మాల్దీవులు దూకుడుపై భారత్ మౌనం ఎందుకు?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మాల్దీవులు ఒక చిన్న ద్వీపదేశం. ఆ దేశ విస్తీర్ణం కేవలం 300 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో మాల్దీవులు ఇండియా రాజధాని దిల్లీ కన్నా ఐదు రెట్లు చిన్నది.

దాదాపు 1200 చిన్నచిన్న దీవుల సమాహారం మాల్దీవులు. జనాభా 5.21 లక్షలు.

ప్రపంచంలో చిన్న చిన్న భూభాగాలుగా విడిపోయి ఉండే దేశంగా మాల్దీవులను చెబుతారు. మాల్దీవుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బోట్లు, నౌకల్లో వెళ్లాల్సి ఉంటుంది.

ఆ దేశ వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, మాల్దీవులు భారత్‌కు డెడ్‌లైన్ విధిస్తూ అల్టిమేటం జారీచేస్తోందని చాలా మంది అంటున్నారు.

''ఇస్లామిక్ ధోరణి, చైనా అనుకూల విధానాలు పాటిస్తున్న మాల్దీవుల నూతన అధ్యక్షుడికి చైనా పర్యటనతో ధైర్యం వచ్చింది. భారత్‌కు డెడ్‌లైన్స్ పెడుతున్నారు. బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ల నిర్వహణ చూసుకోగలమని, తమ భూభాగంపై ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ దుందుడుకు ప్రకటనలు చేస్తున్నారు'' అని భారత్‌‌కు చెందిన ప్రముఖ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానె ట్వీట్ చేశారు.

మహమ్మద్ మయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

మాల్దీవులు ఎందుకంత ప్రధానం?

ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు గత వారమే తమ దేశానికి చేరుకున్నారు.

చైనా నుంచి వచ్చీ రాగానే, దేశ రాజధాని మాలెలో ఆయన మాట్లాడుతూ- ''మాల్దీవులు చిన్నదేశమే కావొచ్చు, కానీ అది తమ దేశాన్ని బెదిరించేందుకు వేరే దేశానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు'' అన్నారు.

ఆయన భారత్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ, ఈ మాటలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అన్నవేనని అర్థమవుతోంది. అయితే, మాల్దీవులకు వ్యతిరేకంగా ఇప్పటివరకూ భారత్ స్పందించలేదు.

మార్చి 15 కల్లా భారత్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవులు గడువు విధించింది. దీంతో మాల్దీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ భారత్ ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్న తలెత్తుతోంది.

భారత్‌కు మాల్దీవులు అంత ముఖ్యమా? అందువల్లే మాల్దీవుల దూకుడు ప్రకటనలను భారత్ సహిస్తోందా?

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

సముద్ర మార్గాలు, ప్రతిపక్షం, ముస్లిం జనాభా

ప్రపంచ పటంలో భౌగోళికంగా కీలకమైన చోట మాల్దీవులు ఉంది. హిందూ మహాసముద్రంలో ప్రధాన సముద్ర మార్గాలకు సమీపంలో ఈ దేశం ఉంది.

ఈ సముద్ర మార్గాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు ఇదే మార్గం ద్వారా చమురు సరఫరా అవుతుంది. అందువల్ల మాల్దీవులతో సంబంధాలు దెబ్బతినడం భారత్‌కు ఏవిధంగానూ సమర్థనీయం కాదు.

ప్రస్తుతం మాల్దీవుల్లోని ప్రతిపక్షం భారత్ వైపే ఉందని చెబుతుంటారు. ఒకవేళ భారత్ ఆవేశపూరిత ప్రకటనలు చేసి, అవి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తే, అప్పుడు అక్కడి ప్రతిపక్షాలను శాంతింపజేయడం కూడా సాధ్యం కాదు.

అలాంటి పరిస్థితులు ఎదురైతే, అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షంపై చైనా ప్రభావం పెరుగుతుంది.

