోబర్ 13న అమెరికాలో అడుగు పెట్టినప్పుడు తన ట్రావెల్ డైరీలో రాసుకున్నారు.

అక్టోబర్ 15న మరోసారి ఈ అంశం గురించి ప్రస్తావించారు. అక్కడున్న ద్వీపాలలో వృధాగా పడి ఉన్న బంగారం కోసం వెదికానని అందులో చెప్పారు. అలాగే స్థానికులు పెట్టుకున్న స్వర్ణాభరణాల గురించి కూడా పేర్కొన్నారు.

స్పానిష్ అమెరికాలో మూడువందల ఏళ్ల పాటు ఎల్డొరాడో కోసం వెదికారని చరిత్ర కారుడు హొలండా చెప్పారు. పురాణాలు, అందులో ఉన్న నాయకుడు, వాటిలోని కథనాలు, అవి అస్తిత్వంలో ఉన్నాయా లేవా అని అన్వేషకులు విశ్వసించే దానిని బట్టి ఆ ప్రదేశం మారుతూ ఉంటుంది.

‘ఈ పురాణం 1530 నుంచి స్పానిష్ అమెరికా అంతటా విస్తరించింది'’ అని రమిరెజ్ చెప్పారు.

మొదట్లో అది ఇప్పుడున్న కొలంబియా అని అనుకునే వారు. ఆ తర్వాత అది వెనెజ్వెలాకు తర్వాత కొంతకాలానికి అమెరికా మధ్య ప్రాంతంలోకి మారింది.

ఈ భూభాగాల గురించి యూరోపియన్లకు ఏమీ తెలియదు అని అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. సంపదకు స్వర్గధామం, వారి లక్ష్యానికి కేంద్ర స్థానమని భావిస్తున్న ప్రాంతం ప్రస్తుత గయానా అని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

వాల్ట‌ర్ రాలీని చిత్రీకరిస్తూ చెక్కిన థియోడర్ డి బ్రై

ఫొటో సోర్స్, PUBLIC DOMAIN

ఫొటో క్యాప్షన్, వాల్ట‌ర్ రాలీని చిత్రీకరిస్తూ చెక్కిన థియోడర్ డి బ్రై

పార్ట్ 2: వాల్టర్ రాలీ

ఏమైనప్పటికీ వాల్టర్ రాలీ మెదడు నిండా ఎల్డొరాడోను కనుక్కోవాలనే కల నిండిపోయి ఉంటుంది. ఆయన ఇంగ్లండ్‌లోని డెవన్ పట్టణంలోని ఓ ప్రొటెస్టెంట్ కుటుంబంలో పుట్టారు. కుటుంబంలోని ఐదుగురు పిల్లల్లో అందరి కంటే చిన్నవాడు.

ఆయన యవ్వనం అంతా అస్థిరమైన ప్రయాణాలతో సాగింది. ఆయన న్యాయశాస్త్రాన్ని చదువుకున్నాడని, బహుశా అది పూర్తి చేయలేదనేది కొంతమంది వాదన.

1579 నుంచి 1580 వరకూ డెస్మండ్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఈ ప్రాంతంలో బ్రిటిషర్ల పాలనకు వ్యతిరేకంగా ఐరిష్ ఫ్యూడల్ లార్డ్స్ లేవనెత్తిన ఉద్యమం ఇది.

ఈ అణచివేత కార్యక్రమంలో సాధించిన విజయాలకు గాను వాల్టర్ రాలీకి భారీగా భూములు దక్కాయి. మొత్తం ఐర్లండ్‌లో 0.2 శాతం భూమి ఆయన సొంతమైంది.

చిన్న చిన్నగా అతను ఇంగ్లీష్ రాజుల మనసు చూరగొన్నారు. గ్రామాలు, కౌంటీలు, మారుమూల ప్రాంతాలు, దేశాలు, క్రిస్టియన్ రాజులు, క్రిస్టియన్ ప్రజల ఆధీనంలో లేని ప్రాంతాలను గెలుచుకుని వాటిని పాలించి లేదా తన పాలనలో ఉంచుకునేలా వాల్టర్ రెలీగ్‌కు అనుమతి ఇస్తూ 1584లో క్వీన్ ఎలిజబెత్ రాజపత్రాన్ని జారీ చేశారు.

