మీ వేలిముద్రలు మీకే ప్రత్యేకమా... కాకపోవచ్చని అంటున్న ఏఐ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయ్ క్లెయిన్మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
ఒక వ్యక్తి వేలిముద్రలు ఆ వ్యక్తికే ప్రత్యేకం. అచ్చంగా అలాంటి వేలిముద్రలు మరొకరికి ఉండే అవకాశమే లేదని మనం ఇప్పటివరకూ నమ్ముతున్నాం. కానీ, ఈ నమ్మకాన్ని కొలంబియా యూనివర్సిటీ పరిశోధన ఒకటి సవాల్ చేస్తోంది.
ఒక వ్యక్తి వేలిముద్రలు మరొకరితో సరిపోలుతాయో లేదో తెలుసుకునేందుకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌కి అమెరికా యూనివర్సిటీకి చెందిన బృందం శిక్షణ ఇచ్చింది.
వేర్వేరు వేలిముద్రలు ఒక వ్యక్తి వేలిముద్రలతో సరిపోలుతాయో లేదో ఈ టెక్నాలజీ 75 శాతం నుంచి 90 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదని పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే, అది ఎలా పనిచేస్తుందో కచ్చితంగా చెప్పలేకపోయారు.
''ఏఐ ఈ పని ఎలా చేస్తుందనేది కచ్చితంగా తెలియదు'' అని ఈ అధ్యయనాన్ని పర్యవేక్షించిన కొలంబియా యూనివర్సిటీ రోబోసిస్ట్, ప్రొఫెసర్ హాడ్ లిప్సన్ అంగీకరించారు.
ఏఐ సంప్రదాయ విధానాలకు భిన్నంగా వేలిముద్రలను విశ్లేషించి ఉంటుందని, మినిటియేగా పిలిచే వేలిముద్రల రేఖల(రిడ్జెస్) ముగింపు, వాటి కేంద్రం(ఫోర్క్)పై కంటే, వేలి మధ్యలో రేఖలు ఎలా చీలిపోతున్నాయనే దానిపై ఫోకస్ చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
''దశాబ్దాలుగా ఫోరెన్సిక్ నిపుణులు వినియోగిస్తున్న సంప్రదాయ గుర్తులను ఇది ఉపయోగించడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది వేలిముద్రలోని రేఖల వంపు, రేఖలు విడిపోయే వేలి మధ్యలోని సుడుల ఆధారంగా వేలిముద్రలను పరీక్షిస్తున్నట్లు అనిపిస్తోంది'' అని ప్రొఫెసర లిప్సన్ చెప్పారు.
తొలుత ఈ ఐడియాతో వచ్చిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధి గేబ్ గువో, తాను ఏఐ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయామని ప్రొఫెసర్ లిప్సన్ అన్నారు.
''ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఏ ఇద్దరి వేలిముద్రలు కలిసే అవకాశం లేదనే విషయానికి ఎప్పుడూ ప్రామాణిక నిర్ధారణ లేదు'' అని హల్ యూనివర్సిటీకి చెందిన సైన్స్ ప్రొఫెసర్ గ్రాహం విలియమ్స్ అన్నారు.
''ఏ ఇద్దరి వేలిముద్రలు కలిసే అవకాశం లేదని ఇప్పటి వరకూ మనకు కచ్చితంగా తెలియదు. మనకు తెలిసినంత వరకూ చెప్పగలిగేది ఏంటంటే, ఏ ఇద్దరి వేలిముద్రలు కలవలేదని మాత్రమే.''
కొలంబియా విశ్వవిద్యాలయం అధ్యయనానికి రెండు విషయాలు, వేలిముద్రను ఉపయోగించి ఏదైనా పరికరాన్ని అన్‌లాక్ చేసే బయోమెట్రిక్ విధానాన్ని, ఫోరెన్సిక్ సైన్స్‌ను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉంది.
ఉదాహరణకు, క్రైమ్ సీన్ 'ఏ'లో గుర్తుతెలియని వ్యక్తి బొటన వేలిముద్ర కనిపించి, క్రైమ్ సీన్ 'బి'లో చూపుడు వేలిముద్ర దొరికితే, ఫోరెన్సిక్ సైన్స్ ప్రకారం ఆ రెండూ ఒక వ్యక్తివేనని చెప్పే అవకాశం లేదు. అయితే ఏఐ టూల్ ఆ రెండూ ఒక వ్యక్తివో కాదో కూడా చెప్పగలదు.
