పొగమంచు ఉంటే విమానాలు ఎందుకు ఆలస్యమవుతాయి, నిపుణులైన పైలట్లు లేరా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాధిక బిజినెస్ ట్రిప్ కోసం దిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఉదయం 7.30 గంటలకు ఫ్లైట్. కానీ, ఉదయం 6 గంటలకు దిల్లీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న రాధిక సాయంత్రం 6 గంటల వరకు ఎయిర్ పోర్టులోనే ఉన్నారు.
ఫ్యామిలీతో విహార యాత్రకు దిల్లీ నుంచి గోవా బయలుదేరిన మహేశ్‌ది దాదాపు అదే పరిస్థితి. గోవా వెళ్లాల్సిన ఆయన ఫ్లైట్ 12 గంటలు ఆలస్యం కావడమే కాక చివరకు ముంబయిలో ల్యాండయింది.
ఎటూ వెళ్లడానికి వీలులేక, మిగిలిన ప్యాసింజర్ల మాదిరిగానే తాను కూడా రన్ వే మీద కూర్చుని భోజనం చేయాల్సి వచ్చింది.
దేవరాగ్య దాస్ వెళ్లాల్సిన కోల్‌కతా-బెంగళూరు ఫ్లైట్ రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, 7 గంటలు ఆలస్యంగా ఉదయం 4.41 గంటలకు బయలుదేరింది. దీని కారణంగా తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ మిస్సయ్యానని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
ఇది ఒక్క రాధిక, మహేశ్, దేవరాగ్య దాస్‌ల సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రయాణికులు విమానాల ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పైలట్‌పై ప్రయాణికుడి దాడి
ఉత్తరాదిలో తీవ్రమైన పొగమంచు కారణంగా ఒక్క దిల్లీ విమానాశ్రయం నుంచే ఆదివారం(జనవరి 15) 500 విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. సోమవారం దాదాపు 463 విమానాలు ఆలస్యంగా నడిచాయని, 87 ఫ్లైట్లు ఏకంగా రద్దయ్యాయని చెప్పింది.
ఈ ఆలస్యం ఒక గంటో, రెండు గంటలో కాదు. ఆరు గంటలు, పది గంటలు, 18 గంటలపాటు లేట్‌గా నడుస్తున్న విమాన సర్వీసులు కూడా ఉన్నాయి.
ఈ ఆలస్యం వల్ల కస్టమర్లకు కలుగుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదంటూ జనవరి 14న దిల్లీ-గోవా ఇండిగో విమానంలో ప్రయాణించాల్సిన సాహిల్ కటారియా అనే పాసింజర్, ఫ్లైట్ సిబ్బందిపై దాడి చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇండిగో ఎయిర్‌లైనర్, ఆ ప్రయాణికుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ ప్రయాణికుడిని విమానాల్లో ఘర్షణకు దిగే ప్రయాణికులపై నిషేధం విధించే నిబంధన ప్రకారం ‘నో ఫ్లై లిస్ట్’ జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది.
సిబ్బందిపై దాడి సరికాదని, ఇలాంటి దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి?
ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల పడిగాపులు, ప్రత్యామ్నాయాల కోసం విమానయాన సిబ్బందితో వాగ్వాదాలు, టిక్కెట్ల రద్దు, రీఫండ్ కోసం కస్టమర్ కేర్ సెంటర్లకు ఫోన్‌కాల్స్ నిత్యకృత్యంగా మారుతున్నాయి.
ప్రయాణికులు ఇలా దాడి చేయాల్సిన పరిస్థితులు, ఆగ్రహావేశాలకు లోనయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి?
‘‘సాధారణంగా విమానంలో ప్రయాణించేవారు త్వరగా గమ్యాలకు చేరుకోవాలనే ఆతృతతో ఉంటారు. రెండు మూడు గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా ఐదారు గంటలు విమానంలోనే కూర్చోబెడితే సహజంగానే వారిలో అసహనం పెరుగుతుంది. పైగా సిబ్బంది ప్రయాణం కచ్చితంగా ఎప్పుడు మొదలవుతుందనే సమాచారం ఇవ్వలేరు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు అసహనంతో దాడులు చేసే స్థాయికి వెళుతుంటారు’’ అని విశాఖపట్నానికి చెందిన నరేశ్ కుమార్ అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
‘‘విమానంలో ఉన్న సిబ్బంది నిర్ణేతలు (డెసిషన్ మేకర్స్) కారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏ సమాధానం చెప్పాలో నిర్ణయించేవారు విమానాశ్రయంలో ఉండరు. ఒక నిర్ణయం వెనక లక్షల రూపాయల విలువైన టికెట్స్ క్యాన్సిలేషన్ , రీఫండ్స్ వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. అందుకే నిర్ణయాలు ఆలస్యమవుతుంటాయి’’ అని నరేశ్ చెప్పారు.
