లక్షద్వీప్ భారీగా పర్యాటకులొస్తే తట్టుకోగలదా?

ఫొటో సోర్స్, PMO
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కోచి
ఈ నెల ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షదీవుల పర్యటన అనూహ్యంగా పొరుగు దేశమైన మాల్దీవులతో వివాదానికి దారి తీసింది. అలాగే, గొలుసుకట్టు మాదిరిగా చిన్నచిన్న దీవుల సమూహంగా ఉండే లక్షదీవులపై పర్యాటకుల్లోనూ ఆసక్తి రేపింది. అయితే, దీనిపై పర్యావరణవేత్తలు, కొందరు స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మాల్దీవులకు ఉత్తరంగా, అరేబియా సముద్రంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న లక్షదీవుల పర్యటనలో మోదీ వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. సముద్ర గర్భంలో విహరించిన(స్నార్కెలింగ్), బీచ్‌ల అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ తర్వాత మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మోదీపై ‘అభ్యంతరకర వ్యాఖ్యలు’ చేయడం భారతీయ సోషల్ మీడియాలో వివాదాన్ని రాజేసింది. మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక ప్రదేశంగా లక్షదీవులను పేర్కొంటూ సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది.
ఆ ప్రచారం గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించని లక్షద్వీప్ పోయిన వారం ఒక్కసారిగా గూగుల్ సర్చ్‌లో ఇంతకుముందెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. మోదీ పర్యటన అనంతరం లక్షదీవుల కోసం సర్చ్ చేసిన వారు 3,400 శాతం పెరిగినట్లు భారత్‌కు చెందిన అతిపెద్ద ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ తెలిపింది.
ఈ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ ఖోడా పటేల్ లక్షద్వీప్‌పై ఆసక్తి పెరగడాన్ని స్వాగతించారు. కొన్నేళ్ల కిందట ఆయన అవలంబించిన వివాదాస్పద విధానాలు లక్షద్వీప్‌లో స్థానికుల నుంచి పెద్దయెత్తున నిరసనలకు కారణమయ్యాయి.
''సహజ అందాలతో అలరారే లక్షదీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అక్కడ వసతి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపడుతోంది'' అని ఆయన వార్తా సంస్థ పీటీఐతో చెప్పారు.
2026 నాటికి లక్షదీవుల్లో రెండు ప్రపంచ స్థాయి రిసార్ట్‌లను నిర్మించినున్నట్లు టాటా గ్రూప్ కూడా ప్రకటించింది. మొత్తం 36 చిన్నచిన్నద్వీపాలు ఉన్న ఈ ద్వీపసమూహంలో కేవలం 10 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. వాటి విస్తీర్ణం సుమారు 32 చదరపు కిలోమీటర్లు.
లక్షద్వీప్‌కు ప్రస్తుతం ఒక విమానయాన సంస్థ మాత్రమే సర్వీసులు నడుపుతోంది. సర్వీసుసలను పెంచడంతో పాటు మరో సంస్థ త్వరలోనే సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
అయితే, విస్తీర్ణం, అక్కడి పర్యావరణం కారణంగా అందమైన తెల్లని బీచ్‌లు, నీలిరంగు సముద్రపు నీరు, పగడపు దీవులకు ప్రసిద్ధి చెందిన లక్షదీవులను మాల్దీవుల తరహాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తమ భాగస్వామ్యం కూడా ఉండేలా పర్యాటక రంగ అభివృద్ధి జరగాలని, కానీ ఒక్కసారిగా తమ జీవితాలు తల్లకిందులయ్యేలా భారీ ప్రణాళికలు అవసరం లేదని అక్కడి స్థానికుల్లో చాలా మంది అంటున్నారు.
ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం, అక్కడి ప్రజలు చేపల వేట, కొబ్బరి సాగు, కొబ్బరి పీచు ఉత్పత్తులపై ఆధారపడతారు. అలాగే, పర్యాటకాన్ని అభివృద్ధి చెందుతున్న రంగంగా ప్రభుత్వం పేర్కొంది.