అందుకు ప్రతిగా ఆయన తన ప్రాంతంలో కనుక్కున్న విలువైన ఖనిజాలలో 20 శాతం రాజ కుటుంబానికి ప్రతిఫలంగా చెల్లించాల్సి ఉంటుంది.

అలా ఒక విజేతలో బీజం నాటారు. తర్వాత ఆయన సొంతంగా అమెరికా మీదకు, ప్రత్యేకించి దక్షిణ ప్రాంతం మీదకు దండయాత్రకు బయలుదేరారు. 1584-1585 మధ్య ఆయన నాయకత్వంలో చేపట్టిన సైనిక చర్య ప్రస్తుతం నార్త్ కరోలినా తీరంలో ఉన్న రోవనొకే ఐలండ్‌ను కనుక్కోవడంతో ముగిసింది. నార్త్ అమెరికాలో బ్రిటిషర్ల తొలి వలస పాలనా ప్రాంతం ఇదే.

రాణి అనుమతితో వాల్టర్ ప్రస్తుత వర్జీనియా ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలనను ప్రారంభించాడు.

సౌత్ అమెరికాలో బంగారు నగరం ఉందనే పుకార్లు 1594లో ఆయన చెవిన పడ్డాయి. ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సందేహాలు లేవు. బంగారపు నగరం కథేంటో తేల్చాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు.

“మూలవాసులు చెప్పిన కథల ఆధారంగా చాలా ప్రాంతాలను ఎల్‌డొరాడో అనే భావించారు” అని మిస్సియాటో చెప్పారు.

ఈ కథలను విజేతలతో చర్చల ప్రతిపాదనను తిరస్కరించడానికి మూలవాసులు ఒక మార్గంగా భావించారు.

దాడులకు సంబంధించిన ప్రతీ సమాచారం రహస్యంగా ఉంచేవారు. “ఎల్‌డొరాడోను కనుక్కున్నామనే విజయం తమకు మాత్రమే దక్కాలని ప్రతీ గ్రూపు కోరుకునేది. ఎందుకంటే, ఈ ఘనతను తమ సొంతం చేసుకునేందుకు చాలా బృందాలు ప్రయత్నించాయి. ఇందులో కొంతమందికి పాలకుల ప్రోత్సహం ఉంటే మరి కొంతంమది దొంగల ముఠాలతో అనుబంధం ఉండేదని చరిత్రకారులు చెప్పారు.

రలేగ్ విషయంలో ఇది పూర్తిగా ప్రైవేటీకరణగానే చెప్పుకోవాలి. ఆయనకు పాలకుల నుంచి పూర్తి మద్దతు ఉంది.

ఇంగ్లండ్ కూడా ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉండింది. సాహసికులకు అవసరమైన సొమ్మును అందించడం, వాళ్లు కనుక్కున్న ఖనిజ వనరుల మీద పూర్తిస్థాయి ఆధిపత్యం తీసుకోవడమే రాజ కుటుంబం లక్ష్యం.

ఈ ఇంగ్లీష్ అన్వేషకుడి పాత్రను రమిరెజ్ మరింత గొప్పగా చెప్పారు.

ఎల్‌డొరాడో ఉందని ఆయన బ్రిటిష్ రాజ కుటుంబాన్ని ఒప్పించారు. స్వర్గాన్ని వెదకడంలో స్పెయిన్ వాసుల కథ నుంచి తాను స్ఫూర్తి పొందానని ఆయన రాజ కుటుంబానికి చెప్పారు. ఆ ప్రాంతాన్ని కనిపెట్టాలనే తన ఆలోచనను వారు అర్థం చేసుకున్నారని రమిరెజ్ తెలిపారు.

1860లో రాలీకి మరణశిక్ష అమలు చేస్తున్నప్పటి దృశ్యం చిత్రీకరణ

ఫొటో సోర్స్, PUBLIC DOMAIN

ఫొటో క్యాప్షన్, 1860లో రాలీకి మరణశిక్ష అమలు చేస్తున్నప్పటి దృశ్యం చిత్రీకరణ

పార్ట్ 3: గయానాకు ప్రయాణాలు

వాల్టర్ రాలీ సాహసాన్ని చారిత్రక కోణంలో చెప్పడం మంచిది. 1585లో స్పానిష్- ఆంగ్లో యుద్ధం జరిగింది. రెండు రాజ్యాల మధ్య రాజకీయ, మత పరమైన సంఘర్షణ అది.