ప్రతికూల వాతావరణం వల్ల కలిగే సమస్యకు పరిష్కారం లేదా?
మరి ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణం వల్ల విమానాలు ఆలస్యమైతే ఏం చేయలేమంటూ ఊరుకోవాల్సిందేనా? మంచు కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకునే అవకాశం లేదా?
ప్రకృతి వల్ల ఆలస్యమైన సందర్భాల్లో ప్రయాణికులకు గందరగోళాన్ని నివారించడంలో విమానయాన సంస్థలు విఫలమవుతున్నాయా?
వాతావరణం కారణంగా ఏర్పడుతున్న ఆలస్యం విషయంలో వియానయాన సంస్థలు సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపించాయి. ఆలస్యం గురించి సరైన సమాచారం ఇవ్వకపోవడం ఒక సమస్య కాగా, జరిగిన ఆలస్యానికి సరైన ప్రత్యామ్నాయాలు చూపేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నించడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.
‘‘మా విమానం ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వాతావరణం సరిగా లేదన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ, వాళ్లు ఆలస్యానికి కారణం చెప్పడంలో పదే పదే తప్పిదాలు చేశారు. మొదట వాతావరణం సరిగా లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మరో ప్రకటన చేస్తూ, విమానం నడిపే సిబ్బంది అందుబాటులో లేరని వెల్లడించారు. ఈ రెండింటిలో ఏది నిజమైన కారణమని మేం నమ్మాలి’’ అని దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న రిఫ్కా వర్మ అనే ప్రయాణికురాలు ఎన్డీటీవీతో అన్నారు.
‘‘చివరకు సాయంత్రం 5.30కి సిబ్బంది వచ్చారని ప్రకటించారు. మేమంతా రాత్రి 8 గంటలకు మళ్లీ విమానంలోకి ప్రవేశించాం. తీరా వెళ్లాక అక్కడ పైలట్ లేరు’’ అని రిఫ్కా వర్మ ఎన్టీటీవీతో చెప్పారు.
‘‘17 గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. పిల్లలు గొడవ చేస్తున్నారు. తినడానికి కూడా ఏమీ లేదు. కేవలం కొన్ని చిప్స్ పాకెట్స్ తింటూ కాలం గడపాల్సి వచ్చింది. దీనికి సిబ్బందిని తప్పుబట్టలేం. ఇది కచ్చితంగా మిస్‌మేనేజ్‌మెంట్’’ అన్నారు రిఫ్కా.
దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌బస్ ఏ20ఎన్ విమానం దాదాపు పది గంటలు ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందులో ప్రయాణించాల్సిన సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు పైలట్‌పై దాడికి దిగారు. విమానం ప్రయాణించడానికి మరికొంత సమయం పడుతుందంటూ పైలట్ ప్రకటిస్తున్న సమయంలోనే సాహిల్ ఆయనపై దాడికి దిగారు. ‘‘విమానం తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లండి, లేదంటే డోర్లు ఓపెన్ చేయండి వెళ్లిపోతాం. గంటల తరబడి ఇందులోనే ఎలా కూర్చోబెడతారు’’ అని ఆయన అంటున్నట్లు సహప్రయాణికులు ఒకరు తీసిన వీడియోలో వినిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్‌లైన్స్ తీరుపై ప్రయాణికుల్లో ఆగ్రహం
పైలట్ మీద దాడి చేసిన సాహిల్ కటారియాపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
వాతావరణం కారణంగా జరిగిన ఆలస్యం కన్నా విమానయాన సంస్థలు అనుసరిస్తున్న వైఖరి, ఆలస్యాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో లోపంపై ఎక్కువ మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
‘‘విమానాలు ఆలస్యం కావడం సహజమే. అయితే, విమానాలు నడపలేని పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని ప్రయాణికులకు సత్వరం తెలియజేయాలి. ప్రయాణికులు గంటల తరబడి ఫ్లైట్‌లలో, రన్‌వేల మీద పడిగాపులుగాచేలా చేయాల్సిన అవసరం ఏముంది’’ అని 17 గంటలు ఆలస్యంగా బయల్దేరిన దిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికుడు స్టీవెన్ ఎన్టీటీవీతో అన్నారు.
