విమానం డోర్ ఆకాశంలో ఉండగానే ఊడిపోయి గాలికి కొట్టుకుపోయింది... ఆ తప్పెవరిది?

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, NATIONAL TRANSPORATION SAFETY BOARD

అమెరికాలోని అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తలుపు ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తమ తప్పు ఉన్నట్లు బోయింగ్ కంపెనీ అధినేత ఒప్పుకున్నారు.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకు వెళుతున్న 'అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్-1282' శుక్రవారం 16,000 అడుగుల (4,876 మీ) ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీని తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9కు చెందిన 171 విమానాలను అమెరికా నిలిపివేసింది. సంస్థ తమ తప్పును ఒప్పుకుంటుందని బోయింగ్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ చల్హౌన్ చెప్పారు.

విమానం నుంచి ఊడిపోయి పడిపోయిన 27కేజీల బరువున్నడోర్ ప్లగ్‌ను ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం ఉపయోగిస్తారు. విమానం తయారు చేసేటప్పుడే దీన్ని అమర్చుతారు.

ఈ డోరు ప్లగ్‌ను పోర్టుల్యాండ్‌లోని ఒక టీచర్ తమ ఇంటి పెరట్లో గుర్తించారని అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి(ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది.

విమానపు డోరు ప్లగ్

ఫొటో సోర్స్, NTSB

ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందు కూడా హెచ్చరికలు రావడంతో అలస్కా ఎయిర్‌లైన్స్ ఈ విమానంపై ఆంక్షలు విధించినట్లు ఇన్వెస్టిగేటర్లు చెప్పారు.

‘‘ఇది మన తప్పే అని మనం అంగీకరించాలి. 100 శాతం, పూర్తి పారదర్శక విచారణకు మనం ముందుకు రావాలి’’ అని బోయింగ్ ఉద్యోగులతో చల్హౌన్ అన్నారు.

ఈ ఘటనకు గల కారణాలను విచారించేందుకు ఎన్‌టీఎస్‌బీతో కలిసి బోయింగ్ పనిచేస్తుందని ఉద్యోగులకు చల్హౌస్ వాగ్దానం చేశారు.

‘‘వారు ఈ ఘటనపై ఒక ముగింపునకు రానున్నారు. ఎయిర్‌లైన్ కస్టమర్లతో కలిసి పనిచేసే ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ(ఎఫ్ఏఏ) విమానాలు పూర్తి భద్రతతో సర్వీసులు అందించాలని కోరుకుంటోంది. తదుపరి ఎగరబోయే విమానం పూర్తి భద్రతతో, ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా ఉండేలా అవసరమైన అన్ని రకాల చర్యలు, భద్రతా తనిఖీలు చేపట్టనుంది’’ అని చెప్పారు.

"మేం ఇలాంటి సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్న విమానాలన్నింటినీ నిలిపేశాం. అవి సురక్షితమని ఎఫ్ఏఏ సంతృప్తి చెందే వరకు అనుమతివ్వం" అని అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించిన భయంకరమైన ఫుటేజీని చూసిన బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్.. ‘‘ఈ విమానం డోరు ఊడిపోయిన తర్వాత ఏర్పడిన రంధ్రానికి పక్కన కూర్చున్న వారి పరిస్థితి ఏంటి? అని ఈ ఫోటోలు, ఫుటేజీ చూసినప్పుడు నాకు అనిపించింది . నాకు పిల్లలున్నారు. మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. మరి వీరికి కూడా ఉండొచ్చు. ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి. ప్రతి విషయాన్ని మనం ఇక్కడ పట్టించుకోవాలి’’ అని చెప్పారు.

విమానంలో ప్రయాణించే ప్రజలను సురక్షితంగా ఉంచడమే తమ మొదటి ప్రాధాన్యమని ఎఫ్ఏఏ తెలిపింది. అమెరికా విమానయాన సంస్థలు డజన్ల కొద్దీ జెట్‌లను నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్‌లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఊడిన విమానం డోరు

ఫొటో సోర్స్, REUTERS

ముందే హెచ్చరించిన ఎఫ్ఏఏ

వరుస భద్రతా సమస్యలతో "చరిత్రలో ఎక్కువగా తనిఖీలకు గురైన రవాణా విమానం"గా బోయింగ్ 737 మ్యాక్స్ నిలిచింది.

ఏడాదిన్నర వ్యవధిలో రెండు మ్యాక్స్‌ విమానాలు ప్రమాదానికి గురి కావడంతో మార్చి 2019లో ఈ విమానాలను ఎగరనీయ లేదు.

కొత్త విమానాలు, ఇప్పటికే ఉన్న ఇతర పరికరాల సుదీర్ఘ తనిఖీలు, లోపాల పరిష్కారం కోసం చాలా సమయం పట్టిందని, ఇక 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు పెంచుతామని బోయింగ్ సంస్థ ఇటీవలే పేర్కొంది.

సుమారు పదమూడు వందల 737 మ్యాక్స్ విమానాలు కస్టమర్లకు డెలివరీ చేసినట్లు బోయింగ్ డేటా ద్వారా తెలుస్తోంది.

కాగా, మ్యాక్స్ మోడల్స్‌లలో ఏవైనా బోల్ట్‌లు వదులుగా ఉన్నాయేమో చూసుకోవాలని ఎఫ్ఏఏ గత నెలలోనే విమానయాన సంస్థలను కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)