ముస్సోరీ హోటల్‌లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెరిలిన్ మొలన్
- హోదా, బీబీసీ న్యూస్
ఒక హత్యలో కుట్ర దాగినప్పుడు దాన్ని ఛేదించిన విధానం తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తికరంగానే ఉంటుంది. 'క్వీన్ ఆఫ్ క్రైమ్'గా పేరుగాంచిన ఇంగ్లిష్ రచయిత్రి అగాథా క్రిస్టీ దీనిని బాగా అర్థం చేసుకున్నారు.
ఆమె మొదటి నవల 'ది మిస్టీరియస్ ఎఫైర్ ఎట్ స్టైల్స్'తో కుటుంబ కలహాల కారణంగా జరిగిన హత్యకు సంబంధించిన ఆసక్తికరమైన కథను పరిచయం చేశారు.
1920లో ప్రచురితమైన ఈ నవల ఎమిలీ ఇంగ్లెథార్ప్ అనే సంపన్న మహిళ హత్యపై దృష్టి సారిస్తుంది. ఆమె రెండో భర్త తన కంటే 20 సంవత్సరాలు చిన్నవారు.
హత్య విషయంలో ఆమె భర్తపై ఎమిలీ కుటుంబంతో పాటు స్నేహితురాలు ఎవెలిన్ హోవార్డ్ కూడా అనుమానం వ్యక్తంచేశారు.
రచయిత క్రిస్టీ అత్యంత ప్రసిద్ధ పాత్రలలో ఒకటైన 'డిటెక్టివ్ హెర్క్యులే పాయిరోట్' అనే విచిత్ర పాత్రను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.
ఆమె తరువాతి పుస్తకాల మాదిరే ఈ నవలలో కూడా చాలా మంది అనుమానితులు ఉంటారు. దిగ్భ్రాంతికర ఘటనలు, అందులో దాగి ఉన్న ఆధారాలు, చివరికి అపరాధి ఎవరనేది బహిర్గతం చేయడం.. ఇలా సాగిపోతుంది క్రిస్టీ కథనం.
కానీ ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే.. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఒక శతాబ్దం క్రితం జరిగిన నిజమైన హత్య నుంచి ప్రేరణ పొంది ఇది రూపుదిద్దుకుందని పుస్తకం చదివిన చాలామంది అనుకుంటారు.
1911 సెప్టెంబరులో ముస్సోరీలోని సావోయ్ హోటల్‌లోని ఒక గదిలో 49 ఏళ్ల 'ఫ్రాన్సిస్ గార్నెట్ ఓర్మే' అనే మహిళ శవమై కనిపించారు. ఈ హోటల్‌ను ఐరిష్ లాయర్ నిర్మించారు.
ఓర్మే శరీరంలో ప్రూసిక్ యాసిడ్ కలిపిన సైనైడ్ విషం ఆనవాళ్లు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. దీంతో ఆమె స్నేహితురాలు ఎవా మౌంట్ స్టీఫెన్స్ (36)పై హత్యా నేరం మోపారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ వార్తాపత్రికల్లో ఒక సంచలనం
ఈ హత్య జరిగిన 'ప్రత్యేక పరిస్థితుల' కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని 1912లో ఒక ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక రాసింది.
ఒక బ్రిటిష్ వార్తాపత్రికైతే ఈ కేసుకు సంబంధించిన ప్రతి క్రాస్ ఎగ్జామినేషన్‌ను వివరంగా ప్రచురించింది.
'ముస్సోరీ మర్డర్ ట్రయల్', 'హోటల్ మిస్టరీ', 'క్రిస్టల్ గేజింగ్ ట్రయల్' వంటి హెడ్‌లైన్లతో కథనాలు ప్రచురించింది.
ముస్సోరీలో నివసిస్తున్న భారతీయ రచయిత రస్కిన్ బాండ్, ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యంపై చాలా కథనాలు రాశారు.
అంతేకాదు ఈ హత్య, క్రిస్టీ మొదటి పుస్తకానికి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా రాశారు.
ఆ సమయంలో అది చాలా పాపులర్ కేసు కాబట్టి రచయిత క్రిస్టీ ‘నేరం పరిస్థితుల'ని వాడుకున్నారని రస్కిన్ అభిప్రాయపడ్డారు.