మాల్దీవులు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం. భారత్‌లోని మతవివాదాల ప్రభావం కూడా అక్కడ కనిపిస్తుంది. నుపూర్ శర్మ విషయంలోనూ మాల్దీవుల నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఈ ఇంటర్నెట్ యుగంలో, దేశీయ రాజకీయ వివాదాలకు కూడా సరిహద్దులు లేకుండా పోయాయి.

మహమ్మద్ మయిజ్జు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

హిందూ మహాసముద్రం: చైనాతో పెరుగుతున్న పోటీ

ఇటీవలి దశాబ్దాల్లో హిందూ మహాసముద్రంలో వాణిజ్య, సైనిక కార్యకలాపాలకు సంబంధించి దేశాల మధ్య పోటీ పెరిగింది.

హిందూ మహాసముద్రంలో చైనా తన పట్టు పెంచుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్దీవులు కూడా దానితో జట్టు కడితే, మరింత పట్టు సాధించేందుకు సులభమవుతుంది.

మయిజ్జు నేతృత్వంలోని ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం చైనా అనుకూల వైఖరితో ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. మయిజ్జు ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు, చైనా అనుకూల అభ్యర్థి మయిజ్జు విజయం అని మీడియాలో హెడ్‌లైన్స్‌లో వచ్చింది.

2015 జులైలో మాల్దీవులు రాజ్యాంగ సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం, విదేశాలు భూమిని సమీకరించుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మాల్దీవుల్లో చైనా వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందనే ఊహాగానాలు పెరిగాయి.

ఈ విషయంపై గత శనివారం నాగ్‌పూర్‌లోని మంథన్ టౌన్‌హాల్లో జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు.

మాల్దీవులతో సంబంధాలు దెబ్బతినడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ''రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా ప్రతి సందర్భంలోనూ మనకు మద్దతుగా ఉంటారని, లేదంటే మన మాట వింటారనే గ్యారంటీ ఇవ్వలేను. గత పదేళ్లలో మెరుగైన సంబంధాలు కొనసాగాయి. చాలా విషయాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా కొంత వ్యతిరేకత ఉంది. కానీ, అక్కడి సామాన్యులకు భారత్‌పై మంచి అభిప్రాయం ఉంది. భారత్‌తో సత్సంబంధాలు ఎంత ముఖ్యమో కూడా వాళ్లకు తెలుసు'' అన్నారు.

మహమ్మద్ మయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

నిపుణులు ఏమంటున్నారు?

మయిజ్జు ప్రభుత్వ దూకుడు చర్యలకు భారత్ తెలివిగా, వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుందని భారత్‌కు చెందిన మాజీ దౌత్యవేత్తలు సూచిస్తున్నారు.

''మయిజ్జు రాజకీయం చేస్తున్నారు, దాని నుంచి ఆయన లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. అయితే, భారత్ కూడా ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్లుగా స్పందించడం సరైనది కాదు. సామాజికంగా, ఆర్థికంగా భారత్ ఎంత ముఖ్యమైన దేశమో మాల్దీవులకు తెలిసొచ్చేలా భారత్ వ్యవహరించాల్సి ఉంటుంది'' అని భారత మాజీ దౌత్యవేత్త రాకేశ్ సూద్ ‘ద హిందూ’ పత్రికతో అన్నారు.

మాల్దీవుల సార్వభౌమాధికారం, స్వతంత్రంగా వ్యవహరించడంలో గత ఇబ్రహీం సోలిహ్ ప్రభుత్వం రాజీ పడిందని ముయిజ్జు భావిస్తున్నారు.

ఇబ్రహీం సోలిహ్ ప్రభుత్వానికి భారత్ అనుకూలమనే పేరుంది.

తమ భూభాగంపై భారత సైన్యం ఉండడాన్ని మయిజ్జు వ్యతిరేకిస్తూ వచ్చారు, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ భూభాగం విడిచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ కూడా విధించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన 'ఇండియా అవుట్' నినాదాన్ని బలంగా తీసుకెళ్లారు.

