ప్రపంచంలో తొలిసారిగా సముద్ర గర్భంలో నార్వే మైనింగ్‌.. అక్కడున్న విలువైన ఖనిజాలు ఏమిటి?

ఖనిజాల వెలికితీత

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఎస్మే స్టాలార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • సముద్ర గర్భంలో విలువైన ఖనిజాల వెలికితీతకు నార్వే సమాయత్తం
  • ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా నార్వే
  • బిల్లును వ్యతిరేకిస్తున్న పర్యావరణవేత్తలు
  • సముద్ర జీవులకు ముప్పుపై ఆందోళన

సముద్ర గర్భంలో అత్యంత విలువైన ఖనిజాల వెలికితీతకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా నార్వే నిలిచింది. వాణిజ్య అవసరాల కోసం నార్వే ఈ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన బిల్లును నార్వే జనవరి 9న ఆమోదించింది. గ్రీన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ ఉన్న విలువైన మెటల్స్ అన్వేషణను ఇది విస్తృతం చేయనుంది.

ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తూ నార్వే తీసుకున్న నిర్ణయంతో సముద్ర జీవ సంపదపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ ప్లాన్ కేవలం నార్వే జలాలకు మాత్రమే పరిమితం. కానీ, అంతర్జాతీయ జలాల్లో మైనింగ్ ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది నార్వే చేరుకోనుంది.

అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను చేపడతామని, మరిన్ని పర్యావరణ అధ్యయనాలు చేపట్టి లైసెన్సులను జారీ చేయడం ప్రారంభిస్తామని నార్వే ప్రభుత్వం చెబుతోంది.

సముద్రపు జీవులు

ఫొటో సోర్స్, ALEXANDER SEMENOV/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సముగ్ర గర్భంలో నివసించే జీవజాతిపై పరిమితంగానే అందుబాటులో ఉన్న సమాచారం

నాడ్యూల్స్, క్రస్ట్స్ శిలల్లో లిథియం, స్కాండియం

‘నార్వేజియన్ సీ’లో ఈ మైనింగ్ జరుగనుంది.

సముద్రం అడుగున బంగాళదుంప ఆకారంలో ఉండే శిలలు ఉన్నాయి. వీటినే నాడ్యూల్స్, క్రస్ట్స్ అని కూడా పిలుస్తుంటారు.

లిథియం, స్కాండియం, కోబాల్ట్‌తో పాటు బ్యాటరీ వంటి క్లీన్ టెక్నాలజీలకు అవసరమైన ఖనిజాలు వీటిల్లో ఉన్నాయి.

తన పరిధిలో ఉన్న జలాల్లో 2,80,000 చదరపు కి.మీల వరకు మైనింగ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేలా కంపెనీలకు అనుమతిస్తూ నార్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మైనింగ్‌కు అనుమతిస్తున్న ప్రాంతం బ్రిటన్ పరిమాణం కంటే ఎక్కువగా ఉంది.

ఈ ఖనిజాలు భూమిపైన దొరుకుతున్నప్పటికీ, కేవలం కొన్ని దేశాలలో మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అంతేకాక, ఆయా దేశాల్లో వీటి సరఫరా కూడా ప్రమాదంలోనే ఉంది. ఉదాహరణకు, కోబాల్ట్ రిజర్వులు ఎక్కువగా ఉన్న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటి మైనింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

లైసెన్స్ దరఖాస్తు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు నార్వేలోని మైనింగ్ కంపెనీ లోక్ మినరల్స్ సహ వ్యవస్థాపకుడు వాల్టర్ సోగ్నెస్ చెప్పారు.

అయితే, మైనింగ్ ప్రారంభానికి ముందే సముద్రపు అడుగులను మరింత అర్థం చేసుకోవాల్సి ఉందని వాల్టర్ సోగ్నెస్ ఒప్పుకున్నారు.

పర్యావరణ ప్రభావంపై సరైన అవగాహన లేనందున అన్వేషణ, మ్యాపింగ్ యాక్టివిటీకి దీర్ఘకాలం పట్టవచ్చని ఆయన అన్నారు.

హంప్‌బ్యాక్

ఫొటో సోర్స్, MIKE KOROSTELEV/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సముద్ర గర్భంలో మైనింగ్ వల్ల హంప్‌బ్యాక్ వేల్ వంటి సముద్ర జీవులు ఇబ్బంది పడతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు

నిపుణులు, పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?

సముద్ర జీవానికి ఈ ప్రకటన పెను ముప్పు అని ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఫౌండేషన్‌కు చెందిన సముద్ర పరిశోధకులు, విశ్లేషకులు మార్టిన్ వెబ్లెర్ అంటున్నారు.

అత్యంత ప్రమాణాలతో కూడిన పర్యావరణ విధానాలను అమలు చేయాలనుకుంటున్నట్లు నార్వే ప్రభుత్వం నొక్కి చెబుతోందని, కానీ, అన్ని శాస్త్రీయ సూచనలను తిప్పికొట్టడం దాని మూర్ఖత్వమేనని విమర్శించారు.

పూర్తిగా నూతన పరిశ్రమను తెరవడంపైనే కాకుండా ప్రస్తుత కార్యకలాపాల్లో పర్యావరణ ముప్పును అరికట్టడంపై కూడా మైనింగ్ కంపెనీలు దృష్టిపెట్టాలని సూచించారు.

పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలతో ఈ విధానంపై తాత్కాలికంగా నిషేధం విధించిన యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లతో విబేధిస్తూ నార్వే ఈ నిర్ణయం తీసుకుంది.