ఆ సమయంలో ప్రచురితమైన కథనాల ప్రకారం.. ఫ్రాన్సిస్ గార్నెట్ ఓర్మే ఒక దశాబ్దం పాటు భారత్‌లో నివసించారు.
లక్నోకు చెందిన ఆధ్యాత్మిక వ్యక్తి అయిన ఎవా మౌంట్ స్టీఫెన్స్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, స్నేహంగా మారింది.
ఓర్మే ఒంటరి మహిళ. స్టీఫెన్స్ నుంచి జోస్యం చెప్పడం, ఇతర క్షుద్ర నైపుణ్యాలనూ నేర్చుకున్నారు.
వారిద్దరూ కొన్ని రోజుల పాటు సావోయ్ హోటల్‌లో కలిసి ఉన్నారు. ఓర్మే ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను జాగ్రత్తగా చూసుకున్నట్లు స్టీఫెన్స్ తెలిపారు.
ఓర్మే తన వీలునామాలో పెద్ద మొత్తంలో డబ్బు, మూడు నెక్లెస్‌లు, ఇతర నగలను స్టీఫెన్స్ కోసం కేటాయించారని, ఈ విలువైన ఆస్తులను పొందేందుకు స్టీఫెన్స్ ఓర్మేపై విష ప్రయోగం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
మరోవైపు ఓర్మే తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు డిఫెన్స్ వాదించింది. ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లిచేసుకోవాలని ఓర్మే భారత్ వచ్చారని కానీ, ఆ వ్యక్తి చనిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లారని డిఫెన్స్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఓర్మేకి ఆరోగ్యం కూడా బాగాలేదని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వీడని రహస్యం
ఈ కేసులో చాలా మెలికలు ఉండటంతో పోలీసులతో సహా చాలామందిని గందరగోళానికి గురి చేసింది.
ఒకటి, ఓర్మే చనిపోయే ముందు స్టీఫెన్స్ లక్నో వెళ్లిపోయారని విచారణలో తేలింది. రెండోది ఓర్మే మృతదేహం దొరికిన గది లోపలి నుంచి లాక్ చేసి ఉంది.
ఓర్మే గదిలో నిద్రమాత్రలు, ఆర్సెనిక్, ప్రూసిక్ యాసిడ్ లేబుల్స్‌తో కూడిన రెండు సీసాలు మినహా ఎలాంటి మందులు పోలీసులకు లభించలేదు.
1900వ దశకం ప్రారంభంలో మందులు అమ్మే వ్యక్తి నుంచి ఔషధాలు తీసుకోవాలంటే కొనుగోలుదారులు సంతకం చేయవలసి ఉంటుంది.
అయితే ప్రూసిక్ యాసిడ్ తీసుకొన్నట్లుగా ఉన్న సంతకం, ఓర్మే లేఖలపై ఉన్న సంతకంతో సరిపోలడం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది.
స్టీఫెన్స్ ఒక ఫ్రెండ్‌తో జరిపిన సంభాషణలో ఓర్మే మరణిస్తారని ఆరు నెలల ముందే అనుకున్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
అంతేకాకుండా ఓర్మే ఒక వైద్యుడిని వివాహం చేసుకున్నారని, తన సంపద మొత్తాన్ని ఆయనకే వదిలివేయాలని ఓర్మే నిర్ణయం తీసుకోవడంపై కూడా స్టీఫెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రాసిక్యూషన్ తెలిపింది.
అయితే ఓర్మేకి స్టీఫెన్స్ స్నేహితురాలని, ఆమె విషాన్ని కొనుగోలు చేసిందని లేదా ఓర్మేకు విషం ఇచ్చిందన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది.
చివరికి స్టీఫెన్స్ నిర్దోషిగా విడుదలయ్యారు. " ఓర్మే మరణానికి నిజమైన కారణం బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు" అని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు.
అయితే, ఈ సంఘటనలన్నీ క్రిస్టీ పుస్తకంలో ఉన్నాయి. ఈ కథలో.. ఎమిలీ కూడా ఓర్మే మాదిరే విషంతో మరణించారు. ఆమె గది లోపల నుంచి లాక్ కూడా చేసి ఉంటుంది.