అదనపు విమాన సర్వీసులు ప్రారంభించక ముందు వరకూ లక్షదీవులు చేరుకునేందుకు కేవలం రెండే మార్గాలు ఉన్నాయి. కేరళలోని కోచి నుంచి లక్షద్వీప్‌లోని అగట్టి ఐల్యాండ్‌లో ఉన్న ఏకైన విమానాశ్రయానికి అలయెన్స్ ఎయిర్ విమానయాన సంస్థ నడుపుతున్న సర్వీసుతోపాటు, నాలుగు రోజులకొకసారి వచ్చే షిప్‌లలో మాత్రమే వెళ్లే వీలుండేది.
లక్షద్వీప్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతులు కూడా పరిమిత సంఖ్యలో ఉండేవి.
''ఈ దీవుల అభివృద్ధికి రవాణా, వసతి, మౌలిక సదుపాయాల లేమి అడ్డంకిగా ఉన్నాయి'' అని లక్షద్వీవుల్లోని 70 వేల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) ఎంపీ పీపీ మహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు.
''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బస చేసిన బంగారం ఐల్యాండ్‌లో పర్యాటకుల కోసం కేవలం 36 గదులు మాత్రమే ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.
అందువల్ల, ప్రస్తుతం ఇక్కడ టూరిజం క్రూయిజ్(షిప్)ల ద్వారా నడుస్తోంది. లంగర్ వేసిన ఓడల నుంచి దిగొచ్చిన పర్యాటకులు పగలంతా దీవుల్లో తిరిగి, రాత్రికి మళ్లీ ఓడలోకి చేరుకుంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘స్థానికులకు కూడా అవకాశాలు రావాలి’
మాల్దీవుల్లో పర్యాటకులు బస చేసేందుకు రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల వంటి వందల కొద్దీ ఆప్షన్లు ఉన్నాయి.
''మాల్దీవుల తరహాలో లక్షదీవుల్లో అందమైన బీచ్‌లు, సముద్ర గర్బంలో విహరించే అవకాశం (వాటర్ స్పోర్ట్స్) వంటివి ఉన్నాయి. కానీ, మౌలిక సదుపాయాల పరంగా చాలా దూరంలో ఉన్నాం'' అని ఎంపీ ఫైజల్ చెప్పారు.
అభివృద్ధి పనులు జరగాలంటే, అటు ప్రభుత్వం, ఇటు ఇక్కడి స్థానికుల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
లక్షద్వీప్ జనాభాలో 96 శాతం మంది ముస్లింలు. 2020 డిసెంబరులో బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితుడయ్యారు. తర్వాత ఆయన తీసుకొన్న వివిధ నిర్ణయాలకు వ్యతిరేకంగా లక్షదీవుల్లో ప్రజలు నిరసనలు తెలిపారు.
స్కూల్ మెనూ నుంచి మాంసాహారాన్ని తీసివేయడం, భూమిపై ఆధిపత్యానికి సంబంధించి ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పించే చట్టం ముసాయిదా వంటి చర్యలు వివాదాస్పదమయ్యాయి.
వీటిపై ప్రఫుల్ పటేల్ ఆఫీస్‌తో పాటు లక్షద్వీప్ కలెక్టర్, పర్యాటక శాఖ, సమాచార శాఖలను సంప్రదించేందుకు బీబీసీ ఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ప్రయత్నించింది. కానీ ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు.
అయితే పలు ఇంటర్వ్యూల్లో పటేల్ తన చర్యలను సమర్థించుకున్నారు. అవన్నీ లక్షద్వీప్ అభివృద్ధి కోసమేనని ఆయన చెప్పుకొచ్చారు.
మోదీ పర్యటన తర్వాత, లక్షదీవుల పర్యటన గురించి వివరాలు అడుగుతున్న ఔత్సాహిక పర్యాటకుల సంఖ్య దాదాపు 30 నుంచి 40 శాతం పెరిగిందని అగట్టి ఐల్యాండ్‌లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న అల్తాఫ్ హుస్సేన్ చెప్పారు.
పర్యాటకుల సంఖ్య పెరగడాన్ని స్వాగతించిన హుస్సేన్, భవిష్యత్తులో అగట్టిలో రిసార్ట్ నిర్మించాలని భావిస్తున్నారు. ఇక్కడ బడా వ్యాపారవేత్తలకే కాకుండా స్థానికులకు కూడా అవకాశాలు కల్పించేలా విధానాలు ఉండాలని ఆయన ఆశిస్తున్నారు.