‘‘సముద్ర గర్భంలో ఖనిజాల వెలికితీత విధానాలు ధ్వని, కాంతి కాలుష్యాన్ని కలిగించనున్నాయి. అలాగే నాడ్యూల్స్‌పైనే పూర్తిగా ఆధారపడిన సముద్ర జీవజాలానికి ఇవి ముప్పు’’ అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) తెలిపింది.

సముద్ర జీవవైవిధ్యానికి, పర్యావరణ మార్పుకు కారణమయ్యే ప్రమాదముందనే ఆందోళనతో ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని నార్వే ప్రభుత్వానికి 120 మంది యూరోపియన్ యూనియన్ చట్టసభ్యులు నవంబర్‌లో బహిరంగ లేఖ రాశారు.

ఖనిజాల అన్వేషణ వల్ల సముద్ర జీవంపై ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై నార్వే చేపట్టిన అధ్యయనంలో చాలా లొసుగులు ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.

మైనింగ్ కోసం నార్వే ప్రతిపాదించిన ప్రాంతం
ఫొటో క్యాప్షన్, మైనింగ్ కోసం నార్వే ప్రతిపాదించిన ప్రాంతం

నార్వే ప్రభుత్వం వాదన ఏమిటి?

వివిధ దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతతోపాటు, సొంత నిపుణుల నుంచి కూడా నార్వే ప్రభుత్వం ఈ నిర్ణయంపై విమర్శలు ఎదుర్కొంటోంది.

పరిశోధన తక్కువ ప్రాంతంపైనే చేపట్టి ప్రభావ అంచనాలను ప్రభుత్వం రూపొందించిందని నార్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ రీసర్చ్(ఐఎంఆర్) చెబుతోంది. ఈ అంచనాలనే డ్రిల్లింగ్ ప్రక్రియ చేపట్టే పూర్తి ప్రాంతానికి వర్తింపజేస్తోందని విమర్శిస్తోంది.

సముద్ర జీవులపై ఏ మేర ప్రభావం చూపుతుందో అర్థం చేసుకునేందుకు మరో ఐదు నుంచి పదేళ్ల పరిశోధనలు అవసరమని ఇది అంచనా వేస్తోంది.

అయితే, తక్షణమే డ్రిల్లింగ్ ప్రక్రియ చేపట్టేందుకు కంపెనీలకు నార్వే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కంపెనీలు లైసెన్స్ కోసం పర్యావరణ ప్రభావ అంచనాలతో పాటు ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్నింటినీ పరిశీలించి పార్లమెంట్ అనుమతులు ఇవ్వనుందని నార్వే ప్రభుత్వం చెబుతోంది.

ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ మరియాన్నె సివార్ట్సెన్ నీస్ నార్వే ప్రభుత్వ ప్రణాళిక గురించి వివరించారు. మైనింగ్ కార్యకలాపాలపై ముందస్తు జాగ్రత్తలను నార్వే ప్రభుత్వం తీసుకుందని నీస్ బీబీసీకి చెప్పారు.

‘‘సముద్ర గర్భం నుంచి ఖనిజాల వెలికితీతపై మాకు ప్రస్తుతం అవసరమైన పరిజ్ఞానం లేదు. వీటిని అన్వేషించి, అవగాహన పొందేందుకు ప్రైవేట్ వ్యక్తులను అనుమతించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’’ అని తెలిపారు.

సముద్ర గర్భంలోని పర్యావరణంపై అధ్యయనం చేసేందుకు ప్రైవేట్ రంగం నుంచి అవసరమైన పెట్టుబడులు పొందేలా ప్రభుత్వ ప్రణాళిక ఉందని లోక్ మినరల్స్ సోగ్నెస్ చెప్పారు.

సముద్ర గర్భంలో మైనింగ్ ఎప్పుడు?

‘‘సముద్ర గర్భంలోని పర్యావరణంపై సమాచారాన్ని సేకరించి, అభివృద్ధి చేసే ప్రక్రియ చాలా ఖరీదైనది. రోబోట్స్ ఆపరేట్ చేయడం అత్యంత అవసరం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దురదృష్టవశాత్తు యూనివర్సిటీలకు ఈ పరికరాల యాక్సస్ చాలా పరిమితంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

కానీ, ఖనిజాల వెలికితీత అసలైన ప్రక్రియ 2030 ప్రారంభం వరకు మొదలు కాదని ఆయన భావిస్తున్నారు.

అయితే, భూమిపై వెలికితీసే ప్రస్తుత ఖనిజాలను తిరిగి ఉపయోగించడంపై, రీసైక్లింగ్‌ చేయడంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

ఏడాదికి 16 వేల టన్నుల కోబాల్ట్‌ను వెలికితీస్తుండగా, వార్షికోత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే మొబైల్ ఫోన్ల రీసైక్లింగ్, మెరుగైన సేకరణ ద్వారా రికవరీ చేస్తున్నారని ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్ ఫౌండేషన్ అంచనా వేసింది.

తన ప్రాదేశిక జలాలపైన ఇచ్చిన అనుమతులపై నార్వేలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, అంతర్జాతీయ జలాల కోసం కూడా లైసెన్స్‌లు జారీ చేయాలా, వద్దా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.

ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ(ఐఎస్ఏ) సముద్ర జలాలపై నిబంధనలను ఖరారు చేసేందుకు ఈ ఏడాది సమావేశం కాబోతుంది. 2025లో ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఓటింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)