‘‘ప్రయాణికులు తమ టూర్‌కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకుంటారు. చివరి నిమిషంలో వాటిని మార్చుకోవాల్సి రావడం వారికి కష్టం. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. పైగా వాళ్లు తాము ప్రయాణం చేయబోతున్నామనే మూడ్‌లో ఉంటారు. అది చెదిరిపోతే ఆవేశానికి గురవుతారు’’ అని నరేశ్ అభిప్రాయపడ్డారు.
అయితే, విమానాలను నడిపించడంలో ప్రయాణికుల భద్రతే ఏ విమానయాన సంస్థకైనా ప్రాధాన్యాంశమని మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డీజీసీఏ గైడ్‌లైన్స్ ఏం చెబుతున్నాయి?
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమవుతుండటం, ఎయిర్‌పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌గా చెప్పే ఈ మార్గదర్శకాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యం/రద్దు సమయాలలో విమానయాన సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలను డీజీసీఏ పొందుపరిచింది.
పొగమంచు కారణంగా విమానం నడపడం 3 గంటలకంటే ఎక్కువ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే ఆ విమాన సర్వీసులను రద్దు చేయవచ్చు. ఆ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయాలి.
- ఆలస్యం/ రద్దు కారణంగా ప్రయాణికులను విమానంలోకి అనుమతించలేని పక్షంలో వారికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి.
- విమానాల ఆలస్యం/రద్దు విషయాలను ఎప్పటికప్పుడు సంబంధిత విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో ప్రకటించాలి.
- ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా విమానాల ఆలస్యం/ రద్దు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలి.
- ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రయాణికులకు విమానాల టైమ్‌టేబుల్‌ను తెలియజేసేందుకు నిరంతరం డిస్‌ప్లేలో ప్రకటించాలి.
- ప్రయాణికులకు విమానాల ఆలస్యం/రద్దు అవసరమైన సమాచారాన్ని వివరించేందుకు ఓపికతో వ్యవహరించే సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
అయితే విమానయాన సంస్థల కమ్యూనికేషన్ సరిగా ఉండటం లేదని నరేశ్ చెప్పారు.
‘‘కమ్యూనికేషన్ సరిగా ఉండకపోవడమే అసలు సమస్య. అయితే, దీనికి సిబ్బందిని కూడా తప్పుబట్టలేం. విమానానికి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ పరిస్థితుల్లో విమానం లోపల ఉన్న సిబ్బంది ప్రతి అరగంటకో, గంటకో మాత్రమే ఎంత ఆలస్యమవుతుందో చెప్పగలుగుతారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదలకు పది రోజుల ముందే డీజీసీఏ రెండు విమానయాన సంస్థలకు పంపిన నోటీసులు ఆసక్తి కలిగిస్తున్నాయి.
విపరీతమైన మంచు కురుస్తున్న సమయంలో కూడా విమానాలను కేటగిరీ 3బీ రన్‌వేల మీద ల్యాండ్ చేయగల నిపుణులైన పైలట్లను ఎందుకు నియమించలేదంటూ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్ సంస్థలకు డీజీసీఏ నోటీసులు పంపింది.
దిల్లీ విమానాశ్రయంలో విమానాల ఆలస్యానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమని డీజీసీఏ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘కేటగిరీ 3బీ రన్ వే’ అంటే ఏంటి?
పొగ మంచు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా విమానాలను ల్యాండ్ చేయడానికి వీలు కల్పించే రన్‌వే లను కేటగిరీ 3బీ రన్ వేలుగా చెబుతారు. దృశ్యమానత (విజిబిలిటీ) తక్కువగా అంటే 50 మీటర్లకు ఆవల ఎదురుగా ఉన్న వస్తువులు/ విమానాలు/సంకేతాలు కనిపించని పరిస్థితి ఉన్నచోట ఒక ప్రత్యేక టెక్నాలజీ సాయంతో పైలట్లు విమానాలను దింపగలుగుతారు.