ఇబ్రహీం సోలిహ్ హయాంలో భారత్‌తో కుదుర్చుకున్న మూడు రక్షణ ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమాధికారానికి విరుద్ధమని ముయిజ్జు నేతృత్వం వహిస్తున్న ప్రోగ్రెసివ్ అలయెన్స్ అభిప్రాయపడింది.

ఈ మూడు ఒప్పందాలను మయిజ్జు ప్రభుత్వం వ్యతిరేకించింది. సోలిహ్ ప్రభుత్వం 2021లో భారత్‌తో ఉతురు తిలా ఫలాహు(యూటీఎఫ్) ఒప్పందంపై సంతకం చేసినప్పుడు అప్పటి ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక రక్షణ ఒప్పందం, దాని ప్రకారం నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ హార్పర్‌ను సంయుక్తంగా ఏర్పాటు చేస్తారు.

మహమ్మద్ మయిజ్జు

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఎన్నికల్లో భారత్ వ్యతిరేక ప్రచారం

నిరుడు జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో భారత్ వ్యతిరేక ప్రచారం ప్రధాన అంశాల్లో ఒకటిగా మారింది.

అనేక సమస్యల కారణంగా మాజీ అధ్యక్షుడు యమీన్ ఎన్నికల్లో పాల్గొనలేకపోవడంతో మహమ్మద్ మయిజ్జు కొద్ది నెలల్లోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎదిగారు.

అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు మయిజ్జు మాల్దీవుల రాజధాని మాలె నగరానికి మేయర్‌గా ఉండేవారు. ఇబ్రహీం సోలిహ్ ప్రభుత్వం ఇండియా ఫస్ట్ విధానాన్ని అవలంబించింది. తమ విదేశాంగ విధానంలో భారత్‌కు తొలిప్రాధాన్యం ఇచ్చింది. సోలిహ్ హయాంలో భారత్, మాల్దీవుల మధ్య అనేక రక్షణ, ఆర్థిక ఒప్పందాలు జరిగాయి.

మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయిన తర్వాత, తమ విదేశాంగ విధానంలో భారత్‌కు దూరంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామనే సంకేతాలిచ్చారు. ఆయన తన తొలి విదేశీ పర్యటనకు తుర్కియే వెళ్లారు. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు భారత్‌ వచ్చే ఆనవాయితీని కూడా మయిజ్జు బ్రేక్ చేశారు.

తుర్కియే తర్వాత యూఏఈ వెళ్లిన మయిజ్జు, ఆ తర్వాత చైనాలో కూడా పర్యటించారు. చైనాను తమ ప్రధాన భాగస్వామిగా మయిజ్జు అభివర్ణించారు. అలాగే అనేక ముఖ్యమైన ఒప్పందాలపై కూడా సంతకం చేశారు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, తన మొదటి ప్రసంగంలో భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి ఉపసంహరించుకోవాలని మయిజ్జు పునరుద్ఘాటించారు. దేశ సార్వభౌమాధికారం, స్వతంత్రత తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని చెప్పారు.

మాల్దీవుల తీర ప్రాంతంలో సర్వేకు సంబంధించి 2019లో భారత దేశంతో ఒక ఒప్పందం కుదిరింది. దానిని మయిజ్జు ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇబ్రహీం సోలిహ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు, హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్‌కు సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేశారు. తీరప్రాంత భద్రతలో సహకరించుకోవడం దీని ఉద్దేశం. ఈ ఒప్పందంపై కూడా సోలిహ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇకపై ఈ ఒప్పందం కొనసాగదని మయిజ్జు ప్రభుత్వం డిసెంబర్‌లో ప్రకటించింది.

ఈ ఒప్పందాల నుంచి మాల్దీవులు దూరం జరగడాన్ని చైనాకు దగ్గరవుతున్నుట్లుగా పరిగణిస్తున్నారు. సోలిహ్ హయాంలో రక్షణ పరంగా భారత‌‌ అనుకూల వైఖరి, ఇప్పుడు చైనా వైపునకు మారిందని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, మాల్దీవులు దూకుడుగా వ్యవహరిస్తున్నా భారత్ ఎందుకు మౌనంగా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)