ప్రైవేటు జెండాలను ఎగరవేసే నౌకలను ముంచివేయడంతో ఇది విదేశాలను చిక్కులలో పడవేసింది. ఎలిజబెత్ రాణి అనుగ్రహాన్ని పొందేందుకు ఆయన స్పెయిన్ మీదకు దండయాత్ర చేశాడు.

అదే సమయంలో ఎల్‌డొరాడో గురించి రాణికి చెప్పాడు. ప్రస్తుత గయానా గురించి చెబుతూ “అది బంగారం సమృద్ధిగా ఉన్న ప్రాంతం. పెరూ కంటే ఎక్కువ లాభదాయకం” అని వివరించారు.

రాలీ ఎన్నో ఏళ్లుగా ఎంతో మనసుపడిన ఈ కథనాన్ని పూర్తిగా నమ్మారని అనిపించింది. ఆయన నాయకత్వంలోని సైన్యం 1580ల్లో స్పానిష్ సాహసికుడు పెడ్రో సర్మినెంటో డి గంబోవాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది.

గంబోవాను జైలులో బంధించింది. ఈ సమయంలోనే ఆయన తన వద్ద ఉన్న స్పానిష్ నివేదికలను బ్రిటిష్ వాళ్లకు అందించి ఉండవచ్చు.

గంబోవా మరో స్పెయిన్ సాహసికుడి గురించి రాలీ‌కు చెప్పి ఉండవచ్చు. ఒరినోకో నది ప్రాంతంలో అన్వేషణకు వెళ్లినప్పుడు అతనిని స్థానికులు కిడ్నాప్ చేసి కళ్లకు గంతలు కట్టి అంతా బంగారుమయంగా కనిపించే ప్రాంతానికి తీసుకెళ్లారనేది దాని సారాంశం.

కళ్లకు గంతలు కట్టడంతో ఆ ప్రాంతం గురించి, అక్కడి వ్యక్తుల గురించి అతనికి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.

తన వద్ద ఉన్న మ్యాపుల సాయంతో ఈ సమాచారాన్ని నిర్థరించుకునే ప్రయత్నం చేశాడు. ఎల్‌డొరాడో అనేది ఎస్సీక్విబో నదికి సమీపంలో ఒరినోకో నది దక్షిణం వైపున ఉండే ఒక పట్టణమని దాని పేరు మనోవా అని రాలీ అంచనా వేసుకున్నారు. అక్కడో సరస్సు ఉందని దాని పేరు పరిమే అని అనుకున్నాడు. వీటన్నింటి ఆధారంగా ఎల్‌డొరాడో గురించి ఒక అంచనాకు వచ్చారు.

తర్వాత ఇదే ఆలోచన ఆయన మదిలో స్థిరపడిపోయింది.

“ఆదివాసుల పురాణాలు, మధ్యయుగం నాటి ఆలోచనా ధోరణి కలగాపులగంగా కలిసిపోయి ఈ ఇంగ్లీష్ వ్యక్తి మెదడును ఆక్రమించాయి” అని రమిరెజ్ అన్నారు.

ఆయన ఈ సాహస కార్యక్రమం కోసం పెట్టుబడి పెట్టాలని ఆయన రాజకుటుంబాన్ని ఒప్పించాడు. 1595 ఫిబ్రవరి 6న రాలీ నడిపిస్తున్న పడవ ఇంగ్లండ్‌లోని ప్లిమౌత్ పోర్టు నుంచి బయల్దేరింది.

నౌకలో అవసరమైన సరకులు నింపుకునేందుకు మొదట ఆ నౌక అజోర్స్‌లో ఆగింది. తర్వాత కానరీ ఐలండ్స్ దగ్గర కోర్సెయిర్లు ఓ స్పానిష్ నౌకను దోచుకున్నారు. దీంతో, ఇంగ్లీష్ వాళ్లకు కొంత పరిమాణంలో మందుగుండు కూడా దొరిగింది.