దీనికోసం ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) అనే ప్రత్యేక టెక్నాలజీని పైలట్లు వినియోగించాల్సి ఉంటుంది. విజిబిలిటీ తక్కువగా ఉన్న రన్‌వేలపై విమానాలను రేడియో సిగ్నల్స్ సాయంతో ల్యాండింగ్ చేయగలుగుతారు. అయితే, ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉన్న రన్‌వేలతోపాటు, వాటి మీద విమానాన్ని దింపగల ప్రత్యేక నైపుణ్యం ఉన్న పైలట్లు కూడా అవసరమవుతారు.
దిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉండగా, అందులో కేటగిరీ 3బీ కిందకు వచ్చే రన్ వేలు రెండు మాత్రమే ఉన్నాయని, వీటిలో ఒకటి మెయింటెనెన్స్ కారణంగా ఉపయోగించలేని పరిస్థితి ఉందని ‘ఇండియా టుడే’ రిపోర్ట్ చేసింది.
ఉన్న ఒకే ఒక్క కేటగిరీ 3బీ రన్ వే మీద ఇన్ని విమానాలను నడపడం సాధ్యం కాకపోవడం, వీటి మీద విమానాలను నడపగల పైలట్లు అందుబాటులో ఉండకపోవడం కూడా దిల్లీ విమానాశ్రయంలో గందరగోళానికి దారి తీస్తోందని తెలిపింది.
ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో నెలకొన్న పరిస్థితులను ఊహించిన డీజీసీఏ, సంబంధిత నిపుణులైన పైలట్లను రోస్టర్‌లో చేర్చాలంటూ గత నెలలోనే విమానయాన సంస్థలకు సూచించింది. ఈ నిబంధనలు పాటించనందుకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులైన పైలట్ల కొరత ఉందా?
2021 నాటికి దేశవ్యాప్తంగా 17 వేలమందికి పైగా రిజిస్టర్డ్ పైలట్లు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో పేర్కొంది.
దేశంలో ఆరు ఎయిర్ పోర్టులలో కేటగిరీ 3బీ రన్‌వేలు ఉండగా, అందులో కేవలం 9,600 మంది సిబ్బందికి మాత్రమే ఐఎల్ఎస్ నైపుణ్యంగల సిబ్బంది ఉన్నారని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనం పేర్కొంది. దిల్లీలో 86 శాతం ఆలస్యాలకు కారణం ఈ పైలట్ల కొరతే కారణమని డీజీసీఏ భావిస్తోంది.
‘‘ఈ పైలట్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. వారి పూర్వానుభవాన్నిబట్టి ఈ పైలట్లకు పొగమంచు పరిస్థితుల్లోనూ విమానాలను దింపగలిగేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు’’ అని వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు.
ఐఎల్ఎస్ నైపుణ్యంగల పైలట్లను సిద్ధం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఏవియేషన్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ నైపుణ్యంగల పైలట్లు ఎక్కువగా రావడం లేదని కూడా వారు అంటున్నారు.
‘‘కేటగిరి 3 ట్రైనింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని, పైలట్లకు రియల్ టైమ్ ట్రైనింగ్ అవసరం. అందుకు మేఘాలు, మంచుతో కూడిన వాతావరణ పరిస్థితులు కూడా కావాలి. వారు ఆ సమయంలో సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ సేఫ్టీ మాజీ డైరక్టర్ ఎస్.ఎస్.పనేసర్ నైన్ న్యూస్ మేగజైన్‌తో అన్నారు.
‘‘ఎయిర్‌లైన్స్ సంస్థలకు పైలట్ల కొరత ఉన్నమాట వాస్తవం. దానివల్ల విమానాలు ఆలస్యం కావడంతోపాటు, ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వడం కూడా సాధ్యం కావడం లేదు’’ అని నరేశ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది
- అభినందన్ వర్ధమాన్ : ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో తెరవెనుక ఏం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- ఎల్ డొరాడో: బంగారంతో మెరిసే భూభాగం కోసం చరిత్రలో సాగిన సాహస యాత్రలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















