అక్క ఆత్మహత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు 20 ఏళ్లు ఎదురు చూసిన తమ్ముడు...ఆ తర్వాత ఏమైందంటే?

వేలాయుధం కేసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రభాకర్
    • హోదా, బీబీసీ కోసం

వేలాయుధం తమిళనాడుకు చెందినవారు. తంజావూరు జిల్లా తామరన్ కొట్టై నివాసి ఆయన ఒక కో ఆపరేటివ్ స్టోర్‌లో ఉద్యోగం చేసేవారు.

అది 2014. రోజులాగే ఆయన ఉద్యోగానికి వెళ్లడానికి బయటకు వచ్చారు.

ఆవ వెల్లలార్ వీధిలోని తన ఇంట్లోనుంచి ఆయన బయటకు రాగానే, హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి కొడవలితో ఆయన గొంతు కోసి కారులో పారిపోయారు. అక్కడికక్కడే వేలాయుధం చనిపోయారు.

హంతకుడు ముఖానికి మాస్క్‌తో పాటు హెల్మెట్ పెట్టుకున్నాడని అప్పుడు ఆ హత్యను ప్రత్యక్షంగా చూసిన వేలాయుధం భార్య మీనాక్షి చెప్పారు. ఆ వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఇదంతా 2014 నాటి విషయం.

ఇక 2022లో జరిగిన సంగతి చూద్దాం.

హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి వేలాయుధం భార్య మీనాక్షిని అదే రీతిలో చంపేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మీనాక్షి ప్రాణాలతో బయటపడ్డారు.

గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

తామరన్ కొట్టైలోని వెల్లలార్ వీధిలో నివసించే కార్తీక అనే మహిళను హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు కొడవలితో చంపేందుకు ప్రయత్నించారు. కానీ, కార్తీక దాన్నుంచి బయటడ్డారు. ఆమె మెడకు గాయమైంది.

ఈ మూడు ఘటనలకూ ఒకే వ్యక్తితో సంబంధం ఉందని పోలీసులు కనిపెట్టారు. పదేళ్లుగా పరారీలో ఉన్న ఆ వ్యక్తిని గత వారం క్రైమ్ బ్రాంచ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల నుంచి పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరు? వేలాయుధాన్ని ఆయన ఎందుకు చంపారు? మీనాక్షి, కార్తీకలను ఎందుకు చంపాలనుకున్నారు?

వేలాయుధం కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరిగింది?

వేలాయుధం హత్యకు 1994లో జరిగిన ఒక ఆత్మహత్య కారణమని పోలీసులు చెప్పారు.

పోలీసులు చెప్పినదాని ప్రకారం, ‘‘వేలాయుధం సోదరుడు బాలసుబ్రమణియం తన గ్రామానికే చెందిన 25 ఏళ్ల కళాచెల్విని పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా కళాచెల్వి తన పుట్టింటికి వెళ్లిపోయారు.

రెండు నెలల తర్వాత కళాచెల్వి తన భర్తతో కలిసి ఉండటానికి సుబ్రమణియం ఇంటికి వెళ్లారు. తర్వాత కొన్ని రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

కళాచెల్వి చనిపోయినప్పుడు ఆమె తమ్ముడు 22 ఏళ్ల బాలచందర్, సింగపూర్‌లో పనిచేస్తున్నారు’’ అని వెల్లడించారు.

వేలాయుధాన్ని హత్య చేయడమే కాకుండా ఆయన భార్య మీనాక్షి, తన భార్య అయిన కార్తీకలను కూడా చంపడానికి బాలచందర్ ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు.

తన సోదరి కళాచెల్వి ఆత్మహత్యకు వేలాయుధమే కారణమని భావించిన బాలచందర్, ఏళ్ల పాటు వేలాయుధం హత్యకు ప్లాన్ చేశాడని ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీసీఐడీ పోలీసులు తెలిపారు.

వేలాయుధం కేసు

ఫొటో సోర్స్, Getty Images

20 ఏళ్ల తర్వాత ప్లాన్ అమలు

ఈ కేసు గురించి బీబీసీతో సీబీసీఐడీ ఇన్వెస్టిగేటర్ రహ్మత్ నిషా మాట్లాడారు.

‘‘చాలా ఏళ్లుగా ఆయన తమిళనాడులో లేరు. వేలాయుధం హత్యకు ముందు, హత్య తర్వాత కూడా ఆయన ఇక్కడ లేరు. అందుకే అతన్ని విచారించడం కుదరలేదు.

కెనడా నుంచి బాలచందర్ 2014లో శ్రీలంకకు వచ్చారు. అక్కడ నుంచి సముద్రమార్గాన రామేశ్వరం చేరుకున్నారు. తర్వాత కారులో పట్టుకొట్టై వచ్చారు. వేలాయుధాన్ని చంపేసి కారులో పారిపోయారు.’’ అని చెప్పారు.