స్పానిష్ వలస పాలనలో ఉన్న ట్రినిడాడ్ నుంచి అన్వేషణ ప్రారంభించాలని వారు నిర్ణయించారు. ఆ క్రమంలో వారు ఆ ఏడాది ఏప్రిల్ 4న ప్యురెటో డి ఎస్పానా అనే చిన్న కోటను గెలుచుకున్నారు.

అక్కడ నుంచి ఆ వలస పాలనకు కేంద్రంగా ఉన్న శాన్‌జోస్ డి ఒరునా వెళ్లారు.

ఒరునా గవర్నర్‌ను రాలీ విచారించారు. బహుశా ఆ గవర్నర్‌కు మనోవా, ఎల్డొరాడో గురించి తెలిసి ఉండవచ్చు. అయితే, అతను ఇంగ్లీష్ నావికులు అటు వెళ్లడాన్ని ఆయన నిరుత్సాహపరిచి ఉండవచ్చు.

తర్వాత ఈ సాహస యాత్ర ఒరినొకొ నది వైపు కొనసాగింది. నెల రోజులకు సరిపడా ఆహార పదార్ధాలు నింపుకున్న రెండు పడవల్లో వంద మంది ప్రయాణిస్తూ ఉన్నారు.

మారిన వాతావరణ పరిస్థితులతో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉష్ణ మండలంలో ఉండే విపరీతమైన వేడి, తరచుగా కురిసే వాన వారిని చికాకు పరిచాయి. వారికి మార్గం చూపించేందుకు వచ్చిన మూలవాసి వ్యక్తులు కనిపించకుండా పోవడంతో ఈ అన్వేషకుల బృందంలో నిరుత్సాహం ఏర్పడింది.

అయితే, ఒరినొకో తీర ప్రాంతానికి చేరుకున్న తర్వాత తమకు సానుకూల మార్గం కనిపిస్తుందనే ఆశతో వారు ప్రయాణాన్ని కొనసాగించారు. దట్టమైన అడవి వారిని గడ్డి మైదానాల వైపు తీసుకెళ్లింది.

వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. స్పానిష్ నౌకలు దాడులు చేయవచ్చని వారు దారి పొడవునా భయపడుతూనే ఉన్నారు. రెండు సందర్భాల్లో ప్రతిఘటన ఎదురైంది.

కొన్ని రోజుల తర్వాత రాలీ సాహస యాత్ర కరోనీ నదీ తీరానికి చేరుకుంది. అక్కడ వారు వరావో, పెమాంగ్ అనే ఇద్దరు వ్యక్తులను కలిశారు. అక్కడ స్థానికుల ద్వారా మరోసారి మనోవా, ఎల్‌డొరాడో సంపన్న నాగరికత గురించి రాలీ అతని బృందం విన్నారు.

రాలీ మౌంట్ రొరైమా అనే పర్వతాన్ని చూశారు. దానిపై నుంచి 12 జలపాతాలు పడుతున్నాయని ఆయన తన పుస్తకంలో రాశారు. అందులో ఒకటి చర్చ్ టవర్ కంటే ఎత్తు నుంచి పడుతోందని అన్నారు. అయితే ఏంజెల్ ఫాల్స్ చూసి ఉంటాడని కొంతమంది భావించారు. ఏంజెల్ జలపాతం 807 మీటర్ల ఎత్తు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా కిందకు పడుతుంది.

అయితే అప్పటికే వారు 400మైళ్లు ప్రయాణించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో తిరిగి వెళ్లాలంటే బృందంలో సభ్యులంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని రాలీ ఆదేశాలు జారీ చేశాడు. వాళ్లు ఆగస్టులో తిరిగి ఇంగ్లండ్ వచ్చారు.

వారు తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌లో గొప్ప ఆహ్వానం ఏమీ లభించలేదు. రాజ కుటుంబం పెట్టుబడి పెట్టినప్పటికీ ఈ బృందం విలువైన వస్తువులు తీసుకు రాలేకపోయిందని ఎర్ల్ ఆఫ్ సాల్స్‌బరీ రాబర్ట్ సెసిల్ గుర్తించారు. వాళ్లు తెచ్చిన రాళ్ల నమూనాలను పరిశీలించిన తర్వాత వాటికి పెద్దగా విలువ లేదని తేలింది.