ఫోరెన్సిక్ విభాగంలో ఎలాంటి అనుభవం లేని ఈ కొలంబియా యూనివర్సిటీ బృందం, దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని అంగీకరించింది.
ఏఐ సాధారణంగా పెద్ద సంఖ్యలో డేటాని శోధిస్తుంది, ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని వేలిముద్రలు అవసరం.
దానికితోడు, ఈ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే అన్ని వేలిముద్రలు స్పష్టంగా ఉంటాయి. కానీ బయటి ప్రపంచంలో చాలా వేలిముద్రలు అంత స్పష్టంగా, పూర్తిగా అర్థమయ్యేలా ఉండవు.
''కోర్టుల్లో సాక్ష్యాలను నిర్ధారించే స్థాయిలో మా టూల్ పనిచేయకపోవచ్చు, కానీ ఫోరెన్సిక్ విభాగంలో పని సులువు చేసేందుకు ఉపయోగపడుతుంది'' అని గువో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రస్తుత దశలో ఈ అధ్యయనం క్రిమినల్ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అంత ప్రభావం చూపకపోవచ్చు'' అని స్టాఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సారా ఫీల్డ్‌హౌస్ అన్నారు.
ఏఐ టూల్ చర్మంపై రేఖల వంపులపైనే ఫోకస్ చేస్తుందా లేక సంప్రదాయ పద్ధతుల్లో పరీక్షించినట్లు జీవిత కాలంలో అవి ఎలా రూపాంతరం చెందాయనే అంశాలపై ఫోకస్ చేస్దుందా? అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలియాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇతర ఏఐ టూల్స్ తరహాలోనే ఈ టూల్ కూడా కచ్చితంగా ఎలా పనిచేస్తుందో పరిశోధకులకు కూడా స్పష్టంగా తెలియకపోవడం వల్ల దీనికి సమాధానం చెప్పడం కష్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
కొలంబియా యూనివర్సిటీ అధ్యయనంపై క్షుణ్ణంగా సమీక్ష జరిగింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురితం కానుంది.
ఈ విషయంలో కెషైర్‌కి చెందిన కవలలు అందరికంటే ముందున్నారు. తన మనవళ్లు ఒకరి ఐఫోన్‌ను మరొకరు వాళ్ల వేలిముద్రలతో ఓపెన్ చేయగలరని కవలల నానమ్మ బీబీసీతో చెప్పారు.
''క్రిస్మస్ రోజు నా ముందు చేసి చూపించారు'' అని చెప్పారు. వాళ్లు పుట్టినప్పుడు ఒకేలా ఉన్నారని, కానీ పెద్దయిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని చెప్పగలనని ఆమె మాతో చెప్పారు.
తన మనవళ్లు ఫోన్‌లోని ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా దాటి ఫోన్ ఓపెన్ చేయగలరని ఆమె పేర్కొన్నారు.
వేలిముద్రలు పుట్టకముందే ఏర్పడతాయి. జీబ్రాలు, చిరుతపులుల వంటి జంతువుల వేలిముద్రల వెనుక వాటి జన్యు ప్రక్రియ కూడా ఉండొచ్చని గత సంవత్సరం ప్రచురించిన పరిశోధన సూచించింది. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదట 1950లలో కోడ్‌బ్రేకర్ అలన్ ట్యూరింగ్ ప్రతిపాదించారు.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- పాకిస్తాన్ ఎన్నికల్లో తొలి హిందూ మహిళా అభ్యర్థి డాక్టర్ సవీరా ప్రకాశ్
- బంగ్లాదేశ్:షేక్ హసీనాను ఇందిరా గాంధీ ఎందుకు ఇండియా రప్పించి రహస్యంగా ఉంచారు?
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
- సుచనా సేథ్: 'నాలుగేళ్ళ కొడుకును చంపి, బ్యాగులో కుక్కి, రహస్యంగా కారులో తీసుకెళుతున్న ఈ తల్లి’ ఎలా దొరికిపోయారంటే....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