''పెద్దపెద్ద ప్రాజెక్టులు వస్తే చిన్నచిన్న ఉద్యోగాలు వస్తాయి. అది కాదు మేం కోరుకునేది. కేవలం పని చేయాలని అనుకోవడం లేదు. ఓనర్లు కూడా కావాలని ఆశిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వాతావరణ మార్పులపై నిపుణుల మాట ఏమిటి?
వాతావరణ మార్పుల కారణంగా అక్కడి స్థానికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా సమతౌల్యం చేసేలా లక్షద్వీప్‌లో అభివృద్ధి పనులు జరగాలని నిపుణులు అంటున్నారు.
''పగడపు దిబ్బలు, బీచ్‌లు, నీటి మడుగులపై లక్షదీవుల దీర్ఘకాలిక మనుగడ ఆధారపడి ఉంది'' అని దీవులపై 1996 నుంచి పరిశోధనలు చేస్తున్న మెరైన్ బయాలజిస్ట్ - కోరల్ రీఫ్ ఎకాలజిస్ట్ రోహన్ ఆర్థర్ చెప్పారు. ''ఇవి పర్యావరణపరమైన సదుపాయాలను కల్పిస్తాయి. ఒకదానితో మరోటి ముడిపడి ఉంటాయి'' అన్నారు.
హిందూ మహాసముద్రంలోని ఈ ప్రాంతంపై, ఇక్కడి పగడపు దీవులపై ఎల్-నినో, సదరన్ ఆసిలేషన్ (ఈఎన్‌ఎస్‌వో) వల్ల ఏర్పడే వేడిగాలులు కొన్ని దశాబ్దాలుగా ప్రభావం చూపుతూ వస్తున్నాయి.
ఈ ఏడాది ఈఎన్‌ఎస్‌వో ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ''లక్షద్వీప్‌లోని పగడపు దిబ్బలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో'' అని ఆలోచించేందుకే రోహన్ ఆర్థర్ భయపడుతున్నారు.
వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికలు లేకుండా లక్షద్వీప్‌లో అభివృద్ధి పనులు చేపడితే అది స్థానికుల ఆవాసానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, LAKSHADWEEP.GOV.IN
ఏ సమస్యా లేని పర్యాటకం ఎలా సాధ్యం?
లక్ష ద్వీప్‌ను కర్బన కాసారంగా మార్చే విలాసవంతమైన పర్యాటకానికి బదులు, అక్కడి జీవావరణాన్ని, స్థానికుల ప్రయోజనాలను సంరక్షించే ఉత్తమ నమూనా అవసరమని నిపుణులు, స్థానికులు భావిస్తున్నారు.
జస్టిస్ రవీంద్రన్ కమిషన్ సమర్పించిన ప్రణాళికల రూపంలో ఈ దీవుల అభివృద్ధికి ఇప్పటికే 'ఒక నిర్దిష్ట నమూనా' ఉందని ఎంపీ ఫైజల్ చెప్పారు. ఇది 2015లో కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం కూడా పొందింది.
అవే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చెబుతున్నప్పటికీ, కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను ఇక్కడి ప్రభుత్వం పాటించడం లేదని ఫైజల్ అంటున్నారు.
పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టే ముందు స్ధానిక సంస్థలను సంప్రదించాలని, పగడపు దిబ్బలు - నీటి మడుగుల వంటి పర్యావరణ వ్యవస్థలను సంరక్షించేందుకు డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలపై నిషేధం విధించడం, జనావాసాలు లేని దీవుల్లో మాత్రమే పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ఇంటిగ్రేటెడ్ ఐల్యాండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిఫార్సులు చేసింది.
పర్యాటకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి 230 ఏళ్ళు పడుతుందా?
- పొగమంచు ఉంటే విమానాలు ఎందుకు ఆలస్యమవుతాయి, నిపుణులైన పైలట్లు లేరా?
- సచిన్ తెందూల్కర్‌కు ఆ వైరల్ వీడియో మీద ఎందుకు కోపం వచ్చింది?
- భారత సరిహద్దుకు సమీపంలోని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామన్న మియన్మార్ తిరుగుబాటుదారులు
- ముస్సోరీ హోటల్లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?