దీంతో ఆగ్రహించిన రాలీ తన సాహసయాత్ర గురించి పుస్తకం రాసి ముద్రించాలని నిర్ణయించారు. ఆ పుస్తకం పేరు ద డిస్కవరీ ఆఫ్ గ్రేట్, రిచ్ అండ్ బ్యూటీఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా అని పెట్టారు. ఇందులో గ్రేట్ అనే పదాన్ని బంగారు నగరం మనోవాకు గుర్తుగా వాడారు ( మనోవాను స్పెయిన్ ప్రజలు ఎల్‌డొరాడో అని పిలిచేవారు).

విలియం సెగార్ గీసిన వాల్టర్ రాలీ వర్ణ చిత్రం

ఫొటో సోర్స్, PUBLIC DOMAIN

ఫొటో క్యాప్షన్, విలియం సెగార్ గీసిన వాల్టర్ రాలీ వర్ణ చిత్రం

ఈ పుస్తకం సాహసయాత్ర గురించిన వాస్తవ సమచారాన్ని అందించింది. అయితే, రాలీ యాత్రలో కొన్ని అంశాల గురించి ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. తాను ఆ ప్రాంతంలో విలువైన రాళ్లను కనుక్కున్నట్లు రాశారు.

అయితే, కొన్ని కోణాల్లో చూస్తే, ఇక్కడితో వాల్టరీ రాలీ ప్రాభవం తగ్గిపోయింది. “ ఇది ప్రయాణాలకు సంబంధించిన సాహిత్యంలో మాస్టర్ పీస్” అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న బెంజమిన్ షిమిట్ రాశారు. అలాగే, ఈ పుస్తకం యూరోపియన్లు కొత్త ప్రపంచాన్ని కనుక్కునే ప్రయత్నంలో పునరుజ్జీవనానికి ఈ గ్రంథం ముఖ్యమైన మార్గాలని చూపించిందని చెప్పారు.

తర్వాతి సంవత్సరం ఈ ఆంగ్ల సాహస యాత్రికుడు తన సహచరుడైన లారెన్స్ కెమ్స్‌ను (1562-1618) మరో సాహస యాత్రకు పంపాలని నిర్ణయించాడు.

ఆ ప్రాంతాన్ని మ్యాప్‌లలో భద్రపరిచేందుకు స్థానికులతో సంబంధాలు పెట్టుకోవడం, సమాచారాన్ని సేకరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎస్సీక్విబో నది తీర ప్రాంతం గురించిన సమాచార సేకరణలో కెమ్స్ పాత్ర ఎవరూ కాదనలేనిది.

పరిమె అని భావించే సరస్సుని కెమ్స్ కనుకున్నారు. ఇప్పుడు ఈ సరస్సు గొప్పదిగా గుర్తింపు పొందింది.

1603లో ఎలిజబెత్ వన్ వారసులు అధికారం చేపట్టిన తర్వాత రాలీని తిరుగుబాటు, కుట్ర నేరాల కింద అరెస్ట్ చేశారు. రాజ కుటుంబం క్షమాభిక్ష పెట్టడంతో 1616లో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. 1617లో ఆయన గయానాకు యాత్ర చేసేందుకు మరోసారి అనుమతి ఇచ్చింది బ్రిటిష్ రాజ కుటుంబం.

ఈ ప్రయాణంలో ఆయన బృందం ఇంగ్లండ్- స్పెయిన్ మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఒరినొకో నది వద్ద ఓ స్పెయిన్ నౌక మీద దాడి చేసింది.

స్పానిష్ నావికుల నుంచి ఒత్తిడి రావడంతో స్పెయిన్ రాజు కింగ్ జేమ్స్ ఫస్ట్ వాల్టర్ రాలీ తల నరికి చంపేసేలా మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు.

1618 అక్టోబర్ 29న వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌లోని ఓల్డ్ ప్యాలెస్ యార్డ్‌లో ఈ శిక్షను అమలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