ఆమెకు విషం కలిపింది ఆమె ఫ్రెండ్ అని చివరికి తెలుస్తుంది. ఎమిలీ సంతకాన్ని స్నేహితురాలైన ఎవెలిన్ హోవార్డ్ ఫోర్జరీ చేసి విషం కొనుగోలు చేసి, డబ్బు ఆశతో ఆమెను హత్య చేసినట్లు రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పుస్తకాల మధ్య సారూప్యాలు
దశాబ్దాల తర్వాత నేటికీ ఈ కేసుల మధ్య సారూప్యతలు అభిమానులను థ్రిల్ చేస్తాయి.
2022లో జరిగిన ఇంటర్నేషనల్ అగాథా క్రిస్టీ ఫెస్టివల్‌లో క్రిస్టీ మొదటి నవల, ముస్సోరీ హత్యల మధ్య ఆసక్తికరమైన సంబంధం గురించి భారతీయ క్రైమ్ రైటర్ మంజిరి ప్రభు ప్రసంగించారు.
అయితే భారత్‌లో జరిగిన విష మరణాల నుంచి కేవలం క్రిస్టీ మాత్రమే స్ఫూర్తి పొందలేదు. ఆగ్రాలో జరిగిన ఓ క్రైమ్ కథను సిసిల్ వాల్స్ అనే రచయిత పుస్తకంగా మలిచారు.
ఆ సమయంలో ఆ నగరం బ్రిటిష్ పాలిత భారతదేశంలోని ఆగ్రా, అవధ్ సంయుక్త ప్రావిన్సుల కింద ఉంది. ఆ పుస్తకం పేరు 'ది ఆగ్రా డబుల్ మర్డర్: ఎ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ ఫ్రమ్ ది రాజ్'.
మీరట్‌లో నివసిస్తున్న ఇంగ్లిష్ మహిళ అగస్టా ఫుల్లం, ఆంగ్లో-ఇండియన్ డాక్టర్ క్లార్క్ కలిసి జీవించేందుకు తమ భాగస్వాములపై విషప్రయోగం చేయాలని ఎలా ప్లాన్ చేశారనే దాని గురించి ఆయన రాశారు.
ప్రభుత్వ సమీక్షలో ఆ రెండు కేసులు..
అమెరికా, యూరప్‌ల మాదిరిగానే 19వ శతాబ్దంలో భారతదేశంలో విషం ప్రయోగ హత్యలు సాధారణంగా మారాయి.
అప్పట్లో ఆర్సెనిక్ వంటి విష పదార్థాల విక్రయాలపై నియంత్రణ లేదు.
డేవిడ్ ఆర్నాల్డ్ అనే రచయిత 'టాక్సిక్ హిస్టరీస్: పాయిజన్ అండ్ పొల్యూషన్ ఇన్ మోడరన్ ఇండియా' అనే పుస్తకం రాశారు.
ఈ పుస్తకంలో 1904లో 'ఇండియన్ పాయిజన్ యాక్ట్' రూపొందడానికి ఆర్సెనిక్ విష ప్రయోగాలు ఎలా మూల కారణమయ్యాయో వివరించారు. ఈ చట్టాన్ని ఆర్సెనిక్ కొనుగోలు, వినియోగాన్ని నియంత్రించడం కోసం తీసుకొచ్చారు.
"ఈ చట్టాన్ని పదేళ్ల తర్వాత అంటే 1914లో సమీక్షించినప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రభుత్వం విషప్రయోగం ద్వారా హత్యకు గురైన ఓర్మే, ఫుల్లం-క్లార్క్ కేసులను ఉదహరించింది" అని డేవిడ్ రాశారు.
నిజమైన ఘటనలపై ఆధారపడిన క్రైమ్ కథలు ఒక ఆసక్తికర శైలితో చలనచిత్రాలు, పాడ్‌క్యాస్ట్‌లు, వెబ్ సిరీస్‌ల రూపంలో ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నాయి.
కానీ క్రిస్టీ కథను నడిపించే విధానం, మిస్టరీకి అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి వద్దకు వెళ్ళిన 24 మంది వ్యోమగాముల్లో ఎంతమంది సజీవంగా ఉన్నారు... వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- CEO సుచనా సేథ్: నాలుగేళ్ళ తన కొడుకుని ఈమె ఎందుకు చంపారు, పోలీసులు ఎలా కనిపెట్టారు?
- నేషనల్ క్యాన్సర్ గ్రిడ్: భారత్‌లో రోగులకు ప్రాణదాతగా మారిన కొత్త విధానం
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