కళాచెల్వి ఆత్మహత్యకు కారణం ఏంటో తెలియదని చెప్పిన అదిరాంపట్నం పోలీసు అధికారి ఒకరు, 20 ఏళ్లుగా వేలాయుధం హత్యకు బాలచందర్ ప్లాన్ చేశారని తెలిపారు.

‘‘తన సోదరి చనిపోయినప్పుడు బాలచందర్, సింగపూర్‌లో పనిచేస్తున్నారు. తర్వాత, 2004లో ఆయన ఊరికి వచ్చారు. అప్పటికీ హత్య ప్రణాళికలు ఉన్నాయి. కానీ, తన పెళ్లి కారణంగా ఆయన అప్పటికీ ఈ ఆలోచనలను విరమించుకున్నాడు.

ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు హత్యకు ప్లాన్ చేసిన ఆయన, తన స్నేహితుల సహాయంతో వేలాయుధాన్ని హత్య చేశారు. ఈ హత్యకు ముందు, ఆ తర్వాత ఆయన ఊరిలో లేరు’’ అని అదిరాంపట్నం పోలీసు అధికారి చెప్పారు.

వేలాయుధం కేసు

ఫొటో సోర్స్, Getty Images

వేలాయుధం భార్య మీనాక్షిని ఎందుకు చంపాలనుకున్నాడు?

వేలాయుధం హత్య కేసును మొదట తంజావూరు జిల్లా అదిరాంపట్నం పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కేసులో ఎలాంటి పురోగతి రాలేదు.

ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో మీనాక్షి కేసు వేశారు. దీని తర్వాత 2016లో వేలాయుధం హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించారు.

వేలాయుధం కేసును సీబీసీఐడీకి మార్చినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని మీనాక్షి చెప్పారు.

‘‘హైకోర్టులో కేసు వేసినప్పటి నుంచి, విదేశీ నంబర్ల నుంచి నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలాంటి కాల్ వచ్చినప్పుడల్లా చాలా భయంగా అనిపించేది. కేసును విత్‌డ్రా చేసుకోమంటూ నన్ను బెదిరించేవారు. ఏళ్ల పాటు ఇలా జరిగింది’’ అని మీనాక్షి చెప్పారు.

2022 ఫిబ్రవరి 8న సమీప మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా మీనాక్షిపై ఇద్దరు వ్యక్తులు కొడవలితో దాడి చేశారు. మెడ మీద తీవ్ర గాయంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

‘‘వేలాయుధం హత్య కేసు గురించి మీనాక్షి పట్టుదలగా ఉండటంతో స్నేహితుల సహాయంతో ఆమెను చంపాలని బాలచందర్ ప్లాన్ చేశారు’’ అని పోలీసులు చెప్పారు.

మీనాక్షిపై హత్యాయత్నం కేసును అదిరాంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వేలాయుధం కేసు

ఫొటో సోర్స్, Getty Images

బాలచందర్‌ను ఎలా పట్టుకున్నారు?

‘‘వేలాయుధాన్ని హత్య చేసి పదేళ్లుగా విదేశాల్లో పరారీలో ఉన్న బాలచందర్‌కు ఆయన భార్యకు మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమెను కూడా చంపేందుకు బాలచందర్ ప్రయత్నించాడు’’ అని అదిరాంపట్నం పోలీసులు చెప్పారు.

బాలచందర్ డిసెంబర్ 30వ తేదీన కెనడా నుంచి తిరుచ్చికి వచ్చి అక్కడ నుంచి భార్య కార్తీకను చంపేందుకు పట్టుకొట్టై చేరుకున్నాడని సీబీసీఐడీ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మంగై తెలిపారు.

‘‘వేలాయుధం, మీనాక్షి కేసుల్లోనూ ఇలాగే హెల్మెట్లు, మాస్క్‌లు ధరించి కార్లు, ద్విచక్రవాహనాల మీద వచ్చి హత్యాయత్నం చేశారు. వీరంతా పట్టుకొట్టై నగర సమీపంలో తిరుగుతున్నట్లు మాకు సమాచారం అందింది.

దీని ఆధారంగా వారిని వెదుక్కుంటూ మేం వెళ్లాం. కార్తీకపై దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకోగా బాలచందర్ గురించి తెలిసింది’’ అని అదిరాంపట్నం పోలీసులు వెల్లడించారు.

బాలచందర్‌కు చెందిన సింగపూర్, కెనడా, శ్రీలంక పాస్‌పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు ప్రమాదకర ఆయుధాలